31, డిసెంబర్ 2012, సోమవారం

HAPPY NEW YEAR – 2013


HAPPY NEW YEAR – 2013





వొత్తిలా వెలగండి
కత్తిలా మెరవండి
కొత్త ఏడాదిలో
ఎత్తుగా ఎదగండి                           
                                                             అత్తరువు గంధమై
                                                             చిత్తరువు చందమై
                                                             కొత్త ఏడాది
                                                             మిము హత్తుకోవాలి!
                 
      నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు  
             NIRMALADEVI,   BHANDARU   SRINIVASA  RAO
bhandarusr@yahoo.co.in   AND bhandarusr@gmail.com 9849130595

30, డిసెంబర్ 2012, ఆదివారం

పదమూడయినా చూపకపోతుందా మార్గం



పదమూడయినా చూపకపోతుందా మార్గం 





2012 వ సంవత్సరం అంచున నిలబడి ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ......
ఎన్ని వ్యాపకాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు
కొన్ని మధురం కొన్ని  మరికొన్ని వ్యధాబంధురం
కొన్ని మరపురానివి మరికొన్ని మరచిపోవాలని అనుకునేవి
కొన్ని తీపి గురుతులు  కొన్ని చేదు గుళికలు
ఉగాది పచ్చడిలా కష్టసుఖాల సమ్మేళనమా అంటే కాదాయె
కొని తెచ్చుకున్న ఇక్కట్లు కొన్నయితే పైనబడ్డ ఇబ్బందులు మరి కొన్ని
కొన్ని ప్రకృతి ప్రసాదాలు మరికొన్ని మనిషి స్వయంకృతాలు
కొన్ని స్వార్ధశక్తుల ప్రేరేపకాలు మరికొన్ని రాజకీయ  కుశ్చిత కుతంత్ర జనిత విష పుత్రికలు
పులులు పంజాలు విసిరే చోట లేడికూనల దీనాలాపాలు
విష నాగులు సంచరించే వనంలో రెక్కలు విప్పుకుంటున్న శాంతి కపోతాలు
ఎవరి దోవ వారిదే ఎవరి యావ వారిదే
ఎవరి వాదన వారిదే ఎవరి రోదన వారిదే
ఎవరి గోల వారిదే ఎవరి లీల వారిదే  
ఒకరి మాట మరొకరికి ఎక్కదు
ఒకరి గోడు మరొకరికి పట్టదు
వివాదాల ముందు వివేచన తల వంచుకుంది
వాదప్రతివాదాల నడుమ హేతువు తల దించుకుంది  
పంతాలు పట్టింపుల హోరులో నోర్లు తెగబడ్డాయి, వూర్లు తగలడ్డాయి
నాలుకలు చీలిన  నాయకుల  ప్రేలాపనలతో బుల్లితెరలు చిల్లులు పడ్డాయి  
మాటల తూటాలతో మాధ్యమాలు దద్దరిల్లాయి
అమృతం కురవాల్సిన చోట విషం  ధారగా కారింది  
మంచితనం మనుగడే  ప్రశ్నార్ధకంగా మారింది
వాస్తవాలను ఎరుక పరచాల్సిన విజ్ఞులు తానులో ముక్కలయ్యారు
మౌనంగా పరికిస్తున్న సామాన్యులు నోటమాట రాక అవాక్కయ్యారు
ఏడాది చివరిలో హస్తినలో జరిగిన ఘోరకలి కలి ఉనికిని నిర్ధారించింది   
యుగాంతం వదంతి నిజమయినా బాగుండేదన్న భావన అందరిలో కలిగింది  
అయినా ఏదో ఆశ
మనిషిని బతికిస్తున్న ఆశ
నిరాశ నిస్పృహల  నడుమ జోగాడుతున్న ఆశ
మంచి రోజులు వస్తాయన్న ఆశ
మంచి కాలం ముందుందన్న ఆశ
తిట్టుకుంటున్న నోళ్ళు కట్టుబడతాయన్న ఆశ
కొట్టుకుంటున్న చేతులు కలుసుకుంటాయన్న ఆశ
జనాలను దోచుకుంటున్న   నాయకులు జనాలను కాచుకుంటారన్న ఆశ
కొత్త ఏడాది రూపంలో ఎదుట నిలబడి వుంది
చెబుదాం దానికి స్వాగతం
కాలమే సమస్యలకు పరిష్కారం
రెండువేల పదమూడయినా చూపాలి దానికి ఓ మార్గం (30-12-2012)             
  

29, డిసెంబర్ 2012, శనివారం

లక్ష’వొత్తుల’ నోముకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు



లక్ష’వొత్తుల’ నోముకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు



‘భండారు శ్రీనివాసరావు వార్తా వ్యాఖ్య’ అనే ఈ తెలుగు బ్లాగు నేను మొదలు పెట్టినప్పటినుంచి నన్ను ఆదరించి ‘లక్ష వొత్తుల నోము’ (ONE LAKH HITS) పూర్తిచేసుకోవడానికి సహకరించిన మీ అందరికీ  కోటి కోట్ల వందనాలు- అభివందనాలు. అభివందన చందనాలు.
ఈ లక్ష్యం నెరవేరడానికి  కొత్త సంవత్సరం  2013   వరకూ వేచి చూడాల్సివస్తుందేమో అని అనుకున్న మాట కూడా  నిజమే. కానీ, ఆ ఘడియ ఇంకా కొన్ని రోజులు  మిగిలి వుండగానే నేను ఎదురు చూసిన ఆ క్షణం దగ్గర పడడం కేవలం మీ అభిమానం.  ఆదరణ.  అందుకు లేదు సందేహం.
అందుకే,  ఒక్కొక్కరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు.
సదసద్విమర్శలతో నన్ను మంచి బాటలో పెట్టిన వారికీ, ప్రోత్సహించి ముందుకు నడిపించినవారికీ ‘ఈ లక్షవొత్తుల నోము’ ఫలితం లభించాలని మనసారా కోరుకుంటూ – నూతన సంవత్సర శుభాకాంక్షలతో – భండారు శ్రీనివాసరావు (29-12-2012)                   

నా కలంలో ఇంకు అయిపోయింది



నా కలంలో ఇంకు అయిపోయింది 
  
తెలుగు సభలు ఘనంగా  ముగిశాయి.



‘నా కలంలో ఇంకు అయిపోయింది’ అనే పేరుతొ హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు రాసిన పుస్తకాన్ని తిరుపతి  తెలుగు సభల్లో ఒక కేంద్ర మంత్రి  ఆవిష్కరించినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఆ రచనను కానీ, ఆ రచయితను కానీ చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు కానీ ‘ఇంకు’ అనే ఇంగ్లీష్ పదం వాడడం అవసరమా అన్న సందేహం మాత్రం మిగిలిపోయింది.
(కార్టూనిస్టు కు ధన్యవాదాలు)
(29-12-2012)

రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగిపోయిన శ్రీనాధుడు



రాజమండ్రి  రైల్వే స్టేషన్లో  దిగిపోయిన  శ్రీనాధుడు


ఆరోజు విజయవాడలో ఆఫీసర్ల క్లబ్ వార్షికోత్సవం. వూళ్ళో వున్న పెద్ద పెద్ద ఆఫీసర్లు భార్యలతో సహా వచ్చారు. సాహిత్యం మీద ఇష్టాగోష్ఠి. స్టేజీమీద రైల్వే డి.ఆర్.ఎం గారు ముఖ్య అతిథిగా ఆసీనులయ్యారు. ఆ క్లబ్బుకి వారి సతీమణి కార్యదర్శి. ముఖ్యాంశం శ్రీనాధుని కవితా వైభవం. 

శ్రీనాధుని కవిత్వం గురించి సీస పద్యాలు ఉదహరిస్తూ ఒకరు మాట్లాడారు. ఆయన ప్రసంగం అవగానే అందరూ చప్పట్లు కొట్టారు. డి.ఆర్.ఎం గారు క్లబ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. 

చివర వందన సమర్పణ చేస్తూ డి.ఆర్.ఎం గారి సతీమణి "శ్రీనాధుని కవిత్వం గురించి ఎన్నో చక్కని విషయాలు చెప్పారని అబినందిస్తూ ఆ శ్రీనాధుని ఒక వారం రోజుల క్రితమే తాను తమిళ్‌నాడు ఎక్స్ ప్రెస్ రైల్లో చూసానని, ఆయన ఫలానావారు అని తెలిసేలోగానే వారు రాజమండ్రీలో రైలు దిగి వెళ్ళిపోయారని, అలాంటి మహాకవిని కలిసి మాట్లాడలేకపోవడం తన దురదృష్టమని" విచారంగా చెప్పింది. 

సభలో అంతా అవాక్కయ్యారు. ఆ నిశ్శబ్దానికి కారణం తెలియక భర్త వైపు చూసింది. డి.ఆర్.ఎం గారు భార్యకేసి కోపంగా చూసారు. 

సరే కార్యక్రమం పూర్తి అయింది. డి.ఆర్.ఎం గారు సతీమణితో కార్లో ఇంటికి వెళ్తున్నారు. 

మౌనంగా వున్న భర్తతో "ఏమండీ నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, నాకేసి కోపంగా చూసారు?" అని అడిగింది. 

"
నీకు బుద్ధిలేదు. ఏం వాగావో తెలుసా?" 

"
నేనేమన్నానండి?" అంది భయంభయంగా. 

"
తమిళ్‌నాడు ఎక్స్ ప్రెస్ రాజమండ్రీ మీదుగా వెళ్తుందా? ఆ మాత్రం ఇంగిత ఙ్ఞానం లేకుండా మాట్లాడితే నలుగురూ నవ్వరూ? చూసావా అందరు విస్తుపోయి నీకేసి ఎలా చూసారో?" 

"
అవునండి. అది హౌరా మెయిల్ అనబోయి తమిళ్‌నాడు అన్నా" అంది ఖిన్నురాలై.

28, డిసెంబర్ 2012, శుక్రవారం

వచ్చిండన్నా, వచ్చాడన్నా


వచ్చిండన్నా, వచ్చాడన్నా- వరాల తెలుగు ఒకటేనన్నా భండారు శ్రీనివాసరావు
(తిరుపతి తెలుగు సభలను పురస్కరించుకుని మరోమారు పునశ్చరణ)
ఈ మధ్య కాలంలో కొన్ని కొత్తరకమయిన ఉద్యమాలు, ఆందోళనలు రూపం దిద్దుకుంటున్నాయి. కొన్ని కులాలు, వర్గాలకు చెందిన వారి ఆచారవ్యవహారాలు, కట్టూబొట్టూ, మాటా యాసా ఇవన్నీకొన్ని సినిమాల్లో  వివాదాస్పదమవుతున్నాయి. సినిమాను సినిమాగా చూడాలని కొందరు అంటుంటే, శ్రుతిమించినప్పుడే సమస్యగా మారుతోందని ఇంకొందరు వాదిస్తున్నారు.
ఇందులో తప్పొప్పులను నిర్ధారించడానికి ఆయా వ్యవస్థలు వున్నాయి కాబట్టి  వివరాల్లోకి పోవడం లేదు.
ఈ నేపధ్యంలో భాషకు, యాసకు సంబంధించిన వివాదాలు చిక్కుముడులుగా మారకుండా చూడాల్సిన అవసరం వుంది.
ఒక ప్రాంతం వారి భాషను, యాసను మరో ప్రాంతం వారు అణగదొక్కుతూ,  తమ ప్రాబల్యాన్ని భాషపై కూడా విస్తరిస్తూ పోతున్నారన్న ఆవేదనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ పోయి అమ్మాయి, కొడుకు పోయి అబ్బాయి, కక్కయ్య పోయి బాబాయి, చిన్నమ్మ పోయి పిన్నమ్మ - ఇలా ఒక ప్రాంతానికి చెందిన పదాలు క్రమక్రమంగా కనుమరుగయి పోతున్నాయని   సింగిడి తెలంగాణా రచయితల సంఘం కన్వీనర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించిన   అభిప్రాయంతో కొంతవరకు ఏకీభవించక తప్పదు. ప్రాంతీయపరమయిన ఉద్యమం నడుస్తున్న నేపధ్యంలో ఇలాటి అభిప్రాయాలు మరింత బలంగా వేళ్ళూనుకోవడం సహజమే. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. అయితే, పరిణామక్రమాన్ని కూడా కొంత పరిశీలించుకోవాల్సిన అవసరం వుంది.

నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లు, వీధుల పేర్లు తెలుగులో ఎలారాసేవారో చాలామందికి గుర్తుండేవుంటుంది. అప్పట్లో కూడా అనేకమంది తెలుగు భాషకు పట్టిన దుర్గతిని చూసి ఇలాగే మధనపడేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతొ దేశంలో తొట్ట తొలిసారి ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో తెలుగుకు ఈ దుస్తితి  ఏమిటని బాధపడేవారు. సబ్బులు, తలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో వేసే స్లయిడ్లలో, పత్రికల్లో వచ్చే వాణిజ్య ప్రకటనల్లో  కూడా తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటె ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయిలో తయారయ్యేవి. హిందీ లిపిలో తెలుగు రాయించి, తెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత రాయించడం వల్ల,చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది  తెలిసిన విషయమే.

వెనుకటి రోజుల్లో, నిజాం పాలిత ప్రాంతాలలో  చాలామంది తెలుగు మాతృభాషగా  వున్న కుటుంబాలనుంచి వచ్చినవాళ్లు సైతం ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే వుండేవారు. చాలా   గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని  కూడా చెప్పుకునేవారు.

ఆ రోజుల్లో బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకేఒక్క రైలు నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు బొగ్గుకోసం, నీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూ, పడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినా, పై చదువులకోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపు, రాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలనుంచి  హైదరాబాదుకు రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.

ఫలితంగా గత యాభయ్ ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో  అతితక్కువగా వున్న అక్షరాస్యత శాతాన్ని  బట్టి చూస్తె బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశర్యకరమేమీ కాదు.
వలసలు వచ్చిన వాళ్ళు  సాధారణంగా   వారితో పాటే తమ సంస్కృతిని, ఆచారవ్యవహారాలను, భాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకువస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగువాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే కానీ ఒక దాడి ప్రకారం, ఒక పధకం ప్రకారం జరుగుతోందని అనుకోవడం అంత సబబు కాదు. వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలకోసం వచ్చేవారు, స్తానికులకు చేసే అన్యాయాలతో ముడిపెట్టి, ఈ అంశాన్ని చూడడం కూడా సరికాదనిపిస్తుంది. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీ, ఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారి వారి భాషలు, యాసలు పదిలంగా వుండడాన్నిబట్టి చూస్తె, వలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈ రకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.

భాష పట్ల మమకారం లేని వాడు వుండదు. అది కన్న తల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడిపొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.

మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా.  హిందీ, ఉర్దూ తెలియని ప్రాంతాల్లో కూడా ఆ భాషల చలన  చిత్రాలను ప్రజలు ఆదరించడం తెలిసిందే.  ఎవరయినా ఉర్దూ భాషలో  మాట్లాడుతుంటేనో, ముషాయిరాలు వినిపిస్తుంటేనో  ఆ భాషలోని మాధుర్యానికి అది ఏమాత్రం తెలియని వాళ్లు కూడా తలలూపుతూ ఇంకా వినాలని ఉత్సాహం చూపడం కద్దు. అదీ భాషలోని సౌందర్యం. అదీ భాషలోని గొప్పదనం.

మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపోతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.

భాషలో తమవిఅనుకున్న పదాలు తమవి కాకుండా పోవడమే కాకుండా మాయమయిపోతూవుండడం పట్ల ఎవరయినా బాధపడితే వారి ఆవేదన అర్ధం చేసుకోతగ్గది.

ఐతే, భాషాభిమానులు  బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని  వున్నాయి. నాన్నను ఒరేఅనడం అమ్మను ఒసేఅనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాట, ముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకు, సంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు  అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.

ఎన్ని కొమ్మలు వేసినా తల్లి వేరు ఒక్కటే. కలివిడిగా తల్లిని ప్రేమించడానికి ఏమయినా ఇబ్బందులు వుంటే విడివిడిగా తల్లిని ఆరాధించడమే బిడ్డలు చేయాల్సిన పని. 

27, డిసెంబర్ 2012, గురువారం

ఏం భాషరా బాబు!


ఏం భాషరా బాబు!


తిరుపతిలో తెలుగు సభలేమో కాని టీవీ చానళ్ళలో తెలుగు చర్చలు హోరెత్తి పోతున్నాయి. నిన్న ఒక ఛానల్లో పాల్గొన్న  ముగ్గురూ ఓ పక్క తెలుగులో మాట్లాడుతూనే మరో పక్క మీ తెలుగు వేరు మా తెలుగు వేరు అని  వాదించుకోవడం చూసి చూస్తున్న వారికి  మతి పోయింది. ఒకాయన ఏకంగా దేశంలో యే భాషకు లేనివిధంగా ఒక్క తెలుగుకే తెలుగు,తెనుగు, తెనుంగు అని రకరకాల పేర్లు వున్నాయని, కావున రాష్ట్రంలో ఎవరి తెలుగు వారిదేననీ తేల్చేసారు. మరి పొరుగున వున్న తమిళనాడులో అరవం, తమిళం అని ఒకే భాషను రెండు రకాలుగా పిలుస్తున్న సంగతిని ఆయన వాదం కోసం కాసేపు మరచిపోయినట్టున్నారు. పైగా చర్చలో పాల్గొంటున్న వారెవ్వరూ తమ యాసలో తెలుగు మాట్లాడలేదు. అందరూ మాట్లాడే తీరు ఒకేరకంగా వుంది. పక్కవారు మాట్లాడేది అసలు తెలుగే కాదంటారు. వితండవాదం అంటే ఇదే కాబోలు.

ఇలావుంటే ఈ రోజు ఫేస్ బుక్ లో ఓ మిత్రుడు శ్రీ మంచాల శ్రీనివాసరావు  పెట్టిన పోస్టింగ్ తెలుగుకు పట్టిన తెగులుకు అద్దం పట్టేదిగా వుంది. చిత్తగించండి.
    
ఈనాడు" తెలుగీకరణ తెల్లారినట్టే ఉంది... ఖర్మరా బాబూ!!
APPSC
అంటే రాష్ట్ర ప్రజా సేవ సంస్థ అట! అది సర్కారు కొలువులకు నియామక పరీక్షలు నిర్వహించే సంస్థ మాత్రమే... అందులో సేవ అనే పదానికే అర్థముండదు.... కనీసం ఉద్యోగ నియామక సంస్థ అని చెప్పినా ఓ తీరుగా ఉండేది...!
IAS
పదానికి తెలుగీకరణ మరీ ఘోరంగా ఉంది. indian అనగానే భారత్, administration అనగానే పాలన, service అనగానే సేవ... ఇంకేం, భారత పాలన సేవ అని తేల్చేశారు... అది ఒక జాతీయ స్థాయి ఉద్యోగ కేడర్ అనే అర్థమేమైనా స్ఫురిస్తోందా అసలు!?
records
కి తెలుగు పదం నమోదు పత్రమట!! record చేయడం అనగానే నమోదు అనే పదం గుర్తొచ్చి అలా తేల్చేశారు... కానీ ఇక్కడ records అంటే పత్రాలను పదిలపర్చడం.... 
market yard
అంటే విపణి వేదిక అట! market అంటే ఎంతటి విస్తృతార్థం ఉందో తెలిసినవారెవ్వరూ ఈ పదాన్ని మామూలు market yardకి ఉపయోగించరు!!
commission agents
కి ప్రతిఫలాపేక్షదారులు అనే అనువాద ప్రయాస కూడా గుత్తేదారు అనే విఫల ప్రయోగాన్నే గుర్తుకు తెస్తోంది... .
మంచి సంకల్పం ఉన్నా... ఇలాంటి వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్టదాయకం అవుతుంది...!!
NOTE: కార్టూనిస్టుకు ధన్యవాదాలు