13, ఆగస్టు 2017, ఆదివారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(12)



భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన


“పర్వతాలయ్య గారి తమ్ముడు లక్ష్మీనారాయణ గారు వ్యవహార దక్షుడు. వూళ్ళో తగాదాలు వస్తే ఆయన దగ్గరకు వచ్చి పంచాయితీ పెట్టేవారు. సన్నగా,పొడుగ్గా, నిటారుగా ఉండేవాడు. ఎనభయ్ నాలుగేళ్ళకు పైగా జీవించాడు. ఆయనకు సంతానం కలగలేదు. మా పినతండ్రి రామప్రసాదరావు గారిని దత్తు తీసుకున్నారు. మా తాతగారు పర్వతాలయ్య గారు బండ్లు కట్టుకుని భద్రాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చారు. బహుశా ఆయనకు భద్రాద్రి రామునిపై వున్న భక్తి కారణంగా మా నాన్నగారికి రాఘవరావు అనీ, మా బాబాయికి రామప్రసాదం అనీ పేరిడి ఉండవచ్చు. ఆయనకు కనకమ్మగారని మేనత్త (రామయ్యగారి సోదరి) వుండేది. గోపినేనిపాలెం  రాజయ్యగారు ఆమె కొడుకే అనుకుంటా. వల్లభి వాస్తవ్యులు అయితరాజు గోపాలరావు గారి భార్య, భండారు కామేశ్వర రావు గారి అత్తగారు జగ్గమ్మక్కయ్య, కనకమ్మగారి సంతతికి చెందినదే. తాయమ్మ, లచ్చమ్మ గార్లు ఆయన తోబుట్టువులు. లచ్చమ్మగారు సుబ్బయ్య తాతయ్య రేకుల ఇంట్లో వొంటరిగా ఉంటూ వొండుకుని తింటూ అకస్మాత్తుగా చనిపోయింది. అంతా పురుగు చేష్ట (పాము కాటు వంటిది) అనుకున్నారు. ఆమెకు సంతానం లేదు. బాల వితంతువు. డాక్టర్ జమలాపురం రామారావు (అంతా రాములు మామయ్య అంటారు. గమ్మతేమిటంటే చిన్నా పెద్ద అందరికీ ఆయన రాములు మామయ్యే.) ఆయన తాయమ్మ గారి సంతానం. పర్వతాలయ్యగారు బతికుండగా లోలోపల రగులుతూ వచ్చిన విబేధాలు ఆయన పోగానే ఒక్కసారి భగ్గుమన్నాయి. మా తాతగారిలా మా నాన్నగారు సర్దుకుపోయే మనిషి కాదు. మా బామ్మగారిలాగే ఆయనకూడా ఒకరికి  లొంగి వుండే రకం కాదు. గ్రామానికి ఎవరు వచ్చినా మా ఇంటనే భోజనం చేసేవారు. హోటళ్ళు అవీ లేని రోజుల్లో అలాటి ఆదరణ ఎంతో ఆకట్టుకునేది. మా ఇంట్లో భోజనం చేసిన అధికారులందరూ మా నాన్న అన్నా, మా కుటుంబం అన్నా ఆదరాభిమానాలు చూపేవారు. మా నాన్నగారికి అధికారుల వద్ద ప్రాపకం అల్లా లభించిందే కాని ఒకరి సిఫారసు వల్ల కాదు. 
అప్పటిదాకా గ్రామంలో తిరుగులేని పెద్దరికం లక్ష్మీనారాయణ గారిది. అంటే మా రెండో తాతగారిది.

(కుటుంబ సభ్యులతో లక్ష్మయ్య తాతయ్య)

ఆయనది విచిత్రమైన మనస్తత్వం. మీరేఅని పెద్దపీట వేసి పిలిస్తే ప్రాణం ఇచ్చేమనిషి.  తన మాట కాదంటే, వాడి అంతు చూసే రకం. ఏది చేసినా కుటుంబంలో పెద్దవాడినయిన (పెద్దవాడు పర్వతాలయ్య కాలం చేసాడు కాబట్టి) తనని సంప్రదించి చేయాలన్నది ఆయన కోరిక. అయితే మా నాన్నగారికి తనకు తోచింది చేయడం అలవాటు. ఒకరిని సలహా అడగడం తక్కువ. ఇద్దరూ వ్యవహారదక్షులు, స్వతంత్రులు కావడంతో వాళ్ళ మధ్య సామరస్యం ఎక్కువకాలం సాగలేదు. పరిస్తితి మాట పట్టింపులతో మొదలయి, క్రమంగా మాటలు లేకపోవడం దాకా వచ్చింది. ఆ శతృత్వం  15,20 ఏళ్ళపాటు సాగింది. ఈ లోపల ఇద్దరి నడుమా ఓ అరవై డెబ్బయ్ కేసులు, దావాలు నడిచివుంటాయి. ఈ గ్రంధం  నడిచినన్నాళ్ళు వేమిరెడ్డి సోదరులు అయిదుగురూ మా నాన్నగారి  పక్షాన పెట్టని కోటలా నిలబడ్డారు. మునసబు వాసిరెడ్డి అక్కయ్య గారు కూడా మా నాన్నగారి వైపే వుండేవారు. మునసబు కరణాలు కలిసి వస్తుంటే మా రాములు మామయ్య సరదాగా అక్కయ్య, బావయ్య  వస్తున్నారని నవ్వేవాడు.
మగవాళ్ళ మధ్య ఇంతగా వైరాలు నడుస్తున్నా, పిల్లలు కలిసి ఆడుకోవడానికి కాని, ఆడవాళ్ళు కలిసి మంచి నీళ్ళ బావికి వెళ్ళడానికి కాని, మధ్యాహ్నం వేళల్లో కలిసి కూర్చుని కాలక్షేపానికి పచ్చీసు ఆడుకోవడానికి కాని మగవాళ్ళు అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. లక్ష్మయ్య తాతయ్య గారి భార్య వరలక్ష్మి ( అంతా వరమ్మగారనేవారు, మేమంతా వరం బామ్మ అనేవాళ్ళం) ఎంతో ఆప్యాయత, ఆపేక్ష కలిగిన  మనిషి. మమ్మల్నీ, వాళ్ళ పిల్లల్నీ సమంగా చూసేది. మా నాన్నగారికి మేము పదకొండుమందిమి. ఏడుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలం. మా ప్రసాదం బాబాయి గారికి ఒక్కడే కొడుకు సత్యమూర్తి. ఆడపిల్లలు ఇద్దరు, సుగుణ, మధుర. మేమంతా ఎంతో స్నేహంగా, కలివిడిగా వుండేవాళ్ళం. నేనూ (పర్వతాలరావు) సత్యమూర్తి అన్నయ్య  చాలా  స్నేహంగా వుండేవాళ్ళం. మా రెండిళ్ళ నడుమ తగాదాలను గురించి మేం కాలేజీలో చదివేటప్పుడు తరచూ చర్చించుకునేవాళ్ళం. మనం పెద్దవాళ్ళం అయిన తరువాత అలాటి గొడవలను ఇక ససేమిరా రానీయ వద్దుఅని దీక్ష పూనాం కూడా. ఆవిధంగానే, తగాదాలు, గొడవలు అన్నీ పెద్దవాళ్ళతోటే పోయాయి.


(సత్యమూర్తి అన్నయ్య) 


సత్యమూర్తి  అన్నయ్య మాకే కాక ఊరంతటికీ పెద్ద అండగా ఉండేవాడు. సహాయకారి. పైపెచ్చు ధైర్యశాలి కూడా. దేనికీ భయపడే తత్వం కాదు. రాజకీయాల్లో తిరిగినా, హింస, దౌర్జన్యాలకు తావులేకుండా సామరస్య పూర్వకంగా వ్యవహారాలు నడిపేవాడు.  మా వూరి పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసాడు. గ్రామాభివృద్ధికి బాగా పాటుపడ్డాడు. కాకాని వెంకటరత్నం గారికి ఏకలవ్య శిష్యుడు. చదువుకోసం వెళ్ళిన నన్ను తప్పిస్తే ఆయనే మా వూరునుంచి  హైదరాబాదు వ్యవహారరీత్యా వెళ్లి వచ్చిన మొదటి వాడు. ఆయన హైదరాబాదులో బస్సు దిగి నేరుగా ఖైరతాబాదులో, కాకాని వెంకట రత్నం గారు మంత్రిగా వున్న ఇంటికి వెళ్ళిపోయేవాడు. వూరికి తిరిగి వచ్చిన తరువాత హైడ్రాడ్’ (ఆయన ఉచ్చారణ అలానే వుండేది) విశేషాలను వైన వైనాలుగా వివరంగా చెప్పేవాడు. ఊరివారందరు గుమికూడి ఆ సంగతులన్నీ ఆసక్తిగా వినేవారు. ఊళ్ళోకి కరెంటు తీసుకు రావడానికి, రోడ్డు పడడానికి ఎంతో శ్రమ పడ్డాడు. గుండె జబ్బుతో ఆయన అకాల మరణం చెందకపోతే, మా వూరికి ఆయన తిరుగులేని నాయకుడిగా ఉండేవాడు. వూళ్ళో కలిగిన వాళ్ళే కాకుండా బీదాబిక్కీ కూడా ఆయన్ని విపరీతంగా అభిమానించేవారు. ఆయన చనిపోయినప్పుడు వారంతా తాము దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టు దుఖించారు. ఆయన మృత దేహాన్ని మోసే హక్కు  మీకే కాదు మాకూ వుందని ఇంటి వాళ్ళతో పోట్లాడి చివరకు అందరు కలసి స్మశానానికి తీసుకువెళ్ళి దహనం చేసారు. మేమందరం నిమిత్తమాత్రులుగా చూస్తూ ఉండిపోయాం. ఆరోజుల్లో స్మశానాలకు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కాని అదేమిటో ఆరోజు వూరు వూరంతా తరలివచ్చింది. అక్కడ కులబేధం అని కాని, చిన్నా పెద్దా అని కాని  లేకుండా అంతా ఆయన చితిలో కట్టెపుల్లలు వేయడానికి తొక్కిసలాడారు. మేమంతా ఆయన పిల్లలమేగా, ఆయన చితికి నిప్పంటించే కర్తవ్యం మాకు లేదాఅంటూ షెడ్యూల్డ్ కులాలవారు పెద్దగా ఏడుస్తూ  ఆయన చితిపై కొరవులు వేయడం అందరి హృదయాలను కదిలించింది. అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న సత్యమూర్తి అన్నయ్య ధన్యజీవి. చిరంజీవి. ఇప్పటికీ గ్రామంలో ఏదయినా సమస్య తలెత్తితే సత్యమూర్తి గారు ఉంటేనా ..అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: