(నిన్నటి తరువాయి)
కానీ వీటిని బట్టి
వూరి చరిత్ర తెలుసుకునే వీలు తక్కువ. అయితే చాలా ఏళ్ళుగా వున్న గ్రామం అని చెప్పవచ్చు. ‘స్తంభము ప్రోలు’ అన్నది కంభం పాడు అన్న పేరుకు మూలం కావచ్చు. లేదా ‘స్థంభం పహాడ్’
కాలక్రమంలో కంభంపాడు కావచ్చు. కానీ ఈ గ్రామానికి సమీపంలో స్థంభం కానీ, పహాడ్ కానీ
లేవు. ఇక్కడ లోగడ ఏదయినా ‘జయస్థంభం’ లాంటిది వుంటే, స్థంభం ప్రోలు లేక కంభంపాడు
అనే పేరు వచ్చి ఉండవచ్చు. ఆ రోజుల్లో
ఇలాటి జయ స్తంభాలను చాలాచోట్ల నెలకొల్పి వుంటారు. కనుక కంభంపాడు అన్న పేరుతొ చాలా
గ్రామాలు కనిపిస్తాయి. మధిర దగ్గర ఒకటి, తిరువూరు దగ్గర ఒకటి, అమరావతి దగ్గర
వైకుంఠ పురం దగ్గర మరోటి వున్నాయి. గ్రామ చరిత్రను తెలుసుకోవాలంటే బందరు వెళ్లి
జిల్లా కలెక్టర్ ఆఫీసులో పురాతన పత్రాలను శోధించాల్సి వుంటుంది.
(కంభంపాడులో మా ఇల్లు - పెరడు వైపునుంచి)
కంభంపాడుకు భండారు వారు రావడం గురించి వంశ వృక్షంలో కాని,
కోర్టు తీర్పులో కాని, వివరాలు అంటే తేదీలు వగయిరా పేర్కొనలేదు. వాడేల రామరాజు గారని ఒకరుండేవారు.
ఆయన భార్య బుచ్చమ్మ. వారికి మగపిల్లలు లేరు. ఒక్కతే కుమార్తె. ఆమెను కంచెల గ్రామంలో భండారు
వీరేశలింగం గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరేశలింగంగారు కంభంపాడుకు వచ్చి స్థిర
పడ్డారు. (ఒకరకంగా ఇల్లరికం అన్నమాట) లక్ష్మీనారాయణగారు రాయించిన వంశ వృక్షం ఆయనను వీరేశలింగంగా పేర్కొంటోంది. సుబ్బారావుగారు రాయించిన దానిలో
వీరేశం అనే వుంది. (కోర్టు తీర్పులో కూడా ఇంటి పేరు ‘బండారు’ అనే వుంది కాని ‘భండారు’ అని లేదు. అయితే ఇది రాయసకాని
పొరబాటు అని అనుకోవచ్చు. ఇంచుమించు అదే కాలంలో భండారు లక్ష్మయ్య కులకర్ణి గారు
రాసిన ఒక అర్జీలో ఇంటి పేరును
స్పష్టంగా ‘భండారు’ అనే రాసారు.) కనుక
భండారు వీరేశం లేక భండారు వీరేశలింగం అనే ఆయన కంభంపాడులో భండారు వారికి
మూలపురుషుడు అనడంలో సందేహం లేదు. కంచెల గ్రామంలో కాని, వేములపల్లిలో గాని ఎవరయినా
వంశ వృక్షాలు రాయించి దాచి వుంటే వీరేశం
గారి పూర్వీకుల గురించి తెలుసుకునే వీలువుంటుంది. అయితే వేములపల్లిలోని వంశ
వృక్షాలను గురించి కొందరు సందేహాలు
వ్యక్తం చేస్తున్నారు. అగ్రహారం పంపకాలలో
కోర్టు కెక్కి అక్కడివారు తమ తమ సానుకూలాన్ని బట్టి వంశ వృక్షాలు రూపొందించి
ఉంటారని కొందరి వూహ. వేములపల్లి భండారు వారు లింగాలను ధరించారు. అయితే కంచెల,
పల్లగిరి భండారు వారు, వారివలె
లింగధారులు కారు. ఆరువేల నియోగులు.
స్మార్తులు. యజుస్మాఖాధ్యాయులు. ఆపస్తంభ సూత్రులూను. (మరో భాగం మరోసారి)
(26-07-2013)
(26-07-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి