మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ చాలా మంచి పాత ఫోటోలను
ఎంపిక చేసి మరీ పోస్ట్ చేస్తుంటాడు. ఆయన్ని చూసి ఆ వాతలు యేవో నేనూ పెట్టుకుందామని ఈ రోజు ఓ పూటల్లా వెతికి పాత
కాగితాల్లో నుంచి పాత జ్ఞాపకాలను తవ్వి తీస్తుంటే - డెబ్బయ్యవ దశకంలో బెజవాడ 'ఆంద్రజ్యోతి'లో
పనిచేసేటప్పుడు రిపోర్టర్ గా కవర్ చేసిన ఓ సందర్భం తటస్థపడింది. నిజానికి నేను
పేపర్లో రాసిన వార్త క్లిప్పింగు కాదు. ఆ ఫంక్షన్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు
నేను హడావిడిగా రాసుకున్న నోట్స్ అది. అందులో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి
పేరు కనిపించడంతో ఒకింత ఉత్సుకతతో తీసిచూసాను. ఎన్టీయార్ సినీ నటుడిగా వున్నప్పుడు,
రాజకీయ ప్రవేశం చేయకముందు బెజవాడలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కార్యక్రమం అది. సభకు
హాజరయిన వారి జాబితా చూస్తే ఖచ్చితంగా అది
ఫిలిం డిస్త్రి బ్యూషన్ కంపెనీ ప్రారంభోత్సవం అయివుండాలి. అధ్యక్షత వహించిన నాటి
మంత్రి మూర్తిరాజు గారు, ఎన్టీయార్ ఉపన్యాసాలు మాత్రం దొరికాయి. రామారావుగారు
చేసిన ప్రసంగాన్ని నేనిలా చిత్తు ప్రతిలో (ఒక రకం షార్ట్ హ్యాండ్ అన్నమాట) రాసుకున్నాను.
(Late Shri NTR)
ఆయనిలా మాట్లాడారు:
"సినిమా ప్రదర్శనలో ముఖ్యమైన శాఖ డిస్ట్రి
బ్యూషన్. సినిమా అనేది కళాత్మక వ్యాపారం. వ్యాపారాత్మకమైన కళ కూడా........
"ఒక కొత్త సంస్థ వస్తున్నదంటే పరిశ్రమకు బలం
పెరుగుతున్నదన్న మాట. చిత్రాలు ఈనాడు దెబ్బ తింటున్నాయంటే ప్రజలకు కావాల్సింది మనం ఇవ్వలేకపోతున్నామని
అర్ధం......
"ప్రేక్షకులకు, నిర్మాతలకు మధ్య వంతెన లాంటి
వాళ్ళు పంపిణీదారులు. ఇదొక ఫ్యామిలీ బిజినెస్ కాదు. ఇదొక ఉత్తేజకరమైన మీడియం.........
"పరిజ్ఞానంలో కానివ్వండి, వ్యాపార దక్షతలో కానివ్వండి, వయస్సులో
కానివ్వండి ఇక్కడ వున్న అందరికంటే నేను చిన్నవాడ్ని. అందుకే ఈ సంస్థను పరమేశ్వరుడు
అనుగ్రహించాలని వేడుకుంటున్నాను......
"విజయవాడ కార్యక్రమం అంటే ఒక రకంగా నా కుటుంబ
కార్యక్రమం లాంటిది.....
"నేషనల్ డిఫెన్స్ ఫండ్ కలెక్షన్ సమయంలో
వెస్ట్ గోదావరి జిల్లాలో కార్యక్రమం అంతా మూర్తి రాజుగారు నిర్వహించారు. మూర్తి
రాజుగారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తనని తానే గౌరవించుకున్నది....."
(Late Shri CHVP Murthy Raju)
మంత్రి మూర్తి రాజుగారి ప్రసంగం సంక్షిప్తంగా:
"మీరు దండలు వెయ్యకా తప్పదు, మేము మొయ్యకా
తప్పదు. ఇప్పుడు దండలు వెయ్యడం కాదు. దండకొక వేయి చొప్పున పోగుచేసి రామారావులాంటి
కళాకారులను తయారు చేసే ఒక నటనా కళాశాలను స్థాపించండి....
"నటులలో పోటీ వుండడం మంచిదే. మాకే వూళ్ళో
సంఘాలు లేవు. కానీ వీళ్ళకి మాత్రం ప్రతి వూళ్ళో అభిమాన సంఘాలు వున్నాయి.........
"....ఎక్కువ డబ్బు సంపాదించండి. కాదనను.
కానీ సంపాదించిన దానిలో కొంతయినా సమాజానికి ఉపయోగించండి. సినిమా పరిశ్రమ వారికి
నేనిచ్చే సలహా ఇదే"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి