16, మార్చి 2019, శనివారం

హెల్ప్ లెస్

రాజకీయ వ్యాసాలకు వ్యక్తిగత అభిమానాలకు లంకె కుదరదు. దేని దారి దానిదే. అలా అని మనసులో మాటలు ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట, ఏదోవిధంగా రచనలలో తొంగిచూడడం కద్దు. కీర్తిశేషులు, ప్రముఖ జర్నలిస్టు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని దాచుకోవడానికి సందేహించేవారు కాదు. ఆయన హయాములోనే బడుగు, బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన అంటూ వుండేవారు. అయితే అది తన వ్యాసాల్లో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడేవారు.
సినీ నటుల పట్ల అభిమానం పెంచుకునే రీతిలోనే రాజకీయ నాయకుల విషయంలో కూడా అభిమానులు తయారవుతున్నారు. ఇది తప్పేమీ కాదు.
మా కుటుంబం విషయమే తీసుకుందాం. దాదాపు తొంభయి శాతం మందికి చంద్రబాబునాయుడు అంటే చెప్పలేని ఇష్టం. మొదటి సారి ఆయన ఓటమి పాలయినప్పుడు, మా కుటుంబంలో కొందరు ఆడవాళ్ళు ఆయన్ని చూడాలని కోరితే వాళ్ళని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాను. అందులో గీత అనే ఆవిడ తన సానుభూతి వాక్యాలతో చంద్రబాబుకు కంటనీరు తెప్పించింది. వాళ్ళని సముదాయించాల్సిన పరిస్తితి ఆయనది. ఇన్నేళ్ళు గడిచినా ఆయన పట్ల వారి అభిమానంలో మార్పులేదు.
ఇక జగన్ అన్నా ఆయన పార్టీ అన్నా ప్రాణం పెట్టేవాళ్ళు రోజూ నా చుట్టూతా కనిపిస్తుంటారు. మా పనిమనిషి, వంట మనిషి, వాచ్ మన్ ఇలా అనేక కుటుంబాల వాళ్ళు నాకు తెలుసు. సాక్షి పత్రిక కేలండర్ పై వేసే వై ఎస్ ఫోటోను ఫ్రేము కట్టించి దాచుకుంటారు. ప్రతి ఏటా ఆ పని చేయడం చూసి నాకు చిత్రమనిపిస్తుంది. జగన్ జైలు నుంచి విడుదల అయిన రోజున తమ రోజువారీ పనులు పక్కన బెట్టి గంటలు గంటల పాటు జైలు పరిసరాల్లో ఆయన కోసం ఎదురు చూస్తూ గడిపారన్న తెలుసుకుని ఆశ్చర్య పోవడం నా వంతయింది. ఇన్నేళ్ళు గడిచినా వాళ్ళూ అంతే! జగన్ పట్ల వారి అభిమానం రవంతకూడా చెక్కుచెదరలేదు.
కాబట్టి, ఎవరి అభిమానాలు వారివి. మా కుటుంబంలోని బాబు అభిమానులకు, జగన్ అభిమానులకు నేను రాసే రాతల్లో కొన్ని బాగా నచ్చుతాయి. కొన్ని అస్సలే నచ్చవు. ఆ విషయం నాకు తెలుసు.
కానీ ఈ విషయంలో నేను హెల్ప్ లెస్.


(పైన పేర్కొన్న రాజేంద్ర ప్రసాద్ గారే మరో మాట కూడా చెప్పేవారు. జర్నలిస్టు అనేవాడు ప్రతిపక్షం పట్ల కొంత సానుభూతి చూపాలని అనేవారు. ప్రచారం చేసుకోవడానికి పెద్ద వ్యవస్థ ప్రభుత్వం చేతిలో వుంటుంది. ఆ వెసులుబాటు లేని ప్రతిపక్షాల సంగతి కనిపెట్టి చూడాలని దాని తాత్పర్యం)

3 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

చంద్రబాబుగారి జాతకం బాగులేదని ఆలోచనాతరంగాల శర్మగారు ఏం చేస్తారు పాపం !
హెల్ప్ లెస్ !

సూర్య చెప్పారు...

అందరినీ కలుపుకు పోతూ భలే రాసారే!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సూర్య: రేడియో అనుభవమా మజాకా