13, సెప్టెంబర్ 2015, ఆదివారం

పెళ్లి పుస్తకం


రాత్రి ఏదో ఛానల్లో పెళ్లి పుస్తకం అనే  ప్రోగ్రాం వస్తోంది. అది చూస్తుంటే రెండు పాత జ్ఞాపకకాలు మదిలో మెదిలాయి.


చాలా ఏళ్ళ క్రితం అంటే బోలెడు బోలెడు సంవత్సరాల కిందటి సంగతి. అప్పుడు నేను స్కూల్లో చదువుకునే రోజులు. ఇల్లస్త్రేటేడ్ వీక్లీ అనే ఒక ఇంగ్లీష్ మేగజైన్ వచ్చేది. అందులో దక్షిణాదిలో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు అనే అంశంపై   ఫోటో ఫీచరు రాయడానికి ముంబై నుంచో ఢిల్లీ నుంచో ఒక తెలుగు తెలియని జర్నలిస్టు వచ్చాడు. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు  ఆ రోజుల్లో  సమాచార శాఖ అధికారిగా పనిచేస్తుండేవారు. ఆయన్ని ఆ జర్నలిస్టు వచ్చి కలిసి తాను  వచ్చిన పని చెప్పాడు. అంతకు కొద్ది రోజుల క్రితమే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పెళ్లి ఘనంగా జరిగింది. ఇల్లస్త్రేటేడ్ వీక్లీ సంగతి వినగానే ఆయన యెగిరి గంతేసి ఆ పత్రిక కోసం మొత్తం పెళ్లి తంతు తిరిగి ఏర్పాటు చేశాడు. ఆ వచ్చిన  జర్నలిస్టు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పట్లా ఇలా రాయడం అలా అచ్చు వేయడం కాదుకదా అప్పట్లో.  మొత్తం మీద ఎన్నో నెలలు కళ్ళు కాయలు కాసేలా  ఎదురు చూసిన తరువాత ఆ  ‘మళ్ళీ పెళ్లి’ ఫోటోలు ఎంచక్కా రంగు రంగుల్లో ఆ ఇంగ్లీష్ పత్రికలో వచ్చాయి. అప్పుడు చూడాలి అయన సంతోషం. బెజవాడ రైల్వే స్టేషన్ లో హిగ్గింబాదం బుక్ స్టాల్ లో వున్న ఆ పత్రిక ప్రతులన్నీ కొనేసి చుట్టపక్కాలకి పంచి పెట్టాడు. ఇప్పుడు ఆ కాపీ  ఒక్కటి దొరికితే ఒట్టు.
ఇక రెండో జ్ఞాపకం. తలచుకుంటే జాలేస్తుంది.
ప్రైవేటు టీవీ ఛానళ్ళు ఒకటీ అరా మెల్లమెల్లగా రంగ ప్రవేశం చేస్తున్న రోజులు. ఒక ఛానల్ వాళ్ళు  ఇలానే పెళ్లి పుస్తకం అనో ఇంకోటనో ఏదో పేరుతొ ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళు. సెలెబ్రెటీలను దంపతయుక్తంగా స్టూడియోకు పిల్చి వాళ్ళ అనుబంధాలను అనుభవాలను గుచ్చిగుచ్చి అడిగి మరీ రికార్డు చేసేవాళ్ళు. అందులో పాల్గొనేవాళ్లు కూడా ఈ జన్మకే కాదు వచ్చే ఏడేడు జన్మల్లో కూడా మళ్ళీ భార్యాభర్తలుగానే పుట్టాలని వుందని ఆ టీవీ ఛానల్ సాక్షిగా నొక్కివక్కాణించేవారు. ఆ క్రమంలో కొత్తగా ఎమ్మెల్యే గా ఎన్నికయిన ఒక మహిళను, ఆమె భర్తను స్టూడియోలో కూర్చోబెట్టి ఓ అరగంట ఇంటర్య్వూ చేసారు. చేయడం అయతే చేసారు కానీ ప్రసారం చేయడానికి కొన్ని నెలలు వ్యవధానం పట్టింది. తీరా అది ప్రసారం అయ్యేనాటికి వాళ్ళు విడాకులు కూడా తీసేసుకున్నారు.  ‘ఎన్ని జన్మలెత్తినా మేము భార్యాభార్తలమే’ అని వాళ్ళు  ఉద్ఘాటిస్తున్న దృశ్యాలు మాత్రం పదే పదే ప్రసారం చేసిన ఆ కార్యక్రమాన్ని చూసిన వారికి మంచి కాలక్షేపం కలిగించాయి.
టీవీని ఇడియట్ బాక్స్ అంటాం కానీ అప్పుడప్పుడూ అందులో ఇలాటి ఉచిత వినోదం పుష్కలంగా లభిస్తుంది.              

కామెంట్‌లు లేవు: