ఏటా గోదారి వొడ్డున జరిగే సంతకు వెళ్లడం అచ్చయ్యకు
అలవాటు. ఒక ఏడాది కొత్తగా కాపురానికి
వచ్చిన తన పెళ్ళాం బుచ్చమ్మను కూడా వెంట
తీసుకు వెళ్లాడు..
గోదారి నదిలో లాంచి షికారు చేయాలని బుచ్చమ్మ
ఉబలాటం.
‘వామ్మో ఇంకేమైనా వుందా. రూపాయి టిక్కెట్టు.
రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి’ అని అచ్చయ్య సన్నాయి నొక్కులు.
మరుసటి ఏడూ ఇదే కధ. లాంచి ఎక్కాలని బుచ్చమ్మ. వామ్మో
రూపాయి టిక్కెట్టు వద్దని అచ్చయ్య.
ఇలా ఏండ్లు గడిచిపోతున్నాయి కాని బుచ్చమ్మ లాంచి
షికారు కోరిక తీరకుండానే వుండిపోయింది.
మళ్ళీ తిరుణాల రోజులు వచ్చాయి. అచ్చయ్య, బుచ్చమ్మను
తీసుకుని వెళ్లాడు.
లాంచీ కనబడగానే బుచ్చమ్మ అడిగింది మొగుడ్ని.
‘ నాకు డెబ్బయ్ ఏళ్ళు వచ్చాయి కాని, లాంచి ఎక్కాలన్న చిన్నప్పటి కోరిక మాత్రం తీరనే లేదు. ఈ ఏడాదన్నా ఎక్కిస్తావాలేదా!’
‘వామ్మో! రూపాయి పెట్టి ఆ లాంచి ఎక్కడం ఎందుకే.
వొడ్డున కూర్చుని చూస్తే సరిపోదా! రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి!’ మళ్ళీ
పాత పాటే కొత్తగా పాడాడు అచ్చయ్య.
లాంచీ నడిపే సరంగు మొగుడూ పెళ్లాల మాటలు
విన్నాడు.
‘రూపాయి టిక్కెట్టు కొంటే మీ ఇద్దర్నీ లాంచి
ఎక్కిస్తాను. కాని ఓ షరతు. తిరిగి వచ్చిందాకా మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ నోరు
మెదపకూడదు. నోరు తెరిచారంటే ఓ రూపాయి ఎక్కువ వసూలు చేస్తాను’
ఇద్దరూ ఆ షరతుకు వొప్పుకుని లాంచీ ఎక్కారు.
ఎక్కిన దగ్గరనుంచి మూగనోము పట్టారు. నోరు తెరిస్తే వొట్టు. భార్య పొరబాటున నోరు
విప్పితే రూపాయి డబ్బులకు నీళ్ళు వొదులుకోవాలని అచ్చయ్య భయం.
వాళ్లని మాటల్లో పెట్టి మాట్లాడించాలని సరంగు
విశ్వప్రయత్నం చేసాడు. బోటును నదిలో గింగిరాలు కొట్టించాడు. కానీ, ఇద్దరూ కిమ్మిన్నాస్తి.
లాంచి దిగిన తరువాత సరంగు అచ్చయ్యను అడిగాడు అంత మౌనంగా ఎలావున్నారని.
‘మధ్యలో బుచ్చమ్మ నదిలో పడిపోయింది. అప్పుడు అరచి
చెబుదామనుకున్నాను. కానీ, రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి’
సరంగుకు నోట మాట పడిపోయింది.
(ఈ ఇంగ్లీష్ కధని పంపిన మోచర్ల కృష్ణమోహన్ గారికి
కృతజ్ఞతలు)