‘ఓ నిజం చెప్పనా?’ అంది నిజం.
నిజమే స్వయంగా ఓ నిజం చెబుతున్నప్పుడు
దాన్ని నమ్మనివాళ్ళు ఎవరుంటారు.
‘నన్నూ ఓ నిజం చెప్పమంటారా?, నేనూ,
నిజమూ మా చిన్నప్పటి నుంచీ దోస్తులం”
అంది పక్కనే వున్న అబద్ధం, అది శుద్ధ
అబద్ధమని తెలిసికూడా.
కానీ అబద్ధం చెప్పిన మాట నిజమని
నమ్మేసింది, నిజం అమాయకంగా.
అప్పట్నించి నిజం అబద్ధంతో స్నేహం
చేయడం మొదలెట్టింది.
అలా కొన్నాళ్ళు గడిచాయి.
నిజం తనను నిజంగా నమ్ముతోందని ధ్రువపరచుకున్న
తర్వాత అబద్ధం ఓరోజు నిజాన్ని అడిగింది ‘అలా
సరదాగా అడవిలో షికారుకు వెళ్లివద్దామా’ అని.
సరే అని నిజం అబద్ధం వెంట అడవికి
వెళ్ళింది. చాలా దూరం వెళ్ళిన తర్వాత
వారికి ఓ సరస్సు కనిపించింది. అందులోకి దిగితే తిరిగి ప్రాణాలతో బయటకి రాలేరు. ఈ
నిజం అబద్ధానికి తెలుసు. అయినా ఆ విషయం నిజానికి చెప్పకుండా దాచింది.
ఇద్దరూ స్నానం చెయ్యడానికి దుస్తులు
విప్పి ఒడ్డున పెట్టారు. నిజం ముందుగా నీళ్ళల్లోకి దిగింది.
అబద్ధం తెలివిగా ఒడ్డున వదిలేసిన నిజం దుస్తులు
తాను ధరించి సరస్సులోకి దిగకుండా వెనక్కి వచ్చేసింది. నిజం ఆసరస్సులోనే వుండిపోయింది.
అప్పటినుంచి అబద్ధం తాను వేసుకున్న నిజం దుస్తులతో తానే నిజాన్నని ప్రపంచాన్ని
నమ్మించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ విధంగా కొన్నాళ్ళకు అబద్ధమే నిజంగా చెలామణిలోకి వచ్చింది.
అంటే ఈ రోజు మనకు కనిపించే, వినిపించే
నిజం, నిజానికి నిజం కాదు, అబద్ధం చెప్పే
నిజం మాత్రమే.
(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం
)
1 కామెంట్:
ఈపోస్టు పూర్తిగా చదివాను. నిజం!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి