23, అక్టోబర్ 2020, శుక్రవారం

దమ్ముంటే

 ‘దూకుతా దూకుతా అనే సవితే కాని దూకిన నా సవితి లేదు’ అనేది ఓ ముతక సామెత.

‘మీరు రాజీనామా చేయండి. నాతొ పోటీ చేసి గెలవండి. అప్పుడు తెలిసిపోతుంది ప్రజలు ఎవరి పక్షాన వున్నారన్నది’
ఈ మధ్య ఇటువంటి సవాళ్లు మరీ శృతిమించి రాగాన పడుతున్నాయి.

నాకెందుకో ఈ సవాళ్ళలో చిత్తశుద్ధి లేదనిపిస్తుంది. నాగభూషణం రక్తకన్నీరు నాటకంలో చెప్పినట్టు రాజకీయ నాయకులు వదలలేనిది పదవి ఒక్కటే. టీవీ చర్చల్లో చేసే సవాళ్ళను స్వీకరించి రాజీనామాలు చేస్తారంటే మీరూ నేనే కాదు, పైకి చెప్పరు కానీ వాళ్ళు కూడా నమ్మరు.

(అయితే ఈ సూత్రానికి కూడా కొన్ని మినహాయింపులు వున్నాయి. తెలంగాణా ఉద్యమం రోజుల్లో అప్పటి పీసీసీ ప్రెసిడెంటు ఎం. సత్యనారాయణరావు గారు, ఓసారి నోరుజారి నాటి ఉద్యమ నేత కేసీఆర్ కు ఇలాగే ఓ సవాలు విసిరారు. ఆయన ఆ సవాలును స్వీకరించి మెరుపు వేగంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో నిలబడి పెద్ద మెజారిటీతో గెలిచారు. ఆ ఉపఎన్నిక ఫలితం తెలంగాణా ఉద్యమాన్ని మంచి మేలుమలుపు తిప్పిందని అంటారు.

కాబట్టి దమ్ముందా అనే ఛాలెంజ్ విసిరేముందు సొంత దమ్ము గురించి ఓపరి ఆలోచించుకోవడం మంచిది)
23-10-2020

3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

1969 తెలంగాణ ఉద్యమంలో కూడా ఉప ఎన్నికల (ఖైరతాబాదు నుండి నాగం కృష్ణ, సిద్ధిపేట నుంచి మదన్ మోహన్) పాత్ర కీలకం.

సిద్దిపేటకు ఇంకో విశిష్టిత ఉంది. తెలంగాణా రాష్ట్ర సాధన కొరకు మొత్తం నాలుగు సార్లు ఉప-ఎన్నికలలో (1969: మదన్ మోహన్; 2001: కెసిఆర్; 2008 & 2010: హరీష్ రావు) ప్రజాభీష్టం తెలియజేయడం ఘనత.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala : Thanks for the additional inputs which are very valuble.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇటీవలే మరణించిన ఒక సినీ నటుడి (ఎక్కువగా విలన్ పాత్రలు) డైలాగ్ లో “రా రా సీమ సందుల్లోనికి. చూచుకుందాం నీ పెతాపమో నా పెతాపమో” అంటాడు, అలా ఉంది ఈ నాటి రాజకీయ నాయకుల వ్యవహారం. వీధి కొట్లాటల్లాగా ఆ సవాళ్ళేమిటి? హుందాతనం కనబడకుండా పోయింది. వీళ్ళు ఛాలెంజ్ లు విసురుకుని నిజంగాన్ రాజీనామా చేస్తుంటే దాని ఫలితంగా జరపవలసిన ఉప ఎన్నికల ఖర్చు .... రామదాసు గారడిగినట్లు ఎవడబ్బ సొమ్మని ? ఉత్తి పుణ్యానికి ప్రజాధనం వృధా చెయ్యడమేగా?

మొట్టమొదటి నివారణ చర్యగా టీవీ చర్చలను నిషేధిస్తే కొంత దారికి వస్తుందేమో?

ఏదో తమ పై నాయకులను మెప్పించడానికి, తమ అనుయాయులకు చూపించుకోవడానికి (అన్న ఇరగదీసిండు) పాల్గొంటున్న చర్యలేమో అనిపిస్తుంటుంది.