10, ఆగస్టు 2017, గురువారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(9)


భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన
“కంభంపాడు గ్రామం కృష్ణాజిల్లాలోది. (లోగడ ఇది నందిగామ తాలూకాలో వుండేది. తాలూకాల రద్దు, మండల వ్యవస్థ ఆవిర్భావం తరువాత మా గ్రామం వత్సవాయి మండలంలో చేరింది). ఈ గ్రామ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు లేవు. గ్రామంలో వున్న శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారని చెబుతారు. అదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి గుడి కూడా వుంది. ఇక్కడ మొదట్లో గుడి వుండేది కాదనీ, భండారు పర్వతాలయ్య గారి హయాములో వారూ, వారి సోదరులు కలిసి ఈ గుడి నిర్మించారని కూడా చెబుతారు. ఈ గుడి కాక, వూరి బయట మా తాతయ్య గారు సుబ్బారావు గారు నిర్మించిన ఆశ్రమంలో ముక్తినాధ స్వామి ఆలయం వుంది. శిధిలావస్థకు చేరిన ఈ గుడిని శ్యాం ప్రసాద్ బ్రహ్మచారి అనే స్వాములవారు పునరుద్ధరించారు. ఈ స్వామి వారే, ఆ ఆశ్రమంలో ఒక వేద పాఠశాలను సైతం నిర్వహించేవారు. కొత్తూరు (కొత్త వూరు)లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని అక్కడి రైతులు నిర్మించారు. తరువాత ఆ వూరు ఖాళీ అయినా, ఆలయంలో మాత్రం నిత్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఇవికాక, మా వూరిలో ముత్యాలమ్మ గుడి వుంది.


(భండారు పర్వతాలరావు)

మా చిన తాతగారు భండారు లక్ష్మీనారాయణ గారు దాచివుంచిన 1878 వ సంవత్సరం నాటి కోర్టు తీర్పు ప్రతిలో వారి తండ్రి రామయ్య, పినతండ్రి లక్ష్మయ్య గార్ల పేర్లను ‘రామయ్య కులకర్ణి, లక్ష్మయ్య కులకర్ణి’ అని ఉదహరించడం కనిపించింది. భండారు వంశీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా అనే అనుమానానికి దీనివలన కొంత ఆస్కారం చేకూరుతోంది. ‘కులకర్ణి’ అనేది ఆరోజుల్లో గ్రామాధికారి పదవి. అయినా, అది మహారాష్ట్ర నుంచి వచ్చిందే. దేశముఖ్, దేశపాండేల మాదిరిగా గ్రామాల్లో శిస్తు వసూలుచేసి పెట్టే అధికారం వారికి వుండేది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఊళ్ళల్లో కులకర్ణి వ్యవస్థ దాఖలాలు కనిపిస్తాయి.
ఒకసారి ముత్యాలమ్మ గ్రామ దేవత, పర్వతాలయ్య గారి కలలోకి వచ్చి ‘బందిపోట్లు వూరి పైకి రాబోతున్నారని’ హెచ్చరించిందట. వెంటనే అంతా గ్రామం వొదిలి తప్పుకున్నారట. బందిపోట్లకు ఏమీ చిక్కలేదు. అందుకని కోపించి వారు ముత్యాలమ్మ దేవతను గడ్డపారతో పొడిచి పగులగొట్టారని అంటారు. వెంకటస్వామి అనే అతను ముత్యాలమ్మకు చిన్న గుడి కట్టించాడు. వూరికి తూర్పున పొలిమేర మీద జమ్మి చెట్టు కింద ఎండ పల్లెమ్మ అనే ఓ అమ్మవారి విగ్రహం కూడా వుంది.
“వీరేశం గారికి నలుగురు కొడుకులు. కూతుళ్ళ సంగతి వంశవృక్షం గాని, కోర్టు తీర్పులు కాని చెప్పడం లేదు. కొడుకులు: రాజయ్య(రాజన్న).అప్పయ్య, రామలింగయ్య (లింగయ్య), బసవయ్య.
“రాజయ్యగారికి కనకయ్య (ఈయనకు వీరేశలింగం అనే పేరు కూడా వుంది). రాజయ్య (రాజన్న) అని ఇద్దరు కొడుకులు. వారిద్దరూ అవివాహితులుగా, నిస్సంతుగా చనిపోయారని కోర్టు తీర్పులో వివరించారు.
“అప్పయ్యగారికి చాలాకాలం సంతానం లేదు. దానిపై ఆయన, శ్రీశైలం వెళ్లి అక్కడ మల్లిఖార్జున దేవాలయ ప్రాంగణంలో వున్న సంతానవృక్షానికి ప్రదక్షిణాలు చేసి వచ్చారట. తరువాత ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఆయనకు శ్రీ పర్వతం (శ్రీ శైలం) పేరిట పర్వతాలయ్య అని పేరు పెట్టుకున్నారు. ఈయనే పర్వతాలయ్య -1 (కోర్టు తీర్పులో పర్వతాలు అనే వుంది). ఈయన కంభంపాడు గ్రామ కరిణీకం చేస్తూ వచ్చారు. ఆయనకూ, గ్రామంలోని కమ్మ రైతు పెద్దలకు ఒకసారి కచేరిసావిడిలో కొంత వాగ్వాదం జరిగిందట. అప్పుడు అంతా బొడ్లో పేష్ కప్ (ఒకరకం చిన్న చాకు) పెట్టుకుని, తలపాగాలు చుట్టుకుని వచ్చేవారట. పర్వతాలయ్య గారు ఈకకలంతో ఏదో రాసుకుంటున్నారు.ఏదో మాటామాటా వచ్చి ‘మా కత్తి గొప్పా, నీ కలం గొప్పా’అని అడిగారుట. ఆయన ‘నా కలమే గొప్ప’ అనడంతో మాటకు మాట పెరిగింది. సరసం విరసం అయింది.వాళ్ళు ఇళ్ళకు వెళ్లి, వరిగడ్డి, కుండల్లో చద్దన్నాలు బండ్లలో పెట్టించుకున్నారట. ఆ పళానవెళ్లి, అర్ధరాత్రి పర్వతాలయ్య గారిని లేపి, దొడ్లో చింతచెట్టు కిందకి తీసుకుని వెళ్లి, కత్తితో పొడిచి హత్య చేసారు. ముఖ్యంగా కుడి చేతిపైనా, నాలికపైనా పొడిచారట. కొనవూపిరితో వుండగా ఎవరయినా వచ్చినా తమ పేర్లు చెప్పకుండా ఉండడానికి అలా చేశారుట. తరువాత బండ్లు కట్టుకుని నైజాం లోకి పారిపోయారుట. ఆయన భార్య (పేరు వెంకమ్మగారని గుర్తు) ఏడుస్తుంటే పర్వతాలయ్యగారు ఆ నెత్తురుతోనే, ‘నా’ , ‘కా; అనే అక్షరాలు రాసారుట.‘నా’ అంటే నారాయణ అనీ, ‘కా’ అంటే కామయ్య అనీ అందరికీ అర్ధం అయింది. కాని, పోలీసులు వచ్చి అడిగితే పర్వతాలయ్యగారి భార్య ఎవరి పేరు చెప్పలేదట. (బహుశా చెబితే వాళ్ళు పగబట్టి పిల్లలకు హాని తలబెడతారన్న భయంతో కావచ్చు) ‘ఎవరి పాపాన వాళ్ళే పోతారు. నాకేం తెలియదు. చీకటి. ఎవరూ కనబడలేదు’ అన్నదట. అప్పుడామెకు ఇద్దరు కొడుకులు. రామయ్య, లక్ష్మయ్య. రామయ్యకు పన్నెండేళ్ళు. అయినా, ‘మీ తండ్రి కరణీకం ఇస్తా చేస్తావా?’ అని తాసీల్దారు అడిగితే, ‘చేస్తాన’ని దస్త్రం తీసుకున్నాడట. “ఆరోజుల్లో కరిణీకం ఉద్యోగానికి మేజరయి ఉండాలన్న నియమం లేదన్నమాట. రామయ్య గారి హయాంలో కుటుంబం ఆస్తి బాగా పెరిగింది. వూళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పోయేసరికి మూడువందల ఎకరాల పొలం వుండేది.తన తమ్ముడు లక్ష్మయ్యను ఆయన రాజయ్యకు దత్తు ఇచ్చారు. లక్ష్మయ్య కొడుకు నాగభూషణం కాశీకి వెళ్లి అక్కడ గతించాడు. అప్పుడు మళ్ళీ తన రెండవ కొడుకు లక్ష్మీనారాయణను ఆయన భార్య చుక్కమ్మగారికి దత్తు ఇచ్చారు. కొందరు బంధువులు నాగభూషణం మృతి విషయమై అనుమానాలు వ్యక్తం చేశారట. అవన్నీ తరువాత సమసిపోయాయి. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: