5, జులై 2013, శుక్రవారం

హెల్మెట్ - 1987


ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హెల్మెట్ ధారణను  నిర్బంధం చేయడంతో సామాన్య ప్రజలనుంచే కాకుండా జర్నలిస్టుల నుంచి కూడా నిరసనలు మొదలయ్యాయి. కే.ఎస్. వ్యాస్ గారు ట్రాఫిక్ డీసీపీ. చాలా సమర్దుడయిన పోలీసు అధికారి.  హెల్మెట్ నిబంధనను అమలు చేసే విషయంలో కొత్త పుంతలు తొక్కారు. ప్రధాన కూడళ్ళలో ప్రత్యెకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసి హెల్మెట్ లేని వాళ్ళను మోటారు సైకిళ్ళపై  వెంటాడి పట్టుకుని జరిమానాలు వేయడం మొదలు పెట్టారు. ఇది జనంలో చాలా అసహనానికి దారితీసింది. ఇంటలిజెన్స్ చీఫ్ హెచ్ జే దొరగారికీ, పోలీసు కమీషనర్ టీ ఎస్ రావు గారికీ విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఎందుకంటే రామారావుగారికి చెప్పగల ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకరోజు పొద్దున్నే నేను జూబిలీ హిల్స్ లోని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి హెల్మెట్ విషయంలో జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు  గురించి చెప్పాను. వారు విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ అనేక చోట్లకు వెళ్ళాల్సి ఉంటుందని, అసలే చాలీచాలని జీతాలతో వెళ్ళదీస్తున్న వారికి – హెల్మెట్ పోయినా, లేదా ఎక్కడయినా మరచిపోయినా అంతంత డబ్బులు పోసి  కొనుక్కోవడం కష్టంగా ఉంటుందని చెప్పాను. ఆయన అంతా విని దొరగారికి ఫోను చేసి,  ఏదయినా చేయొచ్చేమో చూడమని చెప్పారు.
బహుశా ఆ మరునాడే అనుకుంటాను. 1987 జులై 14  వ తేదీ.   ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి, మాజీ మంత్రి, అప్పటి శాసనసభ్యులు అయిన ఎన్. అమర్ నాధ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించడంతో అసెంబ్లీ వాయిదా పడింది. రేడియో వార్తలకు ఇంకా చాలా వ్యవధానం వుండడంతో ఆంద్రభూమిలో పనిచేసే నా మిత్రుడు సూర్యప్రకాష్ ను ఇంట్లో దింపడానికి స్కూటర్ మీద విజయనగర్ కాలనీకి  బయలుదేరాను. మధ్యలో ట్రాఫిక్ పోలీసు హెల్మెట్ లేదని ఆపాడు. దగ్గరలో వున్న హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళాడు. నా వెంట వచ్చిన సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి,  నన్ను పోలీసులు పట్టుకుపోయిన విషయం ఇతర జర్నలిస్టులకు తెలియచేసాడు. అంతే! బిలబిల మంటూ అనేకమంది పాత్రికేయ సోదరులు అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. నేను లోపల పోలీసు స్టేషన్ లో ఉన్నందువల్ల గమనించలేకపోయాను కానీ తరువాత తెలిసినదేమిటంటే చాలామంది సీనియర్ పాత్రికేయులు కూడా అక్కడికి వచ్చి నాకు మద్దతుగా నిలిచారని. వారిలో హిందూ రాజేంద్రప్రసాద్, ఎక్స్ ప్రెస్ సుందరం, జ్యోతి వెంకట్రావు, క్రానికల్ రబీంద్ర నాథ్, సింహం, కన్నన్, పేట్రియాట్ ప్రభాకరరావు, న్యూస్ టైం కే.శ్రీనివాసరెడ్డి (ఇప్పుదు రెసిడెంట్ ఎడిటర్ హిందూ, బెంగుళూర్ ఎడిషన్)  జర్నలిస్ట్  యూనియన్ నాయకులు కే. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, కే.లక్ష్మారెడ్డి, నందిరాజు రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, నర్సింగరావు  ఒకరా ఇద్దరా హైదరాబాదులో పేరుమోసిన పాత్రికేయులందరూ హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. పరిస్తితిలోని తీవ్రత పోలీసులకు కూడా అర్ధం అయింది.

(హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేసున్న జర్నలిస్టులు)

మొత్తం మీద జర్నలిస్టుల ఆందోళన కారణంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో  నన్ను విడిచిపెట్టారు. కానీ మరునాడు విలేకరులు  అసెంబ్లీ కార్యకలాపాలను బహిష్కరించారు. ప్రెస్ గ్యాలరీ ఖాళీగా వుండడం గమనించి స్పీకర్ జీ. నారాయణ రావు సభను వాయిదా వేసారు. అప్పుడు  ముఖ్యమంత్రి  రామారావు గారు  వెంటనే స్పందించారు. సంఘటనతో సంబంధం వున్న పోలీసు అధికారిని బదిలీ చేసారు. న్యాయ విచారణకు ఆదేశించారు.   కొత్తగా హోమ్  మంత్రి  బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కోడెల శివప్రసాద్ రావుకు ఈ పరిణామాలు సహజంగానే ఇబ్బందికరంగా పరిణమించాయి. హెల్మెట్ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయలేదు కాని దాన్ని అమలు చేసే పద్ధతిలో కొంత ఉదార వైఖరి చోటు చేసుకుంది. ఈ నడుమలో నాకు మాస్కో రేడియోలో ఉద్యోగం రావడం, నేను కుటుంబంతో సహా సోవియట్ యూనియన్ వెళ్ళిపోవడం జరిగింది.   
దరిమిలా  ఈ హెల్మెట్ అంశం రాజకీయ రంగును పులుముకుంది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలలో హెల్మెట్ రద్దు అంశం కూడా చేర్చారు. ఆఎన్నికల్లో టీడీపీ వోడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జరిగిన  విజయోత్సవ సభలో హెల్మెట్ నిబంధనను  రద్దు చేస్తున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారని ఆయనకు పీ ఆర్ ఓ గా పనిచేసిన జ్వాలా నరసింహారావు మాస్కోలో వున్న నాకు ఫోనులో తెలియచేసాడు.
వాహనదారులకు రక్షణ కవచంలా ఉపయోగపడే హెల్మెట్ విషయంలో జర్నలిస్టులు ఇంత  గొడవ పడడం సబబా అన్న విమర్శలు కూడా వినపడ్డాయి. ఆ పూర్వాపరాలు మరో సారి. (05-07-2013)                                                   


3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఈ పొగరుబోతు పనివల్ల ఎన్నివేల ప్రాణాలు గాల్లో కలిసిపొయాయో, ఎవడేమైపొతే మనకెందుకట, మన పంతం మనదే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత -హెల్మెట్ ఆందోళన – పూర్వాపరాలు -1
http://bhandarusrinivasarao.blogspot.in/
పాత విషయాలను ముచ్చటించుకునేటప్పుడు కాల ధర్మాన్ని గమనంలో పెట్టుకోవాలి. నాటి పరిస్తితులను దృష్టిలో వుంచుకోవాలి. పౌర సమాజంలో పాలకులు విధించే నియమ నిబంధనలు, వాళ్ళు ప్రవచించే నీతి సూత్రాలు ఎన్నో వుంటాయి. వాటిని గౌరవించి తీరాలి కూడా. కాకపొతే, ఒక్కోసారి నిబంధనలను అమలు చేసే తీరుతెన్నులే విమర్శలకు గురవుతుంటాయి. ఉదాహరణకు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. అలాగని ప్రత్యెక పోలీసు బృందాలను నియమించి రోడ్లపై సిగరెట్ తాగేవాళ్ళని వేటాడి పట్టుకుని జరిమానాలు విధించారనుకోండి. అదిగో అప్పుడే వస్తుంది చిక్కు. ఇదిగో ఇలాటిదే హెల్మెట్ నిబంధన. అది అమలు చేయడంలో విచక్షణారహితంగా పోలీసులు నాడు అంటే 1986-87 లో వ్యవహరించిన తీరు. ఓ మోస్తరు వేగంతో కూడా స్కూటర్లు నడపడానికి అనువుగా లేని రోడ్లు. ఆ రోజుల్లో హైదరాబాదులో వాటి పరిస్తితి ఎలా వుండేదో నేటి నెటిజన్లకు తెలిసే అవకాశం లేదు.
ఏ రోడ్డు చరిత్ర చూసినా ......

రోడ్లపైన వరదలా చేరు వాన నీరు
కాలు జారు ప్రమాదాలు అడుగడుగున జోరు
ఒక్క వాన మాత్రంతో రోడ్లతీరు మారు
సైడు కాల్వలుప్పొంగి ఏకమయ్యి పారు
రోడ్డేదో గుంటేదో దేవుడికే తెలుసు
స్కూటరిస్టులంటేనే ఖాకీలకు అలుసు
అలాటి రోడ్లమీద అతివేగం మాట అటుంచి అసలు డ్రైవ్ చేయడమే నానా యాతనగా వర్ణిస్తూ రాసిన ఈ మాదిరి వ్యంగ్య రచనలు అధికార యంత్రాంగం కళ్ళు తెరిపించకపోగా సరిగ్గా ఈ నేపధ్యంలోనే వచ్చి పడింది ఈ నిర్బంధ హెల్మెట్ ధారణ నిబంధన.
హెల్మెట్లను వ్యతిరేకించడం అంటే పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూస్తూ ఊరుకోవడం అన్న వాదనను కొందరు లేవదీసారు.
ఆరోజుల్లో పోలీసు కమీషనర్ ను కలిసి ఒక లేఖ ఇచ్చాను.
“అయ్యా కమీషనర్ గారు –
“హెల్మెట్ల విషయంలో పోలీసుల్ని విమర్శించే వాళ్ళందరూ హెల్మెట్ నిబంధనకు వ్యతిరేకం కాదు. దాన్ని అమలు చేసే విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.
“ఉప్పు అమ్మాలన్నా, పప్పు అమ్మాలన్నా పత్రికల్లో ఎంతో ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తుంటారు. కానీ, పలానా హెల్మెట్ కొనండి అని ఒక్క ప్రకటన ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక్కసారయినా చూసారా. ఎందుకట?
“హెల్మెట్ తయారీదారులకు ప్రకటనల మీద పైసా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. ఒక కోర్టు తీర్పును సాకుగా చూపుతారు. అతి ఉత్సాహం వున్న అధికారిని పట్టుకుంటారు. అంతే! వారి స్టాకంతా – పుచ్చు వంకాయలలాంటి సరుకయినా సరే క్షణాల్లో అమ్ముడు పోతుంది. పైపెచ్చు సర్కారు ఖర్చుతో హెల్మెట్ ధారణ ఆవశ్యకత గురించి ఎలాగూ ప్రచారం ఉండనే ఉంటుంది. అధికారులు చూపిస్తున్న ఈ అత్యుత్సాహం వెనుక ఏదయినా మతలబు ఉందేమో అని అనుమానిస్తే తప్పేమిటి?
“ప్రజలకు అనునిత్యం తారసపడే ఏకైక ప్రభుత్వ ప్రతినిధి ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్. ప్రజల పరువు మర్యాదల్ని అతడి ఇష్టాఇష్టాలకు నడిబజార్లో వొదిలేయడం ఏం మర్యాద చెప్పండి.
కార్లలో తిరిగే ట్రాఫిక్ అధికారులను వెళ్లి ఏదయినా కూడలిలో నిలబడి రోడ్డు దాటలేని అభాగ్యులకు సాయం చేయమనండి. అస్తవ్యస్తంగా వున్న ట్రాఫిక్ దుస్తితిని సరిచేయమనండి. ఒక్క పది రోజులపాటు ట్రాఫిక్ పోలీసుల్ని – చలానాల వసూలు కట్టిపెట్టి తమ పని తాము చేసేలా చూడండి. యెంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. మంచి మార్పును గమనిస్తే ప్రజలే ట్రాఫిక్ పోలీసుల ప్రాధాన్యతను గుర్తిస్తారు. ఎలాటి నిరసనలు లేకుండా హెల్మెట్లతో సహా అన్ని రకాల ట్రాఫిక్ నిబంధలను వారే స్వచ్చందంగా తుచ తప్పకుండా పాటిస్తారు. ఇది నిజం. నిజానికి ఇదే సరైన పరిష్కారం.”
కమీషనర్ నా లేఖను నా ముందే పూర్తిగా చదివారు. అభినందన పూర్వకంగా మందహాసం చేసారు. కానీ ఆ చిరునవ్వులోనే నాకు ఆయన నిస్సహాయత కూడా కనబడింది. కొన్ని రోజులకు పూర్వం నగరంలో ఓ రోడ్డు దుస్తితిని గురించి ఆయనకు నేనే ప్రత్యక్షంగా చూపించాను. (ఆ వివరాలతో పాటు హెల్మెట్ నిబంధన – జర్నలిస్టుల నిరసన పూర్వాపరాలు గురించి మరికొన్ని సంగతులు మరోసారి)

అజ్ఞాత చెప్పారు...

మొదటి అజ్ఞాత గారితో ఏకీభవిస్తున్నా..,
మీ వివరణలో మిమ్ములను, మీ జర్నలిస్ట్ సంఘాలు చేసిన ఆందోళనలను సమర్థించుకున్నారు అంతే.
ఎటువంటి కొత్త చట్టం చేసినా మొదట్లో ఇబ్బందులు తప్పవు, అలాగని మాకు ఆ చట్టాన్ని వ్యతిరేకించే పనులు చేసి దూర ద్రుష్టి లేకుండా తెలివి తక్కువ గా చేసే ఆందోళనలను ఎ మాత్రం సమర్థించలెము.

మీ అనుభవం బాగుంది సార్!!

అయితే జర్నలిస్ట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరు అనే మెసేజ్ మాత్రం ఇవ్వకండి.