10, అక్టోబర్ 2020, శనివారం

పోస్ట్ - భండారు శ్రీనివాసరావు

 (Today, 9th October is World Postal Day)

కంప్యూటర్ ముందు కూర్చుని నా మానాన నేను పనిచేసుకుంటూ వుంటే ఈ పిలుపు.
నిజంగా ఈ మాట వినబడక ఎన్నాళ్ళు అయింది?
ఓ యాభయ్ ఏళ్ళ క్రితం పల్లెటూళ్ళలో నివసించే వృద్ధులయిన తలితండ్రులు, పట్టణాల్లో చదువుకుంటూ ఊళ్ళనుంచి వచ్చే ఉత్తరాలకోసం ఎదురు చూసే వారి పిల్లలు, ప్రియుడు రాసే ప్రేమలేఖ కోసం చకోరపక్షిలా పడిగాడ్పులు పడే ప్రియురాలు ఇలా ఎందరెందరో ‘పోస్ట్’ అనే తియ్యటి మాటను తన నోట పలికే పోస్ట్ మన్ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తుండేవాళ్ళు. ఒకానొక కాలంలో తెలుగు కధల్లో చాలామటుకు ఈ పోస్ట్ అనే మాట తోనే మొదలయ్యేవని చెప్పుకుండేవాళ్ళు కూడా.
ఇప్పుడామాట గతకాలపు ముచ్చట అయింది.
మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత, నెట్లోకం ఆవిష్కృతమయిన ఇన్నేళ్ళ తర్వాత ఆ మాట మా గుమ్మం ముందు వినపడింది.
తలుపు తెరిచి చూస్తే తపాలా శాఖలో ఉత్తరాలు బట్వాడా చేసే మనిషి.
అతడిచ్చిన కవరు అందుకున్నాను. ఒకసారి లోపలకు వస్తారా అని అడిగాను. అతడు ఆశ్చర్యపోతూనే వచ్చాడు.
‘మీతో ఒక్క ఫోటో తీసుకుంటాను. నాకు సెల్ఫీలు తీయడం రాదు, అయినా సరే!’ అన్నాను.
బహుశా నా అంతట నేను అడిగిన మొదటి సందర్భం ఇదే.
అతడి పేరు బీ. మాధవ రెడ్డి.
చాలా సంతోషం అనిపించింది, గత కాలం గుర్తుకువచ్చి.





కామెంట్‌లు లేవు: