30, మార్చి 2020, సోమవారం

ఎలా వున్నారు?


పొద్దున్నే వెంకట్రావు గారి నుంచి ఫోను, ‘ఏం శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు?” అని.
వెంకట్రావు గారు నేను 1970 ప్రాంతాల్లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్లుగా కలిసి పనిచేశాం. లబ్బీ పేటలో మా ఇద్దరి ఇళ్లు కూడా దగ్గరిదగ్గరగానే ఉండేవి. వారి భార్య నిర్మల, నా భార్య నిర్మల సైతం మంచి స్నేహితులు.
తర్వాత నేను హైదరాబాదులో ఆలిండియా రేడియోలో చేరాను. ఆ తర్వాత వెంకట్రావు గారు కూడా హైదరాబాదు వచ్చేశారు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ గా. కొన్నేళ్ళకు ఆ పత్రిక ఎడిటర్ అయ్యారు. ప్రెస్ అకాడమి చైర్మన్ అయ్యారు. మహా టీవీ చీఫ్ ఎడిటర్ అయ్యారు. ఆయన ఎన్ని మెట్లెక్కినా  మా స్నేహం కొనసాగుతూనే వుంది.
నా జీవితంలో కొన్ని నెలల క్రితం ఎదురయిన గొప్ప కష్టం తర్వాత ఐవీఆర్ అప్పుడప్పుడూ ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూ వుంటారు.
“సెల్ఫ్ ఐసోలేషన్ కి అలవాటు పడ్డారా?” ఐవీఆర్ అడిగారు.
ఏ ప్రశ్నకీ సూటిగా జవాబు చెప్పననే పేరు నాకు ఎలాగూ వుంది.
“ఒకడు జీవితంలో అష్టకష్టాలు పడుతూ జాతకంలో మంచి రోజులు వస్తాయేమో అనే ఆశతో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లి చేయి చూపించుకుంటాడు. యాభయ్ ఏళ్ళు వచ్చేవరకు అన్నీ కష్టాలే రాసి వున్నాయి అన్నాడా జ్యోతిష్కుడు. “ఆ తర్వాత” అడిగాడు ఆశగా మనవాడు. “తర్వాత ఏముంది ఆ కష్టాలకు అలవాటు పడిపోతావు”
గత కొన్ని నెలలుగా నాది ఒక రకంగా ఐసొలేషన్ జీవితమే. ఇప్పుడు కొత్తగా కొరానా వల్ల వచ్చిన తేడా ఏమీ లేదు. ఆల్రెడీ అలవాటు పడిపోయాను”
నా జవాబుకి ఆయన నవ్వేశారు. కానీ అందులో బాధ మిళితమై వుందని నాకు తెలుసని ఆయనకీ తెలుసు.           

కామెంట్‌లు లేవు: