8, మే 2018, మంగళవారం

ఎర్రకోటపై నీలినీడలు – భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN ANDHRAPRABHA DAILY ON 08-05-2018)
ఆగస్టు 15 అనగానే చటుక్కున అందరికీ గుర్తుకు వచ్చేది ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై భారత ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చిన మాట నిజమే కాని, ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధానమంత్రి ఈసారి ఎగురవేస్తారా లేదా అనే సందేహం మొట్టమొదటిసారి మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఎర్రకోట చుట్టూ ముసురుకుంటున్న నీలినీడలు. ఈ అనుమానాలు పూర్తిగా ఆధారరహితం కాదని వాటిని వెలిబుచ్చుతున్న వాళ్ళు చెబుతున్నారు.
వీటన్నిటికీ మూలకారణం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం.
దేశంలో అనేక చారిత్రిక కట్టడాలు సరయిన నిర్వహణ లేక శిధిలమవుతున్న మాట వాస్తవం. అలాటి చారిత్రిక సంపదను పరిరక్షించుకోవడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ చేసిన ఆలోచనల ఫలితమే ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ (చారిత్రిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన కట్టడాలను దత్తత తీసుకోవడం) అనే పధకం.
ఈ పధకం కింద ఢిల్లీ లోని ఎర్రకోటను ఐదేళ్ళపాటు పరిరక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం దాల్మియా భారత్ సంస్థకు అప్పగించింది. పంచదార, సిమెంటు వ్యాపారాలు చేసుకునే సంస్థకు ఒక చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఒక అద్భుత కట్టడం పరిరక్షణ బాధ్యతను ఒప్పచెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి వ్యాపారాలు చేసుకునే అటువంటి సంస్థలు ఆ రకమైన బాధ్యతలు నెత్తికెత్తుకోవడానికి దోహదం చేసిన కారణాలు ఏమయ్యుంటాయి అని కూడా రంద్రాన్వేషకులు అన్వేషిస్తున్నారు. దీనికి తోడు అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితుడు కూడా అయిన విష్ణు దాల్మియాకు చెందిన దాల్మియా భారత్ సంస్థకు మొఘల్ చక్రవర్తుల పరిపాలనా కేంద్రం అయిన ఎర్రకోట పరిరక్షణ బాధ్యత ఎలా అప్పగిస్తారు అనే చర్చ కూడా మొదలయింది.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. చారిత్రిక జాతీయ వారసత్వ సంపదకు ప్రతీకలైన అపూర్వ కట్టడాల పరిరక్షణ బాధ్యతను, ఆరంగంలో ఎలాటి అనుభవం లేని సిమెంటు కంపెనీ ఎలా నిర్వర్తించగలుగుతుందని ప్రశ్నించింది. ఈ వివాదాల నేపధ్యంలో ఈసారి పంద్రాగస్టు నాడు ప్రధాని మోడీ ఎర్రకోట బురుజుల నుంచి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారా లేదా అనే సందేహాలు పొటమరిస్తున్నాయి.
సరే! ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతుందా, అనేక వివాదాల మాదిరిగానే కొన్నాళ్ళు తాటాకు మంటలా మండి ఆరిపోతుందా అనేది ఇప్పుడే చెప్పలేము. అయితే ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేసే అంశానికి సంబంధించి ఇంతవరకు ఎక్కువగా వెలుగు చూడని వివరాలు తెలపడం కోసమే ఈ ప్రయత్నం.
మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆ మరునాడు అంటే 1947 ఆగస్టు 16 వ తేదీన నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట వద్ద జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కానీ పతాకాన్ని ఎగురవేయలేదు. మరో నమ్మ లేని నిజం ఏమిటంటే ఆనాడు ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేసింది ఆ పనికోసం నియోగించబడ్డ ఒక ఆర్మీ అధికారి. అప్పుడు జరిగిన ఏర్పాట్ల గురించి ఒక ఆర్మీ అధికారి రాసిన పుస్తకంలో ఈ వివరాలు వున్నాయి. బురుజుపై నిలబడి ప్రధాని నెహ్రూ ఒక స్విచ్చి నొక్కగానే బురుజు కింద గంట మోగే ఏర్పాటు చేసారు. నెహ్రూ స్విచ్చి నొక్కి గంట మోగించగానే ఆ సంకేతాన్ని అందుకుని ఆర్మీ అధికారి వెంటనే జాతీయ జెండాను ఎగురవేశారని ఆయన ఆ పుస్తకంలో తెలిపారు.
మరో విశేషం ఏమిటంటే త్రివర్ణశోభితమైన జాతీయ పతాకం వినువీధుల్లోకి ఎగరగానే చిరుజల్లులు కురిశాయి. గగన తలంలో ఇంద్రధనుస్సు దర్శనమిచ్చింది. ఒకవైపు త్రివర్ణ పతాకం, మరో వైపు రంగురంగుల ఇంద్ర ధనుస్సు. నయనానందకరమైన ఆ దృశ్యాన్ని చక్కటి శుభసూచనగా ప్రజలు భావించారు.
1947 దాదిగా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మొఘల్ చక్రవర్తుల కోటను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే విషయంపై సరయిన వివరాలు లభించడం లేదు. 1857లో జరిగిన ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని బహదూర్ షా జాఫర్ ఈ లాల్ ఖిలా నుంచే మొదలుపెట్టారని, అందుచేత స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎర్రకోట నుంచి ఎగురవేయడం సముచితంగా ఉంటుందన్న భావనతో ఈ సాంప్రదాయం మొదలయిందని కొందరు వివరిస్తున్నారు.
పొతే మరో ఆసక్తికర చారిత్రిక విషయం ఏమిటంటే మొదట బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రాన్ని 1948లో ఇవ్వాలని అనుకున్నారు. అయితే 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ గా నియమితులయిన లార్డ్ మౌంట్ బాటెన్ మాత్రం వేరే విధంగా తలపోయడంతో బ్రిటిష్ పాలకులు తమ నిర్ణయం మార్చుకుని స్వతంత్ర భారత ఆవిర్భావానికి 1947 ఆగస్టు పదిహేనును ముహూర్తంగా ఎంచుకున్నారు. ఈ మార్పుకు మరో కారణం కూడా చెబుతారు. అంతకు మునుపు రెండేళ్ళ క్రితం, రెండో ప్రపంచ యుద్ధం ముగియవచ్చే తరుణంలో సరిగ్గా ఆగస్టు పదిహేనవ తేదీనే, జపాన్ సైన్యం బ్రిటిష్ వారికి లొంగిపోవడంవల్ల, ఆ తేదీ పట్ల మౌంట్ బాటెన్ ముచ్చట పడ్డారనేది ఆ కధనం.
ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే పదిహేనవ తేదీ) పార్లమెంటు హౌస్ లో జరిగిన భారత రాజ్యాంగపరిషత్తు ఐదో సమావేశంలో, భారత దేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఈ సమావేశం పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటలకు సుచేతా కృపాలాని వందేమాతరం గీతాలాపనతో మొదలయింది రాజ్యంగ పరిషత్తు చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది “ప్రపంచం యావత్తూ నిద్రిస్తున్న వేళ, స్వతంత్ర వాయువులు పీలుస్తూ భారత దేశం మేలుకుంటోంది” అనే అర్ధం వచ్చేలా చేసిన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
అనంతరం బొంబాయి (ఇప్పుడు ముంబై) కి చెందిన విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు హంసా మెహతా, దేశంలోని మహిళలు అందరి తరపున భారత జాతీయ పతాకాన్ని జాతికి సమర్పించారు. సుచేతా కృపాలానీ ‘సారే జహాసే అచ్చా’ గేయం పాడి అలరించారు. ‘జనగణమన’ (అప్పటికి అది జాతీయ గీతం కాదు) గీతాలాపనతో నాటి సమావేశం ముగిసింది.
మరునాడు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ హరిలాల్ కనియా, నూతన గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మౌంట్ బాటెన్ నెహ్రూ మంత్రివర్గంతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. జగ్జీవన్ రాం ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆయన ఆ రోజున ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.
తోక టపా:
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఎర్రకోట గురించి కూడా సంక్షిప్తంగా నాలుగు ముక్కలు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తాజ్ మహల్ నిర్మించిన మొగలాయీ పాదూషా షాజహాన్ ఢిల్లీ లో ఎర్రకోట (లాల్ ఖిలా) నిర్మించాడు. 1592 లో జహంగీర్ చక్రవర్తికి తనయుడిగా జన్మించిన షాజహాన్ 74 ఏళ్ళు జీవించి 1666 లో మరణించాడు. 1628 లో సింహాసనం అధిష్టించిన షాజహాన్ 1658 వరకు పాలించాడు. ఆయన కాలంలో, 1639 లో నిర్మించిన ఈ లాల్ ఖిలా 1856 వరకు అంటే సుమారు రెండువందల సంవత్సరాల పాటు మొఘల్ చక్రవర్తుల నివాసంగా కొనసాగింది.
2007లో యునెస్కో ఎర్రకోటని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. (EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సిమెంట్ కంపెనీ వాళ్ళు అయితే మంచిది. ఏవైనా పెచ్చులూడిపోయినా రిపేర్లు అవీ వెంటనే చేస్తారు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇవాళ్టి (09-05-2018) Deccan Chronicle ఆంగ్ల దినపత్రికలో Edit పేజ్ లో ఈ అంశం పైన శర్మిష్ఠ ముఖర్జీ అనే ఆవిడ వ్రాసిన వ్యాసం 👇. ఆసక్తికరంగా ఉంది. ఈవిడ ప్రతిపక్షమైన కాంగ్రెస్ వ్యక్తి కాబట్టే ఇలా వ్రాసారనుకోనవసరం లేదు. వినదగ నెవ్వరు జెప్పిన ............ .....

Don’t try a rush job at India’s heritage sites
by Sharmista Mukherjee

https://www.deccanchronicle.com/opinion/columnists/090518/dont-try-a-rush-job-at-indias-heritage-sites.html