18, జనవరి 2013, శుక్రవారం

ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?



 ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?

ఢిల్లీ నుంచి  గల్లీ దాకా ఇదే చర్చ. ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?
తెలంగాణాకు పచ్చ జెండా చూపుతారా?
సమైక్యానికే ‘సై’ అంటారా?
‘ప్యాకేజీలతో’ సరిపుచ్చాలని చూస్తారా?
హైదరాబాదును ఏం చేస్తారు?  
అసలేమీ చేయకుండా  ఏదో నెపం, ఎవరిమీదో మోపి, తాము  చల్లగా తప్పుకుని మొత్తం సమస్యను శీతల గిడ్డంగిలోకి నెట్టేస్తారా?
అన్నీ ప్రశ్నలే. సమాధానం లేని ప్రశ్నలు. అన్ని రకాల సమాధానాలు వస్తున్న ప్రశ్నలు. ఎవరికి తోచిన జవాబు వారిస్తున్నారు. తమ మనసులోని మాటనే వాటికి  సమాధానంగా ఇస్తున్నారు. తాము ఏమి కోరుకుంటున్నారో దానికే అక్షర రూపం కల్పిస్తున్నారు.
కాంగ్రెస్ సంస్కృతిని గమనం లోకి తీసుకుంటే ఇలాగే జరిగితీరుతుందని చెప్పడానికి  వీలులేదు. కానీ ఇలా జరగొచ్చని చెప్పడానికి మాత్రం వీలుంది.
అలా వీలున్న ప్రత్యామ్నాయాలు  ఇప్పటికి ఇలా కనబడుతున్నాయి.
ఆప్షన్ నెంబర్ వన్ – ఏమయినా జరగనీ. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.
(ఈ అంచనాకు ఆధారాలు: వాయలార్ రవి వ్యాఖ్యలు. సమైక్యంగా వుంచినా సీమాంధ్ర లో జగన్ పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్ ను బట్టకట్టించడం కుదరని పని అని నిర్ధారణకు రావడం. తెలంగాణలో అయినా నష్టాన్ని కొంత మేరకు భర్తీ చేసుకోవచ్చన్న ఆలోచన. ఒకవేళ జగన్ పార్టీ  పైకి  అనుకున్నంత బలంగా లేకపోయినా దానికున్న బలం వోట్లను చీల్చి తెలుగుదేశానికి లేనిపోని లాభం కలిగించడానికి పనికొస్తుందేమో  అన్న సందేహం. అదీ ఇదీ కాకుండా, తెలంగాణా ఏర్పాటు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన  కారణం జగన్ పార్టీయే అన్న భావన ప్రజల్లో  కలిగించి సీమాంధ్ర లో  దాని ప్రభావాన్ని తగ్గించడం.)
ఆప్షన్ నెంబర్ టు – రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడం.
(ఈ అంచనాకు ఆధారాలు : ఈ రకమైన ప్రకటన చేయాల్సివస్తే  ఉత్పన్నమయ్యే శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కోవడానికి  తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై  అత్యున్నత స్థాయిలో జరుగుతున్న సమాలోచనల గురించి వెలువడుతున్న సమాచారం)
ఆప్షన్ నెంబర్ త్రీ : హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా లేక కేంద్రపాలిత ప్రాంతంగా చేసి రాష్ట్రాన్ని విభజించడం
( ఈ అంచనాకు ఆధారాలు : ప్రత్యేక తెలంగాణా కోసం పట్టుబడుతున్న టీ.ఆర్.ఎస్. వంటి ఉద్యమ పార్టీల నాయకులను విశ్వాసంలోకి తీసుకుని కనీసం కొన్ని సంవత్సరాల వరకైనా  ఈరకమైన  ఏర్పాటుకు అంగీకరించేలా వొత్తిడి చేయడం – ‘హైదరాబాదు విషయంలో రిఫరెండానికి సిద్ధం’ అంటూ టీ.ఆర్.ఎస్. అధినేత చేసిన ప్రకటనను  ఇందుకు సంకేతంగా తీసుకోవచ్చు. పుష్కర కాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితం కనుచూపుమేరలోకి వచ్చిన సూచనలు స్పష్టంగా కానవస్తున్నప్పుడు, సిద్దాన్నాన్ని మరో మారు నేలపాలు చేసుకోకుండా, కొన్ని  సడలింపుల ద్వారా లక్ష్యాన్ని సాధించుకోగలిగామన్న సంతృప్తితోనైనా  వారు అంగీకరించకపోతారా అన్న  ఆశ.)
ఆప్షన్ నెంబర్ ఫోర్: ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు వుండవు’ అన్న సూక్తిని మరోమారు రుజువు చేస్తూ ఇరవయ్యెనిమిదవ తేదీన ‘అంతా హుష్ కాకీ’ అన్న తరహాలో సమస్యను తేల్చకుండా మరింత నానబెట్టే ధోరణిని కొనసాగించడం. (దీనికి ఆధారాలు కనబడవు. ఎందుకంటే ఇలాటి  ఎత్తుగడలన్నీ ఎలాటి  ఆధారాలు కనబడకుండా పన్నుతుంటారు కాబట్టి)
ముహూర్తం దగ్గర్లోనే వుంది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ‘కానున్నది కాకమానదు. కానిది కానే కాదు’ అనే వేదాంతం వొంటబట్టించుకున్న బాపతుకదా!
‘విదియనాడు కళ్ళు చికిలించుకున్నా కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడ’ని  కదా నానుడి.
చూద్దాం. ఇరవయ్యెనిమిదిన చంద్రుడు కనబడతాడేమో! (18-01-2013)            

    

6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

విదియ వచ్చి మూడేళ్ళు దాటింది. ఇంకా తదియ రాలేదంటే లగడపాటి, చంద్రబాబు, జగన్ వగైరాల పుణ్యమే (పాపమే)

డిసెంబర్ 9న లేని పాకేజులు, హైదరాబాదు లాంటి అంశాలు ఈరోజు తలెత్తడానికి మూలపురుషులు వీళ్ళే.

అజ్ఞాత చెప్పారు...

ఎదో ఒక వంకతో శీతల గిడ్డంగిలోకి తోసేయడమే జరగబోయేది, రావణ కాష్టం మండుతూనే ఉండాలి అధినాయకులకి.

అజ్ఞాత చెప్పారు...

SKC report సూచనల పరిధిలో నిర్ణయం వుంటుంది. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. లేదంటే ఇలాంటి సెంటిమెంటు డిమాండ్లు పుట్టకొక్కుల్లా పుట్టుకొస్తాయి. అది శాంతిభద్రతల సమస్యలను చేజేతులా తెచ్చుకోవడమే. అంతకన్నా మూర్ఖమైన పని వేరొకటి వుండదు. ఓ రీతి రివాజు లేకుండా ఇలా అడ్డగోలుగా విభజిస్తూపోతే ప్రత్యేక దేశాలు కావాలనే సెంటిమెంటు డిమాండ్లు రావచ్చు. ఇలాంటి హేటువాదాలకు తలొగ్గడం కన్నా SRCకి రెఫర్ చేయడం వుత్తమం.

అజ్ఞాత చెప్పారు...

It would be business as usual, with Telangana Bandh on 29Jan. Tg JAC will continue their threats of bigger agitations peacefully as usual. Next deadline will be set for Apr 1st.

అజ్ఞాత చెప్పారు...

SKC report is only Sweet,karaa,coffee report.

అజ్ఞాత చెప్పారు...

SKC report is only Sweet,karaa,coffee report.