2, అక్టోబర్ 2020, శుక్రవారం

సర్వం జగన్నాధం – భండారు శ్రీనివాసరావు

 

సూత్రాలు లేవు, సిద్ధాంతాలు లేవు. సొంత అవసరాలే కానీ సొంత పార్టీల అవసరాలతో నిమిత్తం లేదు. ఇవ్వాల ఇక్కడ. రేపు అక్కడ. ఎల్లుండి మరెక్కడో! ఎక్కడికి పోయినా మడికట్టుకుని అక్కడే వుండాలని రూలేమీ లేదు. అక్కడ ఇమడలేకపోతే, కోరుకున్న పదవి రాకపోతే, అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోతే, ఏదైనా తేడా పాళాలు వస్తే ఇబ్బందేమీ లేదు. ఎంచక్కా ఎగిరి మళ్ళీ గోడదూకవచ్చు. అడిగేవాళ్ళు లేరు, అడ్డుపెట్టేవాళ్ళు లేరు.

వెనకటి రోజుల్లో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి సొంత బావాబావమరదులు అయినా ఒకరు కాంగ్రెస్ లో, ఇంకొకరు కమ్యూనిస్టు పార్టీలో లేరా అంటే వున్నారు. కానీ వారిది అవకాశవాదం కాదు, సిద్దాంత ప్రాతిపదిక.

ఇప్పుడు అలా కాదే. కొందరు వున్నారు. వాళ్ళు పార్టీ మారరు, పార్టీకి, పదవికి రాజీనామా చేయరు, పిల్లల్ని మాత్రం వెంటబెట్టుకువెళ్లి వేరే పార్టీలో చేర్పించి ఆ పార్టీ కండువాలు కప్పిస్తారు. మరొకాయన గెలిచిన పార్టీలోనే వుంటారు. అసెంబ్లీలో మాత్రం అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడతారు. ఇంకొకాయన తరహానే వేరు. పార్టీలో వుంటూనే పార్టీ విధానాలను అస్తమానం పనిగట్టుకుని విమర్శిస్తూ వుంటారు. ప్రతిపక్షాలు కూడా ఆ స్థాయిలో గొంతు పెంచరు. ఉదయం సాయంత్రం విసుగూ విరామం లేకుండా అదేపనిగా ప్రతిపక్ష బాణీలో ఆయన తన వాణిని వినిపిస్తుంటారు.
ఇంకొందరు వున్నారు. తమ నాయకుడు పార్టీ మారగానే వీళ్ళూ పొలోమంటూ కొత్త పార్టీలో చేరిపోయారు. వీరిది కొంత వింత పరిస్థితి. ఏదో సామెత చెప్పినట్టు మనసొకచోటా మనువొక చోటా.
ఇప్పుడే మరొక మాజీ ఎంపీ ఎప్పుడో తనను వదిలించుకున్న పార్టీలో చేరిపోయాను అంటున్నారు. ‘ఇక నాదేమీ లేదు, పార్టీ అధిష్టానం ఇష్టం’ అని ముక్తాయింపు కూడా. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించి కూడా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. ఇన్నేళ్ళు ఏ పార్టీలో వున్నారు అంటే అది యక్ష ప్రశ్నే. బహిష్కరించిన పార్టీ వాళ్ళు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారా అంటే దాని ఊసే వుండదు.

బాపు ముత్యాల ముగ్గు సినిమాలో హలం పాత్ర రావు గోపాలరావు పాత్రతో అంటుంది, 'నాలుగు రోజులు ఒక చోట డూటీ వేయవుగదా, ఎంతమందిని అని గుర్తు పెట్టుకుంటాను' అని. సందర్భం కాకపోయినా ఎందుకో ఆ డైలాగు గుర్తుకు వచ్చింది.

ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాలేదు. వలస కోయిలలు ముందే కూయడం మొదలుపెట్టాయి. జమిలి ఎన్నికల మీద ఆశలు పెంచుకుంటున్నారేమో. ఇక ఎన్నికల ఘడియ దగ్గర పడితే పరిస్థితి ఏమిటి? శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు అన్నీ ఒక్కమారు ఎత్తిన దృశ్యం కనబడుతుందేమో.

శని సింగాపూర్ లో ఇళ్ళకు తలుపులు, గడియలు వుండవంటారు.
అలాగే, రాజకీయ పార్టీలవాళ్ళు ఎవరైనా సరే స్వేచ్ఛగా లోపలకు రావడానికి, బయటకు వెళ్ళడానికి వీలుగా తలుపులు, కిటికీలు, ద్వారబంధాలు కూడా పెరికి అవతల పారేసినట్టున్నారు.

ఎంత స్వేచ్ఛో భారత ప్రజాస్వామ్యంలో.
ప్రజలకు కాదు సుమండీ, పార్టీలకు, వాటి నాయకులకు.
(02-09-2020)

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

ఎవరు ఎక్కువ డబ్బిస్తే వారికి ఓటు గుద్దే ప్రజలు పెరుగుతున్న కాలంలో నాయకులు కూడా ఇలానే ఉంటారు లెండి.