16, నవంబర్ 2014, ఆదివారం

మనం ఎక్కడ వున్నాం ? లోపం ఎక్కడ వుంది ?



ఈ ప్రశ్న వేసింది ఆషామాషీ వ్యక్తి కాదు. భారత రాష్ట్రపతిగా  పనిచేసి యావత్ భారత ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం. 
అందరం గుర్తు పెట్టుకుని ఆచరించాల్సిన అంశాలతో ఆయన చేసిన అనుగ్రహ భాషణంఇది. తెలుగుదనం కోసం, అనువాద సౌలభ్యం కోసం చేసుకున్న చిన్న చిన్న మార్పులు మినహా ఇది పూర్తిగా ఆయన అంతరంగ ఆవిష్కరణం.
చిత్తగించండి.



మనం ఎందులో తక్కువ. ఎవరితో తక్కువ. మన బలాలు, మన విజయాలు మనమే గుర్తించ లేకపోతున్నాం.
పాల దిగుబడిలో మనమే ముందున్నాం. గోధుమ ఉత్పత్తిలో రెండో స్తానం. అలాగే వరి ధాన్యం విషయంలో కూడా మనదే ద్వితీయ స్తానం. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల విషయం తీసుకుంటే మనదేశమే మొదటి వరసలో వుంది.
ఇలా చెప్పుకోదగ్గ విజయాలు మన దేశం ఎన్నో సాధించింది. కానీ ఏం లాభం? వీటి గురించి ఒక్క ముక్క కూడా మన మీడియాలో రాదు. పేపర్ తిరగేస్తే చాలు అన్నీ చెడ్డ వార్తలే. అపజయాలు. ఉత్పాతాలు, ఉగ్రవాద కార్యకలాపాలు. వీటికి సంబంధించిన సమాచారమే.
ఆ మధ్య టెల్ అవీవ్ వెళ్లాను. అంతకుముందు రోజే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. కొంతమంది ఆ దాడిలో మరణించారు. మరునాడు ఉదయం ఒక ఇజ్రాయెలీ పత్రిక తిరగేశాను. మొదటి పేజీలో ఒక ప్రధాన వార్త కనబడింది. అది బాంబు పేలుడుకు సంబంధించింది  కాదు. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిదేళ్ళు కష్టపడి పచ్చిక మొలవని ఎడారి భూమిని సస్యశ్యామలం చేసిన వైనం గురించి రాసిన కధనం అది. అలాటి ఉత్తేజకరమైన సమాచారంతో అక్కడివాళ్లు తమ దినచర్య ప్రారంభిస్తారు.
"బాంబు పేలుడు సంఘటన గురించిన వార్త లోపలి పేజీలో వేసారు. చావులు, చంపడాలు, బాంబు దాడులు, పేలుళ్లు, ఇలాటి వార్తలన్నీ అంత ప్రముఖంగా అక్కడి పత్రికలు  ప్రచురించవన్న సంగతి అప్పుడే  అర్ధం అయింది.
మరి మన దగ్గరో. ఇందుకు పూర్తిగా భిన్నం. చావులు, జబ్బులు, నేరాలు, ఘోరాలు వీటితోనే మీడియా మనకి సుప్రభాతం పలుకుతుంది.
ఎందుకిలా జరుగుతోంది? జవాబులేని ప్రశ్న. సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న.
సరే. ఇదొక కోణం. మన దేశాన్ని గురించి నేను అన్నీ ప్రతికూల అంశాలే మాట్లాడుతున్నానని అనిపించినా అలాటిదే మరో విషయాన్ని ప్రస్తావించక తప్పడం లేదు.
అదేమిటంటే.  విదేశీ వస్తువుల  మీద మనకున్న మోజు. మనకు విదేశీ టీవీలు కావాలి. విదేశీ దుస్తులు కావాలి. ప్రతిదీ విదేశాల్లో తయారయిందే కావాలి. ఎందుకిలా ఆలోచిస్తున్నాము. ఎందుకిలా విదేశీ వస్తువులపై  వ్యామోహం పెంచుకుంటున్నాము. స్వావలంబన ద్వారా ఆత్మ గౌరవం పెరుగుతుందన్న వాస్తవాన్ని యెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాము.
ఆ  మధ్య హైదరాబాదులో ఒక సదస్సులో మాట్లాడుతున్నాను. ఓ పద్నాలుగేళ్ళ బాలిక నా వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. ఇస్తూ ఆ అమ్మాయిని అడిగాను జీవితంలో నీ లక్ష్యం ఏమిటని. ఆ అమ్మాయి బదులిచ్చింది. 'అంకుల్. అన్నింటా మెరుగ్గా తయారయిన  భారత దేశంలో జీవించాలని వుంది అని.
ఇప్పుడు చెప్పండి. ఆ అమ్మాయి కోరిక తీర్చే బాధ్యత  మనందరిమీదా  లేదంటారా. ఆ కర్తవ్యం  మనది కాదంటారా. అలాటి అమ్మాయిల కోసం అయినా మనందరం కలసి ఈ మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.
మరో విషయం. మనందరికీ  ఒక అలవాటుంది. మన ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటాము. మన చట్టాలు బూజుపట్టిన చట్టాలని గేలి చేస్తాము. మన మునిసిపాలిటీ వాళ్లు నిద్ర పోతున్నారు, వీధుల్లో పోగుపడుతున్న చెత్త గురించి ఏమాత్రం పట్టించుకోరని విమర్శిస్తాము. ఫోన్లు పనిచేయవంటాము. రైల్వే వాళ్ళు మొద్దు నిద్దర పోతున్నారని హేళన చేస్తాము. ఇక మన విమాన సంస్తలంత దరిద్రంగా పనిచేసేవి మొత్తం ప్రపంచంలో ఎక్కడా  లేవంటాము. ఉత్తరాల బట్వాడాను తాబేలు నడకతో పోలుస్తాము.
ఇలా అంటూనే వుంటుంటాము. అలా అంటూ వుండడం మన  జన్మ హక్కు అనుకుంటాము.
వాక్స్వాతంత్ర్యం రాజ్యాంగం ఇచ్చిన హక్కు సరే.  కానీ మనమేం చేస్తున్నాము? ఈ ప్రశ్న ఎప్పుడయినా వేసుకున్నామా? 
మన దేశం నుంచి సింగపూరు వెళ్ళే వాళ్ళను గమనించండి. పోనీ మనమే అక్కడికి వెళ్ళామనుకోండి. ఆహా యెంత గొప్ప ఎయిర్ పోర్ట్! యెంత అద్భుతంగా వుందని మెచ్చుకుంటాము. అక్కడి రోడ్లని చూసి మురిసి ముక్కచెక్కలవుతాము. పొరబాటున కూడా సిగరెట్ పీకను నిర్లక్ష్యంగా బయటకు విసిరేయలేము. అలా చేస్తే జరిమానా కట్టాలని తెలుసు కనుక.  సాయంత్రం అయిదు గంటలనుంచి రాత్రి ఎనిమిది నడుమ అక్కడి ఆర్చర్డ్ రోడ్డు మీద కారులో వెళ్ళడానికి అయిదు డాలర్లు చెల్లించాల్సివస్తే కిక్కురుమనకుండా కడతాము. ఏ షాపింగ్ మాలుకో, రెస్టారెంటుకో వెళ్లి అక్కడ కారు పార్కు చేసినప్పుడు కిమ్మనకుండా పార్కింగ్ ఫీజు చెల్లిస్తాము. ఆ సమయంలో మన హోదా, స్తాయి గురించి అక్కడివారితో వాదన పెట్టుకోము. మన దేశంలో సాధారణంగా చేసే పనులు అక్కడ చేయం. రంజాన్ సమయంలో కూడా అక్కడ ఎవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో తినడానికి సాహసించరు.
లండన్ లో టెలిఫోన్ ఉద్యోగి వద్దకు వెళ్లి, నేను మా వాళ్ళతో ఎస్టీడీ మాట్లాడుతాను. ఈ పది పౌండ్లు వుంచుకుని  నాకు బిల్లు పడకుండా చూడండిఅని అడిగే ధైర్యం చేయం.
వాషింగ్టన్ వెళ్ళినప్పుడు గంటకు యాభయ్ అయిదు  మైళ్లకు మించి కారు డ్రైవ్ చేయం. అధవా చేసి, ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే, ‘నేనెవరో తెలిసే నా కారు ఆపుతున్నావా!అంటూ హుంకరించం. లేదా నేను పలానావారి తాలూకు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోఅని ఆమ్యామ్యా పైసలు  చేతిలో పెట్టే తెగింపు చేయం.
అలాగే, ఆస్త్రేలియాలోనో, న్యూ జిలాండ్ లోనో సముద్రపు వొడ్డున తిరుగాడుతూ, తాగేసిన కొబ్బరి బొండాను అక్కడే పారేసే తెగువ చేయలేం.  వెతుక్కుంటూ వెళ్లి గార్బేజి  బిన్ లో వేసికాని రాము.
టోకియోలో  పాన్ నములుతూ అక్కడే వీధిలో ఉమ్మేయగలమా ? బోస్టన్ కు వెళ్ళినప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో ఎంక్వయిరీ చేయగలమా? విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నియమాలను తుచ తప్పకుండా పాటించ గలిగిన మనం అవే ఇక్కడ యెందుకు చేయలేకపోతున్నాం. ముక్కూ మొహం తెలియని పరాయి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులను అంత చక్కగా పాటించే మనం అదే మన దేశంలో యెందుకు చేయలేకపోతున్నాం. అమెరికా వెళ్లి వచ్చిన వాళ్ళను అడగండి. అక్కడ కుక్కల్ని పెంచుకునే ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో అది కాలకృత్యాలను తీర్చుకున్నప్పుడు వారే స్వయంగా ఆ మలినాన్ని శుభ్రం చేస్తారు. జపాన్ లో కూడా అంతే!  కానీ మన దగ్గర అలాటి సన్నివేశం ఎప్పుడయినా చూశారా?
ఎందుకంటే, మనం వోటు వేసి ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ తరువాత అన్నీ దానికే వొదిలేసి మన బాధ్యతలనుంచి తప్పుకుంటాం. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని అనుకుంటాం. అందరి కష్టసుఖాలను అదే  కనిపెట్టి చూడాలని కోరుకుంటాం.
వీధుల్లో చెత్త పోగుపడితే దాన్ని  తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే అని తీర్మానిస్తాము. పైపెచ్చు చెత్తను ఎక్కడబడితే అక్కడ వెదజల్లడం మన హక్కుగా భావిస్తాం. రైళ్లల్లో టాయిలెట్లు శుభ్రంగా వుంచాల్సిన బాధ్యత రైల్వే అధికారులదే అన్నది మన సిద్దాంతం. అవి శుభ్రంగా వుంచడంలో మన పాత్ర కూడా వుందన్న సంగతి  మరచిపోతాం. ఈ విషయంలో రైల్వే  సిబ్బందికి కూడా  మినహాయింపు ఇవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులకు సరయిన సేవలు అందడం లేదంటే అందులో వారి పాత్ర కూడా వుంటుంది.
ఇక వరకట్నాలు,ఆడపిల్లలు వీటికి  సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తే మనం చేసే వాదనలని   ఆపగలవారు, అడ్డగలవారు  వుండరు. ఇలాటి సాంఘిక సమస్యలపై గొంతుచించుకు వాదించడం వెన్నతోబెట్టిన విద్య. పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయిఅన్న సూత్రం ఇక్కడ బాగా వర్తిస్తుంది. దేశం మొత్తమే అలా తగలడుతున్నప్పుడు ఒక్కడ్ని ఒంటరిగా ఏం చేయగలను  చెప్పండి. మా అబ్బాయికి కట్నం తీసుకోకుండా వున్నంత మాత్రాన సమాజాన్ని పీడిస్తున్న ఈ జాడ్యం విరుగుడు అవుతుందన్న ఆశ నాకు లేదు మాస్టారూఅంటూ   అని ధర్మపన్నాలు వల్లిస్తాం.
మరెలా ఈ వ్యవస్థకు పట్టిన అవస్థలను తొలగించడం? దానికీ మన దగ్గర సమాధానం వుంది. మొత్తం వ్యవస్థను, సమాజాన్ని  క్షాలనం చేసేయాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. బాగు బాగు. చక్కటి సాకు దొరికింది. వ్యవస్థ అంటే ఏమిటి? సమాజం అంటే ఎవరు? పక్కింటివాళ్ళు, ఎదురింటివాళ్ళు, మన  కాలనీవాళ్లు, వూళ్ళో వున్న పౌరులు, లేదా  మునిసిపాలిటీ, ప్రభుత్వం, ప్రభుత్వ అధికార్లు. అంతే. మనం  కాదు. ఈ వ్యవస్తలో  మనం మాత్రం  వుండం. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. పోనీ ఎప్పుడో వీలు చిక్కి అవకాశం వచ్చినా కన్నంలో దూరిన ఎలుకలా ఏమి పట్టనట్టు వుండిపోతాం. ఎవరో రాకపోతారా ఈ వ్యవస్థను బాగుచేయక పోతారాఅని ఎదురు చూపులు చూస్తుంటాం. లేదా ఏ అమెరికాకో వెళ్ళిపోయి వాళ్ల వ్యవస్థ యెంత గొప్పగా పనిచేస్తోందో చెప్పుకుంటూ అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాం. ఒకవేళ న్యూ యార్క్ లో పరిస్థితులు బాగాలేకపోతే, విమానం ఎక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం. అక్కడా అదే పరిస్తితి ఎదురవుతే గల్ఫ్ వెళ్ళే ఫ్లయిట్ పట్టుకుంటాం. అక్కడ ఖర్మకాలి యుద్ధం వస్తే భారత ప్రభుత్వం కలగచేసుకుని క్షేమంగా స్వదేశానికి చేర్చాలని డిమాండ్ చేస్తాం. అదీ మన పరిస్తితి. అదీ మన మనస్తత్వం. అంతే కాని,  వ్యవస్థను బాగుచేయడంలో మన వంతు పాత్ర ఏమిటని ఎవరం, ఎప్పుడూ ఆలోచించం. బాధ్యతలకు భయపడితే, అంతరాత్మలను డబ్బుకు తాకట్టు పెడితే ఇదే పరిస్తితి.
ఒకనాటి అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెనడీ తన దేశస్తులకు ఇచ్చిన సందేశాన్నే మనకు వర్తించేలా మరోరకంగా చెప్పుకుందాం.

భారత దేశం మనకు ఏమిచ్చిందని అడగొద్దు. దేశానికి మనం ఏం చేయగలమో చెబుదాం. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు  ఈనాడు యెలా వున్నాయో అలా భారత దేశాన్ని తయారుచేయడానికి మనం ఏం చేయగలమో దాన్నిచేద్దాం.  (14-08-2012)

కామెంట్‌లు లేవు: