26, మార్చి 2020, గురువారం

రాజకీయాలకు ఇంకా టైముంది


దయచేసి వినండి – భండారు శ్రీనివాసరావు
కరోనా విషయంలో ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో కొన్ని లొసుగులు అనివార్యం. వాటిని మనం భూతద్దంలో చూసి, మరింత పెద్దవి చేసి ప్రపంచానికి చూపించే ప్రయత్నమే ఫేస్ బుక్ వంటి సాంఘిక మాధ్యమాలలో ఎక్కువగా జరుగుతోంది.  ఇంట్లో ఫ్యాను కింద కూర్చుని ఈ క్షణంలో నేనిది టైప్ చేస్తున్నాను అంటే ఈ పని చేయడానికి ఎందరో ఎక్కడో ఈ పరిస్తితుల్లో కూడా  నాకోసం పనిచేస్తున్నారని అర్ధం.
అది మరచిపోయి, ఏదేదో లేనిపోని నీలివార్తలు షేర్ చేస్తూ పోతుంటే నేనెంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నట్టు. మీరు కంటితో చూసిన విషయం ఏదైనా వుంటే, దాన్ని సంబంధిత అధికారులకి చేరవేయడానికి ఈ మాధ్యమాన్ని వాడుకుంటే అంతకంటే కావాల్సింది లేదు. ఉదాహరణకు నీలయపాలెం విజయకుమార్ ఒక పోస్ట్ పెట్టారు. వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో జనాలు ఎగబడి సరుకులు కొంటున్న సంగతి రాసారు. ప్రతి వీధిలో చిన్నవో పెద్దవో కిరాణా షాపులు వుంటే, వాటిల్లో  ధరకాస్త  ఎక్కువే కావచ్చు,  వాటిని వదిలిపెట్టి దూరంగా ఉన్న సూపర్ మార్కెట్ పై దండెత్తడం ఎందుకని వారి ప్రశ్న. “It appears that, people are yet to relise the gravity” అని ఆవేదన వెలిబుచ్చారు. వాస్తవానికి విజయకుమార్ టీడీపీ నాయకుడు. విమర్శ ప్రధానం అనుకుంటే ఆయన పోస్ట్ వేరేగా వుండేది. ఇదీ సంయమనం అంటే.
డిసెంబరు ముప్పయి ఒకటి వరకు మనకెవరికీ కరోనా అంటే తెలవదు. అది ఎలా వస్తుందో తెలవదు. ఇంతవరకు అంటు వ్యాధులు ఈగలు, దోమలు, ఇతర క్రిముల నుంచి మనుషులకు సోకేవి. వాటిని నిర్మూలిస్తేనో, అదుపు చేస్తేనో  రోగాలు తగ్గేవి. మరి కొన్నింటి  నిరోధానికి టీకాలు వున్నాయి. ఇది అలా కాదే. మనుషుల నుంచి మనుషులకు పాకే వ్యాధి. మొదటి దశలో నయం చేయడానికి వీలుంటుంది. రెండో దశ కొంత నయం. మూడో దానికి చేరితే ఇక ఇంతే సంగతులు. కేన్సర్ కూడా ఇంతే కదా అనవచ్చు. కానీ కేన్సర్ రోగిని తాకడానికి ఎవరూ సందేహించరు. చుట్టూ భార్యాపిల్లలను ఉంచుకుని ప్రశాంతంగా ప్రాణాలు విడవొచ్చు. కానీ ఇది అలా కాదే. రోగం వచ్చిందని నిర్ధారణ కాగానే బయట ప్రపంచంతోనే కాదు, కుటుంబ సభ్యులు, చుట్టపక్కాలతో కూడా సంబంధాలు తెగిపోతాయి. అందుకే మనిషికీ మనిషికీ మధ్య దూరం వుండాలని హెచ్చరిస్తోంది. మొదట్లో ప్రభుత్వాలు ప్రదర్శించిన  నిర్లిప్తత కంటే ఇప్పుడు ప్రజల చూపుతున్న  నిర్లక్ష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. అదే ప్రమాదం అనుకుంటే ఇళ్ళల్లో తీరి కూర్చుని, కంప్యూటర్లు ముందేసుకుని, ఘడియకో నీలివార్త వండి వార్చే వారితో మరింత పెద్ద ముప్పు ఎదురవుతోంది.
చూస్తుండగానే కేవలం మూడే మూడు నెలల్లో కరోనా రోగం ఇంతింతై, అంతింతై  తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అది భారత దేశంలో కాలుమోపినప్పుడు  కేంద్రంలో మోడీ, తెలంగాణాలో కేసీఆర్, ఏపీలో జగన్ అధికారంలో వుండడం అనేది యాదృచ్చికం. ఇదే ఏడాది కిందనో, పదేళ్ళ కిందనో జరిగుంటే పాలకులు వేరుగా వుండేవారు. మీరు అనొచ్చు వారి వారి సమర్ధతను బట్టి వ్యవహరించే తీరు మారొచ్చని. కాదనను. కానీ ఈ యుద్ధం మానవాళి చేస్తున్న ప్రచ్చన్న యుద్ధం. కంటికి కనబడని శత్రువుతో చేస్తున్న యుద్ధం. మనకంటే అన్నింటా ఉచ్చస్థాయిలో ఉన్న  దేశాలే ఈ కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. ఈ ముప్పు ఏ ఒక్క ప్రాంతానికో, లేదా ఏ ఒక్క ప్రదేశానికో పరిమితమైంది కాదు. గతంలో మనం చూస్తూ వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకి దీనికి చాలా తేడా వుంది. ఒక చోట వరదలు వస్తాయి. మరో చోట వర్షాలే వుండవు. ఒక చోట భూకంపాలు సంభవిస్తాయి. మరో చోట ప్రశాంతంగా వుంటుంది. కానీ ఈ కరోనా అనేది ఒకేసారి యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉక్కిరిరిబిక్కిరి చేస్తోంది. ఎవరికి వారు తమకు సాయం చేసుకోవడంలోనే బిజీబిజీ. ఇతరులవైపు కన్నెత్తి చూసి పరామర్శించే తీరిక ఈనాడు ఎవరికీ లేదు.  బ్రిటన్ దేశానికి కాబోయే చక్రవర్తే దీని పాలిటపడి చికిత్స తీసుకుంటున్నాడు.
అంచేత చెప్పేది ఏమిటంటే, కొన్నాళ్ళు ఇంటి గడప దాటకుండా ఉండడమే దేశానికి మనం చేసే సేవ. ప్రకృతి కన్నెర్ర చేసిన కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుంటే ఇళ్ళల్లో వుండడం పెద్ద విషయం ఏమీ కాదనిపిస్తుంది. తుపానులు సంభవించినప్పుడు వారాల తరబడి కరెంటు వుండదు. భూకంపాలు సంభవిస్తే ఆసుపత్రులే నేలమట్టం అవుతాయి. వరదలు వచ్చినప్పుడు తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకవు.
అదే ఇప్పుడు చూడండి.  కొన్ని కుటుంబాలకు, కొందరు వ్యక్తులకు జరిగే వ్యక్తిగత ఇబ్బందులను మినహాయిస్తే ఇంట్లో వుండి పోవడం అన్న ఒకే ఒక్క అసౌకర్యం మినహా ఇక ఏ లోటు లేదు. అధికారులు కరెంటు సరఫరాలో లోపం లేకుండా చూస్తున్నారు. నెట్ పుణ్యమా అని ఇళ్ళల్లోనే కావలసినంత కాలక్షేపం. చుట్టపక్కాలతో ముచ్చటించడానికి ఎలాగూ మొబైల్స్ వున్నాయి.  నిత్యావసర వస్తువుల కొరత అనేది సమస్యే. కానీ కొంత సంయమనం పాటిస్తే అంటే పానిక్ బయింగ్ కు స్వస్తి చెప్పగలిగితే  కాసిన ఉపశమనం లభించవచ్చు. ఇవన్నీ మన చేతుల్లో వున్నవే. ప్రభుత్వాలను విమర్శించి ప్రయోజనం లేదు. వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి. మూడు వారాలు ఓపిక పట్టగలిగితే ఆ తర్వాత మరింత ఘాటుగా  రాజకీయ విమర్శలు చేయడానికి ఎంతో సమయం లభిస్తుంది. ఈలోగా బాధ్యత కలిగిన పౌరులుగా  మనం చేయాల్సింది మనం చేద్దాం!              

కామెంట్‌లు లేవు: