13, డిసెంబర్ 2023, బుధవారం

మనిషి నిజంగా బతికేది మరణం తర్వాతనే – భండారు శ్రీనివాసరావు

 

ఆయన ఐ.పి.ఎస్. అధికారి కాదు, అసలు సాధారణ పోలీసు అధికారి కూడా కాదు. అయినా ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో  సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన చనిపోయి ఏడాది గడిచింది. ఈరోజు హైదరాబాదులో జరిగిన ఆయన ప్రధమ వర్ధంతికి గతంలో పోలీసు  డైరెక్టర్ జనరల్స్ గా పనిచేసిన హెచ్.జే. దొరవంటి  ఉన్నతాధికారులతో సహా చిన్నా పెద్దా పోలీసు  అధికారులు ఎంతో మంది హాజరై ఆయన చిత్రపఠానికి పుష్పాంజలి ఘటించి పోలీసు శాఖకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.  మా అన్నయ్య రామచంద్ర రావు గారితో కలిసి, ఆయన కుమారుడు శంకర ప్రసాద్ ని కలవడానికి వారి ఇంటికి వెళ్ళాము. పుష్కర కాలం క్రితం ముగిసిన నా ఉద్యోగపర్వంలో భాగంగా పరిచయం అయిన అనేకమంది రిటైర్డ్ అధికారులు, ముఖ్యంగా వరుసగా పలువురు డీజీపీ లకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కామేశ్వర రావు వంటి వారిని కలవగలిగాను. దశాబ్దాల తరువాత కలిసినా కూడా  చాలామంది నన్ను నా పేరుతొ సహా గుర్తువుంచుకుని పలకరించారు.   

ఆయన పేరు మాదిరాజు రామకిషన్ రావు గారు. మాకు దూరపు చుట్టం. వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు.   ఖమ్మం జిల్లా పుట్టకోట గ్రామ వాస్తవ్యులు. పోలీసు డైరెక్టర్ జనరల్ కు ప్రధాన న్యాయ సలహాదారుడిగా సుదీర్ఘకాలం చాలామంది పోలీసు డైరెక్టర్ జనరల్స్ దగ్గర పనిచేసిన అనుభవం ఆయనది. వయసు రీత్యా 1999 లోనే రిటైర్ అయినప్పటికీ, ఉద్యోగబాధ్యతల్లో ఆయన చూపిన నిబద్దత, అంకితభావం కారణంగా తరువాత  అనేక సంవత్సరాలు ఉద్యోగాన్ని పొడిగిస్తూ పోయారు. చివరికి ఆయనే 2008 లో నాకీ కొలువు చాలనుకుని  స్వచ్చందంగా ఉద్యోగబాధ్యతల నుంచి తప్పుకుని తనకిష్టమైన శృంగేరి పీఠం అప్పగించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఖమ్మంలో అతిపురాతన రామాలయాన్ని పునరుద్ధరించారు. ఖమ్మం సమీపంలో గోశాలతో కూడిన దేవాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. ఉత్తమ ధర్మాధికారిగా శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య నుంచి సత్కారం అందుకున్నారు.


(మాదిరాజు రామకిషన్ రావు)


13-12-2023

 

 

అయోధ్య రెడ్డి


 నాకు ముప్పై ఏళ్లుగా లేదా అంతకంటే ఎక్కువగా తెలుసు. పాత సచివాలయంలో, లేదా బయట ఎక్కడ కలిసినా కూడా నవ్వుల రెడ్డి అని పిలిచే వాడిని. హాయిగా నవ్వేవాడు. వున్నట్టుండి జర్నలిజం వదిలి రాజకీయ రంగప్రవేశం చేసాడు. నాకు ఆశ్చర్యంతో పాటు ఎందుకిలా చేశాడు అనే అనుమానం కూడా కలిగింది. తర్వాత తెలిసింది నవ్వడం ఒక్కటే కాదు తనకు ఒక ధ్యేయం వుందని, అది సాధించే వరకు విశ్రమించడని.
ఈరోజు తెలిసింది అది నెరవేరిందని. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి CPRO గా నియమితులయ్యారు అని.
అభినందనలు అయోధ్య రెడ్డి. కాదు నవ్వుల రెడ్డి

12, డిసెంబర్ 2023, మంగళవారం

మంత్రి అయినా మారని మాట తీరు

ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఈరోజు సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపాము. డాక్టర్ నాగభూషణం, డాక్టర్ భరత్, డాక్టర్ ఏపీ మనోహర్ రావు, నేను, డాక్టర్ బాలాజీ ఈ బృందంలో వున్నాము. జూపల్లి గారు రాజకీయ రంగప్రవేశం చేయక ముందు నుంచి వారితో చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వారితో కలిసి అక్కడే వర్కింగ్ లంచ్ చేసాము. అనేక పాత సంగతులు నెమరువేసుకుంటూ చాలాసేపు వారితో గడిపి తిరిగి వచ్చేసాము. బయట నుంచే తప్ప కొత్త సచివాలయం చూడడం ఇదే మొదటిసారి. కృష్ణారావు గారిని కలిసి కూడా చాలా కాలం అయింది. కానీ ఆయన  ప్రేమాభిమానాలలో ఎలాంటి తేడా లేదు.  
సచివాలయం నాకు కొత్తకాదు. నా విలేకరి జీవితంలో సింహభాగం అక్కడే గడిచింది. నాకు మరింత సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే నేను రిటైర్ అయి పద్దెనిమిది ఏళ్ళు గడిచిన తర్వాత కూడా లిఫ్ట్ బాయ్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గుర్తు పట్టి పలకరించడం.

తోక టపా: మంత్రిగారికి పుష్పగుచ్చం ఇచ్చింది డాక్టర్ నాగభూషణం గారు. ఫోటో తీసిన కెమెరాలో పేరలాక్స్ దోషం కారణంగా కాబోలు, అది నేను ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి నేను కాదు.

9, డిసెంబర్ 2023, శనివారం

పరిధి దాటి చూడండి - భండారు శ్రీనివాసరావు

 మా ఇంట్లో పనిచేసే వలలి (వంటావిడ) ఎంతో సంతోషంగా వుంది. ఆమె ఎల్లారెడ్డి గూడాలో వుండే మా ఇంటితో పాటు మాధా పూర్ లో ఓ డాక్టర్ దంపతుల ఇంట్లో కూడా పనిచేస్తుంది. పొద్దున్నే బయలుదేరి, నేరుగా వెళ్ళే బస్సు దొరకనప్పుడు  రెండు బస్సులు మారి మాదాపూర్ వెళ్లి పని చక్కబెట్టుకుని, మా ఇంటికి వచ్చి బ్రేక్ ఫాస్ట్, వంటపని చేసి వెడుతుంది.  దేనికీ తొందరలేని ఇల్లు కనుక ఆవిడ ఏ టైముకు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. అయితే ఈ తిరుగుళ్లకే సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చు అవుతోంది అని బాధ పడేది. కొత్త ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త పథకం (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం) తనకు ఎంతో వెసులుబాటు అని చెబుతోంది.

 జనాకర్షక పథకాలు అని తీరుబాటు వున్న వాళ్ళు ఎద్దేవా చేసే కొన్ని పథకాలు నిజంగా అవసరంలో వున్నవారికి చాలా ఊరట కలిగిస్తాయి. ఈ నిజం అర్థం కావాలి అంటే తమ చుట్టూ తామే గీసుకున్న పరిధి నుంచి బయటకు వచ్చి చూడాలి.

5, డిసెంబర్ 2023, మంగళవారం

తిరుపతి మనదేనా! – భండారు శ్రీనివాసరావు

 హరి సర్వోపగతుడు, సర్వవ్యాపితుడు. ఇందుగలడు  అందులేడు అనే సందేహము లేని వాడు.

భగవంతుడు అనేవాడు  అన్ని ప్రాంతాలకు చెందినవాడు. భగవంతుడు అందరికీ భగవంతుడే. అలాంటివాడిని ఒక నగరానికో, ఒక రాష్ట్రానికో పరిమితం చేసి మాట్లాడడం సంకుచితమే అవుతుంది.

అయినా కానీ, కొన్ని సందర్భాలలో  భాషాభిమానం ఈ వాదాన్ని ఒప్పుకోనివ్వదు.

ఉదాహరణకు సప్తగిరి నవంబరు సంచిక. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక పత్రిక. ఈ పత్రికను లక్షలాది మంది చదువుతుంటారు. తిరుమలకు సంబంధించిన అనేక అరుదైన విషయాలు, విలువైన  వ్యాసాలు ఈ పత్రికలో వస్తుంటాయి.

సరే అసలు విషయానికి వస్తాను.

నవంబరు సంచిక అంటే కిందటి నెల సంచిక 50 వ పుటలో బాల వినోదం విభాగంలో “మీకు తెలుసా?”  అనే శీర్షిక కింద కొన్ని ప్రశ్నలు వేసి అదే సంచికలో కింద సమాధానాలు కూడా ఇచ్చారు. జవాబులను ప్రశ్న పక్కనే బ్రాకెట్లో ఇచ్చాను.

అవేమిటంటే :

తిరుమల స్వామికి గర్భగుడిలో పై కప్పుకు కట్టే పట్టు వస్త్రం పేరు?  (కురాళం)

కోయిలాళ్వార్ తిరుమంజనం నాడు స్వామికి తొడిగే వస్త్రం పేరు?  (మలై గుడారం)

స్వామి నుదిటి నామం పేరు?  (తిరుమణి కాపు)

పట్టు విసనకర్ర పేరు?  (ఆలవట్టం)

పచ్చ కర్పూరం పేరు?  (గంబూరా)

కుంకుమ పూవు పేరు? (జాప్రా)

రాత్రి నిద్రించిన హుండీకి గల పేరు?  (తోక ముల్లె)

దేవస్థానానికి చలానాల రూపంలో చెల్లించే నగదుకు గల పేరు?  (ఇరసాల్ నామా)

దేవుని వస్తువులు ఉంచే గది పేరు?  (సభరసబేరా)

ఆలయ బీగాల గుత్తి పేరు?  (లచ్చెన)

బాలపాఠకుల విభాగంలో సంధించిన ఈ ప్రశ్నలకు సంపాదక వర్గం వాళ్ళు ఇచ్చిన సమాధానాలు చాలామంది పెద్దలకు కూడా తెలిసివుండే  అవకాశం వుందని నేను అనుకోవడం లేదు.

అసలీ పేర్లు ఏమిటి? అలాంటి అన్యభాషా పదాలను ఇప్పటికీ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది?

వాళ్ళు పెట్టిన శీర్షికనే చివర్లో  నేనూ ఉపయోగిస్తాను.

“మీకు తెలుసా?

(05-12-2023)

28, నవంబర్ 2023, మంగళవారం

KTR తో నేను

https://twitter.com/thenaveena/status/1728102490460287483?s=48

https://x.com/thenaveena/status/1728102490460287483?s=48


https://x.com/TheNaveena/status/1728102490460287483?s=20

21, అక్టోబర్ 2023, శనివారం

రోల్ మోడల్ - భండారు శ్రీనివాసరావు

 మీ రోల్ మోడల్ ఎవరు? అనే ఈ ప్రశ్న మా కుటుంబంలో ఎవర్ని అడిగినా దాదాపు ఒకే సమాధానం వస్తుంది, రావులపాటి సీతా రాం రావు అని. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారిగా రిటైర్ అయ్యారు. అయితే మా వాళ్ళు ఎవరూ ఆయన్ని, ఆయన మీద వున్న గౌరవంతో పేరుతొ పిలవరు, బావా అనో, మామయ్యా అనో. బాబాయ్ అనో పిలుస్తుంటారు.  ఈ మధ్య తాతయ్యా అని కూడా అంటున్నారు. నన్నే అలా అంటున్నప్పుడు నాకంటే మూడు నాలుగేళ్లు పెద్ద అయిన ఆయన్ని అనడంలో ఆశ్చర్యం ఏముంది?

ఇటు అధికార గణంలో, అటు  పాఠకలోకంలో ఆయన పేరు చిరపరిచితం. పోలీసు ఉద్యోగంలోకి రాకముందు నుంచి కూడా ఆయనకు  రచనలు చేయడం అలవాటు. నిజానికి అది ఆయన ప్రవృత్తి. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారిగా రిటైర్ అయిన తర్వాత లాఠీ పక్కన పడేసినా, కలాన్ని మాత్రం వదలకుండా పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాస్తున్నారు, ఆధ్యాత్మిక సంబంధ మైన రచనలు చేస్తున్నారు. పుస్తకాలు ప్రచురిస్తున్నారు. రాయడంతో పాటు చదవడం ఆయనలో ఉన్న మరో సుగుణం. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆయన నిరంతర అధ్యయనశీలి.  రచయితలు రాస్తారు కానీ ఇతరులవి చదవరు అనే అపప్రథ వుంది. అది అపప్రథ కాదు, నిజమే అంటాడు మిత్రుడు జ్వాలా.

ఈ ఉపోద్ఘాతానికి కారణం రావులపాటి సీతారామారావు గారు స్వయంగా రాసి, ( ఈమాట ఎందుకు అంటున్నాను అంటే ఆయన కాగితాల బొత్తి తొడపై పెట్టుకుని, కలంతో రాస్తారు, కంప్యూటర్ వాడరు)  సాహితి ప్రచురణలు ప్రచురించిన ‘పోటీ నీకే జయం నీదే’ అనే నూరు పేజీల పుస్తకం.      

ఇది నా చేతికి వచ్చి వారం, పది రోజులు దాటింది. చదవడం తొందరగానే అయిపోయింది. కానీ ఏమి రాయాలి అనేదే మీమాంసగా మిగిలిపోయింది.  ఆయన ఈ పుస్తకాన్ని నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజుల్లోనే రాసిఉంటే ఎంత బాగుండేదో అని చాలాసార్లు అనిపించింది.  పోలీసు ఆఫీసరుగా ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకున్నామే కానీ అంతకు మించి మా తరం ఏమీ చేయలేక పోయాము. దానికి కారణం, స్పూర్తి కలిగించే ఇటువంటి  పుస్తకాలు తెలుగులో అప్పుడు అందుబాటులో లేకపోవడం. ఇదే పుస్తకం ఆయన ఆ రోజుల్లో రాసిఉంటే, మేమందరం కూడా ఆయన లాగా అయివుండేవాళ్ళం అని చెప్పే ధైర్యం చేయను కానీ, జీవితంలో మరింత ఎదిగి వుండేవాళ్ళం కనీసం మానసికంగా అయినా  అని గట్టిగా  చెప్పగలను. అంత సుబోధకంగా,  సరళంగా, ఉత్తేజితంగా ఆయన ఈ పుస్తకం రాశారు. తన జీవితంలోని, తనకు తారసపడిన కొందరు ఉన్నతాధికారుల జీవితాల్లోని వాస్తవ సంఘటనలను ఆయన సోదాహరణంగా ఇందులో అక్షరబద్ధం చేశారు. తన అపజయాలు గురించి కూడా నిబద్ధతతో నిజాయితీగా రాసారు.  అవన్నీ ఈ సమీక్షలో రాయడం కంటే ఈ పుస్తకంలోని ప్రతి పేరాను  తిరిగి రాయడం సులభం అనిపించింది. అంతకంటే కూడా ఎవరికి వారు అంటే ముఖ్యంగా ఈనాటి యువతరం, మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు తమకు తాముగా చదివి తెలుసుకోవడం మంచిది అని కూడా అనిపించింది.

పోటీ పరీక్షలకు హాజరు అయ్యేవారికోసం ఈ పుస్తకంలో అనేక సలహాలు, సూచనలు వున్నాయి. ఇది చదివి ఆచరణలో పెట్టుకోగలిగితే లక్ష్య సాధన సులభం అవుతుంది. అయితే రచయితే స్వయంగా ఇందులో పేర్కొన్నట్టు, విజయం సాధించాల్సింది మాత్రం  పోటీ పరీక్షను ఎదుర్కుంటున్న అభ్యర్ధే!

ఇంతవరకు కధలు, నవలల పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు రాసిన రావులపాటి సీతారాంరావుగారు, భవిష్యత్ తరానికి మార్గ నిర్దేశనం  చేసే ఇటువంటి ఉపయుక్తమైన పుస్తకం రాయడం ముదావహం.



(పోటీ నీకే! జయం నీదే! పోటీ పరీక్షల గైడ్, రచన: శ్రీ రావులపాటి సీతారాం రావు, వెల: తొంభయ్ రూపాయలు, సాహితి ప్రచురణలు, విజయవాడ. ఫోన్: 8121098500