1, అక్టోబర్ 2020, గురువారం

వంటింట్లో నుంచి మీ ఇంట్లోకి

ఓ మంచి పని పెట్టుకున్న మా మేనకోడలు ఫణి  - భండారు  శ్రీనివాసరావు


ఒసేవ్ వెంకట్రాముడూ... ఏవైనా నోట్లో వేసుకోవడానికి పాలకాయలో, ఇంత కారప్పూసో నా మంచం పక్కన పెట్టి పోరాదే!’ అంటుండేది మా బామ్మ రుక్మిణమ్మగారు  వరండాలో మంచం మీద కూర్చుని  తావళం  తిప్పుకుంటూ. వెంకట్రాముడు అంటే ఆమెకు కోడలు, మాకు అమ్మ అయిన వెంకట్రావమ్మగారు.  ఓ పక్కన కూర్చుని విస్తళ్ళు  కుడుతున్న  మా అమ్మగారు  అత్తగారి మాట ఔదలదాల్చి, లేచి వెళ్లి,  మడి  బీరువాలో దాచి ఉంచిన కారప్పూస
, పాలకాయల వంటి  చిరుతిండ్లను  ఓ గిన్నెలో వేసి అందించేది.  
అదేమిటో ఏళ్ళు మీద పడుతున్న కొద్దీ చిరుతిళ్ళ మీద గాలి మళ్ళుతుందనే వారు, మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు. అలా ఏదో ఒకటి నోట్లో వేసుకుని నములుతుంటే అదో కాలక్షేపం అనేవాళ్ళు కూడా వున్నారు.

ఇప్పుడయితే  చిరుతిండ్లదే రాజ్యం. పిల్లలూ పెద్దలూ వయసుతో సంబంధం లేకుండా గంటగంటకూ  ఏదో ఒకటి నోట్లో వేసుకోకపోతే తప్పేట్లులేదు.

పేరుకు చిరుతిండి అన్నమాటే కానీ ఈ గవ్వలూ, పాలకాయలూ, కారప్పూసా, సున్నుండలు, కజ్జికాయలు వగైరా  చేయాలంటే పెద్ద పనే. ఆ పని తెలిసిన వాళ్లకు కూడా చేసుకునే ఓపికలు, తీరికలు లేవు. పూర్వం ఏ అమెరికాలోనో వుండే వాళ్ళు ఇక్కడకు వచ్చినప్పుడల్లా వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకుని మరీ కొనుక్కుని పోయేవారు. ఇప్పుడు అంటే ఇవన్నీ వాళ్లకు ఆన్ లైన్లో దొరుకుతున్నాయనుకోండి.

కోరిక వుండి ఇంట్లో ఈ చిరు వంటకాలు చేసుకోలేని వాళ్ళకోసం  మా మేనకోడలు ఫణికుమారి  ఓ పని పెట్టుకుంది. ఈ కరోనా తీరిక కాలంలో ఇంట్లోనే  తయారుచేసిన చిరుతిండ్లను తెలిసిన వారికి కొరియర్ ద్వారా పంపిస్తోంది. మా మేనకోడలు అని కాదు, ఇలాంటి వంటకాలు చేయడంలో చేయితిరిగిన మనిషి. డాక్టర్లకు హస్తవాసి మాదిరిగానే కొందరు చేసే వంటలకు వాళ్ళ చేతి మహిమేమో కానీ ఎక్కడలేని రుచి వస్తుంది. మా చుట్టపక్కాల్లో ఫణికి ఈ మంచి పేరు పుష్కలంగా వుంది. దానికి తగినట్టు ఓపికలో  ‘వండనలయదు వేవురు వచ్చిరేని’  అనే ప్రవరాఖ్యుడి భార్య సోమిదేవమ్మ  టైపన్నమాట. 


        

  చిరుతిండ్లే కాదు, నాలుగు రోజులు  నిలవ వుండే పచ్చళ్ళు, పొడులు ఇంకా ఎన్నో ఆన్ లైన్లో ఆర్డరు చేస్తే ఇంటికి వచ్చి వాలిపోతాయి. ఇదిగో లింకు:  

కామెంట్‌లు లేవు: