30, సెప్టెంబర్ 2015, బుధవారం

ఫలప్రదమైన ప్రధాని మోడీ అమెరికా పర్యటన

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 01-10-2015, THURSDAY)

ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయిల్లోని ప్రముఖులు జరిపే విదేశీ పర్యటనలు ఫలప్రదం కాకపోవడం అంటూ వుండదు. అయితే గతంతో పోల్చి చూసుకున్నప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపిన అమెరికా పర్యటన అనేక విధాలుగా ప్రత్యేకతలను, విశిష్టితలను కలిగివుందని గట్టిగా చెప్పవచ్చు. మోడీ పర్యటనకు మీడియాలో వచ్చిన ప్రచార ఉధృతి ఇందుకు నిదర్శనం. ఇది చివరకు ఏ స్థాయికి పోయిందంటే అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన ఒక అపూర్వ ప్రయోగం కూడా మోడీ పర్యటన ప్రచార ప్రభంజనంలో మరుగున పడిపోయింది. ‘భవిష్యత్ మొత్తం మా దేశానిదే. భారత దేశానికి రండి, మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి’  అని అమెరికాలో భారత ప్రధానమంత్రి అక్కడి పారిశ్రామిక వేత్తలను అర్ధిస్తున్న సమయంలోనే, ఇక్కడ స్వదేశంలో అదే అమెరికాకు చెందిన కొన్ని ఉపగ్రహాలను, మన రోదసీ శాస్త్రవేత్తలు, పూర్తిగా  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌకలో నిర్దేశిత కక్ష్యకు జయప్రదంగా చేర్చి, ప్రపంచంలో ఈ పాటవం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత దేశాన్ని చేర్చి మన దేశానికి అఖండ ఖ్యాతిని కట్టబెట్టారు.


ఒకప్పుడు మోడీని తమ దేశంలోకి అడుగు పెట్టనివ్వమని భీష్మించిన  అమెరికా ప్రభుత్వం  అదే మోడీ మహాశయులను సాదరంగానే కాదు సగౌరవంగా యెర్ర తివాచీ పరిచి స్వాగతం పలికింది. పైగా ఇది మొదటిసారి కూడా కాదు. ప్రధాని కాగానే మోడీ మొదటి సారి వెళ్ళినప్పుడు కూడా ఆ అగ్రదేశం ఇదే రీతిలో వ్యవహరించింది. ఆ దేశపు ఆర్ధిక రంగం అభ్యున్నతిలో భారత దేశం నుంచి వెళ్ళిన యువ మేధావుల, సాంకేతిక నిపుణుల పాత్ర ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకున్న పాలకులు కాబట్టి భారత ప్రధానికి ఆ గౌరవం ఇవ్వక తప్పని పరిస్తితి. ఏడాది కాలంలోనే మోడీ ఆ అగ్రరాజ్యం అధినేత ఒబామాతో మూడు పర్యాయాలు భేటీ కావడం ఈ వాస్తవానికి అద్దం పడుతోంది.
విదేశీ పర్యటనలలో వేషభాషలకు మోడీ ఇస్తున్న ప్రాధాన్యం ఇటు స్వదేశంలో విమర్శలకు దారి తీయడంతో ఈసారి అమెరికా పర్యటనలో రూటు  మార్చి ‘తన చాయ్ వాలా గతాన్ని’ అక్కడి జనాలకు గుర్తుచేసే ప్రయత్నం గట్టిగానే చేసినట్టు కానవస్తోంది. ఎక్కడ ఏ పదాన్ని విరిచి చెప్పాలో, ఎక్కడ ఏ భావాన్ని అందరికీ అర్ధం అయ్యేలా పలికించాలో, స్వరాన్ని ఎక్కడ పెంచాలో, గొంతును ఎక్కడ తగ్గించాలో పూర్తిగా ఆపోసన పట్టిన రాజకీయ వేత్త కావడం వల్ల, అమెరికాలో మోడీ చేసిన ప్రసంగాలకు అపూర్వ ప్రతిస్పందన అమోఘంగా లభించింది. అయితే, సభికుల నుంచి హర్ష ధ్వానాల రూపంలో లభిస్తున్న ఆదరణ మైకంలో పడిన మోడీ, కొన్ని దేశ ప్రతిష్టకు పొసగని కొన్ని అంశాలను తన ప్రసంగాలలో ప్రస్తావించి, స్వదేశంలో కొన్ని రాజకీయ విమర్శలను మూటగట్టుకున్నారు. గత విదేశీ పర్యటనలలో సయితం ఇదే రకం  విమర్శలను మోడీ ఎదుర్కున్నారు. విదేశీ సభలు, సమావేశాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రసంగాలు చేయడం అన్నది భారత ప్రధానులకు నియమం కాకపోయినా ఒక ఆనవాయితీ. స్వదేశంలో రాజకీయాలు ఎలా వున్నా, అక్కడ  ఎటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ, విదేశీ గడ్డపై ఒకింత సంయమనం పాటించడం అనేది  ఆ ఆనవాయితీ. మోడీ ఈ రివాజును కావాలనే ఉల్లంఘించి గత ప్రభుత్వాల వైఫల్యాలను విదేశీ ప్రసంగాలలో జొప్పిస్తున్నారన్నది ఆయన రాజకీయ ప్రత్యర్దుల అభియోగం. నిజానికి ఇలా ప్రసంగాలు చేయడం మంచి సంప్రదాయం కాదు.  విదేశాలకు అధికార పర్యటనపై వెళ్ళినప్పుడు భారత ప్రధాని అనే వ్యక్తి యావత్ దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాని,  ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిగా కాదు. ఆయన చేసే ప్రతి ప్రసంగం భారత ప్రతినిధిగానే సాగడం మర్యాదగా వుంటుంది. అందుకే కాబోలు ఆ స్థాయి నాయకులు, ముందుగా తయారు చేసి సిద్ధంగా వుంచుకున్న ప్రసంగపాఠం చదవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.   అయితే ప్రసంగాలలో ఘనాపాటి అనిపించుకుంటున్న నరేంద్ర మోడీకి పాఠం ఒప్పచెప్పినట్టు, ఇలా రాసుకున్న ప్రతిని చదవడం రుచించక పోవచ్చు. అలా అని గత పాలకులను, వారి పరిపాలనను కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదనే చెప్పాలి. సరే! ఇదేమంత పెద్ద విషయం కాదు. సరిచేసుకోదగ్గ సంగతే.
పొతే, నరేంద్ర మోడీ ఈ సారి జరిపిన అమెరికా పర్యటన కాలాన్ని సాధ్యమైనంత సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నించారు. భద్రతా మండలిలో భారత సభ్యత్వం అంశాన్ని సభ్యదేశాలకు మరోమారు గట్టిగా నొక్కి  చెప్పారు. అమెరికాకు చెందిన కార్పోరేట్ దిగ్గజాలతో, గూగుల్, మైక్రో సాఫ్ట్, ఫేస్ బుక్, ఆపిల్  మొదలయిన సిలికాన్ వ్యాలీ  అధినేతలతో సమావేశాలు జరిపారు. గత ముప్పయి ఏళ్లలో  అనేకమంది భారత ప్రధానులు అమెరికాలో అధికార పర్యటనలు జరిపారు. కానీ, సిలికాన్ వ్యాలీ సందర్శించి, భారత్ లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి అక్కడివారికి తెలియచేయడానికి ప్రయత్నించిన మొదటి ప్రధాని మోడీనే కావడం విశేషం. అంతే కాదు ‘ఫార్ట్యూన్ – 500’ జాబితాలో వున్న నలభయ్ రెండు కంపెనీల సీ.ఈ.ఓ. ల సమావేశంలో మోడీ ప్రసంగించారు. ‘భారత దేశం అంటే రెడ్ టేపిజం కాదనీ, రెడ్ కార్పెట్’ అనీ తనదయిన శైలిలో మోడీ చేసిన చమత్కార ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుందని మీడియా అభివర్ణించింది. ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆ సంస్థ అధినేత జుకర్ బర్గ్ తో ప్రధానమంత్రి మోడీ జరిపిన సమావేశం ప్రపంచవ్యాప్త ప్రచారానికి నోచుకుంది. సాంకేతిక విద్యార్హతలు ఏవీ లేకపోయినా, నూతన సాంకేతిక అంశాల పట్ల ఆ వయస్సులో నరేంద్ర మోడీ  కనబరుస్తున్న ఆసక్తి బహుశా వారిని బాగా ఆకట్టుకుని వుంటుంది.
భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ గత కొద్ది కాలంలోనే రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు చేసారు. ఆయన చేసిన పర్యటనల ఫలితాలకంటే, ఆ పర్యటనల తీరు తెన్నులపై మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడిన వ్యాఖ్యలు, కార్టూన్లు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. గతంలో  మోడీ విదేశ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగి వస్తున్నప్పుడు, ‘ప్రధాని మోడీ స్వల్ప కాలిక పర్యటనపై రేపు భారతదేశం వస్తున్నారని’ సోషల్ మీడియాలో  ఒక వ్యాఖ్య వచ్చింది. ఇటువంటివి ప్రచారంలో వుండడం  ఆ ఆస్థాయిలో వున్న  వ్యక్తులకు శోభస్కరం కాదు.
ఏది ఏమైనా అమెరికాలో నివసిస్తున్న అశేష భారతీయులు, వారి వారి రాష్ట్రాలతో, భాషలతో, రాజకీయాలతో నిమిత్తం లేకుండా మోడీ అమెరికాలో జరిపిన పర్యటనని చక్కగా  స్వాగతించారు. అయన చేసిన ప్రతి ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఈ విధంగా మోడీ అక్కడి భారతీయుల మనస్సులను ఆకట్టుకోగలిగారు. ఈ కోణం నుంచి మోడీ పర్యటన అనుకున్న దానికన్నా విజయవంతం అయిందనే చెప్పుకోవాలి. (30-09-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 
NOTE: Courtesy Image Owner                                                  

కామెంట్‌లు లేవు: