కృష్ణా జిల్లా పేరును తెలుగుదేశం
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పేరిట మార్చాలని
నిర్ణయించారు.
అయితే ఇక్కడ ఒక తకరారు వుంది. ఈ
నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ పాలక పక్షం అయిన తెలుగు దేశం పార్టీ కాదు. ఆ
పార్టీకి బద్ధ శత్రువు, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్
పార్టీ నాయకుడు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని
వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ప్రకటించారు. ఇది సహజంగానే రాజకీయ ప్రకంపనలకు దారి
తీసింది.
భవిష్యత్తుకు సంబంధించిన విషయం కనుక
దీన్ని భవితవ్యానికే వదిలేసి కాస్త గతంలో ఏం జరిగిందో చూద్దాం.
మద్రాసు రాష్ట్రం నుంచి విడివడిన ఆంద్ర
రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ గా స్థిరపడిన తర్వాత మొట్టమొదటి సారి జిల్లాకు ఒక రాజకీయ
నాయకుడి పేరు పెట్టడం 1972 లో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పేరు మార్చుకున్న
జిల్లా ఒంగోలు. ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి
పేరిట దాని పేరు ప్రకాశం జిల్లాగా
మార్పుచేశారు.
తర్వాత, హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ
ప్రాంతాలను విడదీసి 1978లో ఒక కొత్తజిల్లాను ఏర్పాటు చేసారు.
అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఈ జిల్లాకు కొండా వెంకట రంగా
రెడ్డి జిల్లాగా నామకరణం చేసారు. కాలక్రమంలో అది రంగారెడ్డి జిల్లాగా స్థిరపడింది.
కొండా వెంకట రంగారెడ్డి అంతకు పూర్వం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు.
ఆ తర్వాత చాలా కాలానికి నెల్లూరు
జిల్లా పేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. ప్రజల కోరిక మేరకు ఈ
జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు
డాక్టర్ రాజశేఖరరెడ్డి అనధికార తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు కూడా. తదనంతర కాలంలో
ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ నిర్ణయాన్ని అమలు చేసారు. కాకపొతే శ్రీరాములు గారి
పేరుతొ పాటు పాత పేరు నెల్లూరును కూడా జోడించారు. ఆ విధంగా జిల్లాలకు పేర్లతో పాటు
ఇంటి పేర్లు కూడా జత కలిపే సాంప్రదాయం మొదలయింది.
రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లా పేరును వై.ఎస్.ఆర్. కడప జిల్లాగా
మార్చింది.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో
జిల్లాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు జిల్లాలకు తెలంగాణా ప్రముఖుల పేర్లు పెట్టారు. ఆ
విధంగా జయ శంకర్ భూపాల పల్లి, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు
ఏర్పడ్డాయి. మరో నాలుగు జిల్లాలకు
పుణ్యక్షేత్రాల పేర్ల మీదుగా జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల అనీ,
యాదాద్రి భువనగిరి అని నామకరణం చేసారు.
ఇక అసలు విషయం కృష్ణాజిల్లా సంగతి
తీసుకుంటే ఎప్పుడో తాతలనాడు అంటే బ్రిటిష్ పాలనలోనే అంటే 1859 లో అప్పటి సువిశాల రాజమండ్రి జిల్లాను విడదీసి కృష్ణా, గోదావరి జిల్లాలను,
మళ్ళీ 1925లో కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పశ్చిమ గోదావరి, గుంటూరుజిల్లాలను ఏర్పాటు చేసారు.
ప్రభుత్వ పధకాలకు రాజకీయ నాయకుల పేర్లు
పెట్టడం, ఆ పార్టీ అధికారం నుంచి తప్పుకుని మరో పార్టీ అధికారంలోకి రాగానే
పాతపేర్లు పోయి కొత్త పేర్లు రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. పేర్ల
మార్పిడి సులభమే కానీ అందుకు బోలెడంత ప్రజాధనం ఖర్చవుతుంది అనే సంగతి రాజకీయాలల్లో
మరుగునపడిపోతోంది.
6 కామెంట్‌లు:
>> అందుకు బోలెడంత ప్రజాధనం ఖర్చవుతుంది అనే సంగతి రాజకీయాలల్లో మరుగునపడిపోతోంది.
మన వెనక వసారాలో రేప్ లూ, మానభంగాలు, దోపిడీ, తాగడానికి నీళ్ళు లేక అల్లల్లాడే జనం, బేంకులో డబ్బులున్నా నోట్ల కష్టాళు అన్నీ వదిలేసి, ఏడాదికి ముఫ్ఫై సార్లు విదేశాలు తిరగడానికి అధికార విమానంలొ తగలేసినత అవుతుందాండి?
అసలు వ్యక్తుల పేర్లు జిల్లాలకు వద్దే వద్దు. ఈ బుచికి రాజకీయాలతో కంపరం పుడుతుంది. అయినా పచ్చ పార్టీకి జగన్ బయ్యా పచ్చి వెలక్కాయ ఇచ్చాడు. జగన్ పవన్ తో పచ్చ పార్టీకి కుచికుచిగా ఉంది. పచ్చ మీడియా తనపని తాను జుగుప్సాకరంగా చేసుకుపోతుంది. కడపకు వై యస్ ఆర్ ,రంగారెడ్డి అని పెట్టడం కూడా తప్పే.
పైన రెండో “అజ్ఞాత” (6.07 pm) చెప్పింది కరెక్ట్. అసలు జిల్లాలకు వ్యక్తుల పేర్లు పెట్డడం ఏవిటి? వేరే పార్టీ అధికారంలోకి వస్తే పాత పేర్లు మార్చేసి తమ వ్యక్తుల పేర్లు పెట్టరని నమ్మకం ఉందా? కులపిచ్చి రాజకీయాలతో, ఓటు రాజకీయాలతో, వ్యక్తి పూజతో రాష్ట్రాన్ని, సమాజాన్ని, మనుషుల మనస్తత్వాలను ఎంత భ్రష్టు పట్టించగలరో అంతా పట్టించారు. God save us. ఇటువంటి విషయాలలో కోర్టులేమన్నా జోక్యం చేసుకోగలుగుతాయా?
"జిల్లాలకు తెలంగాణా ప్రముఖుల పేర్లు పెట్టారు. ఆ విధంగా జయ శంకర్ భూపాల పల్లి, *జోగులాంబ* గద్వాల, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు ఏర్పడ్డాయి."
జోగులాంబ అలంపూర్ గుడి దేవత పేరు. అంచేత జోగులాంబ గద్వాల జిల్లాను పుణ్యక్షేత్రాల పేర్ల మీద పెట్టిన జాబితాలో లెక్కించాలి.
@ Jai Gottumukkala : మీరు రాసింది కరక్టే. నాదే పొరబాటు - భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి