(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 02-11-2014, SUNDAY)
గత గురువారం నాడు మోడీ ప్రభుత్వం కొన్ని పొదుపు
చర్యల్ని ప్రకటించింది. ఒకరకంగా ఇవి వ్యయ నియంత్రణ చర్యలు. ఖర్చు చేయని రూపాయే మనం
మిగిల్చుకున్న రూపాయని అంటారు. అలాగే, ప్రభుత్వం కూడా కొన్ని ఖర్చులు
తగ్గించుకోవాలని తలపెట్టింది. ఖర్చులు పెంచుకుంటూపోయే ఈ రోజుల్లో 'తగ్గించుకుంటాం' అంటే
మంచి మాటే కదా!. అయితే, గతంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే సర్కారు కూడా
రెండోవిడత పాలనలో ఇదేమాదిరి కొన్ని పొదుపు చర్యల్ని ప్రకటించింది. కాబట్టి దీనికి
పూర్తి ఖ్యాతిని పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వ ఖాతాలోనే వెయ్యాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాల నిర్వహణలో భాగంగానే వీటిని
చూడాల్సివుంటుంది.
ద్రవ్యలోటు బాగా పెరిగిపోతూ ఉండడంవల్ల ప్రభుత్వం
కొన్ని చర్యలు తీసుకోకతప్పడం లేదు. ప్రణాళికేతర వ్యయం అపరిమితంగా పెరిగిపోతూ
వుండడం అనేది ప్రభుత్వాలకు ఆందోళన కలిగించే విషయం. దీన్ని అదుపు చేయడం వల్ల ముందు ఇబ్బంది పడేది కూడా ప్రభుత్వాన్ని నడిపేవారే
కావడం ఒక విశేషం. మంత్రులూ, అధికారులూ
కొన్ని సౌకర్యాలు తాత్కాలికంగానైనా కోల్పోతారు. మునపటి మాదిరిగా సర్కారు సొమ్ముతో
జల్సాలు చేయడం కుదరదు. ప్రస్తుతం అధికారరీత్యా పర్యటనలు చేసేటప్పుడు కొందరు
ఉన్నతాధికారులకు విమానాల్లో ఫస్ట్ క్లాసులో ప్రయాణించే వెసులుబాటు వుంది.
సాధారణ టిక్కెట్టు ధరకంటే ఇది రెండు మూడు
రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఆ పద్దతికి ముగింపు పలికారు. అంతే కాదు, విమానాల్లో చౌకగా దొరికే
టిక్కెట్లతోనే ప్రయాణాలు చేయాలి. ఒక
స్థాయి అధికారులకు, అనధికారులకూ దేశ విదేశ ప్రయాణాలు చేసేటప్పుడు తమకు తోడుగా
మరొకరిని వెంట తీసుకుని వెళ్ళే సదుపాయం వుంది. ఈ సౌకర్యం ఇక ముందు వుండదు. సదస్సులు, గోష్టుల పేరుతొ పెట్టె ఖర్చులకు కూడా
ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇలాటి సందర్భాలలో విందు వినోదాల పేరిట చేసే ఖర్చు చుక్కల్ని తాకుతోందనడం
వాస్తవ దూరమేమీ కాదు. ఎంతో అవసరమైన సందర్భాల్లో తప్ప సదస్సులు ఏర్పాటుచేయరాదని
ఆదేశించింది. ఒకవేళ సదస్సుల ఏర్పాటు
తప్పనిసరి అయితే, ఎటువంటి పరిస్తితుల్లోను వాటిని ఖరీదయిన అయిదు నక్షత్రాల
హోటళ్ళలో అసలే ఏర్పాటు చేయకూడదన్నది మరో ఆంక్ష.
వీలయినంతవరకు, డబ్బు తక్కువ ఖర్చయ్యే
వీడియో కాన్ఫరెన్సు విధానాలను అనుసరించాలనీ, పర్యటనలు, ప్రయాణాలు
తగ్గించుకోవాలనీ ప్రభుత్వం సూచించింది.
పొదుపు మంత్రం ప్రభావం ప్రభుత్వ వాహనాల మీద కూడా పడుతుంది. కొత్త వాహనాల కొనుగోళ్ళపై నిషేధం విధించింది.
ఇలానే మరికొన్ని షరా మామూలు చర్యలు ఈ జాబితాలో వున్నాయి.
మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచీ అనవసర వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
అధికార పీఠం ఎక్కగానే, ప్రధాని
హోదాలో వెంట వెంటనే చేసిన అనేక విదేశీ ప్రయాణాల్లో కూడా కొన్ని
సాంప్రదాయక పద్ధతులకు స్వస్తి చెప్పారు. గతంలో ప్రధానమంత్రి విదేశీ ప్రయాణం అంటే
చాలా హడావిడి వుండేది. ఆయన వెంట వెళ్ళే పరివారంలో అనేకమంది పత్రికా విలేకరులు కూడా
వుండేవారు. మోడీ వీటికి రాం రాం చెప్పేసారు. ప్రధానులు ప్రయాణం
చేసే ఎయిర్ ఇండియా విమానాల్లో మద్యం ఏరులా
ప్రవహించేదని గతంలో ఆ అవకాశం దక్కిన
విలేకరులు తమతోటివారికి చెప్పుకునేవారు. మోడీ వాటన్నిటికీ ఒకేసారి భరతవాక్యం
పలికారు. ఇవన్నీ దేశ ప్రజల దృష్టిలో పడి, ఆయన వ్యక్తిత్వ శోభ మరింత ఇనుమడించే మాట నిజమే. కానీ, ఇటీవల మోడీ జరిపిన అమెరికా
పర్యటనలో ఆయన ధరించిన ఖరీదైన డిజైనర్ దుస్తులకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం లభించింది.
గతంలో ఇందిరా గాంధీ విషయంలో ఇదే విధమైన ప్రచారం సాగేది. పర్యటనల సమయంలో ఆవిడ రోజు
మొత్తంలో అనేక పర్యాయాలు ఎలా చీరెలు మార్చేవారు అనే సంగతులను ఫొటోలతో సహా ఆసక్తికర
కధనాలను
పత్రికలు ప్రచురించేవి. ఆరాధ్య దైవాలుగా ప్రజల్లో తమ ప్రభ కొనసాగినన్నాళ్లు ఈ ప్రచారాలు ఆయా నాయకులకు సానుకూలంగానే సాగుతాయి. పరిస్తితులు తలకిందయినప్పుడు, తాడే పామయి
కరిచినట్టు ఇలాటి అంశాలే, వారిపై వ్యతిరేక
ప్రచారానికీ, వారి వ్యక్తిత్వ హననానికీ దారితీసే ప్రమాదం వుంది.
చరిత్ర చెప్పే ఈ పాఠాలను నేతలు సదా గుర్తుపెట్టుకోవాలి.
కొన్ని విషయాలు వినడానికి ఆసక్తికరంగా వుంటాయి.
తమ అభిమాన నాయకులు లేదా వ్యక్తుల జీవన శైలిని, విపరీత పోకడలను అభిమానించేవారు కొందరయితే, ఆ పేరుతొ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించే
ప్రత్యర్ధులు కూడా వుంటారు. గతంలో
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన
టంగుటూరి అంజయ్య అధికారిక పర్యటనలకోసం యాదగిరి అనే ఒక హెలికాఫ్టర్ వాడేవారు. ఆనాటి ప్రభుత్వాలను విపరీతంగా విమర్శించి, ప్రజల్లో
పెల్లుబికిన కాంగ్రెస్ వ్యతిరేకతతో
అధికారపగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ
అధ్యక్షుడు ఎన్టీ రామారావు సయితం ఆ తరువాతి రోజుల్లో హెలికాఫ్టర్ ని విచ్చలవిడిగా వాడిన విధానం విమర్శలకు గురయింది. బెజవాడ నుంచి కృష్ణ అవతల వొడ్డున
వున్న మంగళగిరి వెళ్ళడానికి కూడా ఎన్టీయార్ హెలికాఫ్టర్ వాడారని ఆరోజుల్లో
ప్రత్యర్ధి కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. అయితే, ప్రజల్లో ఆయనకు వున్న విపరీతమైన
అభిమానం వల్ల ఆ ఆరోపణలు గాలికి కొట్టుకుపోయాయి.
తన 'నోటి మాటే' జీవో అని ప్రకటించిన మర్రి
చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రభుత్వ వ్యయంపై అనేక ఆంక్షలు
ఉండేవి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు
ఆయన వెంట వెళ్ళే అధికారులకు విమానయాన అర్హత వుండేది కాదు. ప్రతిసారీ, ఆ అధికారులు విమానయానం
కోసం ఆర్ధిక శాఖనుంచి ప్రత్యేకంగా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సివచ్చేది. ఆ
అనుమతులను విడిగా జీవోల రూపంలో విడుదల
చేయాల్సిన పరిస్తితి వుండేది. ఆయన పేషీ
సిబ్బందిలో చాలామందికి ప్రభుత్వ వాహనాలు ఉండేవి కావు.
సచివాలయంలో అతికొద్దిమంది అధికారులకు తప్ప ఏసీ సౌకర్యం వుండేది కాదు. తరువాత తరువాత
ప్రపంచ బ్యాంకు రుణాలు ఇబ్బడిముబ్బడిగా రావడం మొదలయిన తరువాత నుంచి కాబోలు ప్రభుత్వ కార్యాలయాల రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా
మారిపోయాయి. ఒక మంత్రి కార్యాలయంలో వాడిన ఫర్నిచర్ కొత్తగా వచ్చే మరో మంత్రి వాడే ప్రసక్తి లేదు. కిటికీ తెరలతో సహా మళ్ళీ అన్నీ కొత్తవే
కొంటున్నారు. 'యధారాజా....' అన్నట్టు ఉన్నతాధికారులదీ
అదే వరస అయింది. వారి అభిరుచులకూ, వారి
జాతకాలకు సరిపడే వాస్తుకు అనుగుణంగా వారి కార్యాలయాలు, ఇళ్ళల్లో మార్పులూ, చేర్పులూ ప్రభుత్వ ఖర్చుతో ఆఘమేఘాలమీద జరిగిపోతూ వుండడం
నేడు చూస్తున్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒకరు ఉదయం ఢిల్లీ వెళ్లి సాయంత్రం హైదరాబాదు తిరిగొచ్చి,
తిరిగి మర్నాడు ఉదయమే ఢిల్లీకి విమానంలో వెళ్ళిన సందర్భాలు వున్నాయి. 'రాత్రి
ఢిల్లీలోనే ఉండొచ్చు కదా, రాత్రికి రాత్రి హైదరాబాదు వచ్చి చక్కబెట్టే రాచకార్యాలు ఏమిట'ని ప్రతిపక్షాలు తప్పుబట్టిన
ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల విమాన ప్రయాణాలను ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఇదొక రాజకీయ వైచిత్రి.
ఒకప్పుడు ప్రభుత్వ వాహనాలు అంటే అంబాసిడర్ కార్లు మాత్రమె. ఇందిరా గాంధి ప్రధానమంత్రిగా వున్నప్పుడు కూడా
ఆవిడ అధికారిక వాహనం అంబాసిడర్ కారే. ఇప్పుడు మంత్రులూ, ఆ హోదా కలిగిన వారూ వాడుతున్న అతి ఖరీదయిన కార్లు, వాటిని విచ్చలవిడిగా వాడుతున్న విధానం గమనిస్తే, దుబారా ఎక్కడ జరుగుతున్నదో ఇట్టే
తెలిసిపోతుంది. ఇల్లు చక్కపెట్టే పని ఇలాటి వాటినుంచి మొదలు పెడితే బాగుంటుంది.
మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే. కానీ మనకంటే బాగా అభివృద్ధి చెందిన కొన్ని
దేశాల్లో అధ్యక్షులు, ప్రధానమంత్రులు చాలా నిరాడంబరంగా విధులను నిర్వహించడం
చూస్తున్నాం. ఒక దేశపు ప్రధాని ఎలాటి భద్రతా ఏర్పాట్లు లేకుండా భార్యతో కలిసి
నడుచుకుంటూ సినిమాకు వెళ్ళే వాడని, మరో దేశం అధినేత విమానాశ్రయంలో బోర్డింగ్
పాసుకోసం క్యూలో నిల్చునేవాడనీ, మరోదేశపు
ప్రధాన మంత్రి సరదాగా టాక్సీ డ్రైవర్ వేషం
కట్టి జనాలను అలరించాడనీ ఇలా వార్తలు వింటున్నప్పుడు, పత్రికల్లో చదువుతున్నప్పుడు,
సోషల్ మీడియాలో గమనిస్తున్నప్పుడు మన నాయకులు కూడా అలా వుంటే బాగుండు కదా
అనిపిస్తుంది. ఇటువంటి వృత్తాంతాల నుంచి
పాఠాలు నేర్చుకుంటే మంచిది కానీ, ఉత్తుత్తి పొదుపు మంత్రాలవల్ల చింతకాయలు రాలవు. సౌకర్యాలకు, సదుపాయాలకు
అలవాటుపడ్డ ప్రాణాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఇట్టే కనుక్కుంటాయి. పొదుపు చర్యలు, ఉత్తర్వులు
కాగితాలకే పరిమితమైపోతాయి. నిబంధలను రూపొందించే వారికే వాటిని ఉల్లంఘించే అడ్డదారులు ముందుగా తెలుస్తాయి. ఇది అందరికీ
తెలిసిన విషయమే. (01-11-2014)
NOTE: Courtesy
Cartoonist
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి