11, ఆగస్టు 2017, శుక్రవారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(10)



భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన

ఆరోజుల్లో  పుట్టి ధాన్యం రూపాయాకో రెండుకో అమ్ముడయ్యేది. పంటలన్నీ వర్షాధారం. ధరలు లేవు. దానితో చాలామంది రైతులు శిస్తు కట్టలేక పొలాలు వొదిలేసి వెళ్లిపోయారట.  అప్పటి నిబంధనల ప్రకారం ఆ శిస్తు తాను  చెల్లించి ఆ పొలాలను రామయ్య గారు తీసుకున్నారట. ఆయనకు కరిణీకంచేసినందుకు లభించే జీతం నెలకు మూడో నాలుగో రూపాయలు. అవేం చేయాలో తెలిసేది కాదు.  వస్తువులు అన్నీ గ్రామంలోనే  లభించేవి. దాంతో జీతం రూకలను గూట్లో గిరవాటు వేసేవారట. అలా గూట్లో పడివున్న రూపాయలు,  శిస్తు కట్టలేని రైతుల పొలాలు కొనుక్కోవడానికి అక్కరకు వచ్చాయట.
రామయ్య గారు చాలామందికి ఆశ్రయం కల్పించారు.  ఒకసారి ఆయన వాకిట్లో అరుగు మీద కూర్చుని మొహం కడుక్కుంటూ వుంటే ఒక రైతు  వచ్చాడట. ‘ఎక్కడికి’ అని అడిగితె ‘ఎక్కడ పని దొరికితే అక్కడికి’ అని అన్నాడట. ‘నీకెంత పొలం కావాలో తీసుకో ఇప్పిస్తా. ఇక్కడే వుండిపో ‘ అన్నాడట రామయ్య గారు. ఆ రైతు ఎవ్వరో కాదు ప్రస్తుతం వూరి మోతుబరుల్లో ఒకరయిన  శ్రీ బండి సత్యనారాయణ పూర్వీకుడు. శ్రీ సత్యనారాయణ నేనూ (అంటే, పర్వతాలరావు)  మా వూరి వారిలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్లం. నేను చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల్లో ఉండిపోయాను. బండి సత్యం బియ్యే  మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాడు. అది వేరే కధ.
అలాగే వేమిరెడ్డివారికి ‘మీరెంత అడవి కొట్టుకుంటే  అంత పొలం ఇస్తానని’ చెబితే వాళ్ళు అడవి నరికి పొలం చేకుంటూ కంభంపాడులోనే వుండిపోయారు. రామయ్యగారి కాలంలో  ప్రస్తుతం వేమిరెడ్డి వంశం వాడయిన ఓబుల్ రెడ్డి( నరిసిరెడ్డి దత్తత కుమారుడు) చామర్తి వీరభద్ర రావు గారు, భండారు కామాక్షమ్మ గారు, భండారు రామకృష్ణయ్య గార్ల ఇండ్ల స్థలాలన్నీ ఆయనవే. భండారు సీతారామయ్య గారు తన కూతురు రాజమ్మ గారిని మా పెద్ద మేనమామ కొండపల్లి శ్రీ రామచంద్రరావుకు భార్య చనిపోతే రెండో సంబంధం ఇచ్చారు. మా మేనమామ కృష్ణారావు మరణానంతరం ఆయన విజయవాడకు మకాం మార్చారు.  తరువాత కంభంపాడులోని పొలాలు, ఇళ్ళ స్థలం అమ్మేసుకున్నారు. ప్రస్తుతం మా ఇంటికి ఐ మూలగా ఓబులరెడ్డి ఇల్లున్న స్థలం రామయ్య గారిదే.
ఇంగువ వారి పూర్వీకులకు ఆశ్రయం కల్పించింది కూడా ఆయనే. ఈరోజుల్లో ఇండ్ల స్థలాలు, పొలాలు ఇప్పించడం అనేది మంత్రులు కూడా చేయలేని పని. మంత్రివర్గం చేయగలిగే ఈ పనులను ఆ రోజుల్లో గ్రామ కారణాలు చేయగలిగేవారు. అదీ నోటి మాటతో.
రామయ్య, లక్ష్మయ్య గార్ల హయాంలోనే వారికీ, వారి చిన తాత రామలింగయ్య (కోర్టు తీర్పులో  లింగయ్య అనే వుంది ) కుమారుడు చినకామయ్య గారికీ దావా నడిచింది. బెజవాడ డిస్ట్రిక్ట్ మునసబు కోర్టులో నడిచిన ఈ దావాలో వాది చిన కామయ్య కాగా ప్రతివాదులు రామయ్య, లక్ష్మయ్యలు. దావా పర్యవసానం ఎలా వున్నా, దానికి సంబంధించిన కోర్టు తీర్పులో భండారు వంశం వారి పూర్వీకుల పేర్లు వివరంగా పేర్కొనడం జరిగింది.
రామయ్య గారి భార్య శేషమ్మ గారు. ఆమె దాదాపు ఎనభయ్ ఏళ్ళకు పైగా బతికింది. రామయ్య గారి దంపతులకు ముగ్గురు కుమారులు. పర్వతాలయ్య, లక్ష్మీ నారాయణ, వెంకట సుబ్బారావు. కుమార్తెల సంగతి స్పష్టంగా తెలియదు. కొడుకులలో పెద్దవాడయిన పర్వతాలయ్య గారిదే కరిణీకం. చాలా కాలం అంతా కలిసే వున్నారు. అప్పుడు మా ఇల్లు ఉత్తర ముఖంగా వుండేదిట. ప్రస్తుతం సుబ్బయ్య తాతయ్య జాగాలోకి వున్న బేస్ మట్టం, మెట్లు అప్పుడు ఇంటికి సింహ ద్వారం వైపు ఉండేవి.  ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతి కావడం వల్ల మా నాన్నగారు రాఘవరావు గారు ఇప్పుడున్న ఇంటిని నిర్మించారు. కొద్దిగా  కాలిన దూలాలను కొన్నింటిని కొత్త ఇంటి నిర్మాణంలో వాడారు. జాగ్రత్తగా పరికించి చూస్తే ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ కానవస్తాయి. ఆ  ఇల్లు కట్టినప్పుడు మా తాతగారు పర్వతాలయ్య గారు బతికే వున్నారు. వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు వేర్లు పడ్డారు. లక్ష్మీనారాయణ గారు కొండారెడ్డి జాగా కొనుక్కుని వేరే ఇల్లు కట్టుకున్నారు. సుబ్బయ్య గారు మా ఇంటి పక్కనే ఒక పూరిల్లు వేసుకుని వుంటూ వుండేవారు. ఆ రోజుల్లో ఊళ్ళోకి తాసీల్దారు  రావడం అంటే గొప్ప విషయం. వూరికి వచ్చిన తాసీల్దారు పొలాల వెంట తిరుగుతూ అడంగల్ లో రాసిన విధంగా పంటలు వాస్తవంగా వేసేవారో  లేదో ప్రత్యక్షంగా తనిఖీ చేసేవాడట. అందుకోసం ఆయన దర్జాగా మేనాలో వెడుతుంటే  కరణం, మునసబులు ఆ మేనాకు చెరో వైపు వెంట పరిగెత్తుతూ పంటల వైనం, సర్వే నెంబర్లు వివరించేవారట. అప్పుడు అందరికీ గుర్రాలు ఉండేవి. ప్రయాణాలు ఎక్కువభాగం కాలినడకనా, గుర్రాల మీదా సాగేవి. ఆడవాళ్ళు  మేనాలో గాని ఎద్దు బండ్లపై గాని ప్రయాణం చేసేవారు. మోతుబరులు, కరణాలు గుడిసె బండ్లలో వెడితే, సంసారులు(రైతులు) జల్ల బండ్లలో వెళ్ళే వాళ్ళు. బండ్ల ప్రయాణాల్లో జీతగాళ్ళు ఎడ్ల తాళ్ళు పట్టుకుని ముందు  నడుస్తుంటే వెనుక వెట్టివాళ్ళు (వాళ్ళు గ్రామోద్యోగులయినా వెట్టివాళ్లనే పేరు పోలేదు. ఒకప్పుడు వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ బతికేవాళ్ళు. మోతాదు, వెట్టి వాడు అని పిలిచేవాళ్ళు. మా నాన్నగారివద్ద  అలాటివాళ్ళు ముగ్గురు వుండేవాళ్ళు. ఇప్పుడు వారికి సమాజంలో గౌరవం లభించేలా వారి ఉద్యోగ హోదాలు మార్పు చేయడం అభిలషణీయం)

బండ్లు వెడుతున్నప్పుడు వడ్డేరకాలు (బాటలో ఎత్తుపల్లాలు) వచ్చినప్పుడు బండి పడిపోకుండా వాళ్ళు బండి చక్రం పట్టుకుని బరువానేవాళ్ళు.  వానాకాలం దోవ బురదగా వుండి బండి చక్రాలు కూరుకుపోతాయనే భయంతో ఒక్కొక్క బండికి రెండేసి జతల ఎడ్లను కట్టే వాళ్ళు. అసలా రోజుల్లో కరణాలు తప్ప ఎవరూ  బండ్లు కట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. వ్యవసాయప్పని చెడుతుందని కొంతా, ఎడ్లు దెబ్బతింటాయని కొంతా  భయం. (ఇంకా వుంది)


(భండారు పర్వతాలరావు)

2 కామెంట్‌లు:

Arun చెప్పారు...

ఈ బండి సత్యం గారు మా అమ్మమ్మ కుటుంబానికి ఆప్త మిత్రులు, మా అమ్మ కూడా ఆయన గురించి చెప్పేది, ఆ రోజుల్లోనే ఓల్డ్ బీయ్యే చదివారని, అంత చదివి కూడా వ్యవసాయం చేసేవారనీ. వేమిరెడ్డి వాళ్ళగురించి నాకు పెద్దగా తెలీదుకానీ, నరాల వాళ్ళు బాగ తెలుసు నాకు కూడా, నరాల నర్శిమ్హయ్య శీతమ్మ గారు, అప్పిరెడ్డి గారు (పంచాయితీరాజ్ లో ఈఓ గా చేసారు ఈయన) . మా చిన్నతనంలో డాబా ఇల్లు ఉంది వాళ్ళకే; శివారెడ్డి రైస్ మిల్లు వెనక మా తాతయ్య, ఆయన తమ్ముడి ఇల్లు ఉండేవి, మా తాతయ్య ఇంటి వెనక వెలమలోరి ఇల్లుండేది. రైస్ మిల్లు ముందు రోడ్ లో వెళ్తే డాబా వాళ్ళ ఇళ్ళూ ఉండేవి వరసగా. 1995-96 లోనో తరవాతి ఏడాదో వెళ్ళాను ఆఖరిసారి కంభంపాడు, అప్పటికి మావాళ్ళు వత్సవాయి పొయ్యే దారిలొ డొంక పక్కన ఉండేవాళ్ళు, అప్పిరెడ్డి గారి ఇంటి పక్కన. పాత ఇళ్ళూ వైపు వెళ్ళి 25 ఏళ్ళ పైమాటే. మీ బ్లాగ్ వల్ల ఆ జ్ణాపాకలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నా

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Arun - చాలా సంతోషం అండీ. మీ అమ్మగారికి నమస్కారాలు. అప్పిరెడ్డి గారిది ఒక్కటే అప్పుడు డాబా ఇల్లు. డాబా వెంకటరెడ్డి అనేవాళ్ళు. ఆ రోజుల్లో రైస్ మిల్లు పిల్లలకు ఒక వింత. అందరం అక్కడికే చేరే వాళ్ళం. కిరోసిన్ తోనో, డీసెల్ తోనో నడిపేవాళ్ళు. దానికొక పట్టా వుండేది. చక్రాలు తిరుగుతున్నప్పుడు మిల్లు మనిషి లాఘవంగా వాటికి తగిలించేవాడు. మా అన్నయ్య, బండి సత్యం తరవాత, మొదటి పట్టా పుచ్చుకున్నది అప్పిరెడ్డి మాత్రమె.