ఎవరో అన్నట్టు ఈరోజుల్లో చాలా సినిమాలు
చూడలేనివే. కొన్ని కోట్లు పెట్టి తీస్తారు. పెద్ద యాక్టర్లు. పెద్ద పెద్ద
సెట్టింగులు. ముందుగా టిక్కెట్లు కొనుక్కుని వెడితే 'ఇంకా ఎప్పుడు అయిపోతుందిరా
నాయనా' అనిపిస్తాయి. ఆ విధంగా 'చూడలేని' సినిమాలు అవి. మరికొన్ని, నిజంగా చాలా
కొన్నే. వీటిని తీసేవారికీ దమ్ముండాలి. చూసేవారికీ దమ్ముండాలి. ఎవరో చెబితే పోనీ
చూద్దాం అనుకుని, ఆర్చుకుని తీర్చుకుని వెళ్లేసరికి 'ఆ బొమ్మ' ఎంచక్కా
ఎగిరిపోతుంది. ఆ విధంగా ఆ సినిమాలు కూడా 'చూడలేనివి'.
నిన్న ఆ రెండో బాపతు సినిమా ఒకటి చూడడం తటస్తించింది.
'చక్రవాకం' టీవీ సీరియల్ 'ఫేం' బిందు నాయుడు గారి భర్త డాక్టర్ బాలాజీ మొన్న ఫోన్లో మాట్లాడుతూ మాట వరసకు చెప్పినట్టు
చెప్పారు, 'పరంపర అనే సినిమా వచ్చింది
చూడండి' అని. 'వీలుంటే కాదు, వీలుచేసుకుని చూడండి, ఎందుకంటె ఇటువంటి సినిమాలు
ఎక్కువ రోజులు ఆడవు' అని ఆయన చెప్పకపోయినా విషయం నాకు అర్ధం అయింది.
ఆదివారం మధ్యాహ్నం జూబిలీ క్లబ్ లో జ్వాలా
ఫ్యామిలీ, మా ఫ్యామిలీ లంచ్. మాటల సందర్భంలో
మళ్ళీ 'పరంపర' ప్రస్తావన. అది ఎక్కడ ఆడుతుందో తెలుసుకుని ఆరుగంటల ఆటకు వెళ్ళండి
అని పదో నెంబరు కౌంటర్ లో నా పేరు చెప్పండి అని లంచ్ కు వచ్చిన బుంటీ చెప్పింది. 'మంచి
పుస్తకాన్ని కొని చదవాలి, మంచి సినిమా టిక్కెట్టు కొని చూడాలి' అని ఈ మధ్య ఓ
తిరుగులేని స్వచ్చంద ప్రతిన చేసుకుని
పాటిస్తున్న నేను, కాస్త ముందుగానే
థియేటర్ కు వెళ్లి పలానా వారు చెప్పిన పలానా కౌంటర్ దగ్గర పలానా వారి పేరు చెబుతుండగానే కౌంటర్లోని అమ్మడు
'ఎన్ని టిక్కెట్లు' అని అడిగింది. దాంతో బోధ పడింది చూడబోతున్న సినిమా 'రెండో రకం
చూడలేని' సినిమా అని.
సినిమా సంగతి ఎలా వున్నా హాలు బాగుంది. జనం
అనుకున్నట్టే పలచపలచగా వున్నారు. మొదటి రోజు 'మిధునం' సినిమాకు వెళ్ళినప్పుడు ఇదే
అనుభవం. చాలా సంవత్సరాలక్రితం హైదరాబాదులో 'శంకరాభరణం' మొదటి ఆట చూసినప్పుడు కూడా ఇదే సీను.
సినిమా మొదలయింది. డైరెక్టర్ ఫోటోగ్రఫీ రంగానికి
చెందిన వ్యక్తి అని నెట్లో చదివాను. అందుకే కాబోలు ప్రతి ఫ్రేము
చాలా అందంగా ఉండేట్టు జాగ్రత్త తీసుకున్నారు. తండ్రీ కొడుకుల కధ. చిన్న లైనుతో కధ
అల్లుకోవడం వల్ల దాన్నుంచి దారి తప్పిపోకుండా
సినిమా నడిపించారు. సినిమా ఇలా తీయాలని అనుకుని తీసినట్టు వుంది కానీ ఇలా తీస్తేనే
జనం చూస్తారు అనే భావనతో తీసినట్టులేదు. అంచేత సినిమాకు డాక్యుమెంటరీ ఛాయలు అద్దుకున్నాయి.
రాజీపడని ఈ తత్వం ఓ సారి సినిమాకు కీడు చేయవచ్చు, కొండొకచొ మేలూ చేయవచ్చు.
సినిమాలో ప్రధాన పాత్రధారి నరేష్. ఆయన అనగానే
మనకు జంధ్యాల జ్ఞాపకం వస్తారు. నవ్వులు జ్ఞాపకం వస్తాయి. అయితే, ఇలాటి సినిమాలు
తీసేవారికీ, చూసేవారికే కాదు అందులో వేషం వేసేవారికి కూడా దమ్ముండాలి. నరేష్, అయన
భార్యగా నటించిన అలనాటి సీనియర్ హీరోయిన్ ఆమని కూడా తమకు ఆ దమ్ముంది అని నిరూపించారు. మొదటి
నుంచి చివరి వరకు మాసిన నెరిసిన గడ్డంతో ఒక మధ్య తరగతి మానవుడిగా, నిత్య సమస్యలతో
సతమతం అయ్యే గృహస్తుగా, కోరికలకు తనకుతానే సమాధి కట్టుకుని జీవితంతో సమాధానపడే వ్యక్తిగా
నరేష్ ఇందులో నటించారు. ఆ మాటకు వస్తే ఇటువంటి సినిమాల్లో నటీనటులు నటించరు. అలా
అలా కధలో లీనమై జీవిస్తారు. నరేష్, ఆమని
కూడా అదేపని చేసారు.
'సినిమా అనగానే కాస్త మెలో డ్రామా వుండాలి వుండి
తీరాలి' అని సినీ పండితుల ఉవాచ. కానీ దర్శకుడు ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు. తను
అనుకున్నట్టు తాను తీసుకుంటూ పోయాడు. 'నేనిలాగే
తీస్తాను, చూస్తే చూడండి లేకపోతే లేదు'
అనే అనే గుండె ధైర్యం సినిమా అంతటా
నిండుగా పరచుకుంది.' చాలా సీరియస్ సినిమారా
బాబోయ్' అనే వాటిల్లో కూడా అక్కడక్కడా కొంత హాస్యం చిప్పరిల్లేలా జాగ్రత్తలు
తీసుకోవడం కద్దు. కానీ ఈ సినిమా దర్శకుడు మహా మొండివాడు. రాజీ పడే ధోరణి యెంత మాత్రం ఎక్కడా కానరాలేదు. అందుకు చెప్పాలి ఆయనకు
కంగ్రాట్స్.
పొతే, నాకు చాలా రోజులనుంచి గోదావరి జిల్లాల
గ్రామీణ సౌందర్యం వీక్షించాలని కోరిక. నేను కొన్న టిక్కెటు ఖరీదు అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే బస్సు
చార్జీకంటే తక్కువ. నేత్రపర్వంగా వున్నాయి దృశ్యాలు. అది చాలు అనిపించింది.
సినిమా చూసిన తరువాత బాగుందా లేదా అనే చర్చ ఎలాగూ
వుంటుంది. తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు.
నాకు మాత్రం ఒకటే అనిపించింది.
'ఈ సినిమా బాగుందా లేదా అనికాదు. మూసబాణీలో
కొట్టుకుపోతున్న తెలుగు చలన చిత్ర రంగాన్ని ఓ మలుపు తిప్పాలంటే ఇటువంటి సినిమాలు
అడపాదడపా రావాలి. అలా రావాలంటే సకృత్తుగా వచ్చే ఇటువంటి 'పరంపర' సినిమాలను
టిక్కెట్టు కొని చూసి, ఇలాటివి మరికొన్ని తీయడానికి మరి కొంతమంది ముందుకు వచ్చేలా చేయాలి.
సినిమా చూసిన ఇంకోటి కూడా నాకనిపించింది. నేను కొన్న నూట యాభయ్ రూపాయల టిక్కెట్టులో
మొత్తం సొమ్ము ఈ సినిమా తీసిన వారికే పొతే బాగుంటుందని.
అది సాధ్యం కాని పని. అలాగే 'పరంపర' వంటి సినిమాలు తరచుగా చూడ్డం
కూడా.
దర్శకుడు మధు మహంకాళి గారికి 'హాట్స్ ఆఫ్'
కానీ ఇలాటి హాట్స్ ఆఫ్ లు, అవార్డులు 'కాసు'కు
సమానం కావు కదా!
తోక టపా: ఇందులో మా రేడియో కోణం కూడా ఒకటుంది. చిత్రంలో ఒకచోట రేడియోలో వార్తలు వినబడుతుంటాయి. ఆ స్వరం ఎవ్వరిదయ్యా అంటే, మన ఈ ఫేస్ బుక్ ప్రపంచం మిత్రుడు, రేడియోలో ఇప్పటికీ వార్తలు చదువుతున్న పోణంగి బాలభాస్కర్ ది, వెంటనే ఫోను చేసి చెప్పాను.
(17-11-2014)తోక టపా: ఇందులో మా రేడియో కోణం కూడా ఒకటుంది. చిత్రంలో ఒకచోట రేడియోలో వార్తలు వినబడుతుంటాయి. ఆ స్వరం ఎవ్వరిదయ్యా అంటే, మన ఈ ఫేస్ బుక్ ప్రపంచం మిత్రుడు, రేడియోలో ఇప్పటికీ వార్తలు చదువుతున్న పోణంగి బాలభాస్కర్ ది, వెంటనే ఫోను చేసి చెప్పాను.
1 కామెంట్:
"...సినిమా ఇలా తీయాలని అనుకుని తీసినట్టు వుంది కానీ ఇలా తీస్తేనే జనం చూస్తారు అనే భావనతో తీసినట్టులేదు...."
అద్భుతమైన మాట చెప్పారు శ్రీనివాస రావుగారూ. నిజం ఇలాంటి సినిమాలు మరిన్ని వచ్చి, మళ్ళీ అదొక "మూస" కాకుండా, ప్రస్తుతం ఉన్న మూస సినిమా "ఆనవాయితీ" దురాచారాన్ని పారదోలాలి. ముంబాయిలో ఈ సినిమా వస్తుందో లేదో వచ్చ్నా మాకు తెలిసే లోగా వెళ్ళిపోతుందేమో అని బెంగ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి