వెనక్కు తీసుకోలేనిది నోరు జారిన మాట ఒక్కటే!
మాధవరావుకు ఎదురుగా ఎవరన్నా కనిపిస్తే నమిలి మింగేయాలన్నంత
కోపంగా వుంది. ఆస్పత్రి కారిడారులో అసహనంగా తిరుగుతున్న తీరే ఆయన మానసిక స్తితిని
తెలుపుతోంది. మద్ధ్యమధ్యలో ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేస్తున్నాడు. డాక్టర్ ఇంకా
రాలేదా అని అడుగుతున్నాడు. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ తన కొడుకుని తీసుకుని
ఆసుపత్రికి వస్తే డాక్టర్ అయిపు లేడు. ‘కబురు
చేశాం! వచ్చి చూస్తారు’ అన్న సిబ్బంది అరకొర జవాబులు పుండు మీద కారం చల్లిన చందంగా
ఆయనకు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. చుట్టుపక్కలే కాదు చుట్టుపక్కల వూళ్ళల్లో
కూడా మరో ఆసుపత్రిలేదు. ఇటు కొడుకు పరిస్తితి ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. అటు డాక్టర్
లేకపోవడం ఆ ఆందోళనను ఆగ్రహంగా మారుస్తోంది.
కాసేపటికి ఎదురు చూస్తున్న డాక్టర్ వచ్చాడు. ఆయన మొహం
నిర్వికారంగా వుంది. రాగానే గాయపడ్డ బాలుడి గురించి సిబ్బందిని అడిగి లోపలకు
వెడుతుంటే మాధవరావుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపం మాటల రూపంలో బయటకు వచ్చింది.
‘నువ్వేనా ఇక్కడ డాక్టరువి. ఇక్కడ పేషెంట్లు చావుబతుకుల్లో
కొట్టుకు చస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడ చక్కర్లు కొడుతున్నావు.’
సిబ్బంది మాధవరావుని వారించాలని చూసారు. కానీ ఆయన వినే పరిస్తితిలో
వుంటే కదా. అతడి కళ్ళ ముందు గాయపడి రక్తంవోడుతున్న కొడుకు రూపమే కనబడుతోంది.
‘ఏం మాట్లాడవు. అవునులే ఏం
చెబుతావు. ఇదే నీ కన్న కొడుకు ఇలా ఆసుపత్రిలో పడివుంటే ఇలానే తాపీగా, నింపాదిగా
వస్తావా? అసలు జనం ప్రాణాలంటే మీకు లెక్కలేకుండా పోతోంది’
మాధవరావు మాటల తీవ్రత పెరుగుతూనే వుంది. డాక్టర్ మాత్రం ఏమీ పట్టించుకోనట్టు ఆపరేషన్ థియేటర్ లోకి
వెళ్లిపోవడం చూసి ఆయన అరికాలు మంట నెత్తికెక్కింది.
ఆపరేషన్ జరిగినంత సేపు మాధవరావు శాపనార్ధాలు సాగుతూనే వున్నాయి.
కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు.
‘భగవంతుడు దయామయుడు. నా మానవ ప్రయత్నానికి ఆయన పూర్తిగా
సహకరించాడు. మీ అబ్బాయికి ఇక ఏం భయం లేదు, మా వాళ్ళు చూసుకుంటారు’ అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళిపోయాడు.
మాధవరావుకు డాక్టర్ మాటలు యెంత ఉపశమనం కలిగించాయో, ఆయన అలా
ఉరుకులు పరుగుల మీద బయటకు వెళ్లిపోవడం అంతే ఆగ్రహాన్ని కలిగించింది.
‘ఛీ! ఏం డాక్టర్లు. బయట ఇంత ఆందోళనగా ఎదురు చూస్తున్న మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఏదో మా ప్రయత్నం మేము
చేసాము. దేవుడి దయవల్లే మీ వాడు బతికాడంటూ పొడిపొడిగా చెప్పేసి అలా వెళ్ళిపోతాడా? యెంత నిర్లక్ష్యం? యెంత పొగరు?’
అంటూ చిందులు వేసాడు.
నర్సు కళ్లనీరు పెట్టుకుంటూ చెప్పింది.
‘అయ్యా! మీ పిల్లవాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మా
డాక్టర్ గారిది అమృత హస్తం. పోతే, మీరు
వచ్చినప్పుడు ఆసుపత్రిలో డాక్టరు గారు లేని మాట నిజమే. ఆ సమయంలో ఆయన శ్మశానంలో వున్నారు.
వొక్కగానొక్క కొడుకు రాత్రే రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయాడు. కర్మకాండలో వున్నాకూడా, మేము కబురు చేయగానే అంత్య క్రియల కార్యక్రమం మధ్యలో వొదిలేసి వచ్చారు.
మీ అబ్బాయికి ఆపరేషన్ చేసి మళ్ళీ మిగిలిన తంతు పూర్తిచేయడం కోసం అక్కడికే వెళ్లారు’
(నెట్లో కనబడిన ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేఛ్చానువాదం - ఇమేజ్ సొంతదారుకు కృతజ్ఞతలు)
2 కామెంట్‌లు:
మంచి కథ, మంచి కథనం. బాగుంది.
కార్పొరేట్ సంస్కృతిలో ఇది చచ్చిపోయి చాలా కాలమయిందండి. అక్కడక్కడ ఇటువంటివాళ్ళు ఇంక మిగిలున్నారు, ఇది సత్యం, మంచి మాట చెప్పినందుకు, కధనం వినిపించినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి