ఐ.సి.ఐ.సి.ఐ. నక్షత్రకులు
రాజీవ్ దంపతులు ఎక్కిన విమానం కొన్ని వేల అడుగుల ఎత్తున గాలిలో తేలిపోతోంది. తమ నలభయ్యవ వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకోబోతున్న సందర్భాన్ని తలచుకుంటూ ఆ దంపతులు కూడా వూహల్లో తేలిపోతున్నారు.
ఇంతలో పబ్లిక్ అడ్రెస్ సిస్టం నుంచి విమానం కెప్టెన్ గొంతు వినిపించింది. అతడి స్వరంలో తెలియని కంగారు ప్రయాణీకులకు ఇట్టే తెలిసిపోతోంది.
‘లేడీస్ అండ్ జెంటిల్మెన్! మీ అందరూ నిబ్బరంగా వుండాలని కోరుకుంటున్నాను. మన ఈ విమానం ఇంజిన్లలో మరమ్మతు చేయలేని అవరోధం తలెత్తింది. అత్యవసరంగా కిందికి దింపాల్సిన అగత్యం ఏర్పడింది. నిర్మానుష్యమయిన ఒక దీవిని కనుగొన్నాము. అక్కడ విమానాన్ని సురక్షితంగా దింపే ప్రయత్నాలు చేస్తున్నాము. అవి ఫలించాలని మనమందరం మనసారా కోరుకుందాం. కాకపోతే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఒకసారి అక్కడ దిగడం అంటూ జరిగితే మనకు బయట ప్రపంచంతో సంబంధాలు శాశ్వితంగా తెగిపోతాయి. ఆ తరువాత మనమందరం ఆ దీవిలోనే జీవితాంతం మన బతుకులు తెల్లవార్చుకోవాలి. మనం ఎక్కడ వున్నదీ ఇక ఎవ్వరూ కనుక్కోలేని దీవిలో మనం కాలుమోపబోతున్నాం.’
విమానం పైలట్లు తమ నైపుణ్యం అంతా ఉపయోగించి విమానాన్ని ఆ దీవిలో సురక్షితంగా దించగలిగారు. చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్ధం నడుమ ప్రయాణీకులందరూ బిక్కుబిక్కుమంటూ మాటామంతీ లేకుండా అందులోనే కూర్చుండిపోయారు.
ఓ గంట గడిచింది.
రాజీవ్ పక్కకు తిరిగి భార్య చెవిలో చెప్పాడు.
‘ఈ నెల మనం ఐ.సి.ఐ.సీ.ఐ. బ్యాంకుకు పంపాల్సిన ఇంటి లోను వాయిదా చెక్కు పంపించావా?’
రాజీవ్ భార్యకు ముందు మొగుడు ఏం అడుగుతున్నాడో అర్ధం కాలేదు. అర్ధం అయిన తరువాత అర్ధం కానట్టు మొహం పెట్టింది. అనుకోకుండా ఎదురయిన ఈ అవాంతరం వల్ల మొగుడు ఇలా ఈ సమయంలో అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నాడేమో అని సరిపుచ్చుకుంది.
‘చెక్కు పంపలేదు. అయినా ఆ విషయం మాట్లాడుకునే సందర్భమా ఇది?’ అంటూ ఎదురు ప్రశ్న వేసింది.
‘పోనీ, బ్యాంకు క్రెడిట్ కార్డు ఇన్ స్టాల్ మెంటు కట్టావా! అదీ మరచిపోయి వచ్చావా?’ అంటూ రాజీవ్ ఇంకో ప్రశ్న సంధించాడు. భార్య ఖచ్చితంగా ఇది సంధిప్రేలాపనే అని ఓపక్క భయపడుతూనే ‘లేద’ని జవాబిచ్చింది.
అది వింటూనే, నలభయ్ ఏళ్లలో ఎన్నడూ ఎరగని విధంగా భార్యను గట్టిగా వాటేసుకుని తోటి ప్రయాణీకులు ఉలిక్కిపడేలా రాజీవ్ పెద్దగా అరిచాడు.
‘ఇక మనమెంతమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఈ దీవిలోనే కాదు అతల,సుతల,పాతాళ లోకాల్లో ఎక్కడున్నాసరే బ్యాంకు వాళ్లు మనల్ని కనిపెట్టితీరతారు.’
(నెట్లో సంచారం చేస్తున్న ఓ ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం –రచయిత) (28-06-2012)
2 కామెంట్‌లు:
సరదా గానే వున్నా నిజమైనదే. మీరు ఈ బాంక్ లో పది వేలు వేసి సంవత్సరము తరువాత చూడండి రకరకాల చార్జీలతో మీరు వేయి రూపాయిలు బాకీ పడతారు. దోపిడీ బాంక్.లాభాలు కాదు ఏమైనా వస్తాయి.
మహా ముదురు కస్టమర్ సర్వీస్ 50 సార్లు ఎక్స్‌క్యూజ్‌మి , థాంక్యూ, రిగ్రెట్, అపాలజీలు చెబుతారు కాని ఓ ఎఫ్.డి కాన్సిల్ చేసి డిడ్ పంపమంటే 8నెలలు తీసుకున్నారు. ప్రతిదానికి ఫామ్ భరో, పేరుకు పేపర్లెస్ బ్యాంక్. ICICI ఓ పనికిమాలిన బ్యాంక్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి