22, జులై 2013, సోమవారం

గురుద్దేవో నమో నమః !

గురుద్దేవో నమో నమః !  
ఈరోజు గురు పూర్ణిమ.  
సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి
యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.
ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నానుఅని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడుఅని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.
గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.
ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.
తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు
ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.
మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.
1921 వ  సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.
పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.
ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.


శ్రీ శివరాజు అప్పయ్య పంతులు గారు 

నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు. నిస్వార్ధంగా పిల్లలకు చదువు  చెప్పిన పుణ్యమే ఆయన్ని ఈ రోజుకు కూడా ఆరోగ్యవంతుడిగా కాపాడుతోంది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు కొంతమంది జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. మరికొందరు వయస్సులో పెద్దవాళ్ళయ్యారు. కానీ ఆయన ఇప్పటికీ అప్పటిమాదిరిగానే సాధారణ జీవనం సాగిస్తున్నారు.
గురు పూర్ణిమ సందర్భాన్ని  పురస్కరించుకుని ఆ మహానుభావుడికి మరోసారి మనః పూర్వకంగా -
గురుద్దేవో నమః

(22-07-2013)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html