27, జూన్ 2013, గురువారం

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు



( జూన్ 28-  మాజీ ప్రధాన మంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి)


గూగుల్ ఇమేజ్ సెర్చ్ సర్ఫ్ చేసుంటే ఒక కార్టూన్ కనిపించింది.
 అందులో -




కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.

వర్తమాన ప్రపంచానికి ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
ఎనభయ్యవ దశకంలో నేను మాస్కోలో వున్నప్పుడు వేల సార్లు విన్న పదం – ‘స్పసీబా’ – అంటే ఇంగ్లీష్ లో థాంక్స్’ – మన తెలుగులో ధన్యవాదాలు’. బహుశా ఈ పదం ఇంత పెద్దగా వుండడం వల్లనో ఏమో ఇది పలకడానికి జనం కొంత సంకోచిస్తున్నారనుకోవాలి.


రష్యన్లు - ఆ మాటకు వస్తే ప్రపంచం లోని అనేక దేశాలవాళ్ళు కృతజ్ఞతను బాహాటంగా వెల్లడిస్తుంటారు. అది వారి జీవన విధానంలో ఒక భాగమై పోయింది. పైకి వ్యక్త పరిస్తేనే కృతజ్ఞతా భావం వున్నట్టని చెప్పడం నా వుద్దేశ్యం కాదు. తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని అన్నయ్యా ! చెల్లెమ్మా!అంటూ చెప్పుకునే డైలాగులు వింటే కంపరం కలుగుతుంది కానీ, వారి నడుమ వున్న ఆత్మీయతా భావం అవగతం కాదు. అయితే చేసిన మంచిని మరచిపోవడం మనుషులకు వుండాల్సిన లక్షణమని అనుకోలేము.
కృతజ్ఞతఅన్న పదానికి ఈనాటి రాజకీయాల్లో స్తానం వున్నట్టులేదు. రాజకీయనాయకులకు వడ్డించేవాడుప్రధానం కాని వడ్డించినవాడు కాదు.


పీవీ నరసింహారావుగారి విషయమే తీసుకుందాం. ప్రధానిగా వున్నంతకాలం ఆహా! ఓహో!!అన్నారు. ఆర్ధిక సమస్యలతో పీకలలోతు మునిగిపోయివున్న దేశాన్ని నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలంఅధికార పీఠం పై వుంచిన అపర చాణ క్యుడని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం కావడంతోనే ఆ నోళ్ల తోనే – ‘అధికారాంతమునందు చూడవలె అని పద్యాలు పాడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ పదవేసర్వస్వమయిన వారికి ఆయన భజనేసర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన పత్తిత్తులకుఆయన చేసిన మేళ్ళుకానరాలేదు. అయిదేళ్ళు తెలుగువాడిలోని వాడినీ వేడినీలోకానికి చాటిచెప్పిన వృద్ధ రాజకీయవేత్త న్యాయస్తానాలలో నిస్సహాయంగా బోనులోనిలబడ్డప్పుడు ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు కళ్ళుమూసుకున్నారు. ప్రధానిగా పీవీ ని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో కృతజ్ఞతఅనే పదానికి తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు హడావిడి ఒక విలేఖరిగా నాకు తెలుసు. ఆకాశవాణి ప్రతినిధిగా కలుసుకోవాలన్నా ఎంతో కష్టంగా వుండేది. అధికారులు, అనధికారులు, మందీ మార్భాలాలు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో బస చేసినప్పుడు  నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్, న్యూస్  ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  'పీవీ గారిని చూడడం వీలుపడుతుందాఅని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేసామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము.లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేసారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.  అదీ  పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు కలయో వైష్ణవ మాయయోఅన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.
ఇలాటి నేపధ్యాలున్న మన రాష్ట్ర రాజకీయ రంగంలో -

అధికారం చేజారితేనే పట్టించుకోని రాజకీయ నాయకులు - ప్రాణాలు విడిచిన తమ నాయకులను పట్టించుకుంటారనుకోవడం భ్రమ. రామారావయినా, రాజశేఖరరెడ్డి అయినా అంతే.

కొన్నాళ్ళ తరవాత పిల్లలకు కృతజ్ఞతగురించి తెలియచేప్పాలంటే మ్యూజియం కు తీసుకు వెళ్ళాలేమో!

3 కామెంట్‌లు:

buddhamurali చెప్పారు...

ఈ రోజు పివి నరసింహా రావు జయంతి
ఎందుకు గుర్తుంటుంది
ఆయన కేమైనా టివి చానల్ ఉందా ? పేపర్ ఉందా ? వారసుల కేమైనా టికెట్ లు ఇచ్చే అధికారం ఉందా ? ఎందుకు గుర్తుంటుంది ..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@buddha murali - వాళ్ళు ఎవరికీ గుర్తుండదనేకదా ఈ తాపత్రయం మురళి గారు.

Unknown చెప్పారు...

Nice article about a great man that nation forgot because of no 'Gandhi' at the end of the name. Thanks