6, ఏప్రిల్ 2018, శుక్రవారం

కధ ముగిసింది మళ్ళీ మొదలు కావడానికి – భండారు శ్రీనివాసరావు


‘తాంబూలాలు ఇచ్చేశాం, మీ ఇష్టం’ అనేశారు ఢిల్లీలో  ఏలికలు
“ఈరోజు లాగానే రేపూ, కాకపోతే సభ మర్నాటికి కాకుండా నిరవధికంగా వాయిదా. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇదే జరుగుతుంది. నా మాటే కాదు, జనం అనుకుంటున్నది కూడా ఇదే.”
గురువారం రాత్రి సాక్షి టీవీలో అడిగిన ప్రశ్నకు నా సమాధానం.    
అద్భుతం జరగలేదు, కాబట్టి అందరూ అనుకున్నదే జరిగింది. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కావున, చర్చ సంగతి దేవుడెరుగు,  మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస  తీర్మానం అనేది  ప్రతిపాదన స్థాయికి కూడా రాకుండానే పోయింది. విలువైన సభా సమయం, ప్రజాధనం, ప్రతిపక్షాల ఆందోళన గాలికి పోయింది.
ఇన్ని రోజులపాటు  పార్లమెంటులో జరిగిన, మీడియా భాషలో చెప్పాలంటే, రాజకీయ పోరాటం, విజేతలెవ్వరో తేల్చకుండానే ముగిసిపోయింది.
కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే రంగస్థలంపై పాత్రధారులందరూ ముందుగా అనుకున్న ప్రకారం  తాము రాసుకొచ్చిన పద్యాలనే పలుమార్లు రాగయుక్తంగా ఆలపించి తెరదించేశారు. ఈ మొత్తం అంకంలో తమదే హైలైట్ అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాకపోతే రంగస్థలం ఆవల జరగాల్సిన కధ కొంత ఇంకా మిగిలే వుంది. రాజీనామా లేఖలతో సంసిద్ధంగా ఉన్న వై.ఎస్.ఆర్.సి.పీ. లోక్ సభ సభ్యులు వాటిని స్పీకర్ కు  సమర్పించడానికి అప్పాయింట్ మెంట్ టైం మధ్యాన్నం పన్నెండున్నర వరకు వేచి ఉండాల్సి ఉన్నందున ఆ కధ కొంత అసంపూర్తిగా మిగిలిపోయింది.
స్పీకర్ వారి రాజీనామాలను వెంటనే ఆమోదిస్తారా! ఆమోదిస్తే ఎన్నికల సంఘం తదనుగుణంగా ఉప ఎన్నికలు నిర్వహిస్తుందా!” ఇలాంటి కొన్ని ప్రశ్నలు మీడియా చర్చల కోసం ఎదురు చూస్తుంటాయి.
ముగిసిన లోక సభలో టీడీపీ ఆందోళన, ఏపీ భవన్ లో వైసీపీ ఆమరణ దీక్ష వంటివి మినహాయిస్తే ఇక రంగస్థలం ఢిల్లీ నించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మారినట్టే అనుకోవచ్చు. దీనికి శ్రీకారం అన్నట్టుగా ఊరూరా టీడీపీ సైకిల్ యాత్రలూ, వైసీపీ సానుభూతి దీక్షలూ, జన సేన, ఉభయ కమ్యూనిష్టుల పాదయాత్రలూ ఈ సరికే మొదలయ్యాయి.
అయితే ఒక విషయంలో మాత్రం స్పష్టత వచ్చింది. రాజీనామాలకూ, ఎన్డీయే నుంచి గుడ్ బై చెప్పడాలకూ, ఇతర రకాల ఆందోళనలకూ లొంగేది లేదనీ, తాంబూలాలు ఇచ్చేశాం, ఇక మీరేం చేస్తారో చేసుకోండని మోడీ సర్కారు మొహం మీదే తలుపు వేసి చెప్పేసింది.
కావున, ఇక రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇక కలివిడిగా కలిసి జనాల దగ్గరకు పోతాయా, విడివిడిగా తమ వాదనలు ఎప్పటిలాగే వినిపిస్తాయా అంటే జవాబు చాలా తేలిగ్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్న వాతావరణమే ఎన్నికల దాకా కొనసాగుతుంది.
ఎందుకంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు అన్నింటికీ ప్రధాన ప్రచారాస్త్రం ఇదే కాబట్టి.   
                 

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఏలికలు తామనుకున్నది సాధించారు. ఆపు లేకుండా ప్రతిరోజూ సభాకార్యక్రమాల్ని అడ్డుకుంటున్నవారిని మార్షల్స్ ద్వారా బయటకెందుకు పంపించెయ్యలేకపోయారో? ఏమిటీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అలా వీలు కాదంటారా? ఏమైనా అంతా పధకం ప్రకారమే జరిగినట్లుంది.

// “..... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు అన్నింటికీ ప్రధాన ప్రచారాస్త్రం ఇదే కాబట్టి.” // అని మీరన్న ఈ వాక్యం చదివితే పాత జ్ఞాపకమొకటి మెదిలింది. మీరూ చూసే ఉంటారు - బోఫోర్స్ గొడవ బయటపడిన తరువాత వచ్చిన ఎన్నికల్లో ఇదే తంతు. ఆ రోజుల్లో ఒక కార్టూన్ వచ్చింది (కార్టూనిస్ట్ పేరు, పత్రిక పేరు గుర్తు రావడంలేదు). ఎన్నికల అభ్యర్ధి (కాంగ్రెస్సేతర) ప్రచారవేదిక మీద మైకు ముందు నిలబడి “బోఫోర్స్, బోఫోర్స్, బోఫోర్స్, మీ ఓటు నాకే. బోఫోర్స్, బోఫోర్స్, బోఫోర్స్ ....” అంటున్నట్లు గీసిన కార్టూన్ అది. వేరే ప్రసంగం / ప్రచారం ఏమీ ఉండదు బోఫోర్స్ జపం మినహా. అలాగే ఇప్పుడూనూ - ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి ఈ జపమే చేసే సూచనలు ఎక్కువ.

అజ్ఞాత చెప్పారు...

పెత్యేక హోదా లొల్లి. రాజకీయాలు బుచికి. కేంద్రం తుర్రో తుఱ్ఱు. తెలుగు పెజానీకం కుర్రో కుర్రు. మీడియా జమకుజమా లస్కుటపా.

sam చెప్పారు...

dear sir very good blog and very good content
Tollywood Cinema News