యమధర్మరాజు మహిష వాహనం ఎక్కి యమపాశం చేతబట్టి భూలోకం బయలుదేరాడు.
కాలం తీరిన మనుషుల ప్రాణాలు పట్టి యమలోకానికి చేర్చడానికి తన కొలువులో ఎంతోమంది యమభటులు వున్నప్పటికీ యముడే స్వయంగా భూలోక యాత్ర పెట్టుకోవడానికి ఓ కారణం వుంది.
నరలోకంలో ఓ నరుడు శాస్త్ర పరిశోధనలు చేస్తూ చేస్తూ ఒక ప్రయోగంలో గణనీయమైన విజయం సాధించాడు. మనుషులను పోలిన మనుషులను సృష్టించే ఒక ఫార్ములాను కనుగొన్నాడు. అచ్చం తన మాదిరిగా వుండే మరో డజను మంది శాస్త్రవేత్తలను ఆ ఫార్ములా సాయంతో తయారుచేసాడు.
కానీ ఈ లోగా ఆ శాస్త్రవేత్తకు భూమిమీద నూకలు చెల్లే తరుణం ఆసన్నం కావడంతో అతడిని కొనిపోవడానికి నరకం నుంచి యమభటులు వచ్చారు. ఆ వచ్చిన యమ భటులకు ఆ పదముగ్గురిలో అసలు శాస్త్ర వేత్త ఎవరన్నది అర్ధం కాలేదు. కనుముక్కు తీరులో కానీ, మాట వరుసలో కానీ, నడకలో కానీ ఆ పదమూడుమంది అచ్చంగా ఒకే రకంగా వుండడంతో కాసేపు గుంజాటనపడి ఎటు తేల్చుకోలేక వారు నరకానికి తిరిగి వెళ్ళిపోయి తమ ప్రభువుతో విషయం విన్నవించుకున్నారు.
యమధర్మరాజు స్వయంగా పాశం పట్టుకుని భూలోకం రావడానికి ఇదీ నేపధ్యం.
తీరా వచ్చిన తరువాత కానీ తన భటులు పడ్డ అవస్థ ఆయనకు అర్ధం కాలేదు. వాళ్లు చెప్పినట్టు ఆ పదమూడుమందిలో అసలు శాస్త్రవేత్త ఎవరన్నది గుర్తుపట్టడం అతి కష్టం అని ఆయనకు కూడా తొందరగానే అర్ధం అయిపోయింది. కానీ సమవర్తి తన వోటమిని అంత తేలిగ్గా యెలా వొప్పుకుంటాడు చెప్పండి?
అప్పుడాయన ఏం చేశాడన్నదే ఈ చిన్న కధకు క్లైమాక్స్.
తన ఎదుట కనబడుతున్న పదముగ్గురిలో ఒకడే తనకు కావలసిన వాడు. ఆ ఒక్కడినీ కనిపెట్టడం యెలా! అందుకని వారందరినీ వుద్దేశించి ఇలా అన్నాడు.
“అయ్యా శాస్త్రవేత్త గారు. మీ మేధస్సు అమోఘం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మీ తెలివితేటలకు నా జోహారు. ఇటువంటి మేధావిని నా ఇన్ని కోట్ల సంవత్సరాల సర్వీసులో ఎన్నడూ చూసి ఎరుగను. మీ పదముగ్గురిలో అసలు ఎవరు? మిగిలిన ఆ పన్నెండుమంది నకిలీలు ఎవరన్నది తెలుసుకోగలగడం ఆ మూడు తలల విధాతకు కూడా సాధ్యం కాదనిపిస్తోంది. కాకపొతే పరీక్షించి చూడగా చూడగా నా కళ్ళకు మాత్రం మీ ప్రయోగంలో ఏదో ఒక చిన్నలోపం కానవస్తోంది. ఇంత అద్భుత సృష్టి చేసిన మహానుభావులు మీరు. అంత చిన్న లోపాన్ని కనిపెట్టి ఎందుకు సరిచేయలేకపోయారో నాకర్ధం కావడం లేదు..........”
........యమధర్మరాజు మాటలు ఇంకా పూర్తికానేలేదు.
ఈ లోపలే ఆ పదముగ్గురులోనుంచి ఒకడు తటాలున బయటకు వచ్చి “నా పనిలోనే తప్పు పట్టేంత మొనగాడివా నువ్వు. తప్పు చేశానని వూరికే అంటే సరిపోదు. ఎక్కడ ఆ తప్పు చేసానో కూడా చెప్పు” అన్నాడు.
యముడు క్షణం ఆలశ్యం చేయకుండా ఆ మాటలు అంటున్న వ్యక్తిపై పాశం విసురుతూ చెప్పాడు. “ఇదే నువ్వు చేసిన తప్పు. దీన్ని మీభాషలో ఇగో (EGO) అనో, గర్వం అనో అంటారు. దాన్ని చంపుకుని వుంటే ఇప్పుడు నీకీ చావు తప్పేది.”
(Image courtesy ROBO film)
1 కామెంట్:
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
బీజేపీ ఆధ్వర్యంలో రేపు నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలను ఘనంగా జరపనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. more Telangana news
కామెంట్‌ను పోస్ట్ చేయండి