30, డిసెంబర్ 2016, శుక్రవారం

2017 లో ప్రతిపక్షాలను కాదు ప్రజలను చూడండి ప్రభువులూ!


(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 01-01-16,SUNDAY)

అనాదిగా అలుపులేకుండా తిరుగుతున్న కాలచక్రం, తిరిగి తిరిగి, తిరిగొచ్చిన చోటికే తిరిగిరావడం  మామూలే.
అనేక అనుభవాలను, అనుభూతులను మన మదిలో, ఒడిలో  ఒదిలిపెట్టి  గత  ఏడాది సెలవు తీసుకుంది. సరికొత్త ఆశలతో కొత్త ఏడాది గడప దాటి అడుగు పెట్టింది.
చివరాఖర్లో కొంత హడావిడి చేసి 2016  తప్పుకుంటోంది. ఆ ప్రకంపనలను వారసత్వంగా అందిపుచ్చుకుని  2017 ప్రవేశిస్తోంది.

కొంచెం అటూ ఇటూగా కేంద్రంలోను, రెండు కొత్త తెలుగు రాష్ట్రాలలో నూతన ప్రభుత్వాలు కొలువుతీరి  రెండున్నర సంవత్సరాలు దాటుతోంది. ‘ఎన్నికలకు ముందు చెప్పినవేవీ చేయకుండా చేతులు ముడుచుకు కూర్చున్నారని’ ప్రతిపక్షాల వాదన. ‘కాదు, ఈ కొద్ది కాలంలో మేము చేసినన్ని మంచి పనులు గతంలో చాలాకాలం పాలించిన పార్టీలు ఏవీ చేయలేదని’ ఈ కొత్త పాలకుల సమర్ధన.  2016 లోనే కాదు, గత రెండున్నరేళ్లలో ఏం జరిగిందో సింహావలోకనం చేసుకుందాం.
ముందు ఢిల్లీ నుంచి మొదలుపెడదాం. చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయాన్ని సాధించి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. మొదటి రెండేళ్లలో రాజకీయంగా కొన్ని ఆటుపోట్లు ఎదురయినా వ్యక్తిగతమైన ప్రజాదరణ ఇసుమంత కూడా కోల్పోలేదు. అన్నింటికీ మించి అధికారంలోకి రాగానే సహజంగా అంటుకునే అవినీతి మరకలు ఆయన్ని అంటుకోలేదు. బ్రహ్మాండమయిన పనులేవీ చేసి చూపించిన దాఖాలాలు పెద్దగా లేకపోయినా ప్రజలకు ఆయన పట్ల నమ్మకం తగ్గిపోలేదు.  పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకున్నప్పటికీ, అందువల్ల ముందుగా  చీకాకులు పడుతున్నది తామే అయినప్పటికీ సామాన్య ప్రజలు పంటి బిగువన ఆ కష్టాన్ని భరిస్తూ వచ్చిన విషయం అంత చిన్నవిషయమేమీ  కాదు. కారణం ఏదైనా, కారకులు ఎవరయినా, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి  మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత ఏడాది చివరి రెండు మాసాల్లో యావత్ జాతిని ప్రభావితం చేసింది. దేశానికి పట్టిన నల్ల ధనం రోగాన్ని మటుమాయం చేయడానికి మోడీ తలపెట్టిన కాయకల్ప చికిత్స తొలి ప్రభావం సామాన్య జనజీవనంపైనే పడింది. ఈ ఆకస్మిక నిర్ణయం తమ జీవితాల్లో తీసుకొచ్చిన అనూహ్య పరిణామాలను వారు అతి సహజంగా తీసుకుంటున్నారనే చెప్పాలి. వెనిజులా దేశంలో ఇటువంటి నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు ఎంత కోపోద్రిక్తులయింది గమనిస్తే, భారతీయులు ప్రదర్శిస్తున్న సహనం మోడీ అదృష్టమనే అనుకోవాలి.  అయితే దాన్ని ప్రజలు తమకిస్తున్న సహకారంగా ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందులో కొంత నిజం లేక పోలేదు,  కానీ అది పూర్తిగా నిజం కాదన్న ఎరుక సర్కారు వారికి వున్నట్టు అనిపించడం లేదు.        
 ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న యాగీ పట్ల పాలక పక్షానికి కొంత అసహనం వుండవచ్చు. అలాగని వస్తున్న ప్రతి విమర్శను రాజకీయ కోణం నుంచి చూస్తూ తప్పుపట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రతిపక్షాలు సరే! ప్రజలు ఏమనుకుంటున్నారో చారుల ద్వారా సమాచారం తెప్పించుకుని వారి ఇబ్బందులను కొంతవరకయినా తగ్గించి  ఒకింత ఉపశమనం కలిగించండం మోడీ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకోవాల్సిన సంకల్పం ఇదే!
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చేజారిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం   తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి.  ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకదాని చిక్కుముడి విప్పేలోగా మరోటి సిద్ధం. కొన్ని వచ్చి పడ్డవి అయితే మరి కొన్ని తెచ్చి పెట్టుకున్నవి.
సమస్యను అవకాశంగా మలచుకోవడం తనకలవాటని చెప్పుకునే చంద్రబాబు, ఎదురయిన ప్రతి సమస్యను పార్టీకి, రాష్ట్రానికి పనికి వచ్చే అవకాశంగా మార్చుకునే పనిలో అహరహం కష్టపడుతుంటారు. కనీసం కష్టపడుతున్నట్టు కానవస్తారు. 'పని చేయడంతో సరిపోదు పనిచేసినట్టు కనబడాలి కూడా' అనే ఈ కాలపు రాజకీయానికి నిజానికి ఆయనే ఆద్యులు.
ఎన్ని చేస్తున్నా, ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్నా ఇంకా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి. రాజ్యం వుంది రాజధాని లేదు. ఖజానా వుంది. నిధులు లేవు. కేంద్రంలో మిత్ర ప్రభుత్వం వుంది. అయినా ఆశించిన విధంగా అక్కరకు రావడం లేదు. ఇటువంటి వ్యతిరేక పరిస్తితులను కూడా ఆయన అనుకూలంగా మార్చుకునే పనికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందులో కూడా రాజకీయంగా బలపడే ప్రయత్నం స్పష్టంగా కానవస్తుంది. ప్రతిపక్షాన్ని బలహీన పరిచే వ్యూహం దాగుంటుంది.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ రాని అపూర్వ అవకాశం చంద్రబాబు నాయుడుకి కొత్త రాజధాని నిర్మాణం  విషయంలో లభించింది. కొంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఈ విషయంలో కూడా చంద్రబాబు తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం కనుక ఆయన ప్రయత్నాలకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కానరాని మాట నిజమే. కాకపోతే కొత్త రాష్ట్రానికి వుండే ఇబ్బందులను ప్రజలు అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు కానీ  ఇష్టపూర్తిగా కాదన్న వాస్తవాన్ని తెలుగు దేశం అధినేత గుర్తుపెట్టుకోవాలి.
ఇక చంద్రబాబుకు మరో సువర్ణావకాశం పోలవరం రూపంలో వచ్చింది.  
దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941 జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.  ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్ మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది.  ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న భద్రాచలం సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం వేల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న పోలవరం ప్రాజక్టుకు,  వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కూడా  చంద్రబాబుకు రాజకీయంగా చాలా కీలకం. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.  అయినా ప్రతి సోమవారం ఆ ప్రాజెక్టు పురోగతి గురించిన సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. సమీక్షలతో ప్రాజెక్టు పూర్తి కాదు కదా! అది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఢిల్లీ మీద ఒత్తిడి పెంచారు.
ఏడాది చివర్లో చంద్రబాబు ప్రభుత్వానికి చిన్న తీపి కబురు అందింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర నిధుల్లో కొంత భాగం చెక్కు రూపంలో చేతికి వచ్చింది. అంతే! క్షణం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీటు పనులకు స్వయంగా ఆయనే శంకుస్థాపన చేశారు. చెక్కు చేతికి అందిన నాలుగు రోజుల్లోనే మెరుపు వేగంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన  తీరు గమనించిన వారికి సకాలంలోనే దాన్ని పూర్తి చేయగలరన్న నమ్మకం కలిగి వుంటుంది. అయితే కేంద్రం ఎంతో అబ్బురంగా అందించిన డబ్బు, ప్రాజెక్టు అంచనా వ్యయం  ఈ రెంటినీ పోల్చి చూసుకుంటే రెండేళ్లలో పని పూర్తి కావడం సాధ్యమా అనే సందేహం కలుగుతుంది.              
ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వరంగా మారుతుంది. పూర్తి చేయకుండా ఒదిలేస్తే రాజకీయంగా తెలుగు దేశం పార్టీకి శాపంగా మారుతుంది. అంచేతనే 2018 కల్లా పోలవరం పూర్తి చేసితీరుతామనే ప్రకటనలు ఆ పార్టీ  నాయకులు తరచూ చేస్తూ వస్తున్నారు. ప్రాజెక్ట్ అనుకున్న విధంగా, అనుకున్న వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే.  ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం మాత్రం అంచనాలకు మించి పెరిగిపోవడం ఖాయం.
ఎన్ని సంక్షేమ పధకాలు మొదలు పెట్టినా చంద్ర బాబు ఎన్నికల వైతరణి దాటాలంటే అటు రాజధాని నిర్మాణం కొంతయినా చేసి చూపించాలి. ఇటు పోలవరం ప్రాజక్టును కొంతయినా కట్టి చూపించాలి. ఇది ఎరిగిన రాజకీయ నాయకుడు కావడం వల్లనే ఈ రెండిటి పట్లా ఆయన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు చెప్పుకోవాల్సిన నూతన సంవత్సర సంకల్పం.
ప్రతి విషయానికీ ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోకుండా, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నెపం మోపకుండా  తన దీక్షాదక్షతలపై  ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా చూసుకోవాలి.
పొతే తెలంగాణా.   
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం నల్లేరు మీది బండి నడకలా సాగిపోతోంది. కేసీఆర్ మాట అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సుగ్రీవాజ్ఞగా చెల్లుబడి అవుతోంది. ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది. అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలియదు.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీతెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, నియామకాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నవారు అనుకున్నారు. అయితేవారనుకున్నట్టూ ఏమీ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అయినా కేసీఆర్ పైన ప్రజల అభిమానం చెక్కు చెదరలేదు. రాష్ట్రం ఏర్పాటయిన తరువాత జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లో టీఆర్ఎస్  నే గెలిపిస్తూ వచ్చారు. కేసీఆర్ తమ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న బంగారు తెలంగాణా స్వప్నం పట్ల వాళ్ళ నమ్మకం చెక్కుచెదరలేదు. మొన్నీ మధ్య ఆయన ప్రారంభించిన రెండు పడక గదుల ఇల్లు అనే పధకంతో ఆయన పట్ల నమ్మకం మరింత పెరిగి వుంటుంది కూడా.    
అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఇంతకాలంగా చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసేఆర్ నేతృత్వం వహిస్తున్న పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ప్రచార కోశంలో వీటన్నిటికీ జవాబులు సిద్ధంగా వుండొచ్చు. ప్రచారమే ప్రధానం అనుకుంటే, వాస్తవానికి చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికీ దొరకనంతగా విస్తృత, సానుకూల  ప్రచారం కేసీఆర్ కు లభిస్తోంది. పత్రికలవారితో పన్నెత్తి మాట్లాడడమే అపురూపం. అయినా మీడియాలో ఆయనకు వస్తున్న ప్రచారం అపూర్వం.   
అయితే ఇంతటితో సరా! సరే అని  ఇవ్వాళ ప్రజలు సరిపుచ్చుకోవచ్చు.  రేపూ ఇలాగే వుంటుందనే గ్యారంటీ వుందా?
ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భంలో కేసీఆర్ ఒక సంకల్పం చెప్పుకోవాలి. ప్రజలు అప్పగించిన పుణ్య కాలంలో మిగిలిన రెండేళ్ళు, ( చివరి ఆరునెలలు ఎన్నికల హడావిడే సరిపోతుంది) రాజకీయ భేషజాలకు స్వస్తి చెప్పి తనను నమ్ముకున్న ప్రజలను ఓ కంట కనిపెట్టి చూడాలి. ఏ విషయంలో ఎవరయినా ఏదైనా   ప్రశ్నిస్తే అందులోని నిజాయితీని కనిపెట్టగలగాలి. రాజహంస పాలనూ, నీళ్ళనూ వేరు చేసినట్టు, రాజకీయ ఆరోపణలను, నిజాయితీగా చేసే విమర్శలను వేర్వేరుగా చూడగలగాలి.
ఇది కేసీఆర్ చెప్పుకోవాల్సిన సంకల్పం.
ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ముగ్గురినీ కేవలం అనుభవం, సమర్ధత  కారణంగానే ప్రజలు వారు కోరుకున్న గద్దెలు ఎక్కించారు. అనుభవంలో కాని, రాజకీయ చాణక్యంలో కాని ఈ మువ్వురు  ఒకరికొకరు ఏమాత్రం  తీసిపోరు. వీరికి వున్న ఈ సానుకూల లక్షణాలన్నీ జనరంజకమైన పాలనకు దోహదం చేసి తీరాలి. మరి అయిదేళ్ళ విలువైన కాలంలో ఇంత కాలం గడచిపోయింది కానీ జనాలు కోరుకున్నది ఏమన్నా జరిగిందా?
వీరిలో పోలిక కలిగిన లక్షణం కూడా  ఒకటుంది.
ఏదైనా  మంచిపని  చేసినప్పుడు ఆ విషయాన్ని వారంతట వారే బయటకు చెప్పుకుంటున్నట్టే, చేయలేని విషయాన్ని ఎవరయినా ప్రస్తావిస్తే చాలు అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. ‘అభివృద్ధికి అడ్డు తగులుతున్నారనే’ అభాండం వేస్తున్నారు. లేదా తమ వైఫల్యాలకు మునుపటి  పరిపాలకుల నిర్వాకం కారణం అని  కొట్టి పారేస్తున్నారు. గతంలో  జరిగిన పొరబాట్లను లేదా తప్పులను  చక్కదిద్దే దక్షత వుందన్న కారణంతోనే ప్రజలుతమకు  పట్టం కట్టారన్న సంగతి మరిచి పోతున్నారు.
“మీ సమర్ధతకు మెచ్చి ప్రజలు  ఇచ్చిన నజరానా మీ పదవులు. అందుకు బదులుగా వారికి ఏదైనా చేయండి. సమయం తగ్గిపోతోంది. ప్రతిపక్షాలను పక్కన పెట్టి ప్రజలను అక్కున చేర్చుకోండి.”
నూతన సంవత్సరం సందర్భంగా జనశ్రేయోభిలాషులు వారిని కోరుకునేది ఇదొక్కటే.
ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుల గాటన కట్టి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తు పెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గొప్ప ప్రజాస్వామిక లక్షణం ప్రజల్లో  నిండుగా  వుంది.
చరిత్ర రుజువు చేసిన సత్యం ఇది.
సర్వజన హితాన్ని గమనంలో వుంచుకుని రాస్తున్న ఆప్తవాక్యం ఇది.  
(31-12-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595 

27, డిసెంబర్ 2016, మంగళవారం

తెలియనివాడజ్ఞుండగు


తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళు అని మనుషులు  రెండు రకాలు.
తెలిసిన వాళ్ళు తమకు అన్నీ తెలుసనుకుంటారు. దానివల్ల లాభమయినా నష్టమయినా వారికే.
తమకు అన్నీ తెలిసినట్టే అందరికీ అన్నీ తెలుసని కూడా  అనుకుంటారు. దానివల్ల కూడా ఇతరులకు ఇబ్బంది తక్కువే.
అందరికీ అన్నీ తెలిసివుండాలి అని అనుకోవడం వుంది చూశారు అందువల్లే ఇబ్బంది.
పైగా ‘ఈ మాత్రం కూడా తెలియదా!’ అనే వెక్కిరింపులు, కొక్కిరింపులు మరీ బాధాకరం.

అన్నీ తెలుసనుకునే వారికి ఈ వాస్తవం తెలియక పోవడం మరింత బాధాకరం  

23, డిసెంబర్ 2016, శుక్రవారం

కేసీఆర్ ఫాం హౌస్ అంటే ఇదా!


అనుకోకుండా తతస్తపడే అవకాశాలు అబ్బురంగా కూడా వుంటాయి.
అలాంటివి ఇవ్వాళ ఏకంగా రెండు. పొద్దున్నే జ్వాలా వెంబడి ఎర్రవల్లి, నరసన్న పేట వెళ్లాను. ఈరోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి పాల్గొనే సభలు, సమావేశాలు అంటే ఆ హంగూ, ఆ ఆర్భాటం చెప్పక్కర లేదు. నిజానికి డబల్ బెడ్ రూమ్ పధకం కేసీఆర్ ప్రాధాన్యతా పధకాల్లో ఒకటి. అయినా సభ చాలా చాలా నిరాడంబరంగా జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఏర్పాట్లు ఏవీ లేవు. లోగడ కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఇంతే. హడావిడి తక్కువ. బహుశా ఇది కేసీఆర్ స్పెషాలిటీ కాబోలు. ఆయన వేదిక దిగి వస్తుంటే చిన్న సందు వంటి దారిలో నేనూ, జ్వాలా నిలబడి ఉన్నాము. మంత్రులతో పాటు నడిచివస్తున్న ముఖ్యమంత్రి జ్వాలా దగ్గర ఆగారు. అయన నన్ను పలానా అని పరిచయం చేసారు. కేసీఆర్ ఆయన తెలియకపోవడం ఏమిటి, అంటూ నాతొ కరచాలనం చేసిన తరువాతనే ముందుకు కదిలారు.  
పునర్నిర్మించిన  నరసన్నపేట గ్రామంలో నాలుగు వీధులు కలయ తిరిగారు. కొన్ని ఇళ్ళల్లోకి వెళ్లి అక్కడివారిని పలకరించారు.
హైదరాబాదుకి తిరిగి వస్తుంటే మరో అనుకోని అవకాశం. ఎప్పుడూ వినడమే కాని కనని ప్రదేశం. కేసీఆర్ ఫాం హౌస్. లోపలకు వెడుతుంటే బాటకు రెండు వైపులా పున్నాగ చెట్లు. అవతల విశాలమైన భూముల్లో రకరకాల పళ్ళ తోటలు, కూరగాయల పాదులు. ఇన్నాళ్ళు ఫాం హౌస్  అంటే ఒక అభిప్రాయం వుండేది. తీరా చూసిన తరువాత అటువంటివి ప్రతి పల్లెలోనూ వుంటాయి అనిపించింది. రెండంతస్తులు. ఒక పక్కగా మెట్లు. అవి చాలా సాదా సీదాగా వువ్నాయి. లిఫ్ట్  లేదు. కేసీఆర్ బస రెండో అంతస్తులో. మొదటి దాంట్లో డైనింగ్ హాలు. అదీ చాలా సింపుల్ గా వుంది.  ఆయన కూర్చునే కుర్చీ మీద ఒక యెర్ర తువ్వాలు వేసి వుంది. అక్కడే టిఫిన్లు చేశాము. అదొక అన్నసత్రంలా వుంది. ఎవరు వచ్చి తిన్నా అడిగేవారు లేరు, పెట్టేవాళ్ళే తప్ప.  
ఇక డబల్ బెడ్ రూమ్  పధకం సంగతి. రాగానే ముందు వ్యాసం రాసి బ్లాగులో పోస్ట్ చేశాను. పధకం లాగానే పెద్దది కదా! అందుకని లింక్ మాత్రం ఇస్తున్నాను.
http://bhandarusrinivasarao.blogspot.in/2016/12/blog-post_43.html


కేసీఆర్ కర్తృత్వంలో పేదవాడి గృహప్రవేశం


  
  
మార్గశిర మాసం, కృష్ణ పక్షం, దశమి, శుక్రవారం.
తెలంగాణలో కొత్త బంగారు లోకం ఆవిష్కృతమైంది. నివేశన స్థలం, పూరి పాక, పక్కా ఇల్లు ఇలా కాలానుగుణంగా రూపాలు మార్చుకుంటూ వస్తున్న పేదవారి ఇల్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని సంపన్నులు సయితం అసూయపడేరీతిలో రెండు పడక గదుల గృహంగా రూపాంతరం చెందింది. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలు సామూహిక గృహప్రవేశాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వర్ణ శోభిత తెలంగాణాను కళ్ళముందు నిలిపాయి.



విలేకరిగా ఉత్సాహం కొద్దీ ముహూర్త సమయానికి  ఎర్రవల్లి  వెళ్లాను. ఈరోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు  ముఖ్యంగా ముఖ్యమంత్రి పాల్గొనే సభలు, సమావేశాలు అంటే ఆ హంగూ, ఆ ఆర్భాటమే వేరు. నిజానికి డబల్ బెడ్ రూమ్ పధకం కేసీఆర్ ప్రాధాన్యతా పధకాల్లో ఒకటి. అయినా సభ చాలా చాలా నిరాడంబరంగా జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఏర్పాట్లు ఏవీ లేవు. లోగడ కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఇంతే. హడావిడి తక్కువ. బహుశా ఇది కేసీఆర్ స్పెషాలిటీ కాబోలు. ఆయన వేదిక దిగి వస్తుంటే చిన్న సందు వంటి దారిలో నేనూ, జ్వాలా నిలబడి ఉన్నాము. మంత్రులతో పాటు నడిచివస్తున్న ముఖ్యమంత్రికి  జ్వాలా నన్ను పలానా అని   పరిచయం చేసారు. ‘ఆయన తెలియకపోవడం ఏమిటి’ , అంటూనే  నాతొ కరచాలనం చేసిన  తరువాతనే కేసీఆర్ ముందుకు కదిలారు.  
పునర్నిర్మించిన  నరసన్నపేట గ్రామంలో నాలుగు వీధులు కాలినడకన  కలయ తిరిగారు.  ఇళ్ళల్లోకి వెళ్లి అక్కడివారిని పలకరించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం విభిన్నంగా జరిగింది. ఎవరి మత విశ్వాసాలకు, సాంప్రదాయాలకు  అనుగుణంగా గ్రామస్తులు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు  ప్రవేశించారు. ఇల్లంటే ఇలా వుండాలి అని  కలిగిన వాళ్ళు కూడా అబ్బురపడేలా ఆ గృహాలకు  రూపకల్పన చేసారు. ఇక వూరి సంగతి చెప్పక్కర లేదు. వీధులకు ఇరువైపులా ఒకే నమూనా కలిగిన ఇళ్ళు. సిమెంటు రోడ్లు, మురికి నీరు పోయేలా రోడ్లపక్కన కాలువలు, పచ్చని మొక్కలు, వీధి దీపాలు, ఇంటింటికీ నల్లాలు, ఇంకుడు గుంటలు, ఇంటర్  నెట్ సేవలు,  కళ్యాణ మండపం ఒకటేమిటి ఒక వూరికి ఉండాల్సిన సౌకర్యాలు సమస్తం ఈ ఊళ్లకు అమర్చి పెట్టారు. కొంతకాలం క్రితం ఇదే ఊళ్లలో పాత ఇళ్ళను పడగొడుతున్నప్పుడు, ‘ఇదంతా జరిగేదేనా’ అని నిరాశతో  నోళ్ళు నొక్కుకున్నవాళ్ళ నోళ్ళు, కళ్ళెదుట జరిగిన  ఈ గ్రామ  పునర్నిర్మాణాన్నిచూసిన తరువాత మూతబడి వుంటాయి.
వందల మంది పేదల కళ్ళల్లో ఆనందం నింపిన కేసీఆర్ నిజంగా ధన్యజీవి. ప్రజలు అప్పగించిన అధికారాన్ని, తిరిగి ఆ ప్రజల మేలుకే ఉపయోగించడం ఎలాగన్నది ఆయన చేసి చూపెట్టారు.
ఒక  హడావిడి లేదు, అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించింది లేదు. అయినా అనుకున్న పనిని, అనుకున్న వ్యవధిలో పూర్తిచేసి, శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభోత్సవం జరిపి, నిబద్దతత వుంటే మనిషికి అసాధ్యం లేదని నిరూపించారు. పేదవాడి సొంత ఇంటి కలని నిజం చేసి చూపించారు.
నిరుడు హైదరాబాదులో ఐ.డి.హెచ్. కాలనీలో తొలి అడుగు పడింది. మళ్ళీ ఏడాది తిరిగేలోగా నరసన్నపేట, ఎర్రవల్లి గ్రామాల్లో  మలి అడుగు పడింది. తడబడకుండా వడివడిగా అడుగులు వేస్తూ ఈ పధకాన్ని మొత్తం తెలంగాణా అంతటా విస్తరింపగలిగితే, యావత్ భారతానికి ఈ పధకం ఆదర్శంగా నిలుస్తుంది.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమాలను ఒక విలేకరిగా నేను గమనిస్తూ వచ్చాను. అరకొరగా కాకుండా పూర్తి స్థాయిలో, ప్రజల అవసరాలకు తగిన విధంగా పక్కా గృహాల నిర్మాణం జరిగింది మాత్రం ఇదే తొలిసారి.   
సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనే కోరికే ఆదిమ మానవుడిని జనవాసాల నాగరిక జీవనం వైపుగా మళ్ళించింది. లేనిపక్షంలో పొదలు, గుహలకే మనిషి జీవితం పరిమితమై వుండేది.
సొంతిల్లు అనే కల కనని మనుషులు వుండరు. ఇల్లు అనేది నివసించడానికే కాదు మరణించడానికి కూడా అవసరం అని నమ్మే వాళ్ళు వున్నారు. ఒక ఇంటివాళ్ళు కావాలనే కోరిక పెంచుకునే విషయంలో  వున్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా లేదు. కలిగిన వాళ్ళు తమ విభవం కొద్దీ ఒకటికి మించిన ఇళ్ళుకట్టుకుంటే, లేనివాళ్ళు కనీసం ఒక్క ఇల్లుఅన్నా సొంతం అవుతే బాగుండని కోరుకుంటారు. ఇదేమీ తీరని కోరిక  కాకపోయినా అంత తేలిగ్గా సాధ్యం అయ్యే విషయం కూడా కాదు. అందుకే ఇల్లంటే అందరికీ అంతటి మక్కువ.
అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో అత్యధికులు ఇళ్లు లేనివాళ్ళే. తల దాచుకోవడానికి కొందరు అద్దె కొంపల్ని నమ్ముకుంటే అసలా మాత్రం గూడు లేనివాళ్ళు కూడా పుష్కలంగానే వున్నారు.
మన దేశంలో పేదలకోసం ఏటా లక్షల సంఖ్యలో ఇళ్ళు నిర్మిస్తున్నామని మన రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తుంటే విని అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళు  నోళ్ళు వెళ్ళబెట్టడానికి కారణం వుంది. మన దగ్గర పేదవాడి ఇల్లు అంటే నాలుగు మట్టి గోడలు, పైన తాటాకు కప్పిన పూరి పాక.  కానీ  అభివృద్ధి చెందిన దేశాల్లో ఇల్లుఅంటే ఆ  లెక్క వేరు.
బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు  టి. అంజయ్య.
రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన  ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి  విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.
పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశనస్థలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, ఇళ్ళ స్థలాలకు   ఈనాడు వున్న ధరలు లేని ఆ పాత  రోజుల్లో కూడా పేదలకు  నివేశన స్థలాలు  అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు  స్థలాలను  పేదవారికి ఇళ్ళ స్థలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ  స్థలాల కేటాయింపు అనేది అదనపు పెద్దరికాన్ని కట్టబెట్టింది. కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత పక్కాగా అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో పక్కా ఇళ్ళ పధకం అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రధానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈనాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు, లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత కొన్నేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి తిలాపాపం తలా పిడికెడు చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.
దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండినవాడు, కడుపు మండినవాడు అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే సిసలయిన  పాలకుల అసలయిన కర్తవ్యం.

ఈ నేపధ్యంలోనే  తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఎన్నికల వాగ్దానాల అంబుల పొదిలోని ఒక ప్రధాన అస్త్రానికి పదునుపెట్టి ప్రదర్శించారు. బడుగులకో గూడు ఏర్పాటు చేయాలనే సదుద్దేశ్యంతో కేసీఆర్ రెండు పడకల ఇంటి పధకానికి తొలి రూపం ఇచ్చారు. హైదరాబాదులోని ఐ.డీ.హెచ్. కాలనీలో తానే శంకుస్థాపన చేసిన 396 రెండు పడక గదుల  ఇళ్ళ కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి తిరిగి తన చేతుల మీదుగానే ప్రారంభించి, బలహీన వర్గాల గృహ నిర్మాణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీసారు. అంతకుముందే  నిర్మాణదశలో కాలనీని  సందర్శించిన గవర్నర్ నరసింహన్, ఆ ఇళ్ళను చూసి ముచ్చట పడ్డ విషయం గమనార్హం.
అయితే ఇంతటితో ప్రభుత్వం బాధ్యత తీరిపోలేదు, సరికదా మరింత పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసినా తెలంగాణా కొత్త రాష్ట్రంలో ఇంటి వసతి లేని పేదల సంఖ్య లక్షల్లో వుంది. రెండు పడక గదుల ఇళ్ళు ఏటా అరవై వేలు కట్టాలన్నది ప్రభుత్వ యోచన.  ఈలెక్కన లక్షల ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు పూర్తికావాలి?
నిజానికి కార్యక్రమం ప్రభుత్వానికి అలవికి మించిన భారం. సందేహం లేదు. అయినా ఇచ్చిన మాట ప్రకారం వందల సంఖ్యలో అయినా కొన్నింటిని  ప్రభుత్వం నిర్మించి చూపెట్టి, తన మాటలు నీటి మూటలు కావని నిరూపించుకుంది. కేంద్రం కూడా విషయంలో ఇతోధిక సాయం అందిస్తే క్రతువు జయప్రదం అవుతుంది. విదేశాల్లో స్థిరపడ్డ రాష్ట్ర వాసులు కూడా తమవంతు సాయం చేస్తే  తమ జన్మ భూమి ఋణం కొంత తీర్చుకోగలుగుతారు. ఏదిఏమైనా, ఎన్ని అడ్డంకులు ఎదురయినా నిబ్బరంగా నిలబడి పూర్తి చేయాల్సిన పవిత్ర కార్యక్రమం ఇది. జరిగి తీరాలని అందరం కోరుకుందాం. 
మొత్తం మీద మొదటి అడుగులు పడ్డాయి. కేసీఆర్ తన సొంత ఇంటి పండుగలా ఈ పేదల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తిచేసారు. ఈ పేదల గృహ ప్రవేశ పధకాన్ని ఎలాటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళగలిగితే, రెండు రూపాయల బియ్యం అనగానే జనాలకు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చినట్టు, రెండు పడక గదుల ఇల్లు అనగానే తటాలున గుర్తు వచ్చేది కేసీఆర్ పేరే అవుతుంది.
ఉపశృతి: హైదరాబాదుకి తిరిగి వస్తుంటే మరో అనుకోని అవకాశం. ఎప్పుడూ వినడమే కాని కనని ప్రదేశం. కేసీఆర్ ఫాం హౌస్. లోపలకు వెడుతుంటే బాటకు రెండు వైపులా పున్నాగ చెట్లు. అవతల విశాలమైన భూముల్లో రకరకాల పళ్ళ తోటలు, కూరగాయల పాదులు. ఇన్నాళ్ళు ఫాం హౌస్  అంటే ఒక అభిప్రాయం వుండేది. తీరా చూసిన తరువాత అటువంటివి ప్రతి పల్లెలోనూ వుంటాయి అనిపించింది. రెండంతస్తుల భవంతి. ఒక పక్కగా మెట్లు. అవి చాలా సాదా సీదాగా వువ్నాయి. లిఫ్ట్  లేదు. కేసీఆర్ బస రెండో అంతస్తులో. మొదటి దాంట్లో డైనింగ్ హాలు. అదీ చాలా సింపుల్ గా వుంది.  ఆయన కూర్చునే కుర్చీ మీద ఒక యెర్ర తువ్వాలు వేసి వుంది. సీఎం పీఆర్వో విజయకుమార్ పూనికపై   అక్కడే టిఫిన్లు చేశాము. అదొక అన్నసత్రంలా వుంది. ఎవరు వచ్చి తిన్నా అడిగేవారు లేరు, పెట్టేవాళ్ళే తప్ప.
ఇదీ కేసీఆర్ స్పెషాలిటీ అనే చెప్పుకుంటారు.
              
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  


21, డిసెంబర్ 2016, బుధవారం

ఇంటి పేరు మళ్ళీ మారుతోందా!


ఆంధ్రజ్యోతిలో భండారు శ్రీనివాసరావు,  ఆలిండియా రేడియోలో జీవన స్రవంతి శ్రీనివాసరావు, పెద్ద పత్రికల పిల్ల పత్రికల్లో కంట్రిబ్యూటర్ల పుణ్యమా అని బండారు శ్రీనివాసరావు ఇలా ఇంటి పేరు మారుతూ వచ్చింది.

ఈరోజు ఓ పెళ్ళికి వెళ్ళాము. ముప్పయ్యేళ్ళ రేడియో సర్వీసు ఎటు పోయిందో ఏమో, ఫేస్ బుక్ రాతలే పెద్ద పీట   వేసుక్కూర్చునాయల్లే వుంది. కనిపించివాళ్ళ పలకరింపులన్నీ ఆ పేరు మీదే. ఆ  ఖాతాలోనే. 

20, డిసెంబర్ 2016, మంగళవారం

మౌనమె మనమాట ఓ మూగవదనా!



దేవుడు, కులం, మతం ఈ  మూడూ వ్యక్తిగతం. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి అభిమానాలు వారివి. అవి పెదవీ, గడపా  దాటకుండా వుంటేనే మేలు.  వాటిపై చర్చల వల్ల సత్ఫలితాలు వుండకపోగా సమాజ వాతావరణం కలుషితమవుతుంది. జనాలు మాట్లాడుకునే విషయాలు, చర్చించుకోవాల్సిన అంశాలు  ఈ ప్రపంచంలో ఇంకా అనేకం వున్నాయి. అలా అని మౌనంగా ఉండమని కాదు చెప్పేది.  ‘మౌనాన్ని’ భంగపరిచేదిగా లేకుండావుంటే  చాలు.  

‘రాయి’నైనా కాకపోతిని.....


ఏదో సినిమాలో నటుడు నాగభూషణాన్ని ఎవరో అడుగుతారు ‘మీరేం చేస్తుంటార’ని. ఆ పాత్రలో నాగభూషణం చెప్పిన జవాబు. “దానధర్మాలు చేస్తుంటాను” ఆయనకి అది తప్ప మరోటి చేతకాదు.
“ఏమిటి మీరిలా రాస్తూనే వుంటారు” కొందరు మిత్రులు నన్ను ఆరా తీస్తుంటారు. నాదీ అదే పరిస్తితి.

“రాయడం తప్ప నాకు ఇంకోటి చేతకాదు”

19, డిసెంబర్ 2016, సోమవారం

తేనె దొరికేది తిరిగే తుమ్మెదకే!

భలేమంచి చౌక ......
ఆరు ఖండాలు...ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా.
పద్నాలుగు దేశాలు....నేపాల్, భూటాన్, ఇరాన్, చైనా, స్వీడన్, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, స్కాట్ లాండ్, మెక్సికో, బ్రెజిల్, నైజీరియా, తాస్మానియా...
ఇవన్నీ కేవలం రెండువందల యాభయ్ రూపాయలకే. పాస్ పోర్టులు, వీసాలు అక్కరలేదు.
ఎలాగంటారా?

అలుపెరుగని యాత్రిక రచయిత ఎం. ఆదినారాయణ రాసిన ‘భూ భ్రమణ కాంక్ష’ చదివి చూడండి.



Image may contain: 1 person

18, డిసెంబర్ 2016, ఆదివారం

నీది, నాది, మనది

“స్వామీ ! ఒక ధర్మ సందేహం”
“సంశయించకుండా అడుగు నాయనా!”
“ప్రతిదీ నాది నాది అనుకుంటాం. దీని నుంచి బయటపడే మార్గం లేదా?”
“ఒక చిన్న కధ చెబుతాను. విన్న తరువాత సందేహం వుంటే అడుగు.
“అనగనగా ఒక ఏకాంబరం. ఒకరొజూ పొరుగూరికి వెళ్లి తిరిగొచ్చేసరికి వున్నఇల్లు మంటల్లో తగలబడిపోతోంది. వూరి జనమంతా చేరి చోద్యం చూస్తున్నారు.
ఏకాంబరం గుండె పగిలిపోయింది. తాతలకాలం నాటి ఇల్లు, కళ్ళఎదుటే పరశురామ ప్రీతి అయిపోతోంది. ఎలా! ఎలా! మనసులో ఒకటే బాధ. ఏం చెయ్యలేని నిస్సహాయత. నిన్ననే ఇంటికి బేరం తగిలింది. అసలు ధరకంటే ఎక్కువే ఇవ్వచూపాడు. కానీ ఇంటి మీద మమకారంతో ఏకాంబరం ఒప్పుకోలేదు.
ఇంతలో అతడి పెద్దపిల్లాడు వచ్చాడు. తండ్రి చెవిలో చెప్పాడు.
“మీరు ఊరెళ్ళినప్పుడు అతగాడు మళ్ళీ వచ్చాడు. ఇంకా ఎక్కువకే కొంటానని మాటతో పాటు చాలా మొత్తం బయానాగా ఇచ్చాడు. బేరం బాగా వుండడం వల్ల మీకు చెప్పకుండానే ఒప్పుకున్నాను”
ఈ మాట చెవినపడగానే ఏకాంబరం మనసు స్తిమిత పడింది. ‘అమ్మయ్య ఇప్పుడు ఇల్లు తనది కాదు. ఈ భానన కలగగానే అతడూ చోద్యం చూస్తున్న వారిలో ఒకడిగా మారిపోయాడు. ఇల్లు అగ్నికి ఆహుతి అవుతోందన్న ఆందోళన సమసిపోయింది.
ఇలా ఉండగానే రెండో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రితో అన్నాడు.
“ఒక పక్క మన ఇల్లు తగలబడి పోతుంటే మీరేంటి, ఇలా నిర్వికారంగా చూస్తూ నిలబడ్డారు?”
తండ్రి జవాబు చెప్పాడు. 'ఇంకెక్కడ మన ఇల్లు. మీ అన్నయ్య నిన్ననే ఎవరికో అమ్మేశాడు”
“భలే వారే ! అతడు మనకు బయానా మాత్రమే ఇచ్చాడు, పూర్తి పైకం ఇవ్వలేదు”
ఏకాంబరానికి మళ్ళీ దిగులు పట్టుకుంది. కొంతసేపటి క్రితం వరకు వున్న మనాది మళ్ళీ పట్టుకుంది.
“అయ్యో! తగలబడుతోంది నా ఇల్లే” అనే స్పృహ తిరిగి ఆవరించింది.
ఇంతలో మూడో కుమారుడు వచ్చి మరో మాట చెప్పాడు.
“చూశావా నాన్నా మన ఇల్లు కొన్నవాడు యెంత మంచివాడో! ఈ ప్రమాదం రేపు జరిగి వుంటే ఏమయ్యేది. ఇలా జరుగుతుందని మీకూ తెలియదు, నాకూ తెలియదు.  అంచేత మీ నాన్నను బాధపడవద్దని చెప్పు. ఆ ఇల్లు నాదే. మాట ప్రకారం డబ్బు మొత్తం ఇచ్చేస్తానని అన్నాడు"
మళ్ళీ సీను రివర్సు.
అంటే. ఆ ఇల్లు తనది కాదు. ఈ భావన అంకురించడంతో మళ్ళీ అతడూ నలుగురిలో ఒకడిగా  మారిపోయాడు.
నిజానికి ఏదీ మారలేదు. మారింది అల్లా తనదీ, పరాయిదీ అనే భావన ఒక్కటే”   

 (ఇంగ్లీష్ కధనానికి స్వేఛ్చానువాదం)