మా ఇంట్లో పనిచేసే వలలి (వంటావిడ) ఎంతో సంతోషంగా వుంది. ఆమె ఎల్లారెడ్డి గూడాలో వుండే మా ఇంటితో పాటు మాధా పూర్ లో ఓ డాక్టర్ దంపతుల ఇంట్లో కూడా పనిచేస్తుంది. పొద్దున్నే బయలుదేరి, నేరుగా వెళ్ళే బస్సు దొరకనప్పుడు రెండు బస్సులు మారి మాదాపూర్ వెళ్లి పని చక్కబెట్టుకుని, మా ఇంటికి వచ్చి బ్రేక్ ఫాస్ట్, వంటపని చేసి వెడుతుంది. దేనికీ తొందరలేని ఇల్లు కనుక ఆవిడ ఏ టైముకు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. అయితే ఈ తిరుగుళ్లకే సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చు అవుతోంది అని బాధ పడేది. కొత్త ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త పథకం (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం) తనకు ఎంతో వెసులుబాటు అని చెబుతోంది.
జనాకర్షక పథకాలు అని తీరుబాటు వున్న వాళ్ళు ఎద్దేవా చేసే కొన్ని పథకాలు నిజంగా అవసరంలో వున్నవారికి చాలా ఊరట కలిగిస్తాయి. ఈ నిజం అర్థం కావాలి అంటే తమ చుట్టూ తామే గీసుకున్న పరిధి నుంచి బయటకు వచ్చి చూడాలి.