17, ఆగస్టు 2018, శుక్రవారం

రాజకీయాల్లో అస్తమించిన హుందాతనం – భండారు శ్రీనివాసరావు


అటల్ బిహారీ వాజ్ పాయ్ విదేశాంగ మంత్రి. అప్పటివరకు ఢిల్లీ సౌత్ బ్లాక్ లో ఉంటూ వచ్చిన నెహ్రూ చిత్రపటం కనబడకపోవడాన్ని ఆయన గమనించారు. నెహ్రూ ఫోటోను తక్షణం అక్కడ పెట్టాలని ఆదేశించడం, అది అమలుకావడం జరిగింది. ఈ రోజుల్లో ఈ హుందాతనాన్ని ఊహించగలమా?
పార్లమెంటులో ప్రసంగిస్తూ వాజ్ పాయ్ ఆనాటి ప్రధాని నెహ్రూను తీవ్రంగా విమర్శించారు. ఆ సాయంత్రం అటల్ బిహారీ వాజ్ పాయ్ పార్లమెంటు హాలులోకలిసినప్పుడు నెహ్రూ ఆయన భుజం తట్టి ‘బాగా మాట్లాడావు’ అని మెచ్చుకున్నారు. (ఇద్దరూ ఒకరినొకరు ‘గురూజీ’ అని సంబోధించుకునేవారట)  ఈ రోజుల్లో అలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!
వాజ్ పాయి ముందు విదేశాంగ మంత్రి అయ్యారు. తరువాత అదే పదవిని పీవీ నరసింహా రావు స్వీకరించారు. వాజ్ పాయి వ్యక్తిగత సిబ్బందిని అందర్నీ కొనసాగించడానికి పీవీ నిర్ణయించారు. ఈరోజుల్లో అలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!
ముందు పీవీ ప్రధాని అయ్యారు. తరువాత అదే పదవిని వాజ్ పాయ్ అలంకరించారు. అప్పటికే పీవీ, దేశప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అణుపరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా వాజ్ పాయ్ ప్రభుత్వం వచ్చింది. పీవీ నరసింహా రావు, ఎవరూ గమనించకుండా వాజ్ పాయ్ చేతిలో ఒక చీటీ పెట్టారు. “అణుపరీక్షకు సర్వం సంసిద్ధంగా వుంది. ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత మీపై వుంది”
పీవీ సలహాను వాజ్ పాయ్ పాటించారు. పోఖ్రాన్ లో అణుపరీక్షను జయప్రదంగా నిర్వహించారు.
పీవీ మరణించినప్పుడు ఇచ్చిన సంతాప సందేశంలో వాజ్ పాయ్ ఈ సంగతి వెల్లడించేవరకు ఈ విషయం గోప్యంగానే వుంది. ఈ హుందాతనాన్ని నేటి రాజకీయాల్లో ఊహించగలమా!
పీవీ ప్రధానమంత్రి, జెనీవాలో జరిగిన మానవహక్కుల సదస్సుకు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్ పాయ్ నాయకత్వంలో భారత ప్రతినిధివర్గాన్ని పంపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందివారిని కాకుండా విపక్షానికి చెందిన వ్యక్తిని  పీవీ ఎంపిక చేయడం ఆ పార్టీవారికి రుచించలేదు. అలాగే బీజేపీ వారికి కూడా వాజ్ పాయ్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించడం పట్ల అభ్యంతరాలు వున్నాయి. కానీ భారత ప్రతినిధివర్గం నాయకుడిగా జెనీవా సదస్సులో వాజ్ పాయ్ ప్రసంగించిన తీరు, భారత దేశ విధానాన్ని వ్యక్తం చేసిన పద్దతి ఆ తర్వాత అందరి ఆమోదాన్ని పొందింది. ఈనాటి రాజకీయాల్లో ఇలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!
తదనంతర కాలంలో పీవీ రాసిన పుస్తకాన్ని వాజ్ పాయ్ ఆవిష్కరించారు. అలాగే వాజ్ పాయ్ రచించిన కావ్యాన్ని పీవీ ఆవిష్కరించారు.
పాలక, ప్రతిపక్షాలు రెండూ నిప్పూ ఉప్పూ తరహాలో కాట్లాడుకుంటున్న ఈనాటి రాజకీయ వాతావరణంలో ఆనాటి హుందాతనాన్ని ఊహించగలమా!

గత కొన్నేళ్ళుగా వాజ్ పాయ్ మృత్యువు పడగనీడలోనే శేష జీవితాన్ని గడుపుతూ వచ్చారు. నిజానికి మూడు దశాబ్దాల క్రితమే ఆయన మృత్యువుతో ముద్దాడి బయట పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక కవితలో రాసుకున్నారు.
1988లో అటల్ బిహారీ వాజ్ పాయ్ మూత్ర పిండాల వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్ళారు. ఆ సమయంలో ఆయనకు మరణం తప్పదు అనిపించింది. కవిత రూపంలో తన మనసులోని భావాలను  అక్షరబద్ధం చేసి భారత దేశంలో ఉన్న తన స్నేహితుడు, కవి అయిన ధర్మవీర్ భారతికి పంపారు. అందులో ఇలా రాసుకున్నారు.
“చావుతో పోట్లాడాలని లేదు, కానీ మరణం నా దారికి అడ్డంగా వచ్చింది. తన కౌగిలిలోకి తీసుకుని నా నుదుటిపై ముద్దు పెట్టింది”    
ఒక ఏడాది మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ పుట్టిన రోజున ఆయనకు వినూత్నమైన కానుక ఇవ్వాలని ఆకాశవాణి, దూరదర్సన్ లను నిర్వహించే ప్రసార భారతి సంస్థ సంకల్పించింది.
హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి కొందరు ప్రసిద్ధ కవులను ఢిల్లీకి రప్పించి భారతీయ విద్యా భవన్ లో మూడు రోజులపాటు ప్రత్యేక కవి సమ్మేళనం నిర్వహించింది. వాజ్ పాయ్ రాసిన గేయాల నుంచి కొన్ని పంక్తులను ఒక్కొక్కరికీ ఇచ్చి వాటిని పొందు పరుస్తూ కవితలను రాయించింది. వాజ్ పాయ్ ప్రసిద్ధ గేయాలయిన “కదం మిలాకర్ చల్నా హోగా...” , “ ఆవో ఫిర్ సే జలా దియాయే....” వంటివి వీటిలో వున్నాయి.
ఒక గొప్ప వ్యక్తిని గురించి, అందులోను ఆయన రాసిన కవితల ఆధారంగా గేయ రచన చేయడం ఒక అద్భుతమైన అనుభవం అని ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న వాళ్ళు చెప్పారు.

లోక్ సభలో బల పరీక్ష సమయంలో ఓటమి తప్పదని  ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పాయ్ కి అర్ధం అయింది. అతి స్వల్ప తేడా వున్నప్పుడు విపక్ష సభ్యులను తమ వైపుకు తిప్పుకునే అనైతిక చర్యలకు వాజ్ పాయ్ సుతరామూ ఇష్టపడలేదు. సొంత పార్టీలోని వారే ఆయన మీద ఒత్తిడి పెంచారు. ప్రభుత్వం పది పోవడం అంటే పార్టీకి కూడా నష్టమే. కొనుగోలు వ్యవహారాలు అనైతికం కావచ్చుకానీ, ఒకరిద్దరు సభ్యులు ఓటింగుకు హాజరు కాకుండా ‘ఫ్లోర్ మేనేజ్ మెంటు’ చేస్తే తప్పేమిటని కొందరు వాదించారు. కానీ వారందరికీ వాజ్ పాయ్ ఇచ్చిన సమాధానం ఒక్కటే.
I want to get defeated instead of defeating the spirit of democracy”
(ప్రజాస్వామ్య స్పూర్తిని ఓడించే బదులు నా ఓటమినే నేను కోరుకుంటాను”
ఈరోజుల్లో ఇలాంటి నిబద్ధతను నాయకుల నుంచి ఆశించే అవకాశం ఉందా!

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అటువంటి హుందాతనమూ, అటువంటి రాజకీయవేత్తలూ మరి కనపడే అవకాశాలు చాలా తక్కువ. వాజపాయి గారి హుందాతనానికి మరొక నిదర్శనం చూడండి. నెహ్రూ గారు పోయినప్పుడు ప్రతిపక్ష నాయకుడైనప్పటికీ వాజపాయి గారు సమర్పించారని చెబుతున్న నివాళి ఈ క్రింది లింక్ లో చూడండి 👇 ఎంత హుందాతనం ఉట్టిపడుతోందో. అది ఒక సంస్కారం. వాజపాయి లాంటి వారు అరుదైన వ్యక్తిత్వం కలిగిన మహానుభావులు rare personalities 🙏.

https://theprint.in/opinion/vajpayee-on-nehrus-death-bharat-mata-has-lost-her-favourite-prince/99455/

ఈరోజు వాజపాయి గారి అంతిమయాత్రలో ఆ gun carriage cortege వెనకాల ఆ మొత్తం దూరం నడిచిన ప్రధానమంత్రి మోదీ గారిని గమనించారా? అది కూడా సంస్కారవంతమైన పనే 👏.

అజ్ఞాత చెప్పారు...

అదేంటో కొంత మందికి ఎవరూ నచ్చ్చరు . ఎన్నో విషయాల్లో పొగడాల్సిన వ్యక్తి ని పట్టుకుని, తిట్టుకుంటూ కవితలు అల్లుకుంటున్నారు .