(Published in 'SURYA' telugu daily in its Edit page on 20-11-2014, Thursday)
పార్టీ ఫిరాయింపుల పర్వం
తెలంగాణా అసెంబ్లీని కుదిపివేస్తోంది. తమ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన ఈ
అంశాన్ని కాంగ్రెస్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సభనుంచి వరుస సస్పెన్షన్ లకు గురయిన కాంగ్రెస్ సభ్యులు ఏకంగా గవర్నర్ కే
పిర్యాదు చేసారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, టీ.ఆర్.ఎస్. దుందుడుకు చర్యలకు
ముకుతాడు వేయాలనీ కోరారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను
ప్రోత్సహిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును అనర్హుడిగా ప్రకటించి తక్షణం ఆయన్ని ఆ పదవినుంచి తప్పించాలని విజ్ఞప్తి
చేసారు.
పార్టీ ఫిరాయింపులను
దొంగతనంతో సమానంగా పరిగణించాలని ఫిరాయింపుల తాకిడితో తల్లడిల్లుతున్న తెలంగాణా
కాంగ్రెస్ కోరుతున్నట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.
నిజమే. ఒక పార్టీ
టిక్కెట్టుపై ఎన్నికయిన వారిని మరో పార్టీలోకి తీసుకోవడం అంటే ఒక రకంగా అది
దొంగతనమే. మరొకరి సొత్తును అపహరించడమే. కానీ 'నేను చేస్తే ఒప్పు నువ్వు చేస్తే
తప్పు' అనే ద్వంద్వ వైఖరే ఈ వాదానికి బలం లేకుండా నిర్వీర్యం చేస్తోంది.
గతంలో ఎన్నికలకు ముందూ,
లేదా ఎన్నికలు ముగిసిన తరువాత కొద్దికాలం పాటు ఈ ఫిరాయింపులు నడిచేవి. మారుతున్న కాలానికి
పరిస్తితులకు అనుగుణంగా ఇప్పుడవి
నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఎవ్వరు కారణం అంటే అన్ని పార్టీలకూ ఇందులో అంతో ఇంతో
భాగం వుంది. ఈ సంస్కృతి ప్రబలడానికి అందరూ ఎంతో కొంత పాత్ర పోషించబట్టే గట్టిగా తమ
వైఖరిని సమర్ధించుకోవడానికి అదే అడ్డం పడుతోంది. ఫిరాయింపులను పోత్సహించేవారు, ఫిరాయింపులవల్ల
నష్టపోయేవారిని ఉద్దేశించి 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అని ఎద్దేవా చేయడానికి
వీలు కల్పిస్తోంది.
తెలంగాణా ప్రాంతానికి
సంబంధించి ఫిరాయింపుల తాకిడికి ఎక్కువగా నష్టపోయింది తెలుగు దేశం పార్టీ. 'ఇక
తెలంగాణాలో టీడీపీకి భవిష్యత్తు లేద'ని అధికారపక్షం అయిన టీ.ఆర్.ఎస్. నాయకులు
చేసిన, చేస్తున్న ప్రచారానికి భయపడో, లేదా
తమ భవిష్యత్తును మరింత ఖచ్చితంగా చెప్పాలంటే వర్తమానాన్ని పదిలం చేసుకోవాలనే తాపత్రయంతోనో కొందరు టీడీపీ
నాయకులు పార్టీని విడిచిపెట్టి టీ.ఆర్.ఎస్. తీర్ధం పుచ్చుకోవడం జరిగింది.
మరికొంతమంది తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఈ బాటలోనే వున్నారని ప్రచారం సాగుతోంది. అధికారంలో
వున్నన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని వుండి, అన్ని రకాల పదవులను, వాటి తాలూకు వైభోగాలను
అనుభవించి, తీరా అధికారానికి దూరం కాగానే పార్టీని విడిచిపెట్టి వెళ్ళడం కేవలం స్వార్ధం కోసమే అని టీడీపీ
నాయకులు చేస్తున్న ప్రకటనలకు ప్రజల్లో ఆదరణ దొరకకపోవడానికి కారణం కూడా గతంలో వారు అనుసరించిన ఇటువంటి విధానాలే. గత అయిదేళ్ళ కాలంలో ఇలాటి సందర్భాలు
అనేకం అందరికీ అనుభవైకవేద్యం. 'వేరే పార్టీవాళ్లు తమ పార్టీలోకి వస్తే అది తమ ఘనత అనీ, తమ శక్తి సామర్ధ్యాలపట్ల అపార నమ్మకంతోనే వాళ్ళు తమ పార్టీలో చేరారనీ లోగడ ఘనంగా చెప్పుకున్న
విషయమే ఇప్పుడు ముందరి కాళ్ళకు బంధంగా మారింది. పార్టీ ఫిరాయింపులకు గురవుతున్న
అన్ని పార్టీలదీ ఇదే వరస. ఎందుకంటె ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. ఎవ్వరికీ పార్టీ ఫిరాయింపులనేవి
అంత అంటరానివి కావు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్
లో ఇక భవిష్యత్తు లేదు అని నిర్ధారణ
చేసుకున్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరడానికి బారులు తీరినప్పుడు, వారిని పార్టీలో
చేర్చుకోవడం నీతి బాహ్యం అని భావించి తలుపులు మూసివున్నట్టయితే ఆ పార్టీకి ఇప్పుడు
విమర్శించడానికి తగిన నైతిక బలం చేకూరివుండేది. ఎన్నికలు ముగిసి ప్రజలు తమకు
పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు అప్పగించిన తరువాత కూడా వై.సీ.పీ. నుంచి
గెలుపొందిన ఒక పార్లమెంటు సభ్యుడిని టీడీపీలో చేర్చుకున్నప్పుడు కూడా ఆ చర్య
అనైతికం అని అనిపించకపోవడం అవకాశవాద
రాజకీయాలకు పరాకాష్ట, అప్పుడది రాజకీయ అవసరం. కాబట్టి జంపు జిలానీలకు పార్టీలో
స్థానం కల్పించారు. ఈ పార్టీ ఆ పార్టీ అనికాదు అందరూ ఈ విషయంలో ఒకే మాట, ఒకే బాట. అనుకూలంగా వున్నప్పుడు ఒక మాటా, ప్రతికూలంగా
వున్నప్పుడు మరో మాటా చెబుతూ వచ్చే ఇటువంటి రెండు నాలుకల ధోరణి కారణంగానే రాజకీయ నాయకుల
మాటల పట్ల ప్రజలకు విశ్వాసం కొరవడుతోంది.
సరే. ఇదంతా వర్తమానం.
ముందు ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి గతంలోకి కొంత తొంగి చూస్తె ముందేం చేస్తే బాగుంటుంది అన్న విషయం బోధపడే అవకాశం
వుంటుంది.
పార్టీ ఫిరాయింపులకు
మొదటి బీజం పడింది, స్వతంత్ర భారతంలో 1967 లో జరిగిన నాలుగో
సార్వత్రిక ఎన్నికల అనంతరం. ఆ విత్తనం యెంత
బలంగా పడిందంటే ఈ ఫిరాయింపుల ఫలితంగా 1967 - 1973 మధ్య ఆరేళ్ళ
కాలంలో పదహారు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజలచేత ఎన్నికయిన మొత్తం రెండువేల ఏడువందలమంది ప్రజా ప్రతినిధులు,
తాము ఎన్నుకున్న వోటర్ల ప్రమేయం లేకుండా వేరే పార్టీల్లో చేరిపోయారు. 1967 నుంచి మూడేళ్ళలో
ప్రతి అయిదు మంది ఎమ్మెల్యేలలో ఒకరు పార్టీ మారారంటే ఫిరాయింపులు యెంత తీవ్రంగా
జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ప్రతిఫలం లేకుండా ఈ గోడ దూకడాలు జరగవు అనే
నమ్మకానికి ఊతం ఇవ్వడానికా అన్నట్టు అలా
దూకిన వాళ్ళలో పదిహేనుమంది ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. 212 మంది మంత్రులు కాగలిగారు.
వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకున్న బాపతు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ
వికృత పోకడలకు మొదటి అడ్డుకట్ట వేయడానికి మన రాజకీయ నాయకులకు దాదాపు పదిహేడేళ్ళు
పట్టింది.
1984 డిసెంబర్ 29 వ తేదీన
కర్ణాటకలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకుగాను నాటి పాలకపక్షం అయిన జనతా పార్టీని మట్టి కరిపించి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వం
లోని కాంగ్రెస్ ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుని తన సత్తా ప్రదర్శించింది. ఆనాడు
రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే వోటమికి నైతిక బాధ్యత వహించి గవర్నర్ కు మంత్రివర్గం
తరపున రాజీనామా పత్రం సమర్పించారు. మామూలుగా అయితే అటువంటి పరిస్తితుల్లో గవర్నర్
లేదా కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు. ఒకటి జనతా
పార్టీనుంచి ఫిరాయింపులు ప్రోత్సహించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం.
లేదా, రాష్ట్రపతి పాలన విధించడం. అంతకుముందు
శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడలకు అలవాటు పడిన వారందరూ యువనేత రాజీవ్
గాంధీ కూడా తల్లి బాటలోనే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని అనుకున్నారు.
అయితే రాజీవ్ గాంధీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కర్ణాటకలో అసెంబ్లీ రద్దు
చేయడానికి వీలుగా గవర్నర్ కు స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు రాజీవ్ యెంత
వ్యతిరేకం అన్నది ఈ ఒక్క ఉదంతంతో తేటతెల్లమయింది. అంతేకాదు, రాజీవ్ గాంధీ పార్టీ
ఫిరాయింపులను చాలా తీవ్రంగా తీసుకున్నారు. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన రెండోవారంలోనే
పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించి ఫిరాయింపుల
నిరోధక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా
పార్లమెంటులో తమ పార్టీకి వున్న తిరుగులేని ఆధిక్యతను ఆసరాగా చేసుకుని 52 వ రాజ్యంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చి ఈ దశగా
తొలి అడుగు వేసారు. ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఇటువంటి
చట్టాన్ని తీసుకువచ్చిందో అదే పార్టీ కాలక్రమంలో ఫిరాయింపులకు పుట్టిల్లుగా
మారింది. అయితే ఈ విషయంలో ఏ ఒక్క పార్టీకి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటె
ప్రతి పార్టీ తన స్వప్రయోజనాలకోసం ఈ చట్టానికి తూట్లు పొడవడమే కాకుండా చట్టంలోని
కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తూ
రావడం మరో విషాదం.
ఈ ఏడాది జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మన
రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన ఫిరాయింపులు చోటుచేసుకున్నాయి.
ఎన్నికలకు ముందు వివిధ పార్తీలకు చెందిన పందొమ్మిదిమంది
సీనియర్ నాయకులు తమ పార్టీలకు గుడ్ బై చెప్పి వేరే పార్టీల్లో చేరిపోయి పోటీ చేసారు. వీరిలో
పదహారుమంది సిట్టింగు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆఖరు నిమిషంలో గోడ దూకాలని తీసుకున్న వారి నిర్ణయానికి ప్రజల ఆమోదం
లభించలేదు. ఫలితంగా వోటమి చవిచూడాల్సి
వచ్చింది.
టీడీపీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఇరవై ఆరుమంది సీనియర్
కాంగ్రెస్ నాయకులకు తెలుగుదేశం తీర్ధం ఇవ్వడమే కాకుండా, టిక్కెట్లు, బీ ఫారాలు ఇచ్చి
ఎన్నికల బరిలో నిలబెట్టారు. అయన వ్యూహం సగం సగం పనిచేసింది. వారిలో పదమూడుమంది గెలిచారు. మరో
పదమూడుమంది పరాజయం పాలయ్యారు.
అలాగే తెలంగాణా ప్రాంతంలో టీ.ఆర్.ఎస్. అధ్యక్షుడు కేసీయార్ సయితం ఇదే ఎత్తుగడ అనుసరించారు. ఆయన వేరే
పార్టీల్లోని పదమూడుమంది సీనియర్లను పార్టీలో చేర్చుకుని ఎన్నికల గోదాలో నిలబెట్టారు. కాకపోతే ఈ ప్రయోగం మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. వీరిలో ఎనిమిది మంది వోడిపోగా, అయిదుగురు
గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సయితం ఎన్నికల చివరి ఘడియలో ఇద్దరు సిట్టింగు ప్రత్యర్ధి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని పోటీకి నిలబెట్టింది కానీ వారిరువురూ వోడిపోయారు.
ఈ రాజకీయ కప్పదాట్లు అనేవి
మన దేశానికీ, మన ప్రాంతాలకు మాత్రమే
పరిమితం కాదు. అనేక దేశాల్లో ఈ సంస్కృతి రెక్కలు విప్పుకుని విస్తరిస్తోంది.
ఉదాహరణకు నైజీరియా. వచ్చే ఏడాది అక్కడ జరిగే
ఎన్నికల మాటేమో కానీ రాజకీయ నాయకుల పార్టీ
మార్పిళ్లు మాత్రం చాలా వేగంగా పెద్దఎత్తున సాగుతున్నాయి. లేబర్ పార్టీ అభ్యర్ధిగా
గెలిచి గవర్నర్ అయిన ఒలుసేగం మిమికో గాలివాటం చూసుకుని ఆ పార్టీకి రాం రాం
చెప్పేసారు. 2009 ఫిబ్రవరిలో ఆయన ఆండో
స్టేట్ గవర్నర్ అయి, తిరిగి 2012
అక్టోబర్ లో సయితం అయన అదే లేబర్ పార్టీ టిక్కెట్టు పై మళ్ళీ గెలిచి మళ్ళీ గవర్నర్ కాగలిగారు. ఆ రాష్ట్రానికి ఇలా రెండోసారి వరుసగా గవర్నర్ అయిన వారు ఎవ్వరూ
లేరు. లేబర్ పార్టీ పుణ్యమా అని అలాటి రికార్డు అయన సొంతం అయింది. కానీ మిమికో ఈసారి రూటు మార్చి పాలకపక్షంలో
దూరిపోయి తన అదృష్టాన్ని మరో రకంగా పరీక్షించుకునే పనిలోపడ్డారు.
'పిల్లి చనిపోయేలోగా
ఏడు (గండాలు) చావులు తప్పించుకుంటుంది' అని ఆంగ్లసూక్తి. అనంబ్రా రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ పీటర్ ఓబీ ఈ సామెతకు సరిగ్గా అతికినట్టు
సరిపోతారు. ఈయన గారు అధికారంలో వున్న
రోజుల్లో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎల్లా అనే ఒక్క దానిమీదనే దృష్టి పెడతారని,
వేరే ధ్యాసలు ఏవీ పెట్టుకోరని ఆయనకో పేరుందని
అంటారు. అనడం ఏమిటి ఆయనపై ఇలాటివి చాలా కేసులు వున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడల్లా
పదవి పోగొట్టుకోవడం, మళ్ళీ కోర్టు నుంచి ఉపశమన ఉత్తర్వులు తెచ్చుకుని
తిరిగి పదవి పొందడం ఆయనకు అలవాటుగా మారింది. అదేమి చిత్రమో తెలియదు కానీ ప్రతిసారీ కోర్టు
రూలింగులు ఆయనగారికి అనుకూలంగానే వచ్చేవి. అందుకే పిల్లి ఏడు గండాలు తప్పించుకున్నట్టు ఆయనకూడా ప్రతిసారీ వొడ్డున
పడగలుతున్నారు. అన్ని తెలివితేటలు ఉండబట్టే ఈ సారి ఎన్నికలకు ఏడాది ముందే ఆయన
ముందు చూపుతో పాలకపక్షం పీడీపీలో చేరిపోయారు. అంతా ఇలా అధికారపక్షం వైపు దూకుతుంటే పాలక పక్షానికి చెందిన నాయకుడు, ప్రస్తుత పార్లమెంటు స్పీకర్ అయిన అమిను తంబువాల్, ఈ
మధ్యనే తన సొంత పార్టీ పీడీపీ ని వొదిలి పెట్టి ప్రతిపక్షం ఏపీసీ లో చేరి తన
అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చూడాలి ప్రజలు ఎవరి అదృష్టాన్ని ఎలా తిరగరాస్తారో. (19-11-2014)
(కార్టూనిస్ట్ శ్రీధర్ కి కృతజ్ఞతలతో)
3 కామెంట్లు:
deeniloo andarinee mention chesaaru gaanee taman priya mitrudu "MAHA METHA" ni marchipooyaaru
@Ram - రామ రామ
ఈ రోజు ఇందిర జయంతి అనుకుంటాను :) బాగా వ్రాశారు సర్. ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప పౌరులుగా చూడడం లేదు. ఫిరాయింపులకు ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పడక తప్పదు. ప్రస్తుతమైతే మీరన్నట్లు నీవు నేర్పిన విద్యయే అన్నట్లున్నది. అధికారం లోకి రావడానికి - నిలబెట్టుకోవడానికి ఎవడికి వాడు ఫేమిలీ పేకేజీలు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రజలను ఎల్లకాలమూ మోసం చేయలేరు. ప్రజల చైతన్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇందిరనూ , ఎన్.టీ.ఆర్ ను సైతం ఓడించిన చరిత్ర భారత ప్రజాస్వామ్యానికి ఉన్నది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి