30, మార్చి 2020, సోమవారం

దుగ్గిరాల పూర్ణయ్య ఇక లేరు


ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివినవారిలో ప్రసిద్ధులు దుగ్గిరాల పూర్ణయ్య
ఆరోజుల్లో రేడియో కళాకారులకు, న్యూస్ రీడర్లకు సినీ రంగంతో పాటు దీటైన ఆకర్షణ వుండేది. వారిని సాంస్కృతిక కార్యక్రమాలకు, వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సత్కరించేవారు. అయితే స్వతహాగా నిరాడంబర జీవితం గడిపే పూర్ణయ్య వీటన్నిటికీ దూరంగా వుండేవారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంపొందించుకోగల అవకాశాలు వృత్తిపరంగా ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన పనేదో తనేమో అన్నట్టు జీవితం సాగించారు.
సినిమా రంగంలో ఒక మాట వినబడుతూ వుంటుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినాడని. దుగ్గిరాల వారిది కూడా ఓ మోస్తరుగా ఇదే కధ. కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వెళ్ళిన పూర్ణయ్య గారికి ఒక చిన్న కొలువు దొరికింది. బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కే.అద్వాని (అప్పుడు జనసంఘం) నడిపే ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు పూర్ణయ్య గారి పనితీరు వారికి నచ్చింది. వారిరువురి నడుమ సాన్నిహిత్యం పెరిగింది. అద్వానీ గారి మాట సాయంతో ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆయన న్యూస్ రీడర్ కాగలిగారు.
రేడియో ఉద్యోగం కొత్త. అయినా ఆయన త్వరగానే ఆ కొత్త కొలువులో ఒదిగిపోయారు. ఇంగ్లీష్ నుంచి వార్తల్ని తెలుగులోకి తర్జూమా చేసి, స్టూడియోలో లైవ్ చదవడంపై పట్టు సాధించారు. మనిషి పీలగా కనిపించినా వారిది కంచు కంఠం. వేరే ధ్యాసలు లేకుండా కేవలం వృత్తి ధర్మాన్ని నిర్వహించే స్వభావం కావడం వల్ల దుగ్గిరాల పూర్ణయ్య గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని బాధ పడే అభిమానులు కూడా వున్నారు.
నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఢిల్లీలో పూర్ణయ్య గారిని కలుసుకున్నాను. మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం ఆయనకే ముందు వచ్చినా ఆయన కాదనుకుని ఢిల్లీలోనే వుండిపోయారు.
ఎనిమిది పదులు దాటిన పూర్ణయ్య గారు, అనేక దశాబ్దాల క్రితం వదిలి వెళ్ళిన స్వగ్రామం, గుడివాడ దగ్గర అంగలూరులో భార్య శ్రీమతి లక్ష్మితో కలిసి ఇప్పుడు శేష జీవితం గడుపుతూ ఈరోజు ఆదివారం (29-03-2020) మధ్యాహ్నం కన్నుమూశారు.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆ తరపు (bygone era) ప్రతినిధుడు మరొకరు అస్తమించారన్నమాట. శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య గారు మా ఊరి ప్రముఖుడు కూడానూ.

వారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుందాం 🙏.