17, జూన్ 2012, ఆదివారం

ఏవన్నా తేడా వచ్చిందా?


ఏవన్నా తేడా వచ్చిందా?
ఎందుకిలా రాస్తున్నారు అని నా బ్లాగు పాఠకులు కొందరు రాసిన పిమ్మట నేను స్వచ్ఛందంగానే కొన్నాళ్ళపాటు రాజకీయాలు రాయడం మానేసి ‘ఎందుకిలా రాస్తున్నాను?’ అన్న ప్రశ్నను నాకు నేనే వేసుకుని సమాధానం వెతుక్కున్నాను. నేను రాస్తున్నదానిలో, లేదా టీవీ ఛానళ్ళలో మాట్లాడుతున్న వాటిలో ఏదన్నా పక్షపాత ధోరణి కానవస్తున్నదేమో అని పరిశీలన చేసుకున్నాను. ఇన్నేళ్ళుగా రాస్తూ వచ్చిన విషయాలను పునశ్చరణ చేసుకుని మరోమారు బేరీజు వేసుకున్నాను.
ఈనాడు  రాష్ట్ర రాజకీయ యవనికపై మారుతున్న  దృశ్యం పరికిస్తున్నప్పుడు ఇన్నాళ్ళనుంచి నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్లో ఏదయినా తేడా వచ్చిందా? లేక నేను రాసిందే జరుగుతూ వస్తోందా ? అని పోల్చి చూసుకోవడానికే ఈ ప్రయత్నం. నా విమర్శకులను కూడా అదే అభ్యర్ధిస్తున్నాను.కాకపోతే, స్తలాభావం కారణంగా వ్యాసాలను బాగా కుదించడం జరిగింది.

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి  (15-12-2010)
పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే! ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత  పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే  ఇందులోని విషాదం.
నిన్న మొన్నటివరకు ప్రాంతీయ సమస్య ప్రధాన భూమిక పోషించిన రాష్ట్రంలో ఈనాడు రాజకీయమంతా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి నిండా నాలుగు పదుల వయస్సు లేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏడాదిన్నర కూడా కాలేదు. చూడగానే ఆకట్టుకునే విగ్రహం కాదు. పట్టుమని పది నిమిషాలపాటయినా తన ప్రసంగాలతో  ప్రజలను కట్టిపడేసే చాతుర్యం ఏమయినా వుందా అంటే అదీ లేదు.
అయినా వై ఎస్ జగన్ మోహన రెడ్డి సభలకు వేలం వెర్రిగా జనం ఎందుకలా వస్తున్నారు?
ఈ ఒక్క ప్రశ్నే అందర్నీ కలవరపెడుతోంది. అయితే, ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. పైపెచ్చు అనేక సమాధానాలున్న ప్రశ్న. ముందు చెప్పినట్టు ఎవరి ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా వారు ఊహించుకుంటూ జవాబులు వెతుక్కుంటూ వుండడంవల్ల ఎన్నెన్నో రకాల ఊహాగానాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఏమి జరగబోతున్నదన్న దానిపై మరెన్నో రకాల వదంతులు చెలరేగుతున్నాయి. జగన్ అనుకూల, ప్రతికూల కధనాలతో  మీడియా వీటికి మరింత  ఊతం ఇస్తోంది.                                                        

ఇప్పుడున్న వాడినీ వేడినీ మరో మూడేళ్ళు పైబడి  కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఈనాడు జగన్ కు వున్న ధన వనరులు, జన వనరులు వచ్చే ఎన్నికలకల్లా కళ్ళ ఎదుటే  కరిగిపోవడం ఖాయమన్నది వారి నిశ్చితాభిప్రాయం. అవినీతి మార్గాలలో సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మరో మార్గంలో అధికార పీఠం అధిరోహించడం అతడి ఏకైక లక్ష్యమన్నది  గత ఏడాది పైగా సాగుతూ వస్తున్న జగన్ వ్యతిరేక ప్రచారం లోని  మరో పార్శ్వం. ఈ క్రమంలో జగన్ సానుకూల, ప్రతికూల వర్గాల నడుమ సాగిన  వాదప్రతివాదాలు ముదిరి పాకానపడి జగన్ కు జనం లో హీరో స్తాయిని కట్టబెట్టాయి. పార్టీలో పెద్దలంతా ఒకవైపు, జగన్ ఒక్కడూ ఒకవైపూ వుండి నడిపిన రాజకీయంసాధారణ జనంలో జగన్ పట్ల సానుభూతి మరింత పెరిగేలా చేసింది.

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం (29-12-2010)
 
ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో టీడీపీ ది ఒక ప్రత్యేక స్తానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్  మాదిరిగానే కొద్దో గొప్పో కేడర్ కలిగిన పార్టీ. కానీ ఈ మధ్యలో బాగా పుంజుకున్న తెలంగాణా అంశం వారి ఆశలపై మరోసారి  నీళ్ళు చల్లింది.అన్ని పార్టీల మాదిరిగానే ఈ పార్టీపై కూడా తెలంగాణా క్రీనీడలు కమ్ము కున్నాయి.  
పోతే, టీ.ఆర్.యస్.
తెలంగాణా లక్ష్య సాధన కోసం, అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే  నాయకులకు కొదవ లేని పార్టీ అది. అదృష్టం ముందు పుట్టి తరువాత పుట్టిన చంద్రశేఖరరావు ఆ పార్టీ నాయకుడు.
ఇంకా పేరు పెట్టని జగన్ పార్టీ విషయం కూడా చెప్పుకోవాలి. పుటకకు ముందే ప్రకంపనలు సృష్టించి దరిమిలా నీరు కారిపోయిన ఇతర పార్టీలను ఉదాహరణగా చూపిస్తూ  కొందరు  చేస్తున్న అవహేళనల నడుమ, కొత్తగా ఈ పార్టీ పురుడు పోసుకుంటోంది.
రాష్ట్రంలో నేడు నెలకొనివున్న దుస్తితికి  అన్ని  పార్టీలకు అంతో ఇంతో బాధ్యత  వున్నప్పటికీ  ఏదో సాకు చూపి తప్పించుకోలేని ప్రధాన బాధ్యత  మాత్రం అధికార పక్షానిది.          
అయిదేళ్ళు పాలించండని అధికారం అప్పగించిన ప్రజలను వారి మానాన వారిని వొదిలి గ్రూపు తగాదాలతో   మునిగి తేలుతున్న కాంగ్రెస్ వారిని చూస్తుంటే ఆ పార్టీని మొండిగా అభిమానించే వారికి కూడా  ఏష్టత కలుగుతోంది. రెండేళ్ళ క్రితం వరకు వడ్డించిన విస్తరి లాంటి కాంగ్రెస్ పరిస్తితి ఈ రోజు కుక్కలు చింపిన విస్తరి  చందాన తయారయింది.
ముఖ్యమంత్రిని మార్చాలా! ముఖ్యమంత్రి  తీరు మారాలా!! (18-11-2011)
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను రుజువు చేసుకోవడంలో ఆయన కొంతవరకు  వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది.
యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకు సమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి.
 పైగా అధిష్టానం మద్దతు ఆయనకు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా  పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఎన్నెన్ని అవినీతి  ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు  వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి.
ఎటు పోతున్నాం? (22-11-2011)
ప్రత్యర్ధి పార్టీలను  నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధనకోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయకోణం నుంచి చూస్తే వాటికి ఇది  తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే  క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి.
రాజకీయ అవినీతి (28-07-2011)
అంగట్లో అన్నీ  వున్నా అల్లుడి నోట్లో  శని అన్న సామెత చందంగా రాజకీయ అవినీతి గురించి జరిగిన దర్యాప్తులు, అవి నిగ్గు దేల్చిన నిజాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాల కాలంలో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు రుజువై శిక్ష పడ్డ రాజకీయ ప్రముఖులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. నేరానికి తగిన  శిక్ష తధ్యం అన్న భయం వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేర ప్రవృత్తి సయితం తగ్గుముఖం పడుతుంది.
చట్టం అందరిపట్లా ఒకే  రకంగా వ్యవహరించినప్పుడే చట్టం తన పని తాను చేసుకుపోతుందిఅనే వాక్యానికి అర్ధం వుంటుంది. లేని పక్షంలో అది ఒక పనికిరాని వూతపదంగా మిగిలిపోతుంది.

కాంగ్రెస్ వాకిట్లో ఆగస్టు సంక్షోభం (03-05-2012)
తాము కోరి ఎంపిక చేసుకుని నియమించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  తమ అంచనాలకు, ఆకాంక్షలకు అందకుండా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం హస్తిన నాయకులను కలవరపెడుతోందా?
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత రాష్ట్ర వ్యవహారాలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న అధిష్టానం  ప్రయత్నాలు బెడిసికొట్టి, 1982 నాటి చరిత్ర పునరావృతం కాబోతున్నదన్న సందేహం పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోందా?    
ఇంతకీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంతగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం అధిష్టానం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే. కానీ ఆ విషయం అధినాయకత్వం ముఖాన్నే  చెప్పగల, చేవ కలిగిన నాయకుడేడీ? రాష్ట్ర కాంగ్రెస్ అస్తవ్యస్త పరిస్తితికి సంబంధించి ముద్దాయి స్తానంలో వుండాల్సిన అధిష్టానం తీర్పరి పీఠంపై వుండడమే విషాదం. దీనికి తోడు - జాతీయ పార్టీ ముసుగులో పేను పెత్తనంచేయాలనే ఆభిలాష అదనం.
కానీ తప్పు దిద్దుకోవడానికి తరుణం కాదాయె. ముంగిట్లో 18 అసెంబ్లీ ఉపఎన్నికలు, ఒక లోకసభ ఉపఎన్నిక పెట్టుకుని యే నిర్ణయం తీసుకోవాలన్నా పాలుపోని పరిస్తితి.
రాష్ట్రపతి ఎన్నిక అనంతరం  ఆగస్టులో కాయకల్ప చికిత్స మొదలు పెడతారేమో! అప్పుడూ లొంగకపోతే, ఆఖరి ఔషధంగా గరళవైద్యం తప్పదేమో!
దుష్టాంగాన్ని ఖండించయినా శిష్టాంగాన్ని కాపాడమన్నారు కదా పెద్దలు.
కాకపోతే, తొలగించే అంగాలుఒకటా రెండా అన్నదే ప్రశ్న. (17-06-2012)
ఏవన్నా తేడా వచ్చిందా? మీరే చెప్పాలి.

4 కామెంట్‌లు:

Pavani చెప్పారు...

లేదు.రాదు.ఎందుకంటే..చెహోవ్ కథల్లో గుమస్తా మాదిరిగా నొప్పింపక తా నొవ్వక, సుతారంగా,షోగ్గా,బెరుకు బెరుకుగా విశ్లెషించటం తప్ప..ఇదీ నా position అని నిక్కచ్చిగా చెప్పటం కానీ, ఇదీ జరగ బోయేది అని భవిష్య దర్శనం చెయ్యటం కానీ మీరు చెయ్యలేదు.
ఒక్క మీ మీదే కాదు..తెలుగు టీవీల్లో, పత్రికల్లో వచ్చే అందరి విశ్లెషకుల మీదా నా అభిప్రాయం ఇదే. తెలంగాణా విషయంలో కేంద్రం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ప్రజలందరూ సుఖ శాంతుల్తో ఉంటారు, జగన్ నిజంగా దోషేనా?కాదా? ఎలా?, వచ్చే ఎన్నికలెలా ఉండబోతున్నాయి,మీడియా లో పక్షపాతం(ఉదాహరణలతో సహా)...రాయండి. నంగి మాటల పరదాల కింద కాక--సూటిగా, స్పష్టంగా రాయండి. వీలుంటే ఆర్ధిక, సాంస్క్రుతిక విషయాల మీద జరుగుతు దాన్ని అర్థం చేసుకోవటం కాకుండా, మీ అభిప్రాయమేంటో నిక్కచ్చిగా చెప్పండి.
ఎవర్నీ అడక్కుండానే మీ గురించి మీకు తెల్సిపోతుంది.
I appologize for beeing harsh, but frankly thats how I feel. Regards.

అజ్ఞాత చెప్పారు...

/అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే నాయకులకు కొదవ లేని పార్టీ అది/
యువమేతదీ అదే దారి, కుష్టురోగుల్ని, బద్దెపురుగుల్ని వెనకేసుకుని తిరుగుతున్నారు, డొంకదారుల్లో అధికారం పొందాలంటే అలానే చేయాల్సివుంటుంది.
రాజకీయ/సామాజిక పరిస్థితులను విశ్లేషించి మార్గాన్ని సూచిస్తే అది చాలు, మరీ ఖచ్చితమైన భవిష్యదర్శనం చేయించాల్సిన అవసరం జర్నలిస్టులకు లేదు, ఆ పనులు చేయడానికి వేరే వున్నారు (జ్యోతిష్కులు).

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Pavani - You need not feel apologize for being harsh with me. When asked the opinion of readers, how can I take it otherwise. You are most welcome.పోతే, మరో మాట. నా వయస్సు మాటున అభిప్రాయాలను రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది కాదు. ఎవరినో మెప్పించడానికో, లేదా మరెవరినన్నా నొప్పించడానికో రాస్తున్న విషయాలు కాదుకదా. ఇవి చదివేవారందరూ ఏకీభవిస్తారని అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. నేను ప్రాధమికంగా రిపోర్టర్ని. తెలిసిన విషయాలు తెలిసినట్టుగా రిపోర్ట్ చేయడం తప్ప వాటికి రంగూ,రుచీ,వాసనా అద్దడం నా పని కాదు. విషయాలు వివరించి వాటిపై ఒక అవగాహనకు రాగల అవకాశాన్ని చదువరికే వొదిలేయాలని మాకు జర్నలిజంలో అక్షరాభ్యాసం చేయించిన నార్ల గారు నలభయ్ ఏళ్ళ క్రితమే చెప్పారు. ఒక్కోసారి ఇవి నంగి మాటలకిందా, బెరుకు బెరుకుగా విశ్లేషించడం కిందా పొరబడితే నేను తప్పుబట్టను. అరవై అయిదేళ్ళు వచ్చిన తరువాత కూడా నా గురించి మరొకరు చెప్పేదాకా తెలుసుకోలేని స్తితిలో వుంటే ఆ వయస్సుకు అర్ధమే లేదు. ఇంకోమాట. ఫ్రాంకు గా వుంటామనుకునే వాళ్లు, ఫ్రాంకు గా మాట్లాడుతామని అనుకునే వాళ్లు, ఎదుటివాళ్ళు కూడా అలాగే మాట్లాడితే తట్టుకున్నవాళ్ళు ఇన్నేళ్ళ జీవితంలో నాకెవ్వరూ తారసపడలేదు. మీరు అలాటి వారిలో ఒకరు కారన్నది నా నమ్మకం.

KumarN చెప్పారు...

ఫ్రాంకు గా వుంటామనుకునే వాళ్లు, ఫ్రాంకు గా మాట్లాడుతామని అనుకునే వాళ్లు, ఎదుటివాళ్ళు కూడా అలాగే మాట్లాడితే తట్టుకున్నవాళ్ళు ఇన్నేళ్ళ జీవితంలో నాకెవ్వరూ తారసపడలేదు.
__________________

Very well said:)

(Disclaimer: I didnt mean this against anyone please)