21, నవంబర్ 2014, శుక్రవారం

తల్వార్


తల్వార్ అంటే కత్తి. కానీ ఈ ఆర్కే తల్వార్ కత్తిలాంటి మనిషి. అయితే ఈయన 'మాటల్లో మల్లెపూవు, చేతల్లో గులాబీ ముల్లు'  

(Late Shri R.K.Talwar)

చిన్న వయస్సులో స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియాలో అతి చిన్న ఉద్యోగంలో చేరారు.  మామూలుగా ప్రతి మూడేళ్ళకోసారి, అదీ ప్రతిభ ఆధారంగా వచ్చే ప్రమోషన్ ఈయన గారికి ఏడాది రెండేళ్ళు తిరక్కుండానే వచ్చేది. అది ఆయన ప్రతిభ కాదు,  పై వాళ్ళని పట్టుకునే చాకచక్యం అని ఎకసెక్కం చేసిన వాళ్ళు లేకపోలేదు. ఐతే అలాటి  'పట్టు' పనిచేసేది ఒకసారో రెండు సార్లో. కానీ తల్వార్ మహాశయులు అలా అలా ప్రతియేటా  నిచ్చెన  మెట్లెక్కి పోయి యాభయ్ రెండేళ్ళ వయస్సులోనే  స్టేట్ బ్యాంక్ చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు. ఇక ఎక్కడానికి మెట్లు లేక అక్కడే ఆగిపోయారు. కానీ అసలు కధ అక్కడే మొదలయింది.
అప్పుడు నడుస్తున్నది ఎమర్జెన్సీ రోజులు.
ఒక రోజు ఓ పెద్దాయన అనిపించుకుంటున్న ఓ చిన్నాయన  నుంచి ఈ పెద్దాయనకు పిలుపు వచ్చింది. ఖుద్దున వచ్చి తన దగ్గర హాజరీ వేయించుకోమని విన్నపం లాంటి ఆదేశం. ఆరోజుల్లో ఆయన నుంచి పిలుపు వచ్చిందంటే మహా మహా  మంత్రులే రెక్కలు కట్టుకుని క్షణాల్లో వాలియేవారు. కానీ ఆయన పిలిచింది తల్వార్ ని. ఆయన రూటే సపరేటు. ఆయన ఆలోచనలే వేరు.  
'తనను పిలిపించుకోవాల్సింది అదీ అవసరం వుంటే ఆర్ధిక మంత్రి. తను వెళ్ళాలన్నా వెళ్ళేది ఆర్ధిక మంత్రి దగ్గరకు. అదీ ఏదైనా జరూరు పనివుంటేనే. మధ్యలో ఈ కుర్రకారు చిలిపి పిలుపులు లెక్కచేయాల్సిన పని లేదన్న'ది తల్వార్ గారి లెక్క.
ఈ లెక్కలు, అదీ  అసలు లెక్కలే తెలియని ఆ యువనేతకు రుచించలేదు. అనుకున్న పని అనుకున్న క్షణంలో జరిగిపోవాలి. అది ఆయన నైజం.
ఫలితం. స్టేట్ బ్యాంక్ చైర్మన్  తల్వార్ గారికి తక్షణం ఉద్వాసన పలకాలని ఉత్తర్వు. యువరాజు తలచుకుంటే ఉత్తర్వులకేం కొదవు. కానీ నిబంధనలు అంటూ కొన్ని వున్నాయి కదా! స్టేట్ బ్యాంక్ చైర్మన్ ని నియమించడం వరకే ప్రభుత్వానికి అధికారం. తొలగించడానికి లేదు. అదే విషయం యువరాజావారికి మనవి చేసారు. కిం కర్తవ్యమ్?
సర్కారు లో పనిచేసేవారికి ఒకటే కర్తవ్యమ్. పై వారు చెప్పింది అక్షరాలా చేయాలి. రూల్స్ అడ్డం  వస్తాయి. రాక చస్తాయా. అవి ఉన్నదే అందుకు. అందుకేం చేసారు ? మొత్తం స్టేట్ బ్యాంక్ చట్టాన్నే సవరించారు. మూడు నెలలు నోటీసు ఇచ్చి తల్వార్ గారిని తప్పుకోమన్నారు. డానికి తల్వార్ గారు ఏం చేసారు?
ఇప్పటి అధికారుల మాదిరిగా కోర్టుకెక్కలేదు. పత్రికలను పట్టుకోలేదు. ఉద్యోగం వొదిలేసిన తరువాత కూడా ఆయనకు నిబంధనల ప్రకారం లభించాల్సిన సౌకర్యాలను గురించి కూడా లిప్త కాలం ఆలోచించలేదు. నిజానికి మరో రెండు నెలలు అధికారిక నివాసంలో ఉండవచ్చు. మిగిలిన సదుపాయాలను కూడా అనుభవించవచ్చు. కానీ ఆయన ఎవ్వరు? తల్వార్!
అంచేతే, ఉద్యోగం పోయిన తరువాత వెంటనే తన కుటుంబంతో సహా పాండిచేరి వెళ్ళిపోయారు.  తను నమ్మిన అరబిందో మార్గాన్నే నమ్ముకున్నారు. అక్కడ ఓ రెండు గదుల అపార్ట్ మెంటులో లో మరణించేవరకు తన శేష జీవితాన్ని హాయిగా హుందాగా గడిపారు. దటీజ్ తల్వార్.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెన్నై కేంద్రంగా స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా తమిళ నాడుతో పాటు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల  వ్యవహారాలు చూసున్నప్పుడు మర్యాదపూర్వకంగా పాండిచేరి వెళ్లి తన మాజీ బాసును కలుసుకున్నారు. ఆయన భార్య స్వయంగా కలిపి తీసుకువచ్చిన టీ తాగారు.
స్టేట్  బ్యాంక్ చైర్మన్ గా అనుభవంలోకి వచ్చే వైభోగాలు తెల్సిన వాడు కనుక తల్వార్ మహాశయుల నిరాడంబర జీవితాన్ని చూసి చలించి పోయారు.
ఇలాటి వారు ఇంకా వున్నారా!
అంటే ఒకే సమాధానం. అలాటి వారు ఉండబట్టే మనం ఇంకా ఈ కర్మ భూమిలో జీవించగలుగుతున్నాం.
అది మనం చేసుకున్న అదృష్టం. అవునంటారా!

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

ఇలా మెడమీద కత్తిపెట్టి అడిగేస్తే కాదనగలమా?
కాదంటే కర్మధారయ సమాజం వూరుకుంటుందా!