1, ఏప్రిల్ 2018, ఆదివారం

శేషన్ ను చూసి పెద్దపులి బెదురున్! – భండారు శ్రీనివాసరావు


ఎలక్షన్ కమీషనర్  (ఆ రోజుల్లో ఒక్కరే) గా వుండగా టీ.ఎన్. శేషన్ ఓసారి హైదరాబాదు వచ్చారు. రాజ భవన్ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం. అందరం బిలబిలా వెళ్లాం. ఎలక్షన్ కమిషనర్ హోదాలో అది మొదటి సమావేశం. ఆయన గురించి వినడమే కాని వ్యవహార శైలి ఎవరికీ పరిచయం లేదు. గది నిండి పోయింది. ఇంతలో ఆయన వచ్చారు. ఫోటోలు తీసుకోవడానికి ప్రెస్ ఫోటోగ్రాఫర్లు అక్కడి సోఫాలపైకి ఎక్కారు. ఇది మామూలే. ఫోటో సరైన యాంగిల్  లో తీసుకోవడానికి వారు ఇలాంటి ఫీట్లు చేస్తుంటారు. కానీ వచ్చిన వాడు శేషన్ మరి.
ఆయన కన్నెర్ర చేసారు. అందర్నీ సోఫాల నుంచి కిందికి దిగమని గట్టిగా చెప్పారు. వినక పొతే భద్రతా సిబ్బందికి పని చెబుతా అని హెచ్చరించారు.
అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఇలాటి మర్యాదలు గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరగనివి.
అయితే అదే శేషన్ ను అదే గెస్ట్ హౌస్ లో అదే రోజు  మరో మారు కల్సుకోవాల్సిన సందర్భం పడింది. ప్రెస్ క్లబ్  తరపున ఏదో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించాలని సంకల్పం. అంతకు ముందు ఓసారి ఆయన్ని ఇదే పని మీద ఢిల్లీలో శేషన్ అధికార నివాసంలో కలుసుకున్నాము.  మిత్రులు జ్వాలా నరసింహారావు, ములుగు సోమశేఖర్ పూనికపై  డెక్కన్ క్రానికల్ ఢిల్లీ కరస్పాండెంట్ రాధ గారి మాటసాయంతో క్లబ్  కార్యదర్శి శంకర్, నేనూ, జ్వాలా, సోమశేఖర్ కలిసి రాధ గారిని వెంటపెట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళాము. అప్పటికే ఒకటి రెండు సార్లు జ్వాలా ఆయనతో ఫోనులో మాట్లాడ్డం, మెయిల్ సందేశాలు పంపడం జరిగినట్టుంది, తలుపు తీస్తూనే ‘Who is Jwala, Why no flames are coming’   అంటూ పలకరించారు.
భద్రత బాగా వున్నా ఇల్లు చాలా సింపుల్ గా వుంది. నౌకర్లు, చాకర్లు ఎవరూ లేరు. శేషన్ గారి భార్య జయలక్ష్మి గారే  స్వయంగా కాఫీ కలుపుకు వచ్చి సర్వ్ చేసారు. జ్వాలా ‘కాఫీ తాగను’ అంటే ‘ఒక్క క్షణం వుండండి’ అంటూ వెళ్లి బోర్నవిటా తెచ్చి ఇచ్చారు. సరే వచ్చిన పని చెప్పాము. ఆయన విని ‘హైదరాబాదు వస్తున్నాను, అక్కడ కలవండ’ని చెప్పి పంపేసారు.
మళ్ళీ హైదరాబాదుకు వస్తే...
మధ్యాన్నం విలేకరుల సమావేశం సంఘటన తరువాత ఆయన్ని కలుసుకోవడానికి కొంత సంక్షేపించాము. కానీ కలుసుకోమన్నది ఆయనే కావడంతో ధైర్యం చేసి వెళ్ళాము. అదేమిటో మంత్రం వేసినట్టు ఆయనలో  ఢిల్లీలో కలిసిన శేషన్ కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. అప్పటికే ఆ గదిలో ఉన్న వ్యక్తిని తనకు ఇంగ్లీష్ నేర్పిన గురువు అని పరిచయం చేసారు. ఆయన ఎవరో కాదు, KS అనే పొడి అక్షరాలతో హిందూ పత్రికలో వారం వారం ‘Know your English’ అనే కాలమ్ రాసే కే. సుబ్రహ్మణ్యం గారు.  క్లబ్ కార్యక్రమానికి రావడానికి సుముఖత వ్యక్తం చేసారు.
కొన్నాళ్ళకు పరిస్తితులు మారాయి. సుప్రీం కోర్టు ఒక కేసు విషయంలో ఆయన్ని సమన్ చేయడం మొదలయిన చీకాకుల నేపధ్యంలో క్లబ్ కార్యక్రమానికి రాలేదు , కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకునే మహత్తర అవకాశం మాకు ఆ విధంగా లభించింది.
అంతటి పెద్ద ఉద్యోగాలు చేసిన ఆ పెద్ద మనిషి శేషన్,  ముదిమి వయస్సులో వృద్ధాశ్రమంలో శేష జీవితం గడపాల్సి రావడం విషాదం.
‘శతమానం భవతి!’
(శేషన్ సతీమణి శ్రీమతి జయలక్ష్మి గారి గురించిన వినకూడని వార్త సోషల్ మీడియాలో కనిపించిన తరువాత గుర్తుకు వచ్చిన ఓ పాత జ్ఞాపకం)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అదేంటి సార్. తమిళ అయ్యర్ గారింట్లో ఫిల్టర్ కాఫీ తాగకుండా బోర్నవిటా తాగడమేంటి. Seshan may be sincere. Nonetheless he is a maverick. He abrogated to himself unwarranted power. Typical tambrahm officer.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత గారికి. బోర్న విటా తాగింది నేను కాదు, నా స్నేహితుడు. ఇక మీరు రాసిన విషయాలు. సాధారణంగా నేను సందర్భం బట్టి రాస్తాను. ఆయన భార్య చనిపోయిన విషయం తెలిసిన పిమ్మట పెట్టిన పోస్ట్ ఇది. ఇటువంటి సందర్భాలలో ఔచిత్యం పాటించాలి. జర్నలిస్టుగా అది నా విధి.