20, నవంబర్ 2014, గురువారం

రాజధాని నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలెవ్వరు?



ఎవరయినా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఏ చేస్తారు. ముందు అందుకు తగిన సొమ్ములు సమకూర్చుకుంటారు. ఇల్లు ఎక్కడ కట్టాలో నిర్ణయించుకుంటారు. యెంత వసతిగా వుంటే బాగుంటుందో ఆలోచిస్తారు. ఇల్లంటే ఒకనాటి  వ్యవహారం కాదు, పదేపదే కట్టుకునేది కాదు. కనుక ఓ పదేళ్ళ తరువాత అవసరాలకు తగ్గట్టుగా ప్లాను వేసుకుంటారు. వృద్దులయిన తలితండ్రులు వుంటే వారి అవసరాలకు తగిన విధంగా అంటే వారి స్నానపు గదుల్లో కాలు జారడానికి వీలుండని గరుకు బండలు, వాళ్లకు వసతిగా ఉండేలా తక్కువ మెట్లు ఉండేలా చూసుకోవడం ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
అదే ఒక వూరిలో ఒక కాలనీ  నిర్మాణం బాధ్యత మీద పడిందని అనుకోండి. జనాభా యెంత? వారి అవసరాలు ఎలా వుంటాయి? వీధి లైట్లు తగినన్ని ఉన్నాయా ? పారిశుధ్యం విషయంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి? డ్రైనేజీ సదుపాయం ఎలా వుండాలి? అసాంఘిక శక్తులు తలెత్తకుండా రాత్రి వేళల్లో గస్తీ,  కాలనీ వాసులకోసం చక్కని పార్కు ఇలాటి అంశాలన్నీ ముందు గమనంలో పెట్టుకుని ప్రణాళికలు వేసుకుంటారు.
ఒక నగరం కొత్తగా నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు ఇలాటి విషయాలు అన్నింటినీ మరింత విస్తృత రూపంలో ఆలోచించుకోవాల్సి వుంటుంది. పధక రచన చేసుకోవాల్సి వుంటుంది.



ఈ విషయంలో గతం నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో వుంటుంది. మొహెంజొదారో, హరప్పా చారిత్రిక శిధిల సంపదను పరిశీలించేవారికి అలనాటి పాలకులు నగర నిర్మాణాలలో ఎంతటి ముందు చూపు ప్రదర్శించారన్నది తేలిగ్గానే అవగత మవుతుంది. ఈ చారిత్రిక నగరాలే కాదు, వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఏ నగర చరిత్రను తిరగేసినా ఇలాటి ఉదాహరణలే కానవస్తాయి. హైదరాబాదు నగరాన్నే తీసుకుంటే అప్పటి నిజాం నవాబు నగర పౌరుల దాహార్తిని తీర్చడానికి జంట జలాశయాలను ఏర్పాటు చేయడానికి యెంత శ్రద్ధ వహించారో తెలుసుకోవడానికి చరిత్ర గ్రంధాలు తిరగేయనక్కరలేదు. అప్పుడు నగర జనాభా కేవలం యాభయ్ వేలే. అయినా  ఎంతో ముందు చూపుతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా  లక్షల జనాభాకి సరిపడేలా నగర డ్రైనేజీ వ్యవస్థను రూపొందించిన ఇంజినీర్ మోక్షగుండం  విశ్వేశ్వరయ్య గారు నిజమైన దార్శనికుడు. ఈనాడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న హైటెక్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ లేదు అనే వాస్తవం తెలుసుకుంటే ఈనాటి పాలకులు పై పై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న నిజం బోధ పడుతుంది. కేవలం బహుళ అంతస్తుల భవనాలు, అందమైన వీధి దీపాలు మాత్రమే నగర సౌందర్యానికి  కొలమానాలు కావు. ఒక్క వర్షం గట్టిగా కురుస్తే ట్రాఫిక్ అస్తవ్యస్తం అయ్యే రోడ్లు నాగరిక జీవనానికి అద్దం పట్టవు. వర్తమానంలోని అవసరాలను అంచనా వేసుకుంటూ,  భవిష్యత్తులో తలెత్తగల సమస్యలను ముందుగా ఊహించుకుంటూ వాటికి తగ్గట్టుగా ప్రణాలికలను రూపొందించచగలిగిన నాయకులు ద్రష్టలు అవుతారు. దార్శనికులు అనిపించుకుంటారు.

NOTE: Courtesy Image Owner
   

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


'స్పేస్ ఏజ్ అయినా, హైటెక్ ఏజ్ అయినా, డ్రైనేజ్ ప్రణాలిక చాలా అవసరమంటారు !!

జిలేబి