స్టాక్ హోం సిండ్రోం
‘కొట్టిన చెయ్యే కోరు’ అని పాత సినిమాలో ఒక పాట వుంది.
1973 లో స్వీడన్ లోని స్టాక్ హోం లో బ్యాంకు దోపిడీ జరిగింది. ఈ సందర్భంలో దోపిడీ దొంగలు కొంతమంది సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. తమని చంపేస్తారేమోనని ముందు బందీలు భయపడ్డా దొంగలు వారిని ఏమీ చేయలేదు. బందీలుగా వున్న రోజుల్లో వారికీ వీరికీ నడుమ ఒకరకమయిన ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆరు రోజుల తరువాత వారిని విడిచిపెడతామన్నా బందీలు అంగీకరించలేదు. పైపెచ్చు, తమని బందీలుగా పట్టుకున్న దొంగలనే వారు సమర్ధించారు. వారిపై పెట్టిన కేసు ఖర్చులను కూడా భరించడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు, బందీల్లో వున్న ఒక అమ్మాయి బందిపోటు దొంగల్లో ఒకడిపై మనసు పారేసుకుని అతడినే ఆ తరువాత మనువాడింది కూడా. ఈ రకమయిన మనస్తత్వానికి తదుపరి రోజుల్లో ‘స్టాక్ హోం సిండ్రోం’ అనే పేరు స్తిరపడింది.
ఈ విషయం గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఒకటుంది.
‘మేధావులు తమకు తెలిసింది చెబుతారు. సామాన్యులు తమ మనసులోని మాట చెబుతారు. సామాన్యుల మాటలు - రంగూ రుచీ వాసన లేని స్వచ్ఛమయిన నీటిలాటివి’
ఒక టీవీ చర్చలో పాల్గొంటూ నేను చెప్పిన ఈ మాటతో నాతోపాటు ఈ కార్యక్రమానికి హాజరయిన ఒక విశ్లేషకుడు ఏకీభవించలేదు.
మేధావులు, చదువుకున్నవాళ్ళు - తమకున్న పరిజ్ఞానంతో 'అది' లేని వారికి విషయం విడమరచి చెప్పి సరయిన తీరులో వాళ్ళు కూడా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. కాకపొతే మా ఇరువురి నడుమా ఈ సంభాషణ ‘బ్రేక్’ టైం లో సాగింది.
ఆయన అభిప్రాయం కూడా కొట్టిపారేసేది కాదు. కాని మేధావి అంటే ఎవరు? ఒక మేధావి చెప్పింది మరో మేధావి ఒప్పుకునే పరిస్తితి వుందా? అలా వుంటే మేధావి ఎలా అవుతాడు?
సరే! మా సంభాషణ సాగుతుండగానే లైవ్ షో మొదలయింది. నా అభిప్రాయాన్ని సమర్ధించుకుంటూ నేను ఓ అనుభవాన్ని ఉదహరించాను.
ఎనభయ్యవ దశకం ఆఖరులో నేను మాస్కోలో వున్నప్పుడు టీవీలో ఒక టాక్ షో చూసాను. భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం అయ్యేలా ఆ షో నడిచింది. ఆ టాక్ షోలో పాల్గొనాల్సివున్న పెద్దమనిషి సమయానికి రాకపోవడంతో అక్కడ పనిచేసే లైట్ బాయ్ ని పెట్టి ఆ షో నడిపిస్తారు. అతడు దాన్ని యెంత సమర్ధంగా నడిపిస్తాడంటే ప్రేక్షకులు అతడికి బ్రహ్మరధం పడతారు. అవకాశం వచ్చినప్పుడు సామాన్యులు కూడా తమ లోని ప్రతిభను బయట పెడతారని అతగాడు రుజువు చేస్తాడు.
ఇది చెప్పి, టీవీ ఛానళ్ళవాళ్లు కూడా సామాన్యుల అభిప్రాయాలతో కార్యక్రమాలు రూపొందిస్తే జనసామాన్యం అభిప్రాయాలు మరింత బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం వెల్లడించాను.
అసలింతకీ విషయం ఏమిటంటే, సమాజంలో నానాటికీ విస్తరిస్తున్న అవినీతి భూతాన్ని సామాన్యులు అంతగా పట్టించుకోవడం లేదని, వారి నిర్లిప్తత వల్ల ఎంతో అనర్ధం జరుగుతుందని ఈనాడు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో వారిని జాగృతం చేయాల్సిన బాధ్యత వివేకులు, విజ్ఞానులు, మేధావులు తీసుకోవాలని వారి డిమాండు. అయితే, ఇతరులని అవినీతిపరులని ముద్ర వేస్తున్న వాళ్లు సయితం ఏమీ తక్కువ తిన్నవాళ్ళు కాకపోవడం వల్లనే ప్రజలు అవినీతిపట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న సంగతిని వాళ్లు మరచిపోతున్నారేమో అనిపిస్తున్నది. ఆరోపణలు చేసేవారికి విశ్వసనీయత అడుగంటడమే ఈ పరిస్తితికి దారితీసింది. అందరూ అవినీతిపరులే అన్న భావన ప్రజల్లో ప్రబలిన తరువాత ఈ నీతివాక్యాలు వారి చెవులకు సోకడం లేదు. ఈ నేపధ్యంలో ప్రజలు కొద్ది రోజుల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో ఇవ్వబోయే తీర్పు తమకు అనుకూలంగా లేకపోతే వారు అవినీతికి కొమ్ము కాసేవాళ్లని అనుకున్నా తప్పులేదని తీర్మానించడం కూడా ప్రజాతీర్పును చిన్నబుచ్చినట్టే అవుతుంది.
రాజకీయాల్లో వున్నవారు ఓ పదవికి ఆశపడితే అది ధర్మం. సామాన్యులు వోటు కోసం ఏదయినా కోరుకుంటే అది అధర్మం. కనీస అవసరాలు కనుక్కునేవారికి మద్దతుగా నిలబడితే ‘బిస్కెట్లకు’ ఆశపడేవారిగా ముద్ర. రాజకీయులు ఏదయినా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ తమ పనులు చక్కబెట్టుకుంటే అది నైతికత. సమాజం మొత్తం అవినీతిరహితంగా వుంచగలిగితే అందరూ సంతోషిస్తారు. అంతేకాని పక్కవానికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని అంటే కుదరదు.
రాజకీయ నాయకులు, ఆ మాటకు వస్తే సమాజంలో ఎంతోకొంత పలుకుబడి కలిగిన వాళ్లందరూ తమ స్వప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నప్పుడు, తమ విషయంలోనే ఈ పెద్దలు సుద్దులు నూరిపోయడం సామాన్యులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అందుకే, కనీవిని ఎరుగని స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని గ్రహించినందువల్లనే కాబోలు, ఆర్ధిక కారణాలతోనే ప్రజలు అవినీతిపరులుగా ముద్ర పడినవారి పట్ల అభిమానం చూపిస్తున్నారని కొత్త గగ్గోలు మొదలయింది.
పూర్వం ఓ మహారాజు పెద్దమనసుతో ప్రతిరోజూ అన్నార్తులకు అన్నదానం చేస్తుండేవాడు. ఎంతో పుణ్యం చేసుకుంటూ స్వర్గంలో మంచి స్థానాన్ని ఇప్పటినుంచే సంపాదించుకుంటున్నాడని అంతా వేనోళ్ళ చెప్పుకునేవారు.అయితే అలా దానం చేస్తున్న అన్నం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ‘ఎంగిలి’ అవుతోందన్న విషయం ఆ రాజు గారికి తెలియదు. కాని ఈయనగారు ఇలా నిత్యాన్నదానం కొనసాగిస్తూవుంటే, మరో పక్క నరకంలో ‘ ఆ ఎంగిలి కూడు’ ఓ కొండలా పెరగడం మొదలయింది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ కొండ విషయం గమనించి ఆ విషయాన్ని భూలోకానికి వచ్చినప్పుడు ఆ రాజుగారి చెవిన వేసాడు. రాజు కంగారు పడిపోయి తరుణోపాయం కోరాడు. అప్పుడు నారదుడు ఇచ్చిన సలహా రాజుగారికి నచ్చకపోయినా గత్యంతరం లేక అమలు చేసాడు. నారద ముని సూచన మేరకు ఓ ఒంటిస్థంభం మేడ కట్టించి అందులో యుక్తవయస్సులో వున్న తన ఏకైక కుమార్తెను ఒంటరిగా వుంచాడు. ప్రతిరోజూ సాయం సంధ్యవేళలో ఆ భవనానికి వెళ్లి కుమార్తె పడకగది బయట తెల్లవారేవరకు ఆమెకు తెలియకుండా గడిపి తిరిగి రాజభవనం చేరుకునేవాడు. రాజుగారి ఈ వ్యవహారం ఆ నోటా ఈనోటా పడి చివరకు ప్రజలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. సొంత కుమార్తెతో రాజు గారికి అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భూలోకంలో రాజుగారికి వ్యతిరేకంగా అపనిందల ప్రచారం పుంజుకుంటున్నకొద్దీ అక్కడ నరకంలో రాజుగారి ‘ఎంగిలి కొండ’ క్రమంగా తరిగిపోవడం మొదలయింది.
త్రిలోక పూజ్యుడయిన నారద మునీంద్రులు రాజుగారి పాప ప్రక్షాళన కోసం ఇచ్చిన సలహా మహిమ అది.
‘మాదోరి పాప. ఆదోరి బయ్యాలి’ అని కన్నడంలో ఒక సూక్తి. అంటే ఒకరు చేసిన పాపాన్ని వేరొకరు అదేపనిగా చెబుతుంటే ఆ పాపంలో వాటా వాళ్ల ఖాతాలోకి కూడా చేరుతుంది. (09-06-2012)
3 కామెంట్‌లు:
ఈ మూల నుంచి ఆ మూలకి చదవాలంటే చాలా ఇబ్బంది గా ఉంది
కాలమ్ విడ్త్ తగ్గిస్తే కళ్ళు నొప్పులు రాకుండా చాలా వేగంగా చదువు కోవచ్చు
(న్యూస్ పేపర్ కాలమ్ లాగా )
@ అప్పారావు శాస్త్రి గారికి - మీ సమస్య అర్ధం అయింది.కానీ పరిష్కారమే తెలియడం లేదు. ఎందుకంటే అరవై అయిదేళ్ళ వయస్సులో మొదలు పెట్టిన రచనావ్యాసంగం ఇది. మీరు చెప్పిన పద్దతిలోకి మార్చాలంటే మళ్ళీ ఎవరో ఒకరి సాయం అర్ధించాలి. పోతే, చదివి చదివి మీకు కళ్ళు నొప్పులు వస్తున్నట్టే, రాసి రాసి నాకు కీళ్ళ నొప్పులు మొదలయ్యాయి. పిల్లలు, డాక్టర్లు వద్దంటున్నారు. అయినా గతంలో నేను రాసుకున్నట్టు 'కవిత్వం (రచన) తలలో పేను లాటిది. తీసినదాకా దురద వొదలదు'
eee donka tirugudu supportlu ichevaalalne medaavulu antaaru...vaallu enni post lu vesinaa...anthargatham gaa vaalla abipraayanni ruddaalani choosthoo vuntaaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి