ఒక మనిషి ఎలా జీవించాడు అన్నది అతడి
మరణం చెబుతుంది. డాక్టర్ రంగారావు విషయంలో అదే జరిగింది.
డెబ్బయి అయిదేళ్ళ జీవితం. ఎన్ని
అనుభవాలు, ఎన్నెన్ని సంఘటనలు. ముదిమి
వయసులో వాటన్నిటినీ ఒకచోట గుది గుచ్చడం ఎంతటి శ్రమ!
డాక్టర్ రంగా రావు గారు ఈ శ్రమను శ్రమ
అనుకోకుండా, మరొకరిని శ్రమ పెట్టకుండా అతి
తేలిగ్గా పూర్తి చేసారు. అదీ ఆయన జీవితం చరమాంకంలో.
‘హాపింగ్ మెమొరీస్’. ఇంగ్లీష్ లో ఈ పుస్తకం రాసిన వ్యక్తి
తను నిష్క్రమిస్తూ వదిలివెళ్ళిన గొప్ప పుస్తకం. జ్వాలా నరసింహారావు పట్టుదల
వల్ల ఇది వెలుగు చూసింది. ఆయనే ఈ పుస్తకం పేరును ‘కదలాడే జ్ఞాపకాలు’గా
తెనిగించారు.
(కీర్తి శేషులు డాక్టర్ ఏ.పీ. రంగారావు)
నిజానికి డాక్టర్ రంగారావు ఒక మామూలు
డాక్టర్. ‘నేనొక షరా మామూలు డాక్టర్ ని’ ఆయన
అనుకున్నట్టయితే ఆయన కధే వేరుగా వుండేది. ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి
కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో
జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా
నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.
పది జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన
పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే చక్కబెట్టగలిగారు.
అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి
కనుకనే ఇతరులకు అసాధ్యం అనుకున్న అనేక పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.
సకల జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల
వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. కనుకనే ఆయన
మరణించిన తర్వాత జ్వాలా వంటివారు డాక్టర్ రంగారావు గురించి రాసిన అనేక వ్యాసాలు
పత్రికల్లో చదివి, ‘ఈయన ఇంతటి గొప్పవాడా,
మాకు తెలియదే’ అంటూ ఫోన్లు చేసి కొనియాడిన అపరిచితులు అనేకమంది.
ఈ పుస్తకం చాలా విస్తృత కోణాల్లో
వుంటుంది. ఇది ఒక డాక్టర్ జీవితం మాత్రమే కాదు. ఒక సామాజిక కార్యకర్తగా పేదసాదల
కోసం ఆయన పడిన వ్యధ కూడా ఇందులో వుంది.
సమస్యలని గుర్తించి పరిష్కారాలు అత్యంత
సులభంగా చెప్పగల మేధస్సు ఆయనకు వుందని, అత్యంత క్లిష్టమైన శాస్త్రీయ సాంకేతిక
అంశాలతో కూడిన విషయాలను కూడా సులభమైన రీతిలో విడమర్చి చెప్పగల ప్రతిభ వల్లనే ఆయన సూచించిన అనేక పధకాలను
ఆచరణలోకి తేవడం సాధ్యపడిందని, వాటికి తోడ్పాటు అందించిన వదాన్యులు చెబుతుంటారు.
డాక్టర్ రంగారావు గురించి తెలిసిన
వారు, తెలియని వారు కూడా చదవాల్సిన
పుస్తకం ఇది. ఎందుకంటే తెలిసిన వాళ్లకు కూడా తెలియని అనేక విషయాలు ఇందులో చాలా
వున్నాయి.
ఇది వెలుగులోకి రావడానికి ప్రధాన
కారకుడు జ్వాలా నరసింహా రావు. ఇంత మంచి పనిని నెత్తికెత్తుకున్న ఆయన మంచితనాన్ని
మరింత పొగడడానికి సమయం, సందర్భం అడ్డం వస్తున్నాయి.
పొతే, ఇటువంటి మహత్తర కార్యక్రమానికి
సాయపడ్డ మహానుభావులు ఎందరో... వారందరికీ వందనాలు
3 కామెంట్‌లు:
జ్వాలగారు, మీరు రంగారావు గారి గురించి వ్రాసిన రెండు వ్యాసాలూ చదివాను. ఇటువంటి గొప్పవాళ్ళని మీరు పరిచయం చేయటం (నాలాంటి తెలియని వాళ్లకి) చాలా సంతోషకరమైన విషయం. మెల్లిగా ఆదర్శమూర్తులు తగ్గిపోతున్న సమయంలో ఇటువంటి వారి జీవిత చరిత్రల ఆవశ్యకత ఎంతో ఉంది.
అన్యగామి” గారన్నట్లు ఇటువంటి మహానుభావుల గురించి తెలుసుకోవలసిన / తెలియజేయవలసిన (ప్రస్తుత మరియు భావి తరాల కోసం) అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం వారి వైపు నుండి చేసిందేమైనా ఉందా? అయినా ఎవరు పొగిడినా మానినా ఆ వ్యక్తి గొప్పతనానికొచ్చిన లోటేమీ ఉండదు లెండి - డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి లాగా.
ఈ మధ్యనే ఈ ఏప్రిల్ 19 న KVVS Murthy అనే బ్లాగర్ “మన భద్రాద్రి” అన్న తన బ్లాగ్ లో ఈ డాక్టర్ పాండురంగారావు గారి గురించి తన జ్ఞాపకాలు పంచుకున్నారు, మీరు చూశారా? ఈ క్రింది లింక్ లో చూడచ్చు.
http://www.manabhadradri.com/2018/04/it-happens-once-in-while.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి