30, మార్చి 2020, సోమవారం

వెలుగు చూడని వార్తలు – 1 -


అప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ సీపీ ఎం నాయకుడు రాఘవులు ఒక ఆరోపణ చేశారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో వంద కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందన్నది ఆ ఆరోపణ సారాంశం.
మర్నాడు ఒక ప్రముఖదినపత్రిక ఒక కార్టూన్ ప్రచురించింది. వై ఎస్ బొమ్మ పెద్దగా, పక్కనే చంద్రబాబు బొమ్మ చిన్నగా వుంటుంది. ఆయన వై ఎస్ ని ఉద్దేశించి ఏదో అంటుంటాడు. సీపీఎం నాయకుడు రాఘవులు వైఎస్ఆర్ నోట్లో చేయిపెట్టి ఒక డబ్బు మూట బయటకు తీస్తుంటాడు. వై ఎస్ ఆర్ అవినీతిని టీడీపీ కన్నా సీపీఎం బాగా బయట పెడుతోందన్న అర్ధం అందులో అంతర్లీనంగా వుంది.
అది చూసిన వై ఎస్ కి పట్టరాని కోపం వచ్చింది. దాన్ని ఆయన దాచుకోలేదు. ఆ కార్టూన్ వేసిన పత్రిక యజమానిపై మండిపడ్డారు. అప్పుడు అక్కడే వున్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ నచ్చ చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు. ఆ పత్రిక రాసేవన్నీ అభూత కల్పనలు అనే పద్దతిలో ఎదురు దాడి మొదలు పెట్టడమే మంచిదని వైఎస్ నిర్ధారణకు వచ్చారు. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి వున్నప్పుడు ఇప్పటి నుంచే పత్రికలతో తగాదా ఎందుకన్నదికిరణ్, కేవీపీ ల అభిప్రాయం. కానీ వైఎస్ ఒప్పుకోలేదు. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎన్నికల నాటికి ప్రజలు నమ్మే పరిస్తితి వస్తుందని ఆయన నమ్మకం. అప్పటి నుంచి వైఎస్ సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పత్రిక రాతల్ని ఎండగట్టే ప్రయత్నం ప్రారంభించారు. తరువాత అది ఆ రెండు పత్రికలూ..అంటూ రెండు తెలుగు దిన పత్రికలని ఎద్దేవా చేసే ప్రచార కార్యక్రమంగా రూపు దిద్దుకుంది.

కామెంట్‌లు లేవు: