26, నవంబర్ 2014, బుధవారం

'రాజధాని' కబుర్లు

(Published By 'SURYA' Telugu Daily in its Edit Page on 26-11-2014, Thursday)

ఇప్పుడు ఎక్కడ విన్నా 'రాజధాని' కబుర్లే.
దేశాలకు గానీ రాష్ట్రాలకు గానీ నూతన రాజధానుల నిర్మాణం అనేది కొత్తేమీ కాదు. ప్రాచీన కాలంలో ఈజిప్షియన్లు, రోమన్లు, చైనీయులు తరచుగా రాజధానులను ఒక చోటి నుంచి మరో చోటికి మార్చుకున్నట్టు ఆధారాలు వున్నాయి. రాజకీయ, ఆర్ధిక కారణాలు మాత్రమే కాకుండా దేశ రక్షణ అంశాలు కూడా ఇందులో ముడిపడి వున్నాయి. ప్రజల నడుమ ఐక్యత, ప్రాదేశిక భద్రత అనేవి రాజధాని ఎంపికలో కీలక భూమిక పోషిస్తాయి. 


(ప్రాచీన రాజధాని)

దక్షిణ కొరియా  ఉదాహరణ తీసుకుందాం.
అక్కడ కొత్త రాజధాని నిర్మించాలని ప్రతిపాదించారు  ప్రస్తుత రాజధాని సియోల్ కాకుండా సెజోంగ్ అనే మరో చోట నూతన రాజధాని ఏర్పాటు చేసుకోవాలని 2005 లోనే ఒక బృహత్తర ప్రణాళిక రూపొందించారు. రెండు లక్షల పదమూడువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక భారీ భవన నిర్మాణాన్ని 2011  నవంబర్ లో మొదలు పెట్టి  రెండేళ్లలో  పూర్తిచేశారు. నిరుడు డిసెంబర్ నెలలో సియోల్ నుంచి అనేక ప్రభుత్వ విభాగాలను నూతన రాజధానికి తరలించారు. పాత రాజధాని సియోల్ లో మాదిరిగా  ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని మౌలిక సదుపాయాలతో కిక్కిరిసిపోకుండా కొత్త రాజధానిని సరికొత్త ఆలోచనలతో నిర్మించాలనే పాలకుల అభిప్రాయానికి అనువుగా వృత్తాకారంలో, మధ్యలో ఎలాటి నిర్మాణాలు లేకుండా నూతన  రాజధాని డిజైన్ కు రూపకల్పన చేసారు. వృత్తాకార నిర్మాణాలకు ఆవల ఇరవై ఇరుగు పొరుగు ఆవాస ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా ప్రణాలికలు తయారు చేసారు. సాంప్రదాయిక ఇరుగుపొరుగు ప్రాంతాల అభివృద్ధితో పాటు, మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా అభివృద్ధి  చేసే ఆధునిక విధానాలను జోడించడం ఈ ప్రణాళికల్లోని ప్రత్యేకత.
అయితే కొత్త రాజధాని నిర్మాణ పధకాలకు మొదటి అడ్డంకి రాజకీయ ప్రత్యర్ధుల విమర్శల రూపంలో ఎదురయింది.  కొరియన్ జాతీయ అసెంబ్లీలో ఈ అంశంపై చర్చలు చాలా తీవ్రంగా జరిగాయి. ఎన్ని అడ్డంకులు ఎదురయినా ప్రభుత్వం తన ప్రణాళికతో ముందుకు పోయింది. నిరుడు జులై నెలలో మలేసియా కు చెందిన పుత్రజయ, కొరియా నూతన రాజధాని నగరం సెజోంగ్ సిటీ నడుమ అవగాహన పత్రంపై సంతకాలు జరిగాయి. కొత్త రాజధాని ఒక ఆర్ధిక కేంద్రంగా రూపొందేందుకు వీలుగా ఉప ప్రణాలికలు తయారు చేసారు. భవిష్యత్తులో పెరగబోయే జనాభా అవసరాలకు తగ్గటుగా పౌర సదుపాయాలు కల్పించడానికి వీటిని తయారు చేసారు.
ఇక బ్రెజిల్ విషయం తీసుకుంటే -
బ్రెజిల్ దేశపు రాజధాని నిర్మాణం జరిగి  యాభయ్ ఏళ్ళు పూర్తయిన తరువాత కూడా ఈనాటికీ అది ప్రపంచంలోని సుందర రాజధాని నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతూ  ఉన్నదంటే ఆ నగరం రూపకల్పన యెంత పకడ్బందీగా చేసారో అర్ధం అవుతుంది. పైగా ఈ రాజధాని నిర్మాణాన్ని కేవలం నలభయ్ ఒక్క మాసాలలో పూర్తిచేయగలగడం మరో విశేషం. 1956 - 1961 మధ్య బ్రెజిల్ అధ్యక్షుడిగా వున్న జుసెలినో కుబిత్చెక్ - బ్రేసీలియా పేరుతొ ఈ కొత్త రాజధాని నిర్మాణాన్ని సత్వరంగా పూర్తి చేసి 'అయిదేళ్ళలో యాభయ్ ఏళ్ళ అభివృద్ధి' అనే నినాదానికి ఊపిరి పోశారు. పట్టుదల వుంటే ఏదీ అసాధ్యం కాదు అని నిరూపించారు.    
పొతే,  అమెరికా.
అమెరికన్  విప్లవం అనంతరం దేశ రాజధానికి అనేక నగరాలను పరిశీలించారు.ఫిలడెల్ఫియా, బాల్టిమోర్, న్యూయార్క్ సిటీలతో పాటు ఎనిమిది నగరాలు పరిశీలనకు వచ్చాయి. చివరికి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ పొటామాక్ నదీ తీరంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసారు. వర్జీనియా, మేరీ లాండ్ రాష్ట్రాల వాళ్ళు రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ విధంగా వాషింగ్టన్ డీసీ నగరం రూపుదిద్దుకుంది. 1800 నుంచి అమెరికా రాజధానిగా విలసిల్లుతోంది. దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక ప్రయోజనాలు, ఉత్తరాది రాష్ట్రాల యుద్ధ బకాయిల చెల్లింపు డిమాండ్ల కారణంగా తలెత్తిన వివాదం దరిమిలా రాజీ మార్గంగా ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవలసి వచ్చింది.
రష్యా
14 వ శతాబ్దం నుంచి 1712 వరకు రష్యన్ సామ్రాజ్యానికి మాస్కో రాజధానిగా వుండేది. దరిమిలా రష్యాను మరింత పాశ్చాత్య పోకడలకు దగ్గర చేసే ఉద్దేశ్యంతో యూరోపుకు దగ్గరగా వుండే సెంట్ పీటర్స్ బర్గ్ నగరానికి రాజధానిని మార్చారు. తిరిగి కమ్యూనిస్ట్ విప్లవం అనంతరం రాజధాని    1918 లో మళ్ళీ మాస్కోకి తరలిపోయింది.
కెనడా
కెనడా పార్లమెంటు సమావేశాలను మొదట్లో టొరంటో. క్యూబెక్ సిటీలు రెండిట్లో విడతలువారీగా నిర్వహిస్తూ వుండేవారు.   1857లో అట్టావా దేశపు రాజధాని అయింది. నిజానికి ఆరోజుల్లో అట్టావా అనేది చాల చిన్న పట్టణం. పైగా బాగా వెనుకబడిన ప్రాంతంలో వుండేది. కాకపొతే ఒంటారియో, క్యూబెక్ ప్రాంతాలకు నడుమ వుండడం దీనికి కలిసివచ్చింది.
ఆస్ట్రేలియా 
19 వ శతాబ్దంలో మొత్తం ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ ఈ రెండే పెద్ద నగరాలు. దేశ రాజధాని విషయంలో ఈ రెంటి నడుమ గొప్ప పోటీ ఏర్పడింది. రాజీ మార్గంగా కొత్త రాజధాని నిర్మించాలని నటి పాలకులు నిర్ణయించారు. విస్తృతంగా సర్వే చేసిన తరువాత న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి అక్కడ రాజధాని నిర్మించారు. ఆవిధంగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించిన కాన్ బెర్రా 1927 నుంచి ఆస్ట్రేలియా రాజధానిగా ఉంటోంది. సిడ్నీ. మెల్బోర్న్ నగరాల నట్టనడుమ ఈ కొత్త రాజధానిని నిర్మించారు. కాకపోతే సముద్రతీరం లేని రాజధాని నగరం అది.
ఇండియా
ఇండియా బ్రిటిష్ పాలనలో వున్నప్పుడు 1911 వరకు తూర్పు తీరంలో వున్న  కలకత్తా రాజధానిగా వుండేది. పరిపాలన సౌలభ్యం కోసం బ్రిటిష్ వారు రాజధానిని ఉత్తర భారతంలోని ఢిల్లీకి మార్చారు. న్యూ ఢిల్లీ నగరాన్ని  ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 సంవత్సరం నుంచి భారత దేశపు రాజధానిగా కొనసాగుతోంది.
టాంజనీయా
1970 ప్రాంతాల్లో టాంజనీయా రాజధానిని తీర ప్రాంతంలో వున్న దార్ ఎస్ సలాం నుంచి దేశం నడిబొడ్డులో వున్న దొదోమా నగరానికి మార్చారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి కానీ నూతన రాజధాని నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
మియన్మార్ (బర్మా)
లోగడ బర్మాగా వున్న నేటి మియన్మార్ కు ఒకప్పుడు రంగూన్ రాజధానిగా వుండేది. మియన్మార్ రాజధాని మార్పిడి చాలా ఆకస్మికంగా జరిగిపోయింది.  2005 నవంబర్ లో సైనిక ప్రభుత్వం రంగూన్ లో వున్న ప్రభుత్వ సిబ్బందిని హుటాహుటిన దేశానికి ఉత్తర కొనలో వున్న నేపిడా (Naypyidaw) నగరానికి తరలి వెళ్ళమని ఆదేశించింది. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రాజధాని కోసం మూడేళ్ళ క్రితమే ఆ నగరాన్ని నిర్మించిన విషయం బయటకు పొక్కకుండా చూడడం. ఈ వివాదాస్పద రాజధాని మార్పిడికి కారణం జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహా అని ఒక వదంతి అక్కడ బహుళ ప్రచారంలో వుంది. పెద్ద నగరం అయిన రంగూన్ ను వొదిలి చాలా చిన్న జనాభా కలిగిన పట్టణాన్ని ఎంచుకోవడానికి మరో పైకి చెప్పని కారణం వుంది. రంగూన్ వంటి పెద్ద నగరంలో రాజధాని వుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో  జనం పెద్ద ఎత్తున పోగవడానికి ఆస్కారం వుంటుంది. అంచేత అలాటి వాటికి వీలులేకుండా  చూడడానికే రాజధానిని మరో చోట  మారుమూల చిన్న ప్రాంతానికి తరలించారని  రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. (26-11-2014)
NOTE: Courtesy Image Owner




కామెంట్‌లు లేవు: