గత రెండు రోజుల్లో మాకు బాగా కావాల్సిన
వాళ్ళు ఇద్దరు చెప్పాపెట్టకుండా బతుకు రైలు బండి దిగి వెళ్ళిపోయారు.
ఒకరు పద్మ. మా చిన్న మేనత్త మనుమరాలు. ఆ అమ్మాయికి యాభయ్ ఆరేళ్ళు
అంటే నమ్మబుద్దికాదు. అంత నేవళంగా వుంటుంది. పద్మను నవ్వు మొహంతో కాకుండా వేరే
విధంగా మా చుట్టపక్కాలు ఎవ్వరూ చూసి ఎరుగరు. నవ్వుతూ పలకరించేది. పలకరిస్తూ
నవ్వేది. అలాంటి నవ్వులన్నీ మాకు ఇచ్చేసి తాను మాత్రం ఎంచక్కా ఎక్కడికో
వెళ్ళిపోయింది. విచిత్రం ఏమిటంటే పదంటే పది రోజుల్లో తన ప్రాణాలు తీసే జబ్బు తన
ఒంట్లో ప్రవేశించిందని తనకు తెలియదు. ఆసుపత్రివాళ్ళు పెదవి విరిచి ఇంటికి తీసుకుపొమ్మని
చెప్పారు. పద్మకు ఆ విషయం తెలియదు. జబ్బు నయమైందనుకుని నవ్వుతూ సిబ్బంది అందరికీ
టాటా చెప్పి వెళ్ళింది. అంతే! మరునాడు ఇంట్లోను లేదు. అసలు ప్రపంచంలోనే లేదు. ఇలా కూడా మనుషులు చనిపోతారా
అని ఇంకా అందరిలో తొలగని అనుమానం.
రెండో వ్యక్తి తాజుద్దీన్. మా పక్క
ఫ్లాట్ లో వుండేవాళ్ళు. చిన్న కుటుంబం. ఇప్పుడు ఎక్కడో దూరంగా వుంటున్నారు. భార్య
అనీస్. బ్యూటీపార్లర్ లో పనిచేస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలు. రగీనా, అలేజా.
పిల్లలు కాదు అందమైన బొమ్మలు. చిన్నతనంలో దాదాపు మా ఇంట్లో, మా ఆవిడ ఒడిలోనే
పెరిగారు. తాజ్ ఏదో ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అతడికి అంత చిన్న వయస్సులోనే
రెండు కిడ్నీలు చెడిపోయాయి. వారానికి రెండు సార్లు ఎల్లారెడ్డి గూడా నుంచి మోటారు
సైకిల్ పై ఒక్కడూ వెళ్లి నాంపల్లి లోని ఆసుపత్రిలో డయాలిసిస్ చేయించుకుని ఇంటికి
వచ్చేవాడు. ఆరేళ్ళ క్రితం కరెంటు కోతలు బాగా ఉన్నరోజుల్లో లిఫ్ట్ పనిచేయక నీరసంగా
మెట్లెక్కి వస్తుండేవాడు. చాలా రోజుల వరకు అతడు డయాలసిస్ చేయించుకుని
వస్తున్నాడని, కిడ్నీలు చెడిపోయాయని నాకు తెలవదు. మామూలు సమయాల్లో చాలా హుషారుగా
ఉండేవాడు. పిల్లలంటే ప్రాణం.
తాజుద్దీన్ కూడా పద్మ కన్ను మూసిన
రోజునే హైదరాబాదులో మరణించాడు.
ఒక రచయిత అన్నట్టు ‘భగవంతుడు పెద్ద
టెర్రరిస్ట్’.
నిర్దాక్షిణ్యంగా, నిష్కారణంగా ఎప్పుడు
ఎవరి ప్రాణాలు తీస్తాడో తెలవదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి