14, ఆగస్టు 2017, సోమవారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(13)



భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన

మా కుటుంబం మొత్తంలో మా చిన్న తాతగారు   భండారు సుబ్బారావుగారి తరహానే  వేరు. సుబ్బయ్య తాతగారిది  ఆధ్యాత్మిక దృక్పధం. జాలిగుండె. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. కాకపొతే ప్రధమ కోపం. కాని అది తాటాకు మంట లాటిది. ఇట్టే ప్రజ్వరిల్లినా మళ్ళీ అట్టే చల్లారిపోయేది. చిన్నతనంలో చాలా దుడుకు మనిషి అని పేరు కాని పెద్దయిన తరువాత  చాలా మారిపోయాడు.
 పిల్లలు లేని కారణంగా వూళ్ళో అందర్నీ పిల్లలుగా చూసుకునే వారు. కష్టసుఖాలు గమనించి సాయం చేస్తూ  వుండేవారు. తరచుగా సతీసమేతంగా తీర్ధయాత్రలు చేస్తుండేవారు. కాశీ రామేశ్వరాలు తిరిగివచ్చిన పుణ్యశాలి. ఆయన భార్య సీతమ్మ గారు  కందిబండ వారి ఆడపడుచు. భర్తకు జడియడమే సరిపోయేది. ఆ రోజుల్లో భార్యలపై చేయిచేసుకోవడం వుండేది. కాని మా తాతగారికీ, నాన్నగారికీ అది అలవడలేదు. అయితే మా చినతాతలిద్దరికీ ఆ అలవాటు వుండేది. సుబ్బయ్య తాతగారు మాత్రం ఆవేశంలో ఏదయినా తప్పుచేస్తే  వెంటనే పశ్చాత్తాపం చెందేవాడు. ఎవరిమీద అయినా చేయి చేసుకుంటే ముందు బావి దగ్గరకు వెళ్లి తలస్నానం చేసి జందెం మార్చుకునేవాడు. అంతేకాదు. ఆ కొట్టిన వాడిని పిలిపించి మానెడు జొన్నలు ఇచ్చి పంపేవాడు. బీదాబిక్కీ ఎవరికయినా పనిదొరక్కపోతే, ‘ఇవాళ సుబ్బయ్యగారితో నాలుగు దెబ్బలు తిన్నా బాగుండుఅనుకునేవారు. అంతేకాదు ఎవరయినా అప్పు అడగడమే తరువాయి, లేదనకుండా వెంటనే వందా రెండొందలు  ఇచ్చేవాడు. అసలు, వడ్డీ కలిపి ఎంతవుతుందో లెక్క కట్టి, ఎవరికెంత ఇచ్చిందీ వివరాలన్నీ పెన్సిల్ తో గోడమీద రాసేవాడు. ఒకసారి మరచిపోయి సున్నం కొట్టించాడు. అంతే!  మొత్తం పద్దులన్నీ మాఫీ. అప్పులు మాఫీ చేసే విషయంలో చరణ్ సింగుకు దోవ చూపించింది సుబ్బయ్య తాతయ్యే అనవచ్చు.


(సుబ్బయ్య తాతయ్య, సీతం బామ్మ దంపతులు, వారి నడుమ వాళ్ళు దత్తత తీసుకున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు, పాత ఫోటో)



"ఒకసారి  మా చినతాత గారు భండారు సుబ్బారావు గారికి రైల్లో ఒక యువ సాధువు  కలిశాడు. ఆయన వర్చస్సు, పాండిత్యం చూసి మా చిన తాతగారు ముగ్ధుడై ఆయనను కంభంపాడు తీసుకు వచ్చారు. ఆ సన్యాసి పేరు శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి. ఆయనను అంతా కాశీ స్వాములవారు అనేవారు.
ఆయన మా వూళ్ళో ఒక ఆశ్రమం స్థాపించారు. స్వామి  వారు హోమియో వైద్యం కూడా చేసేవారు. ఆయన బోధనలు విని మా తాతగార్లు తలా కొంత పొలం ఆయన గారి ఆశ్రమానికి దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో ఆయన తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే  ఒక వేద పాఠశాలను కూడా నిర్వహించారు. అదంతా బహుశా 1930-40 ప్రాంతాల్లో కావచ్చు. ఆ కార్యకలాపాలతో శ్రీ మండాలపాటి నరసింహారావుగారికీ, విజయవాడ న్యాయవాది శ్రీ  దంటు శ్రీనివాస శర్మ గారికీ సంబంధం వుండేది. మా సుబ్బయ్య తాతగారు సతీ సమేతంగా కొన్నాళ్ళు ఆశ్రమంలోనే కాపురం పెట్టారు.    స్వాములవారు కొన్నాళ్ళు మండాలపేటలోను ఆ తరువాత కొవ్వూరులోను వున్నారు. పూరీ గోవర్ధన మఠం పీఠాధిపతిగా కూడా వున్నారు. ఆయన అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి కాశీ నుంచి తెచ్చిన శివ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు. అదిప్పుడు శిధిలావస్థకు చేరుకోవడంతో ఈ మధ్యనే మా రెండో తమ్ముడు భండారు రామచంద్రరావు పూనిక వహించి ఆ గుడిని  ఓ మేరకు అభివృద్ధి చేసి ఒక  పూజారిని నియమించి ఆ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత మొత్తం పంపుతున్నాడు. ఆశ్రమం మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఆశ్రమానికి మా పూర్వీకులు ఇచ్చిన పొలం ప్రభుత్వం తీసుకుని ఆ  ప్రదేశంలో షెడ్యూల్డ్ కులాలవారికోసం ఒక పెద్ద కాలనీ నిర్మించింది. దానం చేసిన స్థలం అలా ఒక సత్కార్యానికి ఉపయోగపడడం సంతోషదాయకం. పునరుద్ధరించిన ఆలయానికి మా తమ్ముడు  రామచంద్ర రావు ట్రస్టీగా వున్నాడు.
మా నాన్నగారికీ, లక్ష్మయ్య తాతయ్య గారికీ నడుమ జరిగిన తగాదాల్లో సుబ్బయ్య తాతయ్య ఎప్పుడూ నాన్న పక్షానే నిలబడేవాడు. నాన్నగారికి సుస్తీ చేసిన సమయంలో ఆయన ఎంతో ఆదుకున్నాడు. అప్పులన్నీ తీర్చి వేసాడు. చికిత్స గురించి శ్రమ పడే వాడు. ఒకసారి, అప్పుడు నాకు (భండారు పర్వతాలరావు) పదిహేడు ఏళ్ళు ఉంటాయేమో. సందర్భం జ్ఞాపకం లేదు కాని అనవసరంగా ఆవేశపడి ఆయనతో మాట తూలాను. నా మాటల్లో తీవ్రత చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడే కాని కోపం తెచ్చుకోలేదు. తరువాత  నా తప్పు నేనే తెలుసుకున్నా.  ఆయన మనస్సు గాయపడింది అన్న విషయం కూడా నాకు బోధపడింది. చాలామందికి తెలియదు కాని, నాది కోపిష్టి  మనస్తత్వం. అనాలోచితంగా, అనుచితంగా ప్రవర్తించడం, పెద్దవారిని నొప్పించడం దురదృష్టవశాత్తు పరిపాటి అయిపోయింది. భోలాశంకరుడుగా పేరున్న సుబ్బయ్య తాతయ్య గారికి చివరి రోజుల్లో భగవంతుడు పరీక్షలు పెట్టాడు. ఆయన భార్య సీతమ్మగారు పక్షవాతంతో తీసుకుని మరణించింది. ఆయనకు  కూడా పెద్దతనంలో ఒక కాలూ చేయీ పడిపోయింది. ఆయన ఔదార్యం మళ్ళీ, ఆయన పెంపకానికి తీసుకున్న మా రెండో తమ్ముడు రామచంద్రరావుకు వచ్చింది. మొత్తం కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కనిపెట్టి చూసే మంచి బుద్ధిని దేవుడు వాడికి ప్రసాదించాడు. దత్తు పోవడంవల్ల అదనంగా వచ్చిన ఆస్తిపాస్తులను కూడా ఎప్పుడూ తన సొంతం అనుకోలేదు. ఈ సద్బుద్ధి మా తమ్ముడి పిల్లలకు కూడా వుండడం వల్ల ఆస్తుల విషయంలో, మా కుటుంబంలో ఎలాటి పొరపొచ్చాలు తలెత్తలేదు. మా నాన్నగారు, తాతగారు పోయి అనేక దశాబ్దాలు గడిచినా ఇంతవరకు మా మధ్య , మా పిల్లల  మధ్య ఆస్తి పంపకాలు జరగలేదు. కంభంపాడు ఇల్లు, పొలాలకు సంబంధించి ఈనాటి వరకు మాది ఉమ్మడి కుటుంబమే. తమ్ముడు రామచంద్రరావు భార్య విమల కూడా,  మంచానపడిన  మా సుబ్బయ్య తాతగారికి చివరి రోజుల్లో ఎంతో సేవచేసింది.

అదేమిటో ఖర్మ తెలియదు కాని, మా కుటుంబంలో మగవాళ్ళు చివరి రోజుల్లో మంచానపడి, అవస్థలు పడి తీసుకుని తీసుకుని  పోయారు. మా నాన్నగారు దాదాపు మూడునెలలు మంచంలో వున్నాడు. లక్ష్మయ్య  తాతగారి పరిస్తితి మరీ దయనీయం. చెట్టంత ఎదిగిన మనుమడు సత్యమూర్తి ఆయన కళ్ళముందే అకాల మరణం చెందడం దారుణం. అందరిలోకి అదృష్టవంతురాలు లక్ష్మయ్య తాతగారి భార్య వరమ్మగారు. చనిపోయేముందు మొగుడి కాళ్ళు తన దగ్గర పెట్టుకుని, అందరికీ అన్నీ అప్పగింతలు పెడుతూ, ఏదో రైలుకు వెళ్ళేదానిలా హాయిగా అనాయాసంగా దాటిపోయింది. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: