4, మార్చి 2019, సోమవారం

దేవుడి హత్య – భండారు శ్రీనివాసరావు



(ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ ఛానల్ లో  Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో)   
డబ్బు, అధికారం, కులం, మద్యం, మతం ఇవే ఇంతటివరకు ఎన్నికల వైతరణిని దాటించి విజయపధంలో నిలిపే సాధనాలు. ఇప్పుడీ జాబితాకు మరోటి వచ్చి చేరింది. అదే టెక్నాలజీ.
రాజకీయ పార్టీలవాళ్ళు  ఈరోజుల్లో ఎవరికి వారే సొంతంగా టెక్ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదేమీ రహస్యమూ కాదు, చట్ట వ్యతిరేకమూ కాదు. కానీ అదే ఆధునిక టెక్నాలజీ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించే పరిస్తితులు ఎదురయితే మాత్రం ఉపేక్షించడం మంచిది కాదు.
ప్రతి ఎన్నికల ముందూ తప్పనిసరిగా చర్చకు వచ్చే అంశం ఓట్ల తొలగింపు.
ఓటు అనేది ఎప్పుడు జాబితానుంచి తొలగిస్తారు? సాధారణంగా ఆ ఓటరు మరణించినప్పుడు ఇది జరుగుతుంది. తన పేరు ఓటర్ల జాబితాలో లేదని తెలుసుకున్న ఒక వ్యక్తి, ‘బతికుండీ నేను చనిపోయినట్టే లెక్క’ అంటూ గతంలో  ఆవేదనతో చేసిన వ్యాఖ్య వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.      
ఓటర్ల జాబితా నుంచి అర్హులయిన వారి పేర్లు తొలగిస్తున్నారనీ, అర్హత లేని వారిని తొలగిస్తున్నారనీ ఏపీలో పాలక ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అంతేకాదు, ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని ఉభయ పక్షాలు వాడుకుంటున్నాయని కూడా అంటున్నారు. ఇదే నిజమయితే ఈ పని సామూహిక హననం కిందికి వస్తుంది. మూకుమ్మడి హత్యాకాండ అని కూడా అనవచ్చు. ‘ఓటరు దేవుడు’ అని ఎన్నికల ప్రచారంలో రాజకీయనాయకులు అవసరార్ధం ఓటర్లని అభివర్ణిస్తుంటారు. అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏమన్న మాట. ఆధునిక టెక్నాలజీతో ఆ దేవుళ్ళనే  గుంపగుత్తగా మట్టుబెట్టడం అన్నమాట.
అధికార పార్టీ ప్రతి పక్షాన్ని, ప్రతిపక్షం పాలక పక్షం ఒకదానిపై మరొకటి నిందారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. వాటిపై తిరిగి టీవీల్లో చర్చలు. ఇంతటితోనే సరిపుచ్చితే, జర్నలిస్టులుగా మనం మన పౌర ధర్మాన్ని పాటించనట్టే.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలపై జరగాల్సింది చర్చలు మాత్రమే కాదు, చర్యలు కూడా.
అర్హత లేని ఓటర్లతోనే ఎన్నికలు జరగొచ్చు. అర్హత లేని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అవి ప్రజలు ఎన్నుకున్న నిజమైన ప్రజా ప్రభుత్వాలు కానేరవు.
అలాంటి ప్రజాస్వామ్యం మనం గొప్పలు చెప్పుకునే గొప్ప ప్రజాస్వామ్యం కానేరదు.
అది  వట్టి నేతిబీరకాయ కాయ మాత్రమే.
బాగా శ్రద్ధ పెట్టి చదివిన వాడు పరీక్షల్లో కాపీలు కొట్టడు. సరుకు లేనివాడే అడ్డదారులు వెతుక్కుంటాడు.
రాజకీయ పార్టీలు కూడా ప్రజల్ని నమ్ముకోవడం మానేసి వేరే దారులు వెతుక్కోవడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.
ఈ కార్యక్రమాన్ని చూసేవారిలో ఆయా పార్టీల అభిమానులే కాదు, ఏ పార్టీతో అంటకాగని తటస్థ ప్రేక్షకులు కూడా వుంటారు. వారికోసం ఈ మాటలు చెబుతున్నాను. రాజకీయ పార్టీలు ఏవీ చెవిన పెడతాయనే నమ్మకం లేదు.  (కార్యక్రమం ఆఖరున కలిగిన సాంకేతిక అంతరాయం కారణంగా చివరి వాక్యాలు గాలిలో కలిసినట్టు లేదు)  
https://youtu.be/b7151-biN-M    

కామెంట్‌లు లేవు: