5, జనవరి 2013, శనివారం

తెలుగు అకాడమీపై ‘తోట’ గురిపెట్టిన తూటా



తెలుగు అకాడమీపై ‘తోట’ గురిపెట్టిన తూటా
(ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ వ్యాసంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వున్నాయి. రచయిత తోట భావనారాయణ గారికి కృతజ్ఞతలతో)



"అసత్యాలూ, అర్థసత్యాలూ, అచ్చుతప్పులూ, అన్వయదోషాలతో
అకాడెమీ అచ్చే(చ్చో)సి వదిలిన దృశ్యమాధ్యమ చరిత్ర

జెమినీ టీవీ ఆద్వర్యంలో సన్ నెట్ వర్క్ నడుస్తోంది
ఐ న్యూస్ ఛానల్ మూతబడింది
సత్య టీవీ విదేశాలనుంచి ప్రసారమవుతోంది
ఎబిఎన్ అంటే ఆర్మొడా బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్
హెచ్ఎమ్ టీవీ ని ఛానల్ 4 సంస్థ నడుపుతోంది
ఆర్ కె న్యూస్, జనతా న్యూస్, లోకల్ టీవీ శాటిలైట్ ఛానల్స్

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  ఆధ్వర్యంలోని రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి పర్యవేక్షణలో తెలుగు అకాడెమీ వారు డాక్టర్ వోలేటి పార్వతీశం గారి చేత వ్రాయించి అచ్చే(చ్చో)సిన ఐదువేల ప్రతుల లఘు గ్రంథ రాజము తెలుగునాట దృశ్య మాధ్యమంలో ఇలాంటి తప్పులు కోకొల్లలు . తెలుగు విశ్వవిద్యాలయానికీ, తెలుగు అకాడెమీకి లఘుగ్రంథాల ప్రచురణ బాధ్యత అప్పగించగా అకాడెమీ కోటాకింద వచ్చిన 150 గ్రంథాలలో ఇది ఒకటి. పుస్తకాలు రాయించి ముద్రించడమనేది ఒక యజ్ఞంగా  భావించి తెలుగు అకాడెమీ విజయవంతంగా నిర్వహిస్తున్నదన్న ఉపముఖ్యమంత్రివర్యుల అభినందన’, నిష్ణాతులచేత రచింపజేసిన ఈ లఘుగ్రంథాలను పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకం వెలిబుచ్చిన సాంస్కృతికశాఖ మంత్రివర్యుల ప్రస్తావన’, సమస్త విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతో ‘జాతి సంపద’ అ నదగిన పుస్తకాలను ప్రచురిస్తున్నామని అకాడెమీ సంచాలకులవారు నొక్కి వక్కాణించిన భూమిక - నిజమని నమ్మి, కొని, చదవటానికి సాహసించినపుడు కళ్ళుతిరిగే అంశాలు వెలుగు చూశాయి.

దక్షిణాదికి చెందిన ఏషియానెట్ అనే ప్రైవేట్ టీవీ సంస్థ తమ రోజువారీ కార్యక్రమాలలో ఒక అరగంట కాలాన్ని తెలుగు కార్యక్రమాలకు కేటాయించింది... ఈ వ్యవస్థ నుండి తెలుగు ప్రసారం ఉండేదనే విషయం దాదాపుగా తెలుగువారికి ఎవ్వరికి తెలియదుఅంటూ ఒక బ్రహ్మ రహస్యం వెల్లడించారు. పనిలో పనిగా జీ టీవీ ని కూడా ప్రస్తావించి అది కూడా అర్థగంటపాటు తెలుగులో కార్యక్రమాలు ప్రసారం చేసేదని సెలవిచ్చారు. కానీ వాస్తవం అది కాదు. కేరళకు చెందిన శశికుమార్ జీ టీవీ నుంచి మూడేసి గంటల సమయం కొనుక్కొని నాలుగు దక్షిణాదిభాషల్లోనూ ( ఏషియానెట్ తెలుగు, ఏషియానెట్ మలయాళం, ఏషియానెట్ కన్నడ, ఏషియానెట్ తమిళ్ ) ప్రసారాలు ప్రారంభించారు. సాయంత్రం 5 నుంచి 8 గంటలదాకా ప్రసారాలు అందేవి. అందులో ఏషియానెట్ తెలుగు ఛానల్ కోసం మునీర్ అహ్మద్, హరిహరన్, సి.జె.రెడ్డి కార్యక్రమాలు రూపొందించేవారు. కేబుల్ సరిగా విస్తరించకపోవటం వలన తప్పనిసరి పరిస్థితుల్లో మూతబడటం సంగతి సరే సరి. అదే విధంగా జైన్ టీవీ కూడా ప్రత్యేకంగా తెలుగు ప్రసారాలు అందించింది. శరత్ మరార్ సారధ్యంలో సుమంత్, జయంత్ తదితరులు పనిచేసేవారు. అందులో తొలి యాంకర్ అనితా చౌదరి. అప్పుడే అందులో గంటపాటు కొత్త సినిమాపాటలు, షూటింగ్స్ తదితర అంశాలతో కార్యక్రమం నిర్వహించుకోవటానికి తరంగసుబ్రహ్మణ్యం గారికి స్లాట్ కేటాయింపు కూడా జరిగింది. అప్పట్లో యుమాటిక్ హైబాండ్ టేపుల్లో రికార్డు చేసి శ్రీలంక పంపి అప్ లింక్ చేసేవారు. ఇదీ శాటిలైట్ చానల్స్ లో పాక్షిక తెలుగు ప్రసారాల స్థూల చరిత్ర.

ఇక జెమిని టీవి శీర్షిక కింద సన్ నెట్ వర్క్ ‘జెమినీ టీవి’ పేరుతో ఒక తెలుగు ఛానల్ ను ప్రారంభించింది.అని రాశారు. తొలి తెలుగు శాటిలైట్ ఛానల్ విషయంలోనూ తప్పులు తప్పలేదు. నిజానికి జెమినీ టీవీ ప్రారంభించింది ఎల్వీ ప్రసాద్ మనుమలు రవిశంకర్ ప్రసాద్, మనోహర్ ప్రసాద్. రెండేళ్ళు గడిచాక ఆర్థిక ఇబ్బందుల మధ్య సగం వాటాను సన్ నెట్ వర్క్ కు అమ్ముతూ ఆర్థికలావాదేవీల బాధ్యత సన్ వాళ్ళకే అప్పగించారు. కాలక్రమంలో మరిన్ని ఛానల్స్ మొదలుపెట్టడం , ఆ తరువాత పబ్లిక్ ఇష్యూకు వెళ్ళటం, నెట్ వర్క్ విస్తరణలో భాగంగా జెమినీ తొలి యజమానుల వాటా క్షీణించటం తెలిసిందే.

జెమిని టీవి తెలుగునాట కూడా తన ఛానల్స్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేసింది.... ఆ వృద్ధిలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపైన ఒక సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించగలిగింది జెమిని టీవి. దక్షిణాది భాషలకు సంబంధించి ఒక్క జెమిని టీవి వ్యవస్థ 32 ఛానల్స్ నిర్వహిస్తూ 95 మిలియన్ల ప్రేక్షకులకు చేరుతూ, 27 దేశాల్లో తన ప్రసారాలకు ఉనికిని ఏర్పరచుకుందంటే మనకి ఆశ్చర్యం కలుగుతుందిఅంటారు ఈ పుస్తకంలో.  జెమినీ ఛానల్స్ అన్నీ తెలుగువే కదా? రచయిత సన్ నెట్ వర్క్ కూ. జెమినీ కీ మధ్య తేడా తెలియక సన్ గొప్పదనాన్ని జెమినీ కి ఆపాదించి రాసుకుంటూ పోయారు. జెమినీ గ్రూపులో ఆరు ఛానల్స్ ఉన్నాయని ఇంకోచోట ఒప్పుకుంటారు. మళ్ళీ ఈ విషయం మరిచిపోయి జెమినీ పట్ల తనకు కలిగిన ఆశ్చర్యాన్ని రచయిత అందరికీ అంటగట్టారు. 95 మిలియన్లు అనకపోతే హాయిగా తొమ్మిదిన్నర కోట్లు అనవచ్చుగా అంటూ సలహా ఇవ్వటం ఇక్కడ అప్రస్తుతం కావచ్చు.
ఈటీవీ గురించి చెబుతూ ఆ ఛానల్ సాహిత్యసేవ గురించి మాత్రమే ప్రస్తావించటం దురదృష్టకరం. మార్గదర్శి లాంటి కార్యక్రమం గురించిగాని, తెలుగులో మొట్టమొదటి 24 గంటల న్యూస్ ఛానల్ ఈటీవీ 2 అనే విషయాన్ని గాని ఎక్కడా ప్రస్తావించలేదు. చరిత్రలో నమోదుకావలసిన ఇలాంటి విషయంలో ఉపేక్షను ఎలా అర్థం చేసుకోవాలి? అదేవిధంగా మాటీవీ గురించి చెబుతూ, ‘మాటీవీ మనందరి టీవీ’ అనే  నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన మొదటి ఛానల్ గా అభివర్ణించారు. ఎవరి నినాదం వారికే సొంతం. ఈటీవీ వాళ్ళు ఈటీవీ మీ టీవీఅనే నినాదంతో వచ్చారు. మెరుగైన సమాజం కోసంఅనేది టీవీ9 నినాదం. ఇందులో సొంతమని, మొదటి ఛానల్ అనిగాని ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది? ఎవరి నినాదం వాళ్ళదే. అదే సమయంలో తెలుగులో తొలి ‘పే ఛానల్’ గా మాటీవీ ఆరంభంలోనే చందాలు వసూలు చేసిన విషయాన్నిమాత్రం విస్మరించారు. ‘మా టీవి’ ఈరోజున సినీప్రముఖుల అజమాయిషీలో ముందుకు సాగుతోంది’  అన్నారుగాని ఆ ఛానల్ లో సినిమా వాళ్ళది 40 శాతం వాటా మాత్రమేనన్నవిషయం గుర్తించలేదు. ‘కలర్స్’ అనే కార్యక్రమం తరువాతే యాంకర్ల ప్రతిభాపాటవాలు వ్యక్తమయ్యే విధంగా ఛానల్స్ లో కార్యక్రమ ప్రసార సరళి ప్రారంభమైందని, కన్యాశుల్కం నాటకం ప్రసారం చేసి ‘మా టీవీ’ తన స్థాయి పెంచుకునే ప్రయత్నం చేసిందని అలవోకగా కొన్ని అభిప్రాయాలు జనం మీదికి విసిరారు. ఇవి ఎలాంటి ప్రాతిపదికా లేకుండా రచయిత ఏర్పరచుకున్న సొంత అభిప్రాయాలు మాత్రమే. ‘మా జూనియర్స్’ ఛానల్ ను యాజమాన్యం ‘మా గోల్డ్’ గా మార్చిన విషయం రచయిత దృష్టికి రానట్టుంది. టీవీ9 తన అనుబంధ ఛానల్ గా టీవీ 1 ప్రారంభించినట్టు రాశారుగాని అంతకుముందు అదే ఛానల్ సంస్కృతిపేరుతో నడిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ‘జీ తెలుగు’ అని రాయాల్సిన చోట ‘జీ టీవీ’ అని రాశారు.

టీవీ 9 విషయంలో మాత్రం కాస్త ఉదారంగా వ్యవహరించి పొగడ్తల్లో ముంచేశారు. మిగిలినవాటి గురించి అందులో సగమైనా రాయకపోవటం మాత్రం అన్యాయం. టీవీ 5 గురించి నామమాత్రంగా చెప్పారు. కాకపొతే  కొన్ని సంచనాలను కూడా నమోదు చేసుకున్నదంటూ ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ఈ ఛానల్ గురించి రాసిన ఒక వాక్యం గమనించండి. ‘ఎనిమిది ఓబీ  వ్యాన్లు  కలిగి ఉన్నా, ఈ ఛానల్ త్వరితగతిన వార్తలు అందించే కృషి చేస్తోంది. అంటే అర్థమేంటో ? వార్తలు వేగంగా అందకుండా ఓబి వాన్లు అడ్డుకుంటాయా? ఆ అడ్డంకులను తోసిపుచ్చి మరీ త్వరితగతిన వార్తలు అందించేందుకు టీవీ 5 వాళ్ళు కృషి చేస్తున్నారా? ఇక ‘ఎన్ టీవీ’ వారు 12 డి.ఎస్.ఎన్.జి. వ్యాన్లతో  ప్రారంభించి రికార్డు సృష్టించారని రాసినవాళ్ళు ఆ తరువాత పాతికదాకా డి.ఎస్.ఎన్.జి. వాన్లు వాడిన ‘సాక్షి టీవీ’ ఆ రికార్డును బద్దలు చేసినట్టు ఎందుకు రాయలేదో? ఎన్ టీవీ’ గురించి ఐదారు వాక్యాలతో సరిపెట్టి, వనిత’, భక్తి’ ఛానల్స్ ను మాత్రం ఆకాశానికెత్తేశారు. కర్ణాకర్ణిగా విన్నది, తనకు తెలుసనుకున్నది రాయటమే తప్ప తెలుసుకొని రాయటం కనిపించదు.

‘రాజ్’ టెలివిజన్ నెట్ వర్క్ సంస్థ టి.ఆర్.ఎస్. తో కలిసి రాజ్ న్యూస్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. పైగా, తెలంగాణ ప్రాంతపు వార్తల్ని, వార్తావిశేషాల్ని, తెలంగాణ సంస్కృతిని విస్తృతంగా ప్రేక్షకులకు అందించాలనే ధ్యేయంతోనే ఈ రాజ్ న్యూస్ టీవీ ఛానల్ ఏర్పడింది అంటారు. వాస్తవం అది కాదు. తమిళనాడుకు చెందిన రాజ్ నెట్ వర్క్ వాళ్ళకు రాజ్ న్యూస్ తెలుగు అనే ఛానల్ లైసెన్స్ ఉంది. దాన్ని టి.ఆర్.ఎస్. కు లీజుకిచ్చారు. సొంత లైసెన్స్ రాగానే టి.ఆర్.ఎస్. వాళ్ళు ‘టి ఛానల్’ పెట్టుకున్నారు. అంతే తప్ప తెలంగాణ కోసం రాజ్ న్యూస్ ఛానల్ పెట్టలేదు. ఇక ఐ న్యూస్, మహాటీవీ, స్టుడియో ఎన్, వి 6 గురించి ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా రాయకపోగా జీ 24 గంటలు, టి ఛానల్ గురించి ఒక్కో వాక్యంతో సరిపెట్టారు. విస్సా గురించి రాసినదాంట్లో సగం కూడా ప్రస్తావన లేని ఛానల్స్ చాలా ఉన్నాయి.

సాక్షి టీవీ విషయానికొస్తే, దాని సాంకేతికపరిజ్ఞానం గురించి తప్ప ప్రసారాలగురించి రాయటానికి ఇబ్బంది ఏమిటో తెలియదు. ఆ రాసిన నాలుగు ముక్కలూ అలా అట , ఇలా అట అంటూ పొడిపొడిగా రాయటానికి ఏ ప్రత్యేక కారణాలున్నాయో మరి. ఇంకా చిత్రమేంటంటే, ఐ న్యూస్ చానల్ ప్రసారాలు ప్రస్తుతం అందుబాటులో లేవని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి సోదరుడు వాటాలు తీసుకున్నారని లోకమంతా కోడై కూస్తున్న సమయంలో ఐ న్యూస్ అనే ఛానల్ ఆగిపోయిందని రాయటం ఎంత దుస్సాహసం? ఛానల్స్ జాబితా ఇస్తూ న్యూస్ ఛానల్స్ లో జెమినీ న్యూస్, వి 6, సివిఆర్ న్యూస్, ఆర్.వి.ఎస్. ఛానల్స్ పేర్లే మరచిపోయారు. ఛానల్ 7 హెల్త్ ప్లానెట్, సివిఆర్ హెల్త్ అనే రెండు ఛానల్స్ పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇతర ఛానల్స్ విభాగంలో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ పేరు రాసి డిస్కవరీ ని, ట్రావెల్ ట్రెండ్జ్ ను వదిలేశారు. విద్య, ఉద్యోగావకాశాలకోసమంటూ ప్రారంభించిన ఏ  టీవీ’ ఇప్పుడు న్యూస్ ఛానల్ గా మారబోతున్నది. దాన్ని విదేశీయులు నడుపుతున్నట్టు చెప్పారు. నిజానికి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అందులో మెజారిటీ వాటా కొనుగోలు చేశారు. ‘మన టీవీ’ ఇంకా వస్తున్నట్టు రాస్తూ ‘సత్య టీవీ’ విదేశాలనుంచి ప్రసారమవుతున్నట్టు చెప్పారు. సత్య టీవీ అనేది లైసెన్స్ రద్దయిన న్యూస్ ఛానల్. ‘ఆర్.కె. న్యూస్’, జనతా న్యూస్’, లోకల్ టీవీ’ అనేవి కేబుల్ టీవీలన్న విషయం రచయితకు తెలిసినట్టు లేదు. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖవారి వెబ్ సైట్ లో చూసి వివరాలు తనిఖీ చేసుకునేంత కనీస జాగ్రత్తకూడా తీసుకోకపోవటం వల్ల తప్పులు మరీ ఎక్కువయ్యాయి.


‘అనేక ప్రాంతీయ భాషల్లో ప్రభుత్వానికి విస్తృతంగా ప్రసారాలు సాగించే మార్గం నిర్మితమైంది’. ఈ వాక్యం నాకైతే అర్థం కాలేదు. రెండున్నదశాబ్దాలకు పైగా దృశ్యమాధ్యమంలో కార్యక్రమనిర్వాహకులుగా పనిచేసిన కవిపండితుల వాక్యం సామాన్యులకూ అర్థం కావాలిగదా! గ్రంథ రచయితగాని, భాషాసేవలో తలమునకలైన తెలుగు అకాడెమీ పెద్దలుగాని వివరిస్తే వినాలని ఉంది. ‘ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి’ గురించి రాస్తూ ఎబిఎన్ అంటే ఆర్మొడా బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్ అని సెలవిచ్చారు. ‘ఆమోదా’ను ఆర్మొడాగా మార్చింది ముద్రారాక్షసమేనా? కాబోలునని సరిపెట్టుకుందాం. ‘ఈ ఛానల్ ప్రముఖులైన వారితో పరిచయ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి అంతరంగాలను ఆవిష్కరించే కార్యక్రమాలు కూడా ఈ  టీవీకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చాయి’ అని రాశారు. వాక్యం మొదట్లో ‘ఈ ఛానల్’ అని రాసి మళ్ళీ ముగించే ముందు కూడా ‘ఈ టీవీ’ అని రాశారు. రచయిత ఈ గ్రంథం అంతటా ఇలాంటి ప్రయోగాలు చేశారు. ఈ ఛానల్ అని రాయల్సిన ప్రతిచోటా ఈ టీవీ అంటూ రాసి పాఠకులు ఈనాడు టెలివిజన్ ను గుర్తుకు తెచ్చుకొని అయోమయానికి గురయ్యేట్టు చేశారు. జీ తెలుగు ఛానల్ గురించి రాస్తూ, కొన్ని దశాబ్దాల క్రితం హిందీలో అనూహ్యమైన విజయాన్ని మూటగట్టుకున్న చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ప్రసారం చేశారు. అయినా ఈ ఛానల్ కు ప్రజాదరణ లభించలేదు’ అంటారు. అంటే, ఒక విజయవంతమైన చిత్రాన్ని ప్రసారం చెయ్యగానే ఛానల్ ప్రజాదరణ పెరిగిపోవాలా?

వెనుక అట్టమీద ఈ గ్రంథ సారాంశాన్ని, ఆవశ్యకతను, ప్రచురణ లక్ష్యాన్ని ఇనుమడింపజేస్తున్నట్టు సూచించేలా ఐదారు వాక్యాలు రాసే ప్రయత్నం చేశారు. అందులో మొట్టమొదటి వాక్యం ఇది : ‘ఈ శతాబ్దపు తొలిరోజులు మనకి అందించిన ఒక అద్భుత సాంకేతిక పరిజ్ఞానం ఫలం’. ఎన్నిసార్లు చదివినా ఈ వాక్యం అర్థం కాలేదు. ముందుమాటల్లోకి వెళ్ళి చూస్తే, దీన్ని ఆదరిస్తారని మంత్రిగారు విశ్వాసం వెలిబుచ్చినవారిలో పండితులు, తెలుగు భాషాభిమానులతో బాటు పాఠకులు కూడా ఉన్నారు. బహుశా పండితులు, తెలుగు భాషాభిమానులు ఎలాగూ చదవరనే అభిప్రాయంతో పాఠకులు అనే ప్రత్యేకమైన తెగ గురించి మంత్రిగారు ప్రస్తావించి ఉంటారు. పండితులకు, తెలుగు భాషాభిమానులకు ఈ వాక్యం ఎలా అర్థమైందో వాళ్ళ మనసుల్లోకి దూరి చెప్పటం అసాధ్యమేగాని ఒక పాఠకుడిగా నాకు మాత్రం అర్థం కాలేదని ఏమాత్రమూ సిగ్గుపడకుండా మనవిచేసుకుంటున్నా. ఇక అక్షరదోషాల( ముద్రారాక్షసాల) గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తం గ్రంథంలో కనీసం మూడు నుంచి నాలుగు వందలు కనిపిస్తాయి.
93
పేజీల గ్రంథానికి 18 పేజీల ముందుమాటలు, వగైరాలూ ముగిశాక ‘ప్రైవేటు ఛానళ్ళు’  అనే 21 పేజీలున్న ఏడవ అధ్యాయంలో అడుగుపెట్టినప్పుడు ఎదురయ్యే అంశాలను మాత్రమే ఈ అధ్యయనంలో చర్చించాం. మిగిలిన 72 పేజీలూ ఒప్పులని కాదు అర్థం. ఈ చరిత్రను ఇంకా చాలా చెప్పాలనుకున్నప్పటికీ  గ్రంథ విస్తృతి’ని దృష్టిలో ఉంచుకొని దృశ్యమాధ్యమ ప్రస్థానంలో మైలురాళ్ళవంటి కొన్ని సంఘటనలు మాత్రమే యధోచితంగా ముచ్చటించడం జరిగింది’  అని రచయిత వోలేటి పార్వతీశం గారు చెప్పుకున్నట్టే, ఆయన బాటలోనే నేను కూడా వ్యాస విస్తృతిని దృష్టిలో ఉంచుకొని 21 పేజీలలోని అంశాలకే పరిమితమయ్యాను. మొత్తం గ్రంథం గురించి రాయటం మొదలెడితే అసలు గ్రంథాన్ని మించిపోతుందన్న భయం నన్ను వెంటాడుతోంది. అవసరమైనవి ఏవి వదిలేశారో, అనవసరమైన వివరాలు కొండవీటి చేంతాడులా ఎక్కడెక్కడ ఇచ్చారో, కేవలం సాహిత్యకోణంలోనే చానల్స్ ను బేరీజు వేయటం ఎంతవరకు సబబో ఇక్కడ చర్చించటం లేదు. చరిత్ర రచనలో ముఖ్యఘట్టాలను నమోదు చేయాల్సివచ్చినప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇవ్వడమేంటనే పండితచర్చలోకి దిగటం కూడా ఇక్కడ భావ్యం కాదని ముగిస్తున్నా.

‘ఈ గ్రంథంలో ప్రచురితమైన విషయాలకు, వివరాలకు, అభిప్రాయాలకు ఆయా రచయితలు/రచయిత్రులే బాధ్యులు’  అనే ఒకే ఒక్క షరతు ( చట్టబద్ధమైన హెచ్చరిక? ) ముద్రించామని తెలుగు అకాడెమీ వారు తప్పించుకున్నామని అనుకోవచ్చునేమోగాని కుప్పలు తెప్పలుగా కనిపించే అక్షరదోషాలకూ, అన్వయలోపమున్న వాక్యాలకూ బాధ్యులం కాదనటం మాత్రం ఒక భాషా సంస్థ తన నైతికబాధ్యత నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నమే అవుతుంది. ‘దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో సవరించగల’మని అకాడెమీ సంచాలకులవారు తెలియజేశారుగాని తప్పుల కుప్పలాంటి ఈ లఘుగ్రంథాన్ని ఎలా సవరిస్తారో ! బహుశా వెంట్రుకలు ఏరుకుంటూ గొంగట్లోనే అన్నం తింటారేమో!"

--
తోట భావనారాయణ
టీవీ జర్నలిస్ట్
(05-01-2013)

4 కామెంట్‌లు:

.rv చెప్పారు...

దృశ్యమాధ్యమంలో ఎంతో అనుభవం ఉన్న పార్వతీశం గారి రచనలో
ఇలా తప్పులు చోటు చేసుకోవడం చాలా చిత్రంగా ఉంది.

దీని గురించి పార్వతీశంగారు ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది ..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@.rv - అవును. ఈ పుస్తకాన్ని నేనూ చదవలేదు. తిరుపతి సభల హడావిడిలో ముద్రించిన పుస్తకం కాబట్టి ఆ ప్రభావం పడివుంటుంది.-భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

ముందుగా చెప్పి మంచి పని చేసారు, అసలే మీడియా కథలంటే నాకు భలే ఆసక్తి....

మొదట్లో ప్రస్తావించిన 4, 5లైన్ల తప్పులు స్పష్టం గా చూపాయి ఇక చదవటం వేస్ట్ .....

గతం లో నాగ సూరి వేణు గోపాల్ గారివి చదివే అలవాటు ఉండేది...

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - ఇంత తెలిసిన వారికి నేనేం చెప్పను ? - భండారు శ్రీనివాసరావు