4, నవంబర్ 2014, మంగళవారం

రేడియోకు జీవం పోస్తున్న ప్రధాని మోడీ

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 06-11-2014, THURSDAY)

చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు'  ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న  రోజులవి.  ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు  మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక  ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా రేడియోని పక్కన బెట్టి  ముఖ్యమంత్రిగారు 'టీవీ' లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ,  నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి,  'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
ప్రధాన మంత్రి మోడీ రేడియో ప్రసంగాల పుణ్యమా అని ఈ నేపధ్యాన్ని మరో మారు నెమరువేసుకోవాల్సివచ్చింది.


దేశంలో లెక్కకు మిక్కిలిగా  ఇన్నిన్ని టీవీ ఛానల్స్ వుంటే ప్రధాని గారు తన మనస్సులో మాట (మన్ కీ బాత్) ను  ప్రజలతో పంచుకోవడానికి రేడియోనే ఎందుకు ఎంచుకున్నట్టు. ఎందుకంటె తనుచేప్పేది ఎవరికి చేరాలని  అనుకుంటున్నారో ఆయనకు బాగా తెలుసు కనుక. ఆయన లక్ష్యం సాధారణ ప్రజలు కనుక.  వారికి చేరువగా వుండే ప్రసార మాధ్యమం రేడియో. కరెంటు వున్నా లేకపోయినా పనిచేస్తుంది. పనిపాట్లు చేసుకునే వాళ్ళు కూడా తమ పని చెడగొట్టుకోకుండా వినొచ్చు. రైతులు, గ్రామీణ మహిళలు, వ్యవసాయ కూలీలు, రోడ్డు పక్కన, తోపుడుబళ్ళ మీద    చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చెప్పులు కుట్టుకునేవాళ్ళు,  ప్రయాణాల్లో వున్నవాళ్ళు ఇలా  అందరికీ అందుబాటులో వున్న సాధనం రేడియో అన్న ఎరుక కలిగిన వ్యక్తి కనుకనే  ప్రధానమంత్రి ప్రజలకు చేరువ కావడానికి ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. దసరా పండుగ నాడు ప్రధాని మోడీ ఈ రేడియో ప్రసంగ పరంపర మొదలుపెట్టారు. కారణం తెలియదు కానీ రేడియోలో  ఎలా మాట్లాడాలి అనే విషయంపై  ప్రధానికి మంచి అవగాహన  వున్నదని  ఈ ప్రసంగాలు వినేవారికి అనిపిస్తుంది. రేడియోలో ప్రసంగాన్ని  చదివినా పైకి మాట్లాడినట్టు వినిపించాలి.  భాష కూడా సరళంగా వుండాలి. పెద్ద పెద్ద పద ప్రయోగాలు కూడదు. అప్పుడే మనసులోని మాటల్ని జనం మనసుపెట్టి వింటారు. రేడియోకి సంబంధించిన ఈ ధర్మసూక్ష్మం మోడీ గారికి బాగా తెలిసినట్టు వుంది. గత ఆగస్టులో ఎర్రకోట మీద నుంచి ఆయన చేసిన ప్రసంగం గుర్తుంది కదా. సాంప్రదాయక విధానానికి స్వస్తి చెప్పి, అధికారులు తయారు చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని పక్కనబెట్టి, సాధారణ ప్రజలకు సులువుగా అర్ధం అయ్యే రీతిలో, మామూలు మనుషులు మాట్లాడుకునే  భాషలో ఆయన మాట్లాడారు. అది దేశ వ్యాప్తంగా ప్రజల మనసుల్ని చూరగొన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కాబోలు, తన మనసులోని మాటని జనాలతో చెప్పుకోవడానికి ఆయన కొత్తగా రేడియో ప్రసంగ ప్రక్రియను ప్రారంభించారు. ప్రధానమంత్రి కార్యాలయానికి అందుతున్న సమాచారాన్ని బట్టి  మోడీ మహాశయులు మొదలెట్టిన  ఈ కొత్త కార్యక్రమానికి శ్రోతల ఆదరణ విశేషంగా వున్నట్టు తెలుస్తోంది. ఆయన మాటల్లో ఎక్కువగా గాంధీగారి పేరు ప్రస్తావనకు రావడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా సందర్భానికి అనువుగానే ప్రధాని మాటల్లో గాంధీ  పేరు వస్తోందని అనుకోవచ్చు. అక్టోబర్ మూడో తేదీన ప్రారంభించిన  ఈ ప్రసంగ  ప్రహేళికను ప్రధాని,  'ఖాదీ వస్త్రధారణ, నేటి పరిస్తితుల్లో దాని ఆవశ్యకత' అనే అంశంతో మొదలు పెట్టారు.
"మీతో ఇలా రేడియోలో  మాట్లాడడం అనేది నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఒక్క రేడియో ద్వారానే నేను మిమ్మల్ని, ముఖ్యంగా పేదవారినీ, పల్లె ప్రజల్నీ కలుసుకోగలుగుతాను' అని చెప్పారు మోడీ తన ప్రసంగంలో. ఇది ఆయన మనసులోని మాట మాత్రమే కాదు, వాస్తవం కూడా.
'ప్రజలనుంచి  నాకెన్నో విలువైన సలహాలు సూచనలు అందుతున్నాయి. వాటిని చదువుతుంటే నాకు చాలా సంతోషంగా వుంది. మంచి ప్రభుత్వం మంచి పాలన  గురించి మీకు ఎలాటి ఆలోచనలు వున్నా వాటిని నాకు పంపండి. నేను వాటిని చదవడమే కాదు రేడియో ప్రసంగాలలో వాటిని నేను మీతో పంచుకుంటాను.' అని ప్రధాని అన్నారు.  
ప్రతిపక్ష కాంగ్రెస్ మొదట్లోనే తప్పుపట్టింది. 'మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు ముందు ప్రధాని చేసిన రేడియో ప్రసంగం ఎన్నికల నియమావళికి విరుద్ధం' అంటూ ఎన్నికల కమీషన్ కు పిర్యాదు కూడా చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆకాశవాణి  యంత్రాంగాన్ని దుర్వినియోగం  చేయడమే అని కాంగ్రెస్ ఆరోపించింది.
నవంబర్ రెండో తేదీన ప్రసారం అయిన రెండో కార్యక్రమంలో  ప్రధాని 'నల్ల ధనం' గురించి ప్రస్తావించారు. సుప్రీం ఆదేశాల  దరిమిలా పాలకపక్షం కొంత ఆత్మ రక్షణలో పడ్డట్టయింది. అందుకే మోడీ తెలివిగా ఈ  అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ అంశంపై ప్రభుత్వ విధానాన్ని అరమరికలు లేకుండా ప్రజలకు తెలియచెప్పడానికి మంచి ప్రయత్నం చేసారు.

ప్రధాని రేడియో ప్రసంగాల గురించి  దేశ వ్యాప్తంగా చేసిన ప్రచారానికి కోటి  రూపాయలవరకు ప్రజాధనం  ఖర్చు చేసారని కూడా గుసగుసలు వినవస్తున్నాయి. సరే! ఇవన్నీ షరా మామూలుగా రాజకీయాల్లో సహజమే కాబట్టి అసలు విషయం ఒకటి ముచ్చటించుకుందాం.
రాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకోవడంలో వారికి వుండే ఆకర్షణ శక్తికి వారి ప్రసంగ పాటవం తోడవుతుంది. రెండో  ప్రపచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రధానిగా వున్న విన్ స్టన్ చర్చిల్ 'రాజకీయ నాయకులకు వాక్చాతుర్యం, వాక్పటిమను మించిన ఆయుధం లేదన్నారు. బహిరంగ సభల్లో వారు  చేసే ఉపన్యాసాల బలమే వారి అసలు బలం అన్నారు.  ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా  అధ్యక్ష ఎన్నికల్లో  డెమోక్రాటిక్ పార్టీ  అభ్యర్ధిగా నామినేట్ కావడానికి దోహదం చేసిన అంశాలలో ఇదొకటి. అమెరికా అధ్యక్షుడిగా తొలి పర్యాయం ఎన్నిక కావడానికి కూడా ఒబామా  ప్రసంగశైలి బాగా ఉపకరించిందని చెబుతారు.  భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చక్కని వక్త. ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో, వారిని ఉత్తేజపరిచే బాణీలో మాట్లాడడం ఆయనకు కొట్టిన పిండి. లోక్ సభ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ చేసిన ప్రసంగాలే  బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాయని నమ్మేవారు వున్నారు. అందుకే తనకున్న ఈ 'అర్హతను' రేడియో ప్రసంగాల ద్వారా ప్రదర్శించి ప్రజల మనస్సులను గెలుచుకునే క్రమంలోనే మోడీ ఈ మనసులోని మాట కార్యక్రమాన్ని మొదలుపెట్టారని అనుకోవాలి. ఐతే మరో నిజాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి. ధాటీగా ప్రసంగాలు చేసే వాళ్ళందరూ గొప్ప నాయకులు కాలేరు. గొప్ప నాయకులందరూ విధిగా బాగా మాట్లాడేవారు అయివుండనక్కరలేదు. కాకపోతే గొప్ప నాయకుడికి గొప్పగా ప్రసంగించే సత్తా వున్నప్పుడు ఆయన మరింత గొప్ప నాయకుడు కాగల అవకాశాలు కూడా గొప్పగా వుంటాయి.                    
గొప్పగా మాట్లాడి చరిత్ర గతిని మార్చిన సందర్భాలు చరిత్రలో కానవస్తాయి. అమెరికాలో అబ్రహం లింకన్ ఒకసారి రెండే  రెండు నిమిషాలపాటు ప్రజలనుద్దేశించి బహిరంగంగా  ప్రసంగించారు. ఉపయోగించినవి  కూడా పదే పది  వాక్యాలు. ఆ ప్రసంగం ఎంతటి ప్రభావం చూపిందంటే  అమెరికాలో వేళ్ళూనుకుని వున్న  బానిసత్వం అనే దురాచారం కూకటివేళ్ళతో కూలిపోవడానికి  దోహదం చేసింది. అలాగే,  వందేళ్ళ తరువాత 'నాకో కల వుంది' అంటూ వాషింగ్టన్ లోని లింకన్  మెమోరియల్ మెట్లమీద  నిలబడి మార్టిన్ లూధర్ కింగ్  చేసిన ప్రసంగం ఆ దేశంలో  జాతి వివక్షకి చరమ గీతం పాడింది.
ప్రధాని మోడీ నవతరాన్ని విశేషంగా ఆకర్షించడానికి ఆయనకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి ఆధునిక సోషల్ మీడియాలో వున్న అనుభవమే చాలావరకు ఉపయోగపడింది. ఆయన ట్విట్టర్ ఖాతాకు ఇంచుమింహుగా డెబ్బయి లక్షల మంది ఫాలోయర్లు వున్నారు. ఇక ఫేస్ బుక్ లో మోడీ గారి పేజీకి ఏకంగా కోట్లాదిమంది 'లైక్స్' వస్తున్నాయి అంటే ఈ రెండు మాధ్యమాలలో మోడీకి వున్న ఆదరణ అర్ధం అవుతుంది. ఇక ఇప్పుడు అయన మరో బ్రహ్మాస్త్రాన్ని తన అంబుల పొదిలో చేర్చుకున్నారు. అదే ఆకాశవాణి. దేశవ్యాప్తంగా 413  రేడియో స్టేషన్లు వున్నాయి. మొట్టమ జనాభా  120 కోట్లమందిలో 99.19 శాతం మంది ప్రజలకు రేడియో ప్రసారాలు అందుబాటులో వున్నాయి.
ఇప్పుడు అర్ధం అయింది కదా మోడీ జనాలకు దగ్గర కావడానికి రేడియోనే ఎందుకు ఎంచుకున్నారో. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఇది మొదలు పెట్టినప్పటికీ ఒక మంచి పని జరిగింది. ఒకనాడు తన ప్రసారాలతో దేశంలో 'సస్య విప్లవానికి' దోహదం చేసిన రేడియోకి, ప్రస్తుత పోటాపోటీ కాటా కుస్తీ పోటీల యుగంలో కనుమరుగు అవుతోందని జాతి జనులు వేదన చెందుతున్న రేడియోకి మోడీ మళ్ళీ జవసత్వాలు సమకూరుస్తున్నారు. పూర్వ వైభవాన్ని, ఔన్నత్యాన్ని, గౌరవ మర్యాదలను, గుర్తింపును తెచ్చిపెడుతున్నారు. గత కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో సయితం రేడియో గురించిన కబుర్లే, రేడియో గురించిన ప్రసంగాలే. రేడియో గురించిన చర్చలే. ఇంతవరకు మోడీ గారిని మనః స్పూర్తిగా అభినందించాలి.
ఉపశృతి: 1935లో హైదరాబాదు డెక్కన్ రేడియో,  ఆ తరువాత సెప్టెంబర్ పదో తేదీన  మైసూరులో ఒక రేడియో కేంద్రం ఏర్పాటు చేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వశాస్త్ర  ఆచార్యులుగావున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి ఆ కేంద్ర సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. (04-11-2014)

NOTE: Courtesy Image Owner 

4 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

"...పనిపాట్లు చేసుకునే వాళ్ళు కూడా తమ పని చెడగొట్టుకోకుండా వినొచ్చు...."

బాగా చెప్పారు శ్రీనివాసరావుగారూ.

ఆకాశవాణి అన్న పేరు సూచించిన వారు ప్రముఖ హిందీ కవి శ్రీ పండిట్ నరేద్ర శర్మ అని నా దగ్గర ఉన్న సమాచారం. ఆంగ్లంలో మాత్రం ఇప్పటికీ All India Radio గానే వ్యవహరిస్తున్నారు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ SIVARAMAPRASAD KAPPAGANTU గారికి-'నేనూ సాధికారికంగా ఆ మాట చెప్పలేదు. మరొకరు ప్రస్తావించిన విషయాన్నే ఉదహరించాను.ఆకాశవాణి నామకరణం చ్జేసిన వారి గురించి నిర్ధారణగా మీ దగ్గర ఏదయినా సమాచారం వుంటే పంపండి. ముందస్తుగా ధన్యవాదాలు' - భండారు శ్రీనివాసరావు. NOTE: Hope you have my email.

Saahitya Abhimaani చెప్పారు...

నా దగ్గరా సాధికారికంగా సమాచారం లేదు. ఒకచోట రవీంద్రనాథ్ టాగోర్ అని మరొకచోట మైసూరులో మొదటి రేడియో పేరు ఆకాశవాణి అని ఉన్నది. చివరకు ఎవరన్నా మన ఆకాశవాణి చరిత్ర వ్రాయగలిగిన వారు వస్తే కాని ఈ మిస్టరీ విడివడేట్టుగా లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇద్దరి పేర్లు ఒకటి మీరు చెప్పిన అనంత కృష్ణగారు మరొకరు నాకు తెలిసిన నరేద్ర శర్మ గారు ఆ పైన రవీంద్రనాథ్ టాగోర్.

అజ్ఞాత చెప్పారు...

భండారు వారి సెహ భేష్ ఐన మరో ఆణి ముత్యం ఈ టపా !!

ఖచ్చితం గా ఆకాశ వాణి కి మళ్ళీ కళ వస్తుందని ఆశిస్తా. ఈ వేవ్ లో ఆకాశ వాణి వాళ్ళు సరి కొత్త విధానా లని అవలంభించి తమ ప్రసార మాద్యం పాపులారిటీ పెంచ డానికి కర్తవ నిర్వహణ లో దిగాలి కూడాను !


చీర్స్
జిలేబి