16, డిసెంబర్ 2016, శుక్రవారం

కళ్ళనీళ్ళ పెళ్లి


1971 డిసెంబరు 15 వ తేదీ   రాత్రి  మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులుపిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు.  మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టు తో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి.  తొమ్మిదీ పది గంటల  నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు  టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత  16 వ తేదీ రాత్రి బయలుదేరి రైల్లో మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము.  మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని  చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
పెళ్లోద్దు పెళ్ళాం కావాలిఅనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి  కావచ్చు.
మా పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో ఆంద్ర జ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము.  నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరుతున్నాను, అని చెప్పేవరకు నీకు సెలవు ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.   

తోకతపా: ఇలాంటి పెళ్లిళ్లకు ఫోటోలు వుండవు, జ్ఞాపకాలు తప్ప.
(16-12-2016)

5 కామెంట్‌లు:

sarma చెప్పారు...

So, u r a rebel 45 years back :) Wish u both happy married life. Happy marriage day

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వల్లెవేసిన ఆదర్శాలను ఆచరణలోకి తర్జుమా చెయ్యడానికి ధైర్యం, పట్టుదల (కొండొకచో మొండితనం), తెగింపు చాలా అవసరం. అవన్నీ మీలో ఉన్నాయని నిరూపించారు. మీకూ మీ శ్రీమతి గారికీ వివాహ వార్షికోత్సవ అభినందనలు 🌹🌹.

Lalitha చెప్పారు...


పెళ్లిరోజు శుభకామనలు మీ దంపతులిరువురికి!

అజ్ఞాత చెప్పారు...

మీ పిల్లల పెళ్ళిళ్ళకి ఇన్ని కన్నీళ్ళు లేవనుకుంటా!

Chandrika చెప్పారు...

పెళ్లి రోజు శుభాకాంక్షలు దంపతులిరువురికీ